పోర్టు ఆవరణలో స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న శాంతాను ఠాకూర్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : దేశంలోని మేజర్ పోర్టులను ప్రైవేటీకరించాలన్న ఆలోచన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శాంతాను ఠాకూర్ తెలిపారు. మూడ్రోజుల పర్యటన నిమిత్తం విశాఖ చేరుకున్న ఆయన ఇక్కడి పోర్టులో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇండియన్ పోర్టుల ముసాయిదా బిల్లును ఏపీతో పాటు తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలతో మరోసారి చర్చించి ముందుకెళ్తామని తెలిపారు. ప్రైవేటు పోర్టుల నుంచి వస్తున్న పోటీ నేపథ్యంలో విశాఖ పోర్టు అమలుచేస్తున్న బెర్తు లీజులను క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
ఈ సందర్భంగా క్రూయిజ్ టెర్మినల్, పలు బెర్తుల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో విశాఖపట్నం పోర్టు రూ.2 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. ఇక మారిటైం ఇండియా సమ్మిట్‌లో పోర్టు ఏకంగా రూ.26 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న 8 నెలల్లో విశాఖ–రాయపూర్ సాగరమాల ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పోర్టు చైర్మన్ రామ్మోహన్‌రావు, డిప్యూటీ చైర్మన్ దూబె పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment