ప్రపంచ కంటైనర్ పోర్టుల పనితీరు సూచీలో టాప్–20లో చోటు
18వ స్థానాన్ని సొంతం చేసుకున్న సంస్థ
విశాఖ సిటీ: విశాఖ పోర్టు అథారిటీ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ బ్యాంక్ రూపొందించిన కంటైనర్ పోర్టుల పనితీరు సూచీ(సీపీపీఐ)లో టాప్–20లో స్థానం సంపాదించింది. విశాఖ కంటైనర్ టెర్మినల్ అద్భుత ప్రతిభ కనబరిచి 18వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా కంటైనర్ పోర్టుల పనితీరును సీపీపీఐ పరిగణనలోకి తీసుకోగా.. ఇందులో విశాఖ పోర్టు సరికొత్త మైలురాయిని అందుకుంది.
ఈ సూచీల ద్వారా వ్యాపారవేత్తలు పోర్టులను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. పోర్టు సామర్థ్యం, నౌక టర్న్ అరౌండ్ సమయాలు ఎంతో ముఖ్యమైన ప్రమాణాలుగా నౌకల యజమానులు భావిస్తారు. విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో క్రేన్‌లు గంటకు 27.5 కదలికలను నమోదు చేస్తుంటాయి. బెర్త్‌లో షిప్ నిలిపే సమయం 13 శాతంగా ఉంటోంది. అలాగే పోర్టులో టర్న్ రౌండ్‌కు 21.4 గంటల రికార్డు సమయం ద్వారా అత్యుత్తమ సూచీలను నెలకొల్పింది. 65కు పైగా కంటైనర్ లైన్లు కలిగి ఉంది.
కంటైనర్ టెర్మినల్‌కు 8 నిరంతర సర్వీసులున్నాయి. ఈ అసాధారణ ఘనతను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్టేక్ హోల్డర్లు, రైల్వేలు, కస్టమ్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు అభినందించాయి. భవిష్యత్‌లో మరిన్ని రికార్డులు సాధించడానికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చాయి. ఈ ఘనతను సాధించడంలో కీలకంగా పనిచేసిన సిబ్బందిని విశాఖ పోర్టు చైర్‌పర్సన్ డాక్టర్ ఎం.అంగముత్తు అభినందించారు. పోర్టు సమర్థతను ఈ ఘనత చాటి చెప్పిందన్నారు.
సరుకు రవాణాలో 4వ స్థానం
2023–24వ ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టు సరుకు రవాణాలో మెరుగైన పనితీరును కనబరిచి దేశంలోని మేజర్ పోర్టులలో 4వ స్థానంలో నిలిచింది. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే సరుకు రవాణాలో 13.5 శాతం వృద్ధిని కనబరిచింది. ఈ ఘనత పట్ల కేంద్ర పోర్టులు, నౌక, జలరవాణా శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. పోర్టు చైర్‌పర్సన్ డాక్టర్ ఎం.అంగముత్తును ప్రశంసించింది.
Comments
Please login to add a commentAdd a comment