సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టు ట్రస్ట్ సిగలో మరో రికార్డు వచ్చి చేరింది. 2019 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల సరకు రవాణాలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే సమయంలో నాలుగో స్థానానికి పరిమితమైన వీపీటీ.. ఈ ఏడాది 10 శాతం వృద్ధి నమోదు చేసుకుని ఒక స్థానం మెరుగు పరచుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లో విశాఖపట్నం పోర్టు ట్రస్టు 23.70 మిలియన్ టన్నుల కార్గోను రవాణా చేసి రికార్డు సృష్టించింది. గతేడాది 21.52 మిలియన్ టన్నుల కార్గోను రవాణా చేసింది. గతేడాదితో పోలిస్తే ఇది 2.18 మిలియన్ టన్నులు అధికం. విశాఖ పోర్టు ట్రస్టు సరకు రవాణాలో వృద్ధిని సాధించడంలో ఇనుప ఖనిజం, పెల్లెట్స్, కుకింగ్ కోల్, పెట్రోలియం ఉత్పత్తులు, కంటైనర్ కార్గో వంటివి ప్రధాన పాత్ర పోషించాయి.
అధునాతన మార్కెటింగ్ వ్యూహాలు..
ఎప్పటికప్పుడు సరకు రవాణాలో ఆధునిక వ్యూహాల్ని అనుసరిస్తూ.. విశాఖ పోర్టు ట్రస్టు దూసుకెళ్తోంది. ఇన్నర్ హార్బర్‌లో పనామాక్స్ సామర్థ్యం కలిగిన మూడు బెర్తుల నిర్మాణంతో పాటు ఆయిల్ రిఫైనరీ–3లో అదనపు ఆయిల్ హ్యాండ్లింగ్ సామర్ధ్యం పెంపుతో పాటు ఆయిల్ రిఫైనరీ 1, ఆయిల్ రిఫైనరీ 2 బెర్తులను అభివృద్ధి చేసింది. దీనికి తోడు 100 టన్నుల సామర్ధ్యం కలిగిన హార్బర్ మొబైల్ క్రేన్ ఏర్పాటు చేసింది. కస్టమర్లకు ఎండ్ టూ ఎండ్ లాజిస్టిక్ సదుపాయాన్ని కల్పిస్తూ తమిళనాడు ఎలక్ట్రికల్ డిపార్టుమెంట్‌తో ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా విశాఖ పోర్టు ట్రస్టు మైన్‌ల వద్ద వ్యాగన్ లోడింగ్, కార్గో నిల్వ, షిప్పుల్లోకి లోడింగ్, రైల్వే వ్యాగన్ల ఏర్పాటు తదితర సదుపాయాల్ని కల్పిస్తోంది. ఇదే తరహా లాజిస్టిక్ సదుపాయాలతో ఎన్‌ఎండీసీతో నాగర్ నగర్ స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు రవాణాపై త్వరలో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.
ఈ ఏడాది 70 మిలియన్ టన్నుల లక్ష్యం
విశాఖ పోర్టు ట్రస్టు కార్గో హ్యాండ్లింగ్‌లో మూడో స్థానంలో నిలిచి పోర్టు చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. పక్కనే ప్రైవేటు పోర్టు ఉన్నప్పటికీ కార్గో హ్యాండ్లింగ్‌లో పెరుగుదలను నమోదు చేయడం విశేషం. భవిష్యత్తులో మూడో స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ముందుకు దూసుకెళ్లేందుకు సిద్ధమవుతాం. ఈ ఏడాది చివరికి పోర్టు ద్వారా 70 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం.
– పీఎల్ హరనాథ్, విశాఖపోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్
సరకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు
Published Mon, Aug 5 2019 4:39 AM | Last Updated on Mon, Aug 5 2019 4:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment