నిజం నిలకడ మీద కానీ తెలియదంటారు. రాజకీయ నాయకులు కొంతమందికి ఈ విషయం బాగా తెలిసినట్టు ఉంది. ఈ ధైర్యంతోనే వాళ్లు వదంతులు, అసత్యాలు, అర్ధ సత్యాలు ప్రచారం చేసి సఫలం అవుతుంటారు. ఎక్కువసార్లు జరిగేది ఇదే. అబద్ధాలు వ్యాప్తి చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సరితూగ గలిగే వాళ్లు ఇంకొకరు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనతోనే పోటీపడుతున్నారు. ఏ ఘటనలోనైనా తమవారి తప్పుందని తెలిస్తే దాన్ని వెంటనే ప్రత్యర్దిపైకి నెట్టేయడం వీరి శైలి. అనుకూల మీడియా ఒకటి వీరికి అండగా నిలుస్తోది. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండనే చందమీ పచ్చ మీడియా. వందల అబద్దాలు వ్యాప్తి చేయడంలో వీరిదో రికార్డు. వ్యక్తిగా చంద్రబాబు నాయుడు అబద్దాల విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారా అనిపిస్తుంది.
తెలుగుదేశం పార్టీని కూడా ఆయన అసత్యాల ప్రచారంలో ఎక్కడా వెనుకబడకుండా తీర్చిదిద్దినట్లున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం 2024 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఓడరేవులో ఒక నౌకలో మాదక ద్రవ్యాలు వచ్చాయన్న వార్త వచ్చింది. ఒక ప్రైవేట్ కంపెనీ బ్రెజిల్ నుంచి వీటిని దిగుమతి చేసుకుందన్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేపట్టింది కూడా. ఈ వార్త వచ్చిందో లేదో.. టీడీపీ వెంటనే రంగంలో దిగిపోయింది ఆ డ్రగ్స్ వైసీపీ వారివేనని ప్రచారం మొదలుపెట్టింది. దీనిపై టీడీపీ చేసిన ట్వీట్లు చూస్తే... ఇంత నీచంగా కూడా ప్రచారం చేయవచ్చా? అనిపించకతప్పదు. వైసీపీ పేరును వక్రీకరిస్తూ ‘యువజన కొకైన్ పార్టీ’ రాసింది. అక్కడితో ఆగలేదు. అప్పటి ముఖ్యమంత్రి జగన్, ఆయన సమీప బంధువులు వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, సోషల్ మీడియా ఇన్‌ఛార్జీ సజ్జల భార్గవ రెడ్డిల ఫోటోలు పెట్టి మరీ దుష్ప్రచారం చేసింది.
‘‘దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా తాడేపల్లి ప్యాలెస్ లింకులే బయటపడుతున్నాయి’’ అని, ‘‘నాడు తాలిబన్ టు తాడేపల్లి. 2021 విజయవాడలో రూ.21 వేల కోట్ల హెరాయిన్, నేడు బ్రెజిల్ తాడేపల్లి.. 2024విశాఖలో రూ.1.60 లక్ష కోట్ల కొకెన్’’ అంటూ ఆరోపించింది. అసత్యాలు ప్రచారం చేసింది. ఇదంతా అవాస్తవమని టీడీపీకి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లకు కూడా తెలుసు. రాజకీయం కోసం ఏమైనా చేయాలన్నది వారి థియరీ. ఎన్ని అబద్దాలైనా ఆడవచ్చన్నది వారి అభిమతం. అదే ప్రకారం వారితోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటిని ఎల్లో మీడియాగా మార్చేసి, ఎలాంటి నీతి,విలువలు లేకుండా తెలుగుదేశం పక్షాన పని చేయించారు. పచ్చి అబద్దాలైనా, ఏమో నిజం ఉందేమో! అన్నట్లుగా వీరు కథలు ఇచ్చేస్తుంటారు. ఇవి చాలవన్నట్లుగా సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తుంటారు.
ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా వీరి ట్రెండ్ ఇదే. విశాఖ డ్రగ్స్ పై చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు కూడా పోటీ పడి అబద్దపు ప్రసంగాలు చేశారు. పవన్ కళ్యాణ్ దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి విశాఖకు హెరాయిన్ వచ్చిందని ఉపన్యాసం చేస్తే, బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిందని చెప్పేశారు. తీరా సీబీఐ విచారణలో తేలింది ఏమిటంటే సంబంధిత కంటైనర్‌లో డ్రగ్స్ లేవని!! దీనిపై టీడీపీ ఎల్లో మీడియా కానీ, సోషల్ మీడియా కానీ కిక్కురుమంటే ఒట్టు. ఇక్కడ మరో సంగతి చెప్పుకోవాలి. సీబీఐ కూడా ఎన్నికలకు ముందు మౌనం పాటించి, ఎన్నికలైన ఆరు నెలలకు తాపీగా విశాఖ పోర్టులోకి వచ్చింది డ్రగ్స్ కాదని తెలిపింది. ఈ విషయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అప్పట్లో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అండగా నిలిచి ఒక ప్లాన్ ప్రకారం ఇలాంటి కుట్రలు చేసి ఉండవచ్చన్న డౌట్ చాలా మందిలో ఉంది. అదే క్రమంలో సీబీఐ కూడా పని చేసిందేమో అన్న అనుమానం వస్తుంది. ఇప్పుడు వాస్తవం వెలుగులోకి వచ్చాక అయినా, ఇంత నీచమైన ఆరోపణలు చేశాం కదా..వాటిని ఉపసంహరించుకుంటున్నాం..అని కూటమి నేతలు ఎక్కడా చెప్పరు.అప్పట్లో ఈ కంటైనర్ ను దిగుమతి చేసుకున్న సంస్థ టీడీపీకి సంబంధించిన వారిదని వార్తలు వచ్చాయి. దాన్ని తోసిపుచ్చడానికి ఆ కంపెనీ యజమాని సోదరుడు వైసీపీ వాడంటూ మరో వాదనను టీడీపీ మీడియా వారు తెరపైకి తెచ్చారు. అంతేకాదు. సీబీఐ కోరిక మేరకు వారికి సహకరించడానికి అక్కడకు రాష్ట్ర పోలీసు అధికారులు వెళ్లారు. వెంటనే ఎల్లో మీడియా డ్రగ్స్ కేసును మేనేజ్ చేయడానికే వెళ్లారని కల్పిత కథనాలు వండేశారు.
ఇలా ఒకటి కాదు.. ఎన్నో విషయాలలో అబద్దపు ప్రచారం చేశారు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా వారిపై పెడుతున్న కేసులను పరిగణనలోకి తీసుకుంటే, ఆ రోజుల్లో టీడీపీ, జనసేనలు చేసిన దారుణమైన అసత్యాలపై ఎంత తీవ్రమైన కేసులు పెట్టి ఉండాలో! కాని అప్పట్లో అలా చేయలేదు. మరీ అడ్డగోలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఎవరిపైన అయినా ఒకటి, అరా కేసులు పెడితే, వెంటనే మీడియాపై దాడి అంటూ విపరీతమైన ప్రచారం చేసేవారు.
అదే ఇప్పుడు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాపై జరుగుతున్న దాడిని సమర్థిస్తూ, వారిని సైకోలుగా చిత్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఘోరమైన పోస్టులు పెట్టిందని వైసీపీ వారు ఆధార సహితంగా పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు తాము కోర్టులలో ప్రైవేటు కేసులు వేస్తున్నామని చెప్పారు. రాజకీయాలలో అసత్యాలే ప్రామాణికంగా పని చేసుకుంటూ రాజకీయ నేతలు వెళితే సమాజం కూడా అలాగే తయారవుతుంది. ప్రస్తుతం ఏపీలో సమాజం అటువైపు పయనిస్తోందా?
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment