'మత్తు' చుట్టూ చుట్టాలే | Yellow Media Misinformation On Drug Racket | Sakshi
Sakshi News home page

'మత్తు' చుట్టూ చుట్టాలే

Published Sat, Mar 23 2024 4:41 AM | Last Updated on Sat, Mar 23 2024 11:09 AM

Yellow media misinformation on drug racket - Sakshi

సంధ్యా ఆక్వా యాజమాని కోటయ్య చౌదరి టీడీపీ పెద్దలకు సన్నిహితుడు

దామచర్ల, రాయపాటి, లావు కుటుంబాలతో అత్యంత సాన్నిహిత్యం

ఆలపాటితో వ్యాపార బంధం

బాలయ్య చిన్నల్లుడు భరత్‌ కుటుంబంతో దోస్తీ

పురందేశ్వరి కుటుంబంతో వ్యాపారం, స్నేహం..

దామచర్ల సత్య.. నారా లోకేష్‌కు ముఖ్య అనుచరుడు

పొత్తు భరోసాతోనే డ్రగ్స్‌ దందాకు బరితెగింపు

ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ సంధ్యా ఆక్వా పాత్ర

డ్రగ్స్‌ దందాపై పచ్చ మీడియా దుష్ప్రచారం

సమగ్ర విచారణకు వైఎస్సార్‌సీపీ డిమాండ్‌.. సీఈసీ, సీబీఐకి నివేదన 

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఒంగోలు/గాంధీ నగర్‌ (విజయవాడ సెంట్రల్‌)/ పిఠాపురం/ చీరాల/ విశాఖ సిటీ/ సాక్షి ప్రతినిధి,గుంటూరు:    విశాఖలో బట్టబయలైన డ్రగ్స్‌ దందాలో వేళ్లన్నీ టీడీపీవైపే చూపుతు­న్నాయి. బ్రెజిల్‌ నుంచి విశాఖ పోర్టుకు భారీగా డ్రగ్స్‌ను దిగుమతి చేసిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ చైర్మన్‌ కూనం వీరభద్ర చౌదరి, అధిపతి కూనం కోటయ్య చౌదరి టీడీపీలో ప్రము­ఖులైన నారా, నందమూరి, రాయపాటి, ఆల­పాటి, దామచర్ల, లావు కుటుంబాలకు అత్యంత సన్నిహితు­లన్నది బహిర్గతమైంది. డ్రగ్స్‌ మాఫియా బండారం బట్టబయలు కావడంతో బెంబేలెత్తిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారా­నికి దిగి విషయాన్ని పక్కదారి పట్టించాలని కుట్ర పన్నారు.

ఈ అంకంలో భాగంగా ఒక­పక్క సీబీఐ అధికారుల సోదాలు కొనసాగు­తుండగానే గురువారం రాత్రే చంద్రబాబు, లోకేశ్‌ వరుస ట్వీట్లు చేస్తూ టీడీపీ శ్రేణులతో­పాటు టీడీపీ అనుకూల మీడియాకు సంకేతాలు ఇచ్చారు. ఆ వెంటనే టీడీపీ అనుకూల మీడియా అవాస్తవాలు, అభూత కల్పనలు జోడిస్తూ దుష్ప్రచారానికి తెరతీసింది. తద్వారా డ్రగ్స్‌ దందా వెనుక తాము ఉన్నామనే విషయాన్ని కప్పిపుచ్చవచ్చని చంద్రబాబు భావించారు. అయితే కూనం కోటయ్య చౌదరితో టీడీపీ నేతల వ్యాపార బంధం వెలుగు చూడటంతో బాబు కుట్ర బెడిసికొట్టింది. చంద్రబాబు వదిన, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబంతో కూనం కుటుంబానికి ఉన్న వ్యాపార బంధం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది.

రాయపాటి, దామచర్ల, లావు కుటుంబ సభ్యులతో కూనం కోటయ్య చౌదరి కలసి ఉన్న ఫోటోలు తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కూనం వీరభద్ర చౌదరితో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజాకు ఉన్న బంధాన్ని రుజువు చేసే వ్యాపార లావాదేవీల పత్రాలు కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో టీడీపీ, బీజేపీ పొత్తు కుదురుతుందనే  సంకేతాలు అందిన వెంటనే బ్రెజిల్‌ నుంచి భారీగా డ్రగ్స్‌ దిగుమతికి తెర తీసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడం గమనార్హం. 

కింగ్‌ పిన్‌ కోటయ్య చౌదరి..
డ్రగ్స్‌ దందాలో కీలక పాత్రధారులైన సంధ్యా ఆక్వా కంపెనీ చైర్మన్‌ కూనం వీరభద్ర చౌదరి, ఎండీ కోటయ్య చౌదరి టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితులని ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. ఆయన సన్నిహితులు, వ్యాపార భాగస్వాముల జాబితాను చూస్తే ఆ విషయం తేలిపోతోంది. దామచర్ల సత్యం (ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్థన్‌ సోదరుడు), రాయపాటి జీవన్‌ (టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి)లకు ఆయన అత్యంత సన్నిహితుడు. వారంతా ఓ కోటరీగా పెద్ద ఎత్తున వ్యవహారాలు సాగించారన్నది వెల్లడైంది. వారు విదేశాల్లో అత్యంత సన్నిహితంగా తిరిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

దామచర్ల సత్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు. చంద్రబాబుతోనూ సాన్నిహిత్యం ఉంది. సంధ్యా ఆక్వా కంపెనీ చైర్మన్‌ కూనం వీరభద్ర చౌదరితోపాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత ఆలపాటి రాజాకు వ్యాపార బంధం ఉంది. వారిద్దరూ సంతకాలు చేసిన పలు పత్రాలు ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. విశాఖ కేంద్రంగా వ్యవహారాలు సాగిస్తున్న సంధ్యా ఆక్వా  కంపెనీకి నందమూరి కుటుంబంతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేశ్‌ తోడల్లుడు, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం.భరత్‌కు కూనం కోటయ్య చౌదరి అత్యంత సన్నిహితుడు.

ఆయన కుటుంబం సహకారంతోనే విశాఖ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. సంధ్యా ఆక్వా కంపెనీతో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబానికి వ్యాపార బంధం ఉందన్నది ఇప్పటికే బయటపడింది. పురందేశ్వరి కుమారుడు చెంచురామ్, వియ్యంకుడు భాగస్వాములుగా కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరి ఆక్వా వ్యాపారాన్ని ప్రారంభించారు. దీంతో డ్రగ్స్‌ దందాలో తీగ లాగితే చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి కోటరీ అక్రమాల డొంకంతా కదులుతోంది. 

ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ..
దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ పాత్ర ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో మద్యం కుంభకోణానికి పాల్పడిన సిండికేట్‌లో ఆ కంపెనీ కూడా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఆ కేసును కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు విశాఖ డ్రగ్స్‌ దందాను కూడా కలిపి మొత్తంగా మద్యం, డ్రగ్స్‌ మాఫియా గుట్టును ఛేదించే పనిలో నిమగ్నమైంది.

పొత్తుతోనే బరితెగింపు..
ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఎప్పుడో సిద్ధపడ్డారు. అందుకోసం కాళ్ల బేరానికి కూడా దిగజారతానని గతేడాదే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పొత్తును అవకాశంగా చేసుకుని భారీగా డ్రగ్స్‌ దందాకు పచ్చ మాఫియా బరితెగించింది. ఎన్నికల ముందు భారీగా డ్రగ్స్‌ను రాష్ట్రంలోకి తరలించేందుకు పథకం వేసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే సంధ్యా ఆక్వా కంపెనీ ద్వారా బ్రెజిల్‌ నుంచి 25 వేల కిలోల ఈస్ట్‌ దిగుమతి ముసుగులో భారీగా డ్రగ్స్‌ను చేరవేసేందుకు ప్రణాళిక రూపొందించింది.

రెండు నెలల్లో డ్రగ్స్‌ విశాఖ చేరుకునేలా అంతా సిద్ధమైంది. అటు దగ్గుబాటి ఇటు చంద్రబాబు కుటుంబాలు సహకారం ఉండటంతో తమ దందాకు అడ్డు ఉండదని భావించారు. డ్రగ్స్‌ మాఫియాపై అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్‌పోల్‌కు ఉప్పందడంతో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయాన్ని అప్రమత్తం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం విశాఖ పోర్టులో నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్‌ బాగోతం బట్టబయలైంది. పచ్చ కుట్ర బెడిసికొట్టింది. 

ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారంపై వైఎస్సార్‌సీపీ తక్షణమే ప్రతి స్పందించింది. డ్రగ్స్‌ దందాతో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలకు ఉన్న బంధాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లింది. చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. నియమావళిని ఉల్లంఘిస్తూ చంద్రబాబు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆధారాలతో నివేదించింది. దీనిపై జాతీయ ప్రెస్‌ కౌన్సిల్‌కు కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. డ్రగ్స్‌ దందాపై సత్వరం సమగ్రంగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి పాత్రధారులతోపాటు సూత్రధారులను నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేసింది. 

కూనం కుటుంబం కథ...
విశాఖ డ్రగ్స్‌ వ్యవహారంలో ప్రధాన పాత్రధారులైన సంధ్యా ఆక్వా ఫుడ్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ అధినేతలు కూనం వీరభద్ర చౌదరి, కుమారుడు కూనం కోటయ్య చౌదరి స్వగ్రామం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి. ఆక్వా రంగంలో ఉత్థాన పతనాలను చూసిన వీరభద్ర చౌదరి డ్రగ్స్‌ వ్యాపారంలో కాలు మోపాడు. కాకినాడ ప్రధాన కేంద్రంగా ఆక్వా ఫుడ్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్స్, ప్రీ ప్రోసెసింగ్‌ ప్లాంట్ల ముసుగులో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

అటు టీడీపీ ఇటు రాష్ట్ర బీజేపీ అగ్రనేతల అండదండలతో తన కార్యకలాపాలను విస్తరించాడు. కూనం కుటుంబానికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సంధ్యా ఆక్వా ప్రీ ప్రోసెసింగ్‌ ప్లాంట్లతో పాటు ఆక్వా కల్చర్‌ చెరువులు కూడా ఉన్నాయి. వీరి వ్యాపార లావాదేవీలు కొండపి, ఒంగోలు, కందుకూరు, పర్చూరు నియోజకవర్గాల్లోనూ సాగుతున్నాయి. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సోదరుడు దామచర్ల సత్యనారాయణ(సత్య)తో కూనం కుటుంబానికి వ్యాపార లావాదేవీలున్నాయి.

టంగుటూరు టోల్‌ ప్లాజా సమీపంలో దామచర్ల సత్యకు చెందిన పొగాకు గోడౌన్‌లో సంధ్యా ఆక్వా పేరుతో ప్రీ ప్రాసెసింగ్‌ ప్లాంటు ఏర్పాటైంది. కూనం కుటుంబానికి విజయవాడకు చెందిన సౌమ్యుడిగా పేరున్న ఓ టీడీపీ నేతతోనూ సంబంధాలున్నట్లు సమాచారం. కోటయ్య చౌదరి, టీడీపీ నేత తనయుడు తనయుడు విదేశాల్లో మంచి సన్నిహితులని తెలిసింది.  

కాకినాడ తీరంలో కలకలం
డ్రగ్స్‌ తీగ లాగితే కాకినాడ జిల్లా కొత్తపల్లి తీరంలోని మూలపేటలో డొంక కదిలింది. మూలపేటలోని సంధ్య ఆక్వా కంపెనీలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 10 మంది సీబీఐ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో సోదాలు జరిపారు. సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ బల్వీందర్‌ సింగ్‌ ఆధ్వర్యంలో సీబీఐ బృందం ఈ తనిఖీలు చేసింది. జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపూడి సమీపాన ఉన్న సంధ్య ఆక్వా సీడ్‌ తయారీ కంపెనీ, కృష్ణా జిల్లా పామర్రు తదితర ప్రాంతాల్లో ఉన్న సంధ్య ఆక్వా కంపెనీల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెబుతున్నారు.

కత్తిపూడి సమీపంలోని సంధ్య ఆక్వా సీడ్‌ కంపెనీని ఇటీవలే ప్రారంభించారు. దీనిలో ఆక్వా సీడ్‌ తయారీకి అవసరమైన ముడి సరుకును బ్రెజిల్‌ నుంచి దిగుమతి చేయడంతో ఆ సరకు నౌక ద్వారా విశాఖకు కంటైనర్లలో చేరింది. వాటిలో డ్రగ్స్‌ ఉన్నట్లు గుర్తించిన సీబీఐ అధికారులు సంధ్య కంపెనీలన్నింటిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మూలపేటలోని సంధ్య ఆక్వా కంపెనీని క్షుణ్ణంగా పరిశీలించి మందులు, ఇతర శాంపిల్స్‌ సేకరించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకూ సంధ్య ఆక్వా కంపెనీని క్షుణ్ణంగా పరిశీలించిన సీబీఐ అధికారులు తిరిగి సోదాలు చేస్తామని తెలిపారు. 

చీరాలకు లింకు?
డ్రగ్స్‌ దందాకు చీరాలతో కూడా లింకులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. సంధ్యా ఆక్వా పేరుతో వాడరేవులో గత రెండేళ్లుగా కంపెనీ నడుస్తోంది. దీన్ని పురందేశ్వరి అల్లుడు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. గత పది రోజులుగా ఈ కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయని సమాచారం. 

మూడోసారి 150 బ్యాగుల్లో శాంపిల్స్‌ పరీక్ష
డ్రగ్స్‌ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. శుక్రవారం మరికొన్ని శాంపిల్స్‌ను పరీక్షించగా ఫలితాలు పాజిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో న్యాయమూర్తి సమక్షంలో 25 వేల కేజీల సరుకుతో కూడిన కంటైనర్‌ను సీజ్‌ చేశారు. బ్రెజిల్‌లోని శాంటోస్‌ పోర్టు నుంచి రవాణా నౌక ద్వారా విశాఖకు వచ్చిన కంటైనర్‌లో డ్రగ్స్‌ ఉన్నట్లు ఇంటర్‌పోల్‌ ఇచ్చిన  సమాచారంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే.

ఈ నెల 19, 20వ తేదీల్లో 49 బ్యాగుల్లో శాంపిల్స్‌ను పరీక్షించగా డ్రగ్స్‌ ఉన్నట్లు నిర్ధారణైంది. దీంతో ఈ నెల 21వ తేదీన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా శుక్రవారం మరోసారి వీసీటీపీఎల్‌కు వెళ్లి మూడోసారి 150 బ్యాగుల్లో శాంపిల్స్‌ను పరీక్షించారు. వాటి ఫలితాలు కూడా పాజిటివ్‌గా వచ్చినట్లు సమాచారం.

న్యాయమూర్తి సమక్షంలో రికార్డులతో పాటు శాంపిల్స్‌ను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తి సమక్షంలోనే  బ్యాగులను సీజ్‌ చేశారు. మరికొన్ని సీబీఐ బృందాలు సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలోమరిన్ని ఆధారాలతో సీబీఐ అధికారులు త్వరలోనే అరెస్టులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

‘ఆలపాటి’ ఆర్థిక బంధం
విశాఖ డ్రగ్స్‌ కేసులో కీలక పాత్రధారి కూనం వీరభద్ర చౌదరి(వీరభద్రరావు)తో మాజీ మంత్రి ఆలపాటి రాజాకు ఉన్న ఆర్థిక సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. ఆలపాటి రుణాలకు కూనం సెక్యూరిటీ ఇవ్వడంతోపాటు ఎన్‌ఆర్‌ఐ అకాడమీతో భాగం పంపిణీ చేసుకోవడం వంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయి. 2015 అక్టోబరు 31న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ గుంటూరు అరండల్‌పేట విజయా బ్యాంకు బ్రాంచ్‌లో రూ.2 కోట్లు రుణం (దస్తావేజు నంబరు 11158/2015) తీసుకున్నారు. అదే ఏడాది డిసెంబరు 9న మరో రూ.12 కోట్లు అదే బ్యాంకు నుంచి రుణాన్ని పొందారు.

దీనికి ఆలపాటి రాజా భార్య ఆలపాటి మాధవితోపాటు కూనం వీరభద్రరావు, ఎన్‌ఆర్‌ఐ అకాడమీ  ఆస్తులను (దస్తావేజు నంబరు 12521/2015) తనఖా పెట్టారు. 2021లో కూనం వీరభద్రరావుకు ఎన్నారై అకాడమీకి సంబంధించి పార్టీషన్‌ దస్తావేజు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. కూనం వీరభద్రరావు తమ ఆస్తులను తనఖా పెట్టి 2017లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు రుణాన్ని ఇప్పించారు (దస్తావేజు నంబరు 4581/2017). ఇదే దస్తావేజును 2021లో (నంబరు 12205/­2021) రద్దు  చేసుకున్నారు. దీంతోపాటు మరికొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా వీరిద్దరి మధ్య జరిగినట్లు తెలుస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement