రక్తపుటేరులు పారిస్తున్న టీడీపీ శ్రేణులు
హత్యలు, దాడులతో రాష్ట్రం అల్లకల్లోలం
సినిమా ముందుంది అంటూ బెదిరింపులు
కనీసం శాంతి–భద్రతలను సమీక్షించని సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి : ‘పోలింగ్, కౌంటింగ్ మధ్య రెడ్ బుక్ టీజర్ చూపించాం.. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత రెడ్ బుక్ ట్రైలర్ చూపించాం.. అంతటితో అయిపోలేదు.. అసలు రెడ్ బుక్ సినిమా ముందుంది’ అని టీడీపీ రౌడీ మూకలు బరి తెగిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ అధికార గూండాగిరీకి పోలీసు శాఖ దాసోహమవడంతో టీడీపీ రెడ్‌బుక్ ఏకంగా బ్లడ్ బుక్‌గా రూపాంతరం చెంది విశృంఖలత్వం సృష్టిస్తోంది.
రెడ్‌బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో రక్తపుటేరులు పారిస్తూ టీడీపీ నేతల రక్తదాహం తీరుస్తోంది. అయినా సరే ఇది చాలదు.. అంతకు మించి అంటూ ప్రభుత్వ నేతే వ్యాఖ్యానించడంతో పచ్చ మూకలు మరింతగా మరణ మృదంగం మోగించేందుకు బరి తెగిస్తున్నాయి.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటికే 36 హత్యలు.. నలుగురిపై అత్యాచారం, ఆపై హత్యలు.. 16 అత్యాచారాలు.. వెయ్యికి పైగా దాడులతో రాష్ట్రం హడలెత్తిపోతోంది. అరాచకం రాజ్యం చేస్తుంటే రాక్షస గణం గంగవెర్రులెత్తిపోతూ సృష్టిస్తున్న విధ్వంసకాండకు రాజ్యాంగబద్ధ వ్యవస్థలు మౌన సాక్షిగా మిగిలి పోతుండటం పరిస్థితిని మరింతగా దిగజారుస్తోంది.
ఎదురు దాడి చేయండని మంత్రులకు ఆదేశం
హత్యలు, హత్యాయత్నాలు, దాడులతో రాష్ట్రం అట్టుడుకుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం బాధ్యతాయుతంగా స్పందించనే లేదు. పోలీసు ఉన్నతాధికారులతో శాంతిభద్రతలపై సమీక్షించ లేదు. పైగా విధ్వంసకాండను వెనకేసుకొచ్చే రీతిలో మంత్రి మండలి సమావేశంలో మాట్లాడటం విభ్రాంతి కలిగించింది. హత్యలు జరుగుతున్నా జరగలేదన్నట్టుగా మాట్లాడాలి కదా.. అని మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేయడం విస్మయ పరుస్తోంది.
అసలు 36 హత్యలు ఎక్కడ జరిగాయని ఎందుకు ప్రశ్నించలేదని కూడా ఆయన మంత్రులను నిలదీశారు. వినుకొండలో వైఎస్సార్‌సీపీకి చెందిన రషీద్‌ను టీడీపీ వర్గీయుడు జిలానీ.. నడి వీధిలో దారుణంగా హత్య చేస్తే, అది అసలు రాజకీయ హత్యేకాదని వితండవాదం చేయడం టీడీపీకే చెల్లింది. టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొన్న జిలానీ, అసలు తమ పార్టీకి చెందిన వ్యక్తే కాదని అడ్డగోలు వాదన చేయడం విడ్డూరం.
అతను టీడీపీ ఎమ్మెల్యే సతీమణి జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆమెకు కేకు తినిపిస్తున్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చినా సరే తమ పార్టీ నేత కాదనడం కంటే బుకాయింపు ఇంకేముంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే హోమ్ మంత్రి అనిత ఆదివారం హడావిడిగా మీడియా సమావేశం నిర్వహించి, అసలు 36 హత్యలు ఎక్కడ జరిగాయని ప్రశ్నించడం చంద్రబాబు పన్నాగానికి నిదర్శనం.
దాడులు, విధ్వంసానికి చంద్రబాబు ‘పచ్చ’జెండా
పచ్చ మూకలు 45 రోజులకుపైగా యథేచ్ఛగా సాగిస్తున్న విధ్వంసకాండతో చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందినట్టు లేదు. అందుకే ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు బాధితుల ఫిర్యాదులే స్వీకరించడం లేదు. హత్యలు, హత్యాయత్నాలు, విధ్వంసం సృష్టిస్తున్న టీడీపీ, జనసేన నేతలపై కేసులు పెట్టే ధైర్యం పోలీసులకు లేదన్నది సుస్పష్టం. తద్వారా దాడులు కొనసాగించండి.. మేమున్నాం.. అనే రీతిలో టీడీపీ గూండాలను ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహిస్తున్నారు.
వినుకొండలో నడి వీధిలో హత్య చేసిన టీడీపీ వర్గీయుడు జిలానీని పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని అరెస్ట్ చూపిస్తూ పోలీసులు కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్ట లేదు! ప్రెస్ మీట్ పెడితే ఎందుకు హత్య చేశారని మీడియా ప్రతినిధులు అతన్ని, పోలీసులను అడుగుతారు. అప్పుడు రాజకీయ కక్షతోనే హత్య చేశాడనే విషయం చెప్పాల్సి వస్తుంది. అందుకే గోప్యంగా రిమాండ్‌కు తరలించారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ గూండాలు 37 ప్రదేశాల్లో రాళ్ల దాడులతో బీభత్సం సృష్టించారు. ఆ దాడుల్లో పాల్గొన్న ఒక్క టీడీపీ నేత, కార్యకర్త మీద కూడా కేసు నమోదు చేయనే లేదు.
ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైగా బాధితులైన ఎంపీ మిథున్‌రెడ్డి, రెడ్డెప్పపైనే అక్రమ కేసులు బనాయించడం గమనార్హం. తిరుపతి జిల్లాలో టీడీపీ రౌడీ మూకలు 40 చోట్ల దాడులకు పాల్పడ్డాయి. ఒక్క సంఘటనలో కూడా టీడీపీ వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేయలేదు. పైగా బాధితులైన 35 మంది వైఎస్సార్‌సీపీ వర్గీయులపై అక్రమ కేసులు పెట్టారు. ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరంలో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీకి చెందిన సర్పంచ్, ఆయన బంధువులపై దాడి చేస్తే.. ఆ కేసులో వైఎస్సార్‌సీపీ వర్గీయులు 13 మందిని అరెస్ట్ చేశారు.
నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో టీడీపీ నేతలు వందల సంఖ్యలో దాడులకు తెగబడినా సరే వారిపై కేసులు నమోదు చేయనే లేదు. ఇటువంటి ఉదంతాలు రాష్ట్ర వ్యాప్తంగా వందల్లో ఉన్నాయి. తద్వారా రానున్న రోజుల్లో మరింత పెను విధ్వంసం సృష్టించేందుకు.. దాడులతో తెగబడేందుకు.. పచ్చ రౌడీలకు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినట్టేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి, సామాన్యుల ప్రాణాలకు న్యాయ వ్యవస్థ, రాజ్యాంగబద్ధ సంస్థలే అండగా నిలబడాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment