Cargo transport
-
పికప్ వాహన విభాగంలో ఎంఅండ్ఎం 2 కొత్త మోడళ్లు
హైదరాబాద్: సరకు రవాణాకు సంబంధించిన (పికప్) వాహన విభాగంలో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) రెండు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. రూ.7.85 లక్షల నుంచి రూ.10.33 లక్షల శ్రేణిలో ధరలు ఉన్న ఈ బొలెరో మ్యాక్స్ సామర్థ్యం 2 టన్నుల వరకూ ఉందని ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన తెలిపింది. రూ.24,999 చెల్లించి వీటిని బుక్ చేసుకోవచ్చని కూడా ప్రకటన వెల్లడించింది. 1.3 నుంచి 2 టన్నుల వరకూ పేలోడ్ సామర్థ్యంతో ఈ కొత్త శ్రేణి వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసినట్లు ప్రకటన వివరించింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక పరిజ్ఞానం, సదుపాయాలతో ఈ వాహన శ్రేణి ఉత్పత్తి జరిగినట్లు వివరించింది. హెచ్డీ సిరీస్ (హెచ్డీ 2.0, హెచ్డీ 1.7, హెచ్డీ 1.3 లీటర్లు) , సిటీ సిరీస్ (సిటీ 1.3, 1.4 సీఎస్జీ) సిరీస్‌లలో వాహనాలు లభ్యం కానున్నట్లు తెలిపింది. -
జలజ: కారులో ఏముంది..కార్గోనే కిక్కిస్తుంది
ఉరుకుల పరుగుల జీవితంలో... అప్పుడప్పుడు కాస్త బ్రేక్ తీసుకుని ఎక్కడికైనా కొత్తప్రదేశానికి వెళ్తే శారీరకంగా, మానసికంగానూ ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. చాలా మంది ఇలా ఆరునెలలకో, ఏడాదికోసారి ట్రిప్పులు వేస్తుంటారు. ఇలాంటి ట్రిప్పులకు ‘‘కార్లో వెళ్తే ఏం బావుంటుంది లారీ అయితే మరింత మజా వస్తుంది ఫ్రెండ్స్’’ అంటోంది జలజా రతీష్. మాటల దగ్గరే ఆగిపోకుండా కేరళ నుంచి కార్గోలారీని నడుపుకుంటూ కశ్మీర్ ట్రిప్‌నూ అప్ అండ్ డౌన్ పూర్తి చేసి ఔరా అనిపిస్తోంది జలజ. కొట్టాయంకు చెందిన నలభై ఏళ్ల జలజా రతీష్‌కు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ చేయడం అంటే ఎంతో ఇష్టం. దీనికితోడు కొత్త ప్రదేశాలను చూడడం అంటే మక్కువ. దీంతో పెళ్లి తరువాత భర్త ప్రోత్సాహంతో డ్రైవింగ్ నేర్చుకుంది. ఒక పక్క ఇంటి పనులు చూసుకుంటూనే డ్రైవింగ్‌పై పట్టు రావడంతో సొంతంగాఎక్కడికైనా వెళ్లాలని ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోన్న జలజకు.. భర్తకు ముంబైకు ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ రూపంలో అవకాశం వచ్చింది. దాంతో భర్తతో కలిసి బయలు దేరింది. ఈ ట్రిప్పులో తనే స్టీరింగ్ పట్టి నడిపింది. ఏ ఇబ్బంది లేకుండా ముంబై ట్రిప్పు పూర్తిచేయడంతో.. మరోసారి కూడా మళ్లీ లారీ నడుపుతూ ముంబై వెళ్లింది. ఈ రెండు ట్రిప్పులు ఆమె ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచి కేరళ నుంచి కశ్మీర్ వరకు ట్రిప్‌ను ప్లాన్ చేసేలా చేసింది. భర్తతో కలిసి.. లాంగ్ ట్రిప్‌కు పక్కగా ప్రణాళిక రూపొందించి భర్త రతీష్, మరో బంధువు అనీష్‌తో కలిసి ఫిబ్రవరి రెండోతేదీన ఎర్నాకుళం జిల్లా పెరంబూర్ నుంచి బయలు దేరింది. లారీలో ప్లైవుడ్ లోడింగ్ చేసుకుని పూనేలో డెలివరి ఇచ్చింది. తరువాత ఉల్లిపాయలను లోడ్ చేసిన మరో లారీని తీసుకుని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యాణ, పంజాబ్‌ల మీదుగా కశ్మీర్ చేరుకుంది. రోడ్డుమీద కార్గో లారీని నడుపుతోన్న జలజను చూసిన వారికి ‘‘ఇది నిజమేనా అన్నట్టు’’ ఆశ్చర్యంగా అనిపించింది. కొంతమంది ఆసక్తిగా చూస్తే, మరికొంతమంది విస్తుపోయి చూశారు. లారీ ఆపిన ప్రతిసారి చుట్టుపక్కల వాళ్లు వచ్చి జలజ డ్రైవింగ్‌ను పొగడడం, లారీ నడపడాన్ని అద్భుతంగా వర్ణిస్తుండడంతో.. మరింత ఉత్సాహంతో లారీని నడిపి కేరళ నుంచి కశ్మీర్ ట్రిప్‌ను వేగంగా పూర్తిచేసింది. తిరుగు ప్రయాణంలో కూడా కశ్మీర్లో ప్లైవుడ్ ట్రాన్స్పోర్ట్ దొరకడంతో హర్యాణ, బెంగళూరులో లోడ్ దించి, అక్కడ పంచదారను లోడ్ చేసుకుని కేరళ లో అన్లోడ్ చేయడంతో జలజ ట్రిప్పు విజయవంతంగా పూర్తయింది. ఈ ట్రిప్పు బాగా పూర్తవడంతో తరువాతి ట్రిప్పుని త్రిపుర నుంచి ఢిల్లీ ప్లాన్ చేస్తోంది. జలజ తన ట్రిప్ మొత్తాన్ని వీడియో తీసి నెట్లో పెట్టడంతో చాలామంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కొంతమంది అమ్మాయిలు తాము కార్గో లారీలు నడుపుతామని చెబుతున్నారు. సినిమాల్లో చూసినవన్ని ప్రత్యక్షంగా.. ‘‘గత కొన్నేళ్లుగా సినిమాల్లో చూసిన ఎన్నో ప్రదేశాలు ఈ ట్రిప్పు ద్వారా ప్రత్యక్షంగా చూడగలిగాను. ఆద్యంతం ఎంతో ఆసక్తిగా సాగిన ట్రిప్పులో గుల్మర్గ్, పంజాబ్ ప్రకృతి అందాలు మర్చిపోలేని సంతోషాన్నిచ్చాయి. చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ మీద ఆసక్తి ఉన్నప్పటికీ పెళ్లి తరువాతే నా కల నెరవేరింది. ఇప్పుడు కూడా నా భర్త రితీష్ ప్రోత్సాహంతో ఈ సుదీర్ఘ ట్రిప్పుని పూర్తిచేశాను. కార్గో లోడ్లను తీసుకెళ్లడం వల్ల ట్రిప్పుకు పెద్దగా ఖర్చు కాలేదు. లారీలోనే వంట చేసుకుని తినేవాళ్లం. కారులో కంటే లారీలో నిద్రపోవడానికి చాలా సౌకర్యంగా అనిపించింది. కారులో కంటే కార్గో ట్రిప్పు మంచి కిక్ ఇస్తుంది. త్వరలో కుటుంబం మొత్తం కలిసి ఇలాంటి జర్నీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము’’ అని జలజ చెప్పింది. రోజూ చేసే పని అయినా రొటీన్‌కు భిన్నంగా చేసినప్పుడే ఆ పని మరింత ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందనడానికి జలజ జర్నీనే ఉదాహరణ. -
రైల్ కార్గో రవాణాలో ‘త్రివేణి’
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): కార్గో రవాణాలో విజయవాడ రైల్వే డివిజన్ మరో ఘనత సాధించింది. తక్కువ సమయంలో ఎక్కువ సరుకు రవాణా చేసేలా ఇటీవల మూడు గూడ్స్ రైళ్లను కలిపి ఒకే రైలుగా ‘త్రిశూల్’ పేరుతో విజయవంతంగా నడిపిన విజయవాడ డివిజన్ అధికారులు త్రివేణి మిషన్ పేరిట ఆదివారం నాలుగు అతి పొడవైన గూడ్స్ రైళ్లను నడిపి మరో ఘనత సాధించారు. రెండేసి గూడ్స్ రైళ్లను జతచేసి 118 వ్యాగన్లు ఉన్న ఓ భారీ రైలుగా మలిచారు. ఆ విధంగా ఎనిమిది రైళ్లను నాలుగు భారీ రైళ్లుగా చేసి మూడు గమ్యస్థానాలకు కార్గో రవాణా చేశారు. వాటిలో ఒక రైలును విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా తాల్చేర్ వరకు 900 కిలోమీటర్లు నడిపారు. మరో గూడ్స్ రైలును కృష్ణపట్నం పోర్టు నుంచి ఓబులవారిపల్లి మీదుగా కేశోరామ్ సిమెంట్ కంపెనీకి 645 కిలోమీటర్లు కార్గో రవాణా చేశారు. బీసీఎన్ రేక్స్ గల రెండు భారీ గూడ్స్ రైళ్లను విజయవాడ నుంచి కొండపల్లి వరకు నడిపారు. తద్వారా కార్గో రవాణా సామర్థ్యాన్ని అమాంతంగా పెంచుకుని విజయవాడ రైల్వే డివిజన్ దేశంలోనే గుర్తింపు పొందింది. రోలింగ్ స్టాక్ నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచింది. తద్వారా కార్గో రవాణా వేగం పెరగడంతోపాటు తక్కువ సమయంలో లోడింగ్/అన్లోడింగ్ ప్రక్రియ పూర్తిచేశారు. ఖాళీ అయిన వ్యాగన్లు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరతాయి. సిబ్బంది అవసరం తగ్గడంతోపాటు రైలు మార్గంలో రద్దీ తగ్గడంతో రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. భారీ రైళ్లను సమర్థంగా నిర్వహించినందుకు విజయవాడ రైల్వే డివిజన్ ఉన్నతాధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు. -
‘కార్గో’లో గంగవరం పోర్టు మరో మైలురాయి
సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే అత్యంత లోతైన, అధునాతన పోర్టుల్లో ఒకటైన గంగవరం పోర్టు సరుకుల ఎగుమతి దిగుమతుల్లో ఎప్పటికప్పడు రికార్డులు సృష్టిస్తోంది. అత్యాధునిక మౌలిక వసతుల కారణంగా మంగళవారం మరో మైలురాయిని అధిగమించింది. 24 గంటల్లోనే కార్గో హ్యాండ్లింగ్ చేస్తూ రికార్డు నమోదు చేసింది. మొబైల్ హార్బర్ క్రేన్స్ (ఎంహెచ్సీ) వినియోగిస్తూ 24 గంటల్లో ఏకంగా 26,885 మెట్రిక్ టన్నుల ఎరువును షిప్ నుంచి దిగుమతి చేసింది. గతంలో ఇదే పోర్టులో 24 గంటల్లో 16,690 మెట్రిక్ టన్నుల ఎరువులను డిశ్చార్జ్ చేసిన రికార్డుని అధిగమించింది. ఎంవీకే మ్యాక్స్ ఎంపరర్ నౌక తీసుకొచ్చిన 64,575 మెట్రిక్ టన్నుల యూరియాని అత్యంత వేగంగా దిగుమతి చేసింది. స్టీల్‌ప్లాంట్‌కు బొగ్గు అందించడంలోనూ గత నిర్వహణని అధిగమించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం 5,67,888 మెట్రిక్ టన్నులను కన్వేయర్ల ద్వారా ఆర్ఐఎన్ఎల్ ప్లాంట్‌కు బదిలీ చేయగా.. ఆగస్టులో ఏకంగా 6,08,706 మెట్రిక్ టన్నులు బొగ్గును అందించింది. ఒక నెలలో ఇంత పెద్ద మొత్తాన్ని అందించిన గంగవరం పోర్టు అధికారులు, సిబ్బందికి స్టీల్‌ప్లాంట్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గంగవరం పోర్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీజే రావు మాట్లాడుతూ అత్యున్నత మౌలిక వసతులు, నిర్వహణ సామర్థ్యాలను అందిపుచ్చుకోవడం వల్లే అనేక మైలురాళ్లని అధిగమిస్తున్నామన్నారు. పోర్టులో డీప్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయోజనాలు వాణిజ్య సంస్థలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. -
కార్గో బస్సులపై నా ఫొటో వద్దు
సాక్షి, హైదరాబాద్: ‘సరుకు రవాణా చేసే కార్గో బస్సులపై సీఎం కేసీఆర్ ఫొటో పెట్టడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ యత్నాలను కేసీఆర్ తప్పుపట్టారు’అని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఆర్టీసీ బస్సులను సరుకు రవాణాకు వాడటం వల్ల ప్రజలకు సేవలు అందించడం, ఆర్టీసీ లాభాల్లో పయనించడం తన లక్ష్యం అని సీఎం అన్నారు. బస్సులపై ఫొటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని కేసీఆర్ స్పష్టం చేశారు’ అని సీఎంవో పేర్కొంది. -
సరకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టు ట్రస్ట్ సిగలో మరో రికార్డు వచ్చి చేరింది. 2019 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల సరకు రవాణాలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే సమయంలో నాలుగో స్థానానికి పరిమితమైన వీపీటీ.. ఈ ఏడాది 10 శాతం వృద్ధి నమోదు చేసుకుని ఒక స్థానం మెరుగు పరచుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లో విశాఖపట్నం పోర్టు ట్రస్టు 23.70 మిలియన్ టన్నుల కార్గోను రవాణా చేసి రికార్డు సృష్టించింది. గతేడాది 21.52 మిలియన్ టన్నుల కార్గోను రవాణా చేసింది. గతేడాదితో పోలిస్తే ఇది 2.18 మిలియన్ టన్నులు అధికం. విశాఖ పోర్టు ట్రస్టు సరకు రవాణాలో వృద్ధిని సాధించడంలో ఇనుప ఖనిజం, పెల్లెట్స్, కుకింగ్ కోల్, పెట్రోలియం ఉత్పత్తులు, కంటైనర్ కార్గో వంటివి ప్రధాన పాత్ర పోషించాయి. అధునాతన మార్కెటింగ్ వ్యూహాలు.. ఎప్పటికప్పుడు సరకు రవాణాలో ఆధునిక వ్యూహాల్ని అనుసరిస్తూ.. విశాఖ పోర్టు ట్రస్టు దూసుకెళ్తోంది. ఇన్నర్ హార్బర్లో పనామాక్స్ సామర్థ్యం కలిగిన మూడు బెర్తుల నిర్మాణంతో పాటు ఆయిల్ రిఫైనరీ–3లో అదనపు ఆయిల్ హ్యాండ్లింగ్ సామర్ధ్యం పెంపుతో పాటు ఆయిల్ రిఫైనరీ 1, ఆయిల్ రిఫైనరీ 2 బెర్తులను అభివృద్ధి చేసింది. దీనికి తోడు 100 టన్నుల సామర్ధ్యం కలిగిన హార్బర్ మొబైల్ క్రేన్ ఏర్పాటు చేసింది. కస్టమర్లకు ఎండ్ టూ ఎండ్ లాజిస్టిక్ సదుపాయాన్ని కల్పిస్తూ తమిళనాడు ఎలక్ట్రికల్ డిపార్టుమెంట్తో ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా విశాఖ పోర్టు ట్రస్టు మైన్ల వద్ద వ్యాగన్ లోడింగ్, కార్గో నిల్వ, షిప్పుల్లోకి లోడింగ్, రైల్వే వ్యాగన్ల ఏర్పాటు తదితర సదుపాయాల్ని కల్పిస్తోంది. ఇదే తరహా లాజిస్టిక్ సదుపాయాలతో ఎన్ఎండీసీతో నాగర్ నగర్ స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు రవాణాపై త్వరలో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది 70 మిలియన్ టన్నుల లక్ష్యం విశాఖ పోర్టు ట్రస్టు కార్గో హ్యాండ్లింగ్‌లో మూడో స్థానంలో నిలిచి పోర్టు చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. పక్కనే ప్రైవేటు పోర్టు ఉన్నప్పటికీ కార్గో హ్యాండ్లింగ్‌లో పెరుగుదలను నమోదు చేయడం విశేషం. భవిష్యత్తులో మూడో స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ముందుకు దూసుకెళ్లేందుకు సిద్ధమవుతాం. ఈ ఏడాది చివరికి పోర్టు ద్వారా 70 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. – పీఎల్ హరనాథ్, విశాఖపోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్ -
122.5 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో రికార్డు
సాక్షి, హైదరాబాద్: 2018–19 ఆర్థిక సంవత్సరంలో 122.51 మిలియన్ టన్నుల సరుకులు రవాణా చేసి చరిత్ర సృష్టించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అన్నారు. వార్షిక సరుకు రవాణాలో 19.47 మిలియన్ టన్నుల అధికవృద్ధిని సాధించి ఇతరజోన్ల కంటే దక్షిణ మధ్య రైల్వే జోన్ రికార్డు నమోదు చేసిందని తెలిపారు. రైల్వే బోర్డు నిర్దేశించిన లక్ష్యం (111 మిలియన్ టన్నులు) కంటే 10 శాతం అధికంగా సరుకు రవాణా చేశామన్నారు. ఇందుకు కృషి చేసిన ఉద్యోగులు, సిబ్బందిని గజానన్ మాల్యా ప్రశంసించారు. సరుకు రవాణాలో ఈ రికార్డు సాధించడానికి పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో రోజువారీగా విశ్లేషించి అనుకూలమైన చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కాపలాలేని లెవల్ క్రాసింగ్ గేట్లను తొలగించడం, పట్టాల పునరుద్ధరణ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులతో లక్ష్యాన్ని సాధించామన్నారు. బొగ్గు, సిమెంట్ రవాణాతోనే.. గణనీయంగా బొగ్గు, సిమెంట్ సరుకు రవాణా ద్వారానే దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు సాధ్యమైందని గజానన్ మాల్యా పేర్కొన్నారు. బొగ్గు 67.56 మిలియన్ టన్నులు, సిమెంట్ 28.23 మిలియన్ టన్నులు, ఇనుప ఖనిజం 5.46 మిలియన్ టన్నుల మేర సరుకులు రవాణా అయ్యాయని వెల్లడించారు. తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఏపీలోని దక్షిణ కోస్తాకి చెందిన కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్, కాకినాడ పోర్ట్ సంస్థల సరుకును అధికంగా రవాణా చేసినట్లు చెప్పారు. -
భారత్‌కు ఇక రోడ్డు రేలర్ రైళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో సరకు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకరావడంలో భాగంగా దేశంలో తొలిసారిగా రోడ్డు రేలర్ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. కేంద్ర రోడ్డు సరకు రవాణా, జాతీయ రహదారులు, రైల్వే శాఖల సమన్వయంతో ఈ పథకం కార్యరూపం దాలుస్తోంది. చట్టంలో సవరణలు తీసుకురావడంతోపాటు అన్ని అనుమతులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలో గూడ్సు రైళ్ల ద్వారా సరకు రవాణా ఎక్కువగా జరుగుతోంది. రైళ్లలో తీసుకొచ్చిన సరకును దించి మళ్లీ రోడ్డు మార్గాన నిర్దేశిత ప్రాంతానికి తీసుకెళ్లాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన విషయం. ఈ రోడ్డు రేలర్ రైళ్ల వల్ల రైలు ఇంజన్ల ద్వారా తీసుకొచ్చిన సరకుల బోగిని రోడ్డు మార్గాన ట్రక్కు ఇంజన్‌కు తగిలించి తీసుకెళ్లవచ్చు. అంటే, రైలింజన్‌తో సరకు తీసుకొని వెళ్లే కార్గో బోగీ రోడ్డుపైకి వచ్చేసరికల్లా కార్గో వ్యాగన్ అవుతుంది. అందుకు వీలుగా ఈ రోడ్డు రేలర్కు ఎనిమిది టైర్లు, నాలుగు రైలు చక్రాలు ఉంటాయి. పట్టాలపై వెళుతున్నప్పుడు చక్రాలు, రోడ్డుపై వెళుతున్నప్పుడు టైర్లు పని చేస్తాయి. ఉభయ పద్ధతుల్లో సరకును తరలించవచ్చు కనుక వ్యాపారులు కోరుకునే నిర్దేశిత ప్రాంతానికే కచ్చితంగా తరలించవచ్చని, దీని వల్ల ఎంతో డబ్బు ఆదా అవుతుందని అధికారులు అంటున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, రిటేల్ సరకులు, ఫర్నీచర్, హార్డ్‌వేర్ ఉత్పత్తులను ఈ రోడ్డు రేలర్లలో సులభంగా తరలించవచ్చు. జోలార్‌పేట–అరక్కోణం మధ్య ప్రయోగాత్మకంగా ఈ రైలును విజయవంతంగా నడిపి చూశారు. -
జూన్ నుంచి ఈ–వే బిల్లింగ్
న్యూఢిల్లీ: ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరుకు రవాణా కోసం వచ్చే ఏడాది జూన్ 1 నుంచి ఎలక్ట్రానిక్ వే బిల్లు లేదా ఈ–వే బిల్లు వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ వస్తు సేవల పన్ను(జీఎస్టీ) మండలి నిర్ణయం తీసుకుంది. ఐటీ నెట్వర్క్ సంసిద్ధతపై సమీక్ష తర్వాత దేశవ్యాప్తంగా 2018 జూన్ 1 నుంచి ఈ–వే బిల్లింగ్ వ్యవస్థను అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఆర్థిక మంత్రి జైట్లీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన 24వ జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ అడ్డంకులు మొదలైన అంశాలపై చర్చించిన అనంతరం జూన్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. జనవరి 16 నుంచి ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తేనుంది. మరోవైపు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకు రవాణాకు ఈ–వే బిల్లులను వినియోగించడం ఫిబ్రవరి 1 నుంచి తప్పనిసరి అని స్పష్టం చేసింది. జీఎస్టీకి ముందు విలువ ఆధారిత పన్ను(వ్యాట్) అధికారులు సరుకు రవాణాకు సంబంధించి వే బిల్లులను జారీ చేసేవారు. జీఎస్టీఎన్ పోర్టల్ ద్వారా ఈ–వే బిల్లులను జనరేట్ చేస్తారు. రూ.50 వేలకు మించిన సరుకు రవాణాకు ఈ–వే బిల్లు తప్పనిసరి. ఈ–వే బిల్లును జనరేట్ చేసిన తర్వాత ఏకీకృత ఈ–వేబిల్లు నంబర్ ఇస్తారు. ఇది సప్లయర్, ట్రాన్స్పోర్టర్, సరుకు అందుకునే వారికి అందుబాటులో ఉంటుంది. -
సముద్ర మార్గంలో ఫార్మా ఎగుమతులు
సాక్షి,విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి విదేశాలకు సముద్రమార్గంలో ఫార్మా ఉత్పత్తుల ఎగుమతి నెమ్మదినెమ్మదిగా ఊపందుకుంటోంది. ఇక్కడున్న కంటైనర్ పోర్టు నుంచి జపాన్,అమెరికాకు నగరంలోని ఇజాయ్ ఫార్మా కంపెనీ తన ఉత్పత్తులైన మందుబిళ్లలు, ఇంజక్షన్ల రవాణాను తొలిసారిగా ఇటీవలే ప్రారంభించింది. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతికి క్లీన్కార్గోగా పోర్టులు లేకపోవడం, ఉన్న విమానాశ్రయంలో కార్గో రవాణా సదుపాయం లేకపోవడంతో ఇక్కడ ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గత నాలుగేళ్లుగా ఎగుమతి చేస్తున్నాయి. కానీ రానురాను రవాణావ్యయం పెరిగిపోతుండడం, అనుమతుల సమస్య కారణంగా కొత్తగా చౌకైన సముద్రమార్గం ద్వారా ఎగుమతి, దిగుమతులు ప్రారంభించాయి. దీంతో మున్ముందు సముద్రమార్గం ద్వారా ఫార్మా రవాణా వ్యాపారం రూ. 4 వేల కోట్ల దాటవచ్చని అంచనా. తీరని కష్టాలు విశాఖలో మొత్తం 90 వరకు ఫార్మా కంపెనీలున్నాయి.వీటిలో 50కి పైగా పెద్ద కంపెనీలున్నాయి. వీటిలో దివీస్, డాక్టర్ రెడ్డీస్, కొర్నియాస్, లీఫార్మాతో పాటు ఫార్మాసిటీలో అమెరికాకు చెందిన హోస్పిరా, జపాన్‌కు చెందిన ఈసాయి, జర్మనీకి చెందిన ఫార్మా జెల్ కంపెనీలు 25 రకాల ఫార్మా ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడి ఫార్మా వ్యాపారం విలువ రూ. 12వేల కోట్లు. అయితే ఈ ఉత్పత్తుల్లో అధిక శాతం విదేశీ ఎగుమతులే. ముఖ్యంగా బల్క్‌డ్రగ్స్, మందులు, ట్యాబ్లెట్లను ఈ కంపెనీలు విశాఖలో అంతర్జాతీయస్థాయి కార్గో రవాణాలేని కారణంగా రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తరలించి శంషాబాద్ ఎయిర్‌పోర్టు ద్వారా ఎగుమతులు చేస్తున్నాయి. దీనివల్ల సమయాభావం, అనుమతులు,ఎయిర్‌పోర్టు చార్జీలు తదితర ఖర్చులన్నీ కంపెనీలకు తడిసిమోపెడవుతున్నాయి. వాస్తవానికి నగరంలో వైజాగ్‌పోర్టు, గంగవరం పోర్టు, వైజాగ్ కంటైనర్ పోర్టులతో కలిపి మొత్తం మూడున్నాయి. వీటినుంచి విదేశాలకు సరుకు పంపవచ్చు. కానీ ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అవసరమైన క్లీన్ కార్గో పోర్టు లేదు. దీంతో ఇక్కడున్న బడా ఫార్మా కంపెనీలు సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, జపాన్, రష్యా తదితర దేశాలకు క్యాప్యుల్స్, బల్క్డగ్స్ ఇతర మందులను తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఎగుమతి చేస్తున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రవాణా చేయడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నా ఇక్కడ విదేశాలకు ఎయిర్ కార్గో సదుపాయం లేదు. ఇటీవల సింగపూర్‌కు కార్గో విమానం మొదలైనా అదికూడా ట్రైల్ రన్‌గానే మిగిలిపోయింది. అయితే, ఇప్పుడు తాజాగా విశాఖలోని కంటైనర్ టెర్మినల్ నుంచి ఫార్మా ఎగుమతుల ప్రారంభం కావడంతో సమయం ఆదాతోపాటు ఖర్చులు మిగులుతున్నాయని, అందుకే తొలిసారిగా కొద్దిమొత్తం పోర్టు ద్వారా ఎగుమతి చేస్తున్నట్లు ఇజాయ్ ఫార్మా కంపెనీ ఎండీ లాంబా ‘సాక్షి’కి వివరించారు. సముద్రరవాణా అయితే రకరకాల అనుమతుల తలనొప్పులు, ఇతరత్రా ఇబ్బందులు తగ్గుతున్నాయని చెప్పారు. మరోపక్క పోర్టు వర్గాలు సైతం ఫార్మా కంపెనీల నిర్ణయాన్ని స్వాగతించాయి. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు క్రమక్రమంగా పెరగడానికి ఇవి సంకేతాలని వీసీటీపీఎల్ అధికారి ఎంఎన్‌రావు విశ్లేషించారు. సముద్రమార్గంలో ఫార్మా ఉత్పత్తుల రవాణా వ్యాపారం మున్ముందు రూ.200 వందల కోట్లను దాటవచ్చని సీఐఐ అంచనా వేస్తోంది.