‘బ్లాస్టింగ్‌’పై పారదర్శకంగా విచారణ | Transparent trial on Mamillapalli blast case | Sakshi
Sakshi News home page

‘బ్లాస్టింగ్‌’పై పారదర్శకంగా విచారణ

May 13 2021 3:11 AM | Updated on May 13 2021 3:11 AM

Transparent trial on Mamillapalli blast case - Sakshi

సంఘటన స్థలంలో వాహన శకలాలను పరిశీలిస్తున్న జేసీ గౌతమి

సాక్షి, కడప/బద్వేలు:  వైఎస్సార్‌ కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె ముగ్గురాయి క్వారీ వద్ద 10 మందిని బలితీసుకున్న భారీ పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతానికి తావులేకుండా బాధ్యులందరిపైనా చర్యలకు ఆదేశించడంతో విచారణ వేగం పుంజుకుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు, పారదర్శకతకు మారుపేరుగా నిలుస్తూ బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పేలుడు పదార్థాల లైసెన్సు హోల్డరు వై.ఎస్‌.ప్రతాపరెడ్డిని, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తద్వారా తప్పు చేసిన వారి విషయంలో తన–మన అనే తేడాలుండవని ప్రభుత్వం గట్టి సంకేతాలనిచ్చింది. సంఘటనపై దర్యాప్తునకు ఐదుగురు అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని నియమించటంతో ఈ కమిటీ బుధవారం మామిళ్లపల్లెను సందర్శించి విచారణ ఆరంభించింది. వైఎస్సార్‌ జిల్లా జాయింట్‌  కలెక్టర్‌ (రెవెన్యూ) ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీసు, మైన్స్‌ సేఫ్టీ, ఎక్స్‌ప్లోజివ్స్‌ శాఖలకు చెందిన అధికారులు ఈ కమిటీలో ఉన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు వారు తెలియజేశారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశామని, క్షుణ్నంగా విచారణ చేస్తున్నామని జేసీ గౌతమి విలేకరులకు చెప్పారు. జిల్లాలో మిగతా క్వారీలను కూడా తనిఖీ చేసి అక్రమాలు ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం.. 
ఈనెల 8వ తేదీన జిలెటిన్‌ స్టిక్స్‌ను క్వారీ వద్ద దించుతుండగా పేలుడు ఘటనలో మృతి చెందిన పది మందికి లీజుదారుడి నుంచి రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇప్పించడమే కాకుండా ప్రభుత్వం మరో రూ.10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ పరిహారం తాలూకు చెక్కుల్ని అధికారులతో కలిసి స్థానిక నేతలు బుధవారం బాధిత కుటుంబాలకు అందజేశారు. దీంతో ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున సాయం అందినట్లయింది. 

ఐదు రోజుల్లోనే... 
ఘటన జరిగిన ఐదు రోజుల్లోనే ప్రభుత్వం వేగంగా స్పందించి అండగా నిలవడంపై బాధిత కుటుంబాలు ఊరట చెందుతున్నాయి. ఘటన జరిగిన మూడో రోజే లీజుదారుడి నుంచి రూ.50 లక్షలు పరిహారం బాధితులకు ఇప్పించగా ప్రభుత్వం కూడా తన సాయాన్ని అందజేసింది. నిబంధనలు పాటించకుండా ఎల్రక్టానిక్‌ డిటోనేటర్లు, జిలెటిన్‌ స్టిక్స్‌ను ఒకేసారి వాహనంలో క్వారీ వద్దకు తరలించడం, జాగ్రత్తలు తీసుకోకుండా ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో దించడంతో ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధితులు, క్షతగాత్రులను ఆదుకోవడంతోపాటు పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

రిమాండ్‌కు వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి 
దాదాపు 33 హెక్టార్ల విస్తీర్ణం ఉన్న ఈ క్వారీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య సతీమణి పేరుతో ఉండగా బి.మఠం ప్రాంతానికి చెందిన నాగేశ్వర్‌రెడ్డి లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు. లీజుదారుడు నాగేశ్వర్‌రెడ్డిని, ఎక్స్‌ప్లోజివ్స్‌ మేనేజర్‌ రఘునాథరెడ్డిని ఈ నెల 10వ తేదీన పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్‌ విధించింది. పేలుడు పదార్థాల విక్రయాల్లో నిబంధనలు పాటించలేదని పేలుడు పదార్థాల లైసెన్సు హోల్డరు పులివెందులకు చెందిన వైఎస్‌ ప్రతాప్‌రెడ్డిని పోరుమామిళ్ల పోలీసులు మంగళవారం అరెస్టు చేసి బద్వేలు మేజి్రస్టేట్‌ ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఆయన సమీప బంధువు అయినప్పటికీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధ్యులందరిపైనా పోలీసులు చర్యలు చేపట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement