ఏసీబీకి చిక్కిన లైన్‌మెన్ డేవిడ్, పట్టుబడిన నగదు
సాక్షి, గుంటూరు: విద్యుత్ మీటరుకు వినియోగదారుడి నుంచి రూ.10 వేలు డిమాండ్ చేసి, అతని నుంచి రూ.5000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి లైన్‌మన్‌ను అదుపులోకి తీసుకున్న సంఘటన సోమవారం మండలంలోని తురకపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తురకపాలెం గ్రామానికి చెందిన కావూరి పూర్ణచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కావూరి పూర్ణచంద్రరావు తన ఇంటికి విద్యుత్ మీటరు కోసం లైన్‌మన్ డేవిడ్‌ను సంప్రదించారు. విద్యుత్ మీటరు కావాలంటే రూ.10 వేలు మీటరు బిల్లుకు అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశాడు.
దీంతో మూడు నెలలుగా లైన్‌మన్ చుట్టూ తిరిగిన పూర్ణచంద్రరావు తాను కూలీ పనులు చేసుకునే వాడినని, అంత ఇవ్వలేనని చెప్పగా అందుకు ససేమిరా అని లైన్‌మన్ చెప్పటంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో బాధితుడు లైన్‌మన్‌ను బతిమాలుకుని రూ.5వేలు ముందు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. దీంతో సోమవారం సాయంత్రం గ్రామంలోని తన ఇంటి వద్దకు రావాలని లైన్‌మన్ చెప్పటంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఏసీబీ అడిషనల్ ఎస్పీ అల్లంగి సురేష్‌బాబు, సీఐ శ్రీధర్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని బాధితుడి నుంచి లైన్‌మన్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. లైన్‌మన్‌పై కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment