సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కేంద్రంగా భారీ డ్రగ్స్ దందా
బ్రెజిల్ నుంచి కంటైనర్లో విశాఖ పోర్టుకు.. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ తనిఖీ
25 వేల కిలోల డ్రై ఈస్ట్‌తో కలగలిపి కొకైన్ దిగుమతి.. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పేరిట డెలివరీ
ఈ కంపెనీ సీఈఓ కూనం కోటయ్య చౌదరి.. ఆయన తండ్రి వీరభద్రరావు ఎండీ
బీజేపీ నేత పురందేశ్వరి కుటుంబీకులకు వీరభద్రరావు వ్యాపార భాగస్వామి.. టీడీపీ నేతలతోను, బాలకృష్ణ వియ్యంకుడి కుటుంబంతోనూ సాన్నిహిత్యం
టీడీపీ హయాంలో అక్రమాలకు తెగబడ్డ ‘సంధ్యా ఆక్వా’
అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొరడా.. కంపెనీని సీజ్ చేసిన పీసీబీ
2016లో అమెరికాలో విమాన ప్రయాణికురాలితో వీరభద్రరావు అసభ్య ప్రవర్తన, కేసు నమోదు
ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ పాత్ర.. చేతులు మారిన రూ.25కోట్లు!
విశాఖ సిటీ/ సాక్షి, అమరావతి: అచ్చం సినిమాను తలపించే రీతిలో విదేశాల నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన నౌకలో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఇంటర్‌పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడలో భాగంగా ఎవరికీ అనుమానం రాకుండా డ్రై ఈస్ట్‌తో కలిపి బ్యాగుల్లో ప్యాక్ చేసిన ఈ డ్రగ్స్ కంటైనర్‌ను స్వా«దీనం చేసుకున్నారు. కంటైనర్‌లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగ్‌లు.. మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్‌తో మిక్స్ అయిన డ్రగ్స్ ఉండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.
ఎవరిదీ కంటైనర్.. అని విచారణ మొదలుపెట్టగానే.. ఈ స్మగ్లింగ్ దందా వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందనే విషయం బట్టబయలైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇందులో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ, వ్యాపార సంబంధాలూ బయటపడ్డాయి. బ్రెజిల్ దేశంలోని శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన ‘జిన్ లియన్ యన్ గ్యాంగ్’ కంటైనర్ నౌక ఈ నెల 16వ తేదీ రాత్రి 9.30 గంటలకు విశాఖ పోర్టు టెర్మినల్–2కు చేరుకుంది.
అందులో వచ్చిన కంటైనర్లను విశాఖ పోర్టు స్టాక్ యార్డ్‌లో అన్‌లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ షిప్‌లోని ఎస్‌ఈకేయూ 4375380 నంబర్ గల కంటైనర్‌లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని, తనిఖీ చేయాలని ఈ నెల 18న ఇంటర్‌పోల్ నుంచి ఒక ఈ–మెయిల్ వచ్చింది. వెంటనే ఢిల్లీలో సీబీఐ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీ ఉమేష్ శర్మకు అప్పగించారు.
సీబీఐ ఎస్పీ గౌరవ్ మిట్టల్ పర్యవేక్షణలో ఉమేష్‌కుమార్‌తో పాటు మరో డీఎస్పీ ఆకాష్ కుమార్ మీనా బృందం నార్కోటిక్ డిటెక్షన్ కిట్‌తో ఈ నెల 19వ తేదీ ఉదయం 8.15 గంటలకు విశాఖ చేరుకుంది. విశాఖ సీబీఐ డీఎస్పీ సంజయ్‌కుమార్ సమల్‌తో కలిసి విశాఖ పోర్టు విజిలెన్స్, కస్టమ్స్ అధికారుల సహకారంతో పోర్టులో తనిఖీ చేపట్టారు. ఇంటర్‌పోల్ సమాచారమిచ్చిన నంబర్ గల కంటైనర్‌ను స్వా«దీనం చేసుకున్నారు.
భారీగా మాదక ద్రవ్యాలు గుర్తింపు
సదరు కంటైనర్ లాసెన్స్ బే కాలనీ ప్రాంతంలో ఉన్న సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఈ కంపెనీకి కూనం వీరభద్రరావు ఎండీ కాగా.. సీఈఓగా ఆయన కుమారుడు కోటయ్య చౌదరి వ్యవహరిస్తున్నారు. విశాఖలో అందుబాటులో ఉన్న ఆ కంపెనీ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.వి.ఎల్.ఎన్.గిరిధర్, కంపెనీ ప్రతినిధులు పూరి శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్, కె.భరత్ కుమార్‌ను రప్పించారు. కంటైనర్, సీల్ నెంబర్లు చూపించి అందులో ఏముందని సీబీఐ అధికారులు వారిని ప్రశ్నించారు.
కంటైనర్‌లో 25 కేజీలు చొప్పున 1000 బ్యాగ్‌లు మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ ఉందని చెప్పారు. దీంతో కంటైనర్ తెరిచి చూడగా లోపల 20 బాక్సులలో వెయ్యి బ్యాగులు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో బాక్స్ నుంచి ఒక్కో బ్యాగ్‌ను కంపెనీ ప్రతినిధుల సమక్షంలోనే బయటకు తీశారు. ఆ బ్యాగుల్లో పచ్చ రంగులో ఉన్న పౌడర్‌ను నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్‌తో పరీక్షించారు. 20 బ్యాగుల్లో పౌడర్‌ను పరీక్షించిన సీబీఐ అధికారులు విస్తుపోయారు.
ఈ పౌడర్‌లో కొకైన్, మెథాక్వాలోన్, ఓపియం, మారిజోనా, హాషిష్ మాదక ద్రవ్యాలు ఉన్నట్లు రెండు వేర్వేరు పరీక్షల ద్వారా నిర్ధారణ అయింది. తాము తొలిసారిగా వీటిని దిగుమతి చేసుకున్నామని, అందులో ఉన్న పదార్థాల గురించి తమకు తెలియదని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. తిరిగి సీబీఐ బృందం 20వ తేదీ ఉదయం 10.15 గంటలకు విశాఖ పోర్టుకు చేరుకొని సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కూనం హరికృష్ణ, ఇతరుల సమక్షంలో మరికొన్ని బ్యాగులను పరీక్షించారు. అన్నింటిలోను మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారు.
దీనిపై కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించగా.. వారు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. దీంతో సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీపై కేసు నమోదు చేశారు. సంధ్యా ఆక్వాపై
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు టీడీపీ ప్రభుత్వ హయాంలో సంధ్యా ఆక్వా అక్రమాలు యథేచ్ఛగా సాగాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కంపెనీలో తనిఖీలు నిర్వహించింది. అనుమతి లేకుండా ఈక్విడార్ దేశం నుంచి రొయ్యలను దిగుమతి చేసుకుని వాటిని ప్రాసెస్ చేసి అమెరికాకు ఎగుమతి చేశారని తేలింది.
విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత చట్టాలు అనుమతించవు. కానీ ఆ చట్టాన్ని సంధ్యా ఆక్వా ఎండీ కూనం వీరభద్రరావు చౌదరి బేఖాతరు చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. దాంతోపాటు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను కూడా ఉల్లంఘించినట్టు తనిఖీల్లో వెల్లడైంది. ఏకంగా 16 ఉల్లంఘనలను గుర్తించి కేసు నమోదు చేసి సంధ్యా ఆక్వా కంపెనీని సీజ్ చేశారు. ఇదిలా ఉండగా కూనం వీరభద్రరావుపై యూఎస్ పోలీసులు 2016లో కేసు నమోదు చేశారు.
ఆ ఏడాది జూలై 30న లాస్ ఏంజెలిస్ నుంచి న్యూజెర్సీకి వెళ్తున్న విమానంలో తన పక్కనే నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో వీరభద్రరావుని ఎఫ్‌బీఐ అరెస్టు చేసి న్యూయార్క్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం తానా ప్రతినిధుల సహాయంతో ఈ కేసు నుంచి బయటపడ్డారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోనూ వీరభద్రరావు పాత్ర ఉందని తెలుస్తోంది. ఈయన నేతృత్వంలో రూ.25 కోట్లు చేతులు మారినట్లు
సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment