
న్యూఢిల్లీ: ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరుకు రవాణా కోసం వచ్చే ఏడాది జూన్ 1 నుంచి ఎలక్ట్రానిక్ వే బిల్లు లేదా ఈ–వే బిల్లు వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ వస్తు సేవల పన్ను(జీఎస్టీ) మండలి నిర్ణయం తీసుకుంది. ఐటీ నెట్‌వర్క్ సంసిద్ధతపై సమీక్ష తర్వాత దేశవ్యాప్తంగా 2018 జూన్ 1 నుంచి ఈ–వే బిల్లింగ్ వ్యవస్థను అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఆర్థిక మంత్రి జైట్లీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన 24వ జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అడ్డంకులు మొదలైన అంశాలపై చర్చించిన అనంతరం జూన్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు.
జనవరి 16 నుంచి ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తేనుంది. మరోవైపు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకు రవాణాకు ఈ–వే బిల్లులను వినియోగించడం ఫిబ్రవరి 1 నుంచి తప్పనిసరి అని స్పష్టం చేసింది. జీఎస్టీకి ముందు విలువ ఆధారిత పన్ను(వ్యాట్) అధికారులు సరుకు రవాణాకు సంబంధించి వే బిల్లులను జారీ చేసేవారు. జీఎస్‌టీఎన్ పోర్టల్ ద్వారా ఈ–వే బిల్లులను జనరేట్ చేస్తారు. రూ.50 వేలకు మించిన సరుకు రవాణాకు ఈ–వే బిల్లు తప్పనిసరి. ఈ–వే బిల్లును జనరేట్ చేసిన తర్వాత ఏకీకృత ఈ–వేబిల్లు నంబర్ ఇస్తారు. ఇది సప్లయర్, ట్రాన్స్‌పోర్టర్, సరుకు అందుకునే వారికి అందుబాటులో ఉంటుంది.