e-waybills
-
నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహంలో భాగంగా జీఎస్టీ రేటు తగ్గింపుపై జీఎస్టీ కౌన్సిల్ శుక్రవారం జరిగే సమావేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం 12 శాతం రేటు ఉండగా, దీన్ని 5 శాతానికి తగ్గించాలన్నది ప్రతిపాదన. పెట్రోల్, డీజిల్ వాహనాలపై ప్రస్తుతం 28 శాతం పన్ను రేటు అమల్లో ఉంది. అక్రమ లాభ నిరోధక విభాగం పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు 2020 నవంబర్ వరకు పొడిగించే ప్రతిపాదనపైనా కౌన్సిల్ నిర్ణయాన్ని ప్రకటించనుంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జరిగే తొలి జీఎస్టీ కౌన్సిల్ భేటీ ఇది. వాస్తవానికి కౌన్సిల్‌కు ఇది 35వ సమావేశం అవుతుంది. జీఎస్టీ ఎగవేత నిరోధక చర్యల్లో భాగంగా ఈవే బిల్లును జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు (ఎన్హెచ్ఏఐ) చెందిన ఫాస్టాగ్‌తో 2010 ఏప్రిల్ 1 నుంచి అనుసంధానించడం, వ్యాపారుల నుంచి వ్యాపారుల మధ్య జరిగే విక్రయాలు (బీటుబీ) రూ.50 కోట్ల పైన ఉంటే ఈ ఇన్వాయిస్ జారీ చేయడం, అన్ని సినిమా హాళ్లలో ఈ టికెట్‌ను తప్పనిసరి చేయాలని రాష్ట్రాలను కోరే అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. లాటరీలపై పన్ను అంశం తేలేనా? లాటరీలపై జీఎస్టీ రేటు తగ్గింపుపైనా నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం లాటరీలపై భిన్న పన్ను రేట్లు అమల్లో ఉన్నాయి. ఏకీకృత రేటు విషయంలో 8 మందితో కూడిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. రాష్ట్రాలు నిర్వహించే లాటరీలపై 12% రేటు ఉంటే, రాష్ట్ర గుర్తింపుతో నడిచే లాటరీలపై 28 శాతం పన్ను అమలు చేస్తున్నారు. జీఎస్టీ రిఫండ్స్ మంజూరు వ్యవçహారాలకు ఒకే ఒక యంత్రాంగం ఉండాలన్న దానిపైనా కౌన్సిల్ చర్చించనుంది. ప్రస్తుతం తిరిగి చెల్లింపులను చూసేందుకు కేంద్రం, రాష్ట్రాల తరఫున రెండు రకాల యంత్రాంగాలు ఉన్నాయి. అలాగే, అప్పిలేట్ అథారిటీ నేషనల్ బెంచ్ ఏర్పాటు అంశం కూడా చర్చకు రానుంది. -
ఏప్రిల్ 1 నుంచి ఈ–వే బిల్లు అమలు
న్యూడిల్లీ: అంతర్రాష్ట్ర సరకు రవాణా కోసం ఎలక్ట్రానిక్–వే బిల్లును వచ్చే నెల 1 నుంచి తప్పనిసరి చేయాలని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి నిర్ణయించింది. పన్ను రిటర్నుల విధానాన్ని మరింత సరళీకరించడంపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జీఎస్టీ మండలి ప్రస్తుత విధానాన్నే మరో 3 నెలలు పొడిగించినట్లు ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. వాణిజ్య సంస్థలు ప్రతినెలా జీఎస్టీఆర్–3బీ, జీఎస్టీఆర్–1 అనే 2 రకాల రిటర్నులు ఇస్తున్నాయి. వీటిని సరళీకరించి ఒకే రిటర్ను పత్రాన్ని ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని భావించామనీ, సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఆ నిర్ణయం వాయిదా పడిందని జైట్లీ చెప్పారు. దీంతో ప్రస్తుతం ఉన్న రిటర్నుల విధానాన్నే జూన్ వరకు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. కాగా, అంతర్రాష్ట్ర రవాణా కోసం ఈ–వే బిల్లును ప్రభుత్వం ఫిబ్రవరి 1నే అమలు చేయగా ఆ వ్యవస్థలో లోపాలు తలెత్తి సరిగ్గా పనిచేయకపోవడం తెలిసిందే. దీంతో తప్పులను సరిదిద్ది అంతర్రాష్ట్ర సరకు రవాణా కోసం ఏప్రిల్ 1 నుంచి ఈ–వే బిల్లులను మళ్లీ తప్పనిసరి చేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. ఒకే రాష్ట్రంలో రవాణాకు కూడా ఈ–వే బిల్లులను దశల వారీగా తప్పనిసరిచేస్తామనీ, ఇందుకోసం రాష్ట్రాలను నాలుగు భాగాలుగా విభజిస్తామని జైట్లీ తెలిపారు. జూన్ 1 నాటికి అన్ని రాష్ట్రాల్లోనూ ఈ–వే బిల్లుల వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఏప్రిల్ 15న తొలిదశను అమలు చేస్తామనీ, ఆ రాష్ట్రాలేవో ఏప్రిల్ 7న ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అలాగే ఎగుమతిదారులకు జీఎస్టీ కింద రీఫండ్లు చెల్లించేందుకు ఈ–వాలెట్‌ను అక్టోబరు 1 నాటికి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. -
ఏప్రిల్ 1 నుండి ఈవే బిల్లు అమలు
-
అమల్లోకి ‘ఈ–వే’
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి 1 నుంచి దేశవ్యాప్తంగా ‘ఈ–వే బిల్లు’ విధానం అమల్లోకి వచ్చిందని, పన్నుల ఎగవేతకు ఇక ముకుతాడు పడనుందని రాష్ట్ర వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది రెండో మైలురాయి అని అభివర్ణించారు. రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువుల రవాణాకు తప్పనిసరిగా ఈ–వే బిల్లు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ–వే బిల్లు విధానం అమలుతో వస్తు రవాణా రంగంపై తొలిసారిగా సమగ్రమైన డేటాబేస్ (సమాచార నిల్వ వ్యవస్థ) తయారవుతుందని పేర్కొన్నారు. ఏ సరకు ఎక్కడ నుంచి ఎక్కడకు రవాణా అవుతుందో తెలుస్తుందని వివరించారు. కంపెనీల నుంచి వస్తువులు ఎక్కడికి రవాణా అవుతున్నాయో, పన్నులు కట్టారో లేదో తెలుసుకోవడానికి ఈ సమాచార వ్యవస్థ ఉపయోగపడనుందని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనీల్ కుమార్‌తో కలసి గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడికైనా అనుమతి: ఒకే ఈ–వే బిల్లుతో దేశంలో ఎక్కడికైనా వస్తువుల రవాణాకు అనుమతి ఉంటుందని, అంతర్రాష్ట్ర సరుకుల రవాణాకు ఇకపై ట్రాన్సిట్ పాస్ అవసరం ఉండదని సోమేశ్‌కుమార్ వెల్లడించారు. ట్రేడర్లకు వేధింపులు ఉండవ ని, ఈ–వే బిల్లులను సక్రమంగా తీసుకుంటున్నారో లేదో చెక్ చేస్తామని తెలిపారు. ఈ–వే బిల్లులు లేకుండా సరుకులు రవాణా చేస్తూ పట్టుబడితే ఎగ్గొట్టిన పన్నులతో పాటు సదరు పన్నులపై 100 శాతాన్ని జరిమానాగా వసూలు చేస్తామని హెచ్చరించా రు. ఈ–వే బిల్లు డేటాబేస్ ఆధారంగానే జీఎస్టీ వసూళ్లకు ఇన్వాయిస్లు రూపొందించే అవకాశముందని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనీల్ కుమార్ తెలిపారు. ఈ–వే బిల్లును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, బిల్లు నంబర్ ఉంటే చాలన్నారు. జీ‘ఎస్’టీ!: రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ల సరళి సానుకూలంగా ఉందని, జీఎస్టీ అమలుల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి జనవరిలోనే ఎక్కువ ఆదాయం వచ్చిందని సోమేశ్ కుమార్ తెలిపారు. జనవరిలో అత్యధికంగా రూ.1,656.14 కోట్లు వచ్చినట్లు చెప్పారు. డిసెంబర్లో వచ్చిన రూ.1,493.50 కోట్ల పన్నులతో పోల్చితే జనవరిలో పన్ను వసూళ్లు దూకుడు ప్రదర్శించాయన్నారు. పన్ను వసూళ్లలో పెరుగుదల కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది జూలైలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత తొలుత రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని, క్రమంగా పుంజుకుంటుండటంతోపాటు రాష్ట్రానికి నష్ట పరిహారం లభిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ముందుందని తెలిపారు. 14 వేల మంది ట్రేడర్లకు నోటీసులు: జీరో వ్యాపారాన్ని నిర్మూలించడానికి ట్రాన్స్‌పోర్టు గోదాముల్లో తనిఖీలు నిర్వహించామని సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 786 వాహనాలను తనిఖీ చేశామని, పన్నులు చెల్లించకుండా వస్తువులు రవాణా చేస్తున్న 90 వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు రూ.1.19 కోట్ల పన్నులు వసూలు చేశామని తెలిపారు. జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేయని 14 వేల మంది ట్రేడర్లకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. -
బడ్జెట్ డే : అమలులోకి వచ్చిన ఈ-వే బిల్లు
న్యూఢిల్లీ : వార్షిక బడ్జెట్ వెలువడనున్నరోజే దేశవ్యాప్తంగా జీఎస్టీ ఈ-వే బిల్లు విధానం కూడా అమలులోకి వచ్చింది. జీఎస్టీని అనుసరించి ఏవేనీ రెండు రాష్ట్రాల మధ్య రూ.50 వేలకు మించి విలువ కలిగిన సరకులను రవాణా చేయాలంటే నేటినుంచి (ఫిబ్రవరి 1నుంచి) ఎలక్ట్రానిక్ వే (ఈ-వే) బిల్లు తప్పనిసరి. ఒక ఇ-వే బిల్లు 100 కిలోమీటర్ల కంటే తక్కువ దూరానికి ఒక రోజు చెల్లుతుంది. దీని తరువాత ప్రతి 100 కిలోమీటర్లకి, సంబంధిత తేదీ నుండి ఒక రోజుకు చెల్లుబాటు అవుతుంది. ఈ-వే బిల్లును 24 గంటలలో రద్దు చేయవలసి ఉంటుంది. పన్నుల ఎగవేతను నిరోధించడం కోసమే రూపొందించిన ఈ-వే బిల్లు విధానం.. జీఎస్టీ రూపకల్పనలో కీలక అంశంగా పేర్కొన్నారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో జరిగిన 24వ జీఎస్టీమం డలి సమావేశంలో ఈ-వే బిల్లులను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జనవరి 15 నుంచే ఈ-వే అమలును ప్రయోగాత్మకంగా చేపట్టారు. పలు రాష్ట్రాల్లో ఈ విధానం విజయవంతమైనట్లు జీఎస్టీ నెట్వర్క్ సీఈవో ప్రకాశ్ కుమార్ తెలిపారు. గడిచిన 15 రోజుల్లో సుమారు 2.84 కోట్ల ఈ-వే బిల్లులు జారీ అయ్యాయని, జనవరి 30న గరిష్టంగా 3,40,000 ఈవే బిల్లులు జారీ అయినట్లు కుమార్ తెలిపారు. ఇప్పటివరకు ట్రాన్స్పోర్టర్లు, పన్నుచెల్లింపుదారులు అంతా కలిపి 6.70లక్షల మంది ఈ-వే బిల్లు విధానంలో పేర్లను నమోదు చేసుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి అంతర్రాష్ట్ర రవాణాకు ఈ-వే బిల్లు తప్పనిసరి అయినట్లే.. జూన్1 నుంచి రాష్ట్రంలో అంతర్గత రవాణాలకూ ఈ-వే బిల్లు వర్తించనుంది. పారిశ్రామిక వర్గాల ఆందోళన : కాగా, రూ.50 వేలకు మించి విలువ కలిగిన సరకుల రవాణాకు ఈ-వే బిల్లును తప్పినిసరి చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని పారిశ్రామిక వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. రూ.5లక్షలకు మించి విలువ కలిగిన సరుకులకు మాత్రమే వర్తింపజేయాలని, ఈ-వే బిల్లు చెల్లుబాటు గడువును 24 గంటలు(ఒక రోజు) కాకుండా ఐదు రోజులకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. -
29 వస్తువులపై పన్నుకోత
న్యూఢిల్లీ: సామాన్యులకు మరింత ఊరటనిచ్చేలా జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) మండలి మరోసారి పన్ను రేట్లను తగ్గించింది. తాజాగా 29 వస్తువులు, 54 సేవలపై పన్ను రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సవరించిన పన్ను రేట్లు ఈ నెల 25 నుంచే అమల్లోకి రానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ నేతృత్వంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ మండలి 25వ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. రిటర్నుల సరళీకరణపై చర్చ వ్యాపారులు నెలకు ఒకటే రిటర్నును దాఖలు చేసేలా జీఎస్టీ రిటర్నుల విధానాన్ని సరళీకృతం చేయడంపై జీఎస్టీ మండలి చర్చించింది. జీఎస్టీ రిటర్నులను సరళతరం చేయడంపై ఇన్ఫోసిస్ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నీలేకని జీఎస్టీ మండలికి ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం వాణిజ్య సంస్థలు జీఎస్టీఆర్–3బీ, జీఎస్టీఆర్–1 అంటూ రెండు రిటర్నులను దాఖలు చేస్తుండగా, ఇకపై 3బీతోపాటు ఇన్వాయిస్లు కూడా సమర్పిస్తే సరిపోతుందా అన్నదానిపై ఆలోచిస్తున్నామని జైట్లీ చెప్పారు. ముడి చమురు, పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, విమాన ఇంధనం తదితరాలను కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై తదుపరి జీఎస్టీ మండలిలో చర్చించే అవకాశం ఉందని చెప్పారు. అంతర్రాష్ట్ర సరుకు రవాణా కోసం ఎలక్ట్రానిక్ వే బిల్లు విధానం ఫిబ్రవరి 1 నుంచి అమలవుతుందనీ, 15 రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల్లో సరుకు రవాణాకు సైతం ఈ–వే బిల్లును ఆ రోజు నుంచే అమలు చేస్తామని చెప్పాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం కేవలం వాణిజ్య సంస్థలు ఇస్తున్న సమాచారం ఆధారంగానే జీఎస్టీ వసూలవుతోందనీ, పన్ను ఎగవేతదారులను నిరోధించేలా చర్యలు తీసుకుంటే ఆదాయం పెరుగుతుందని అన్నారు. కాగా, వజ్రాలు, విలువైన రాళ్లపై పన్నును 3 నుంచి 0.25 శాతానికి తగ్గించారు. అలాగే థీమ్ పార్క్ టికెట్లు, దర్జీ సేవలపై కూడా పన్ను రేట్లు తగ్గాయి. 28 నుంచి 18 శాతానికి తగ్గినవి ► సెకండ్ హ్యాండ్లో కొనే పెద్ద, మధ్యస్థాయి కార్లు, ఎస్‌యూవీలు (మిగతా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ మోటార్ వాహనాలపై పన్నును 28 నుంచి 12 శాతానికి తగ్గించారు) ళీ జీవ ఇంధనాలతో నడిచే, ప్రజా రవాణాకు ఉపయోగించే బస్సులు. 18 నుంచి 12 శాతానికి తగ్గినవి ► చక్కెర ఉండే స్వీట్లు, చాక్లెట్లు, 20 లీటర్ల తాగునీటి సీసాలు, ఎరువుగా ఉపయోగించే పాస్ఫరిక్ యాసిడ్, బయో డీజిల్, వేప ఆధారిత పురుగు మందులు, కొన్ని రకాల జీవ–పురుగుమందులు, డ్రిప్‌ల వంటి నీటిపారుదల పరికరాలు, స్ప్రింక్లర్లు, స్ప్రేయర్లు. 18 నుంచి 5 శాతానికి తగ్గినవి ► చింతగింజల పొడి, మెహందీ కోన్లు, ప్రైవేటు డిస్ట్రిబ్యూటర్లు సరఫరా చేసే ఎల్పీజీ సిలిండర్లు. 12 నుంచి 5 శాతానికి తగ్గినవి ► వెదురు/ఎండుగడ్డితో తయారైన బుట్టలు తదితర వస్తువులు, అల్లికతో తయారైన వస్తువులు, వెల్వెట్ వస్త్రాలు సున్నా శాతానికి తగ్గిన వస్తువులు ► విబూది, వినికిడి పరికరాల విడి భాగాలు, తవుడు -
రిటర్నుల ఫైలింగ్ సులభతరమే ఎజెండా!
న్యూఢిల్లీ: రిటర్నుల ఫైలింగ్‌ను సులభతరం చేయడం, ఈ–వే బిల్లుల జారీకి జీఎస్టీ నెట్వర్క్ సన్నద్ధతను సమీక్షించడమే ప్రధాన అజెండాగా జీఎస్టీ మండలి సమావేశం గురువారం జరగనుంది. బడ్జెట్ సమర్పణకు ముందు నిర్వహిస్తున్న ఈ భేటి 25వది కావడం గమనార్హం. జీఎస్టీ రేట్లను తగ్గించాలని పలు వర్గాల నుంచి వచ్చిన విన్నపాలను కూడా మండలి పరిశీలించే అవకాశాలున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో సుమారు 70 వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం వెలువడుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనవరి 29 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించేందుకు వీలుగా జీఎస్టీ చట్టంలో సవరణలకు మండలి ఆమోదం తెలపొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
జూన్ నుంచి ఈ–వే బిల్లింగ్
న్యూఢిల్లీ: ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరుకు రవాణా కోసం వచ్చే ఏడాది జూన్ 1 నుంచి ఎలక్ట్రానిక్ వే బిల్లు లేదా ఈ–వే బిల్లు వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ వస్తు సేవల పన్ను(జీఎస్టీ) మండలి నిర్ణయం తీసుకుంది. ఐటీ నెట్వర్క్ సంసిద్ధతపై సమీక్ష తర్వాత దేశవ్యాప్తంగా 2018 జూన్ 1 నుంచి ఈ–వే బిల్లింగ్ వ్యవస్థను అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఆర్థిక మంత్రి జైట్లీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన 24వ జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ అడ్డంకులు మొదలైన అంశాలపై చర్చించిన అనంతరం జూన్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. జనవరి 16 నుంచి ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తేనుంది. మరోవైపు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకు రవాణాకు ఈ–వే బిల్లులను వినియోగించడం ఫిబ్రవరి 1 నుంచి తప్పనిసరి అని స్పష్టం చేసింది. జీఎస్టీకి ముందు విలువ ఆధారిత పన్ను(వ్యాట్) అధికారులు సరుకు రవాణాకు సంబంధించి వే బిల్లులను జారీ చేసేవారు. జీఎస్టీఎన్ పోర్టల్ ద్వారా ఈ–వే బిల్లులను జనరేట్ చేస్తారు. రూ.50 వేలకు మించిన సరుకు రవాణాకు ఈ–వే బిల్లు తప్పనిసరి. ఈ–వే బిల్లును జనరేట్ చేసిన తర్వాత ఏకీకృత ఈ–వేబిల్లు నంబర్ ఇస్తారు. ఇది సప్లయర్, ట్రాన్స్పోర్టర్, సరుకు అందుకునే వారికి అందుబాటులో ఉంటుంది. -
ఫిబ్రవరి 1నుంచే ఇ-వే బిల్లు
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ పన్ను పరిధిలో ఇ-వే బిల్లు విధానాన్ని కచ్చితంగా అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం జరిగిన ఈ సమావేశంలో ఇ-వే బిల్లు విధానాన్ని తప్పని సరిచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంట్రా-స్టేట్ ఇ-వే బిల్లు జూన్ 1 నుంచి తప్పనిసరి చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వస్తువుల అంతర్ రాష్ట్ర ఇ-వే బిల్లు మాండేటరీ అని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. దీన్ని ట్రయల్ రన్ కోసం జనవరి 16నాటికి సిద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఇ-వే బిల్లు విధానం, ఇన్వాయిస్ మ్యాచింగ్ తదితర అంశాలపై చర్చించిన 24వ జీఎస్టీ మండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రూ. 50వేల విలువకంటే ఎక్కువ వస్తువులను రవాణా చేస్తే తప్పనిసరిగా ఇ-వే బిల్లు, రాష్ట్రంలో 10 కి.మీ లోపు వస్తువులను రవాణా చేస్తే ఇంట్రా స్టేట్ ఇ-వే బిల్లు ఉండాలి. కొన్ని రాష్ట్రాలు ఫిబ్రవరి 1 నుంచి స్వచ్ఛంద ప్రాతిపదికన ఇంటర్-స్టేట్ , ఇంట్రాస్టేట్ ఇ-వే బిల్లును అమలు చేస్తాయని కౌన్సిల్ తెలిపింది. అయితే ఇంట్రా స్టేట్ ఇ-వే బిల్లు విధానం మాత్రం ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా అంతర్ రాష్ట్ర వస్తువుల రవాణా, పన్నుల ఎగవేత నిరోధాన్ని ఇ-వే బిల్లు విధానాన్ని జనవరి 1 నుంచి దశలవారీగా..ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని గతంలో నిర్ణయించింది. దీనిపై రివ్యూ నిర్వహించిన మండలి ఈ నిర్ణయం అమలు ఫిబ్రవరికి ప్రీ పోన్ చేసింది. అలాగే నవంబరులో గువాహటిలో జరిగిన గత మండలి సమావేశంలో 178 వస్తువులపై పన్ను రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. -
ఈ-వేబిల్స్‌తో గందరగోళం
ఆదోని అర్బన్: జీఎస్టీ అమల్లోకి రావడంతో వెబ్‌లో ఈ వేబిల్ ఆప్షన్‌ను తొలగించడంతో పట్టణ వ్యాపారస్తుల్లో గందరగోళం నెలకొంది. వేబిల్స్ ఆప్షన్స్ లేకపోవడంతో సరుకును ఇతర ప్రాంతాలకు పంపడానికి ఇక్కట్లు ఎదరవుతున్నాయని వారు వాపోతున్నారు. పట్టణంలో రోజూ రూ. కోట్లలో లావాదేవీలు జరుగుతాయి. ఇక్కడి నుంచి పలు రకాల సరుకులను, ముడిపదార్థాలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ముఖ్యంగా పత్తి. అయితే వాహనాల్లో తరలించడానికి వేబిల్ అవసరం. ఇప్పటి వరకు వేబిల్తోనే ఎగుమతులు జరిగేవి. అయితే ప్రస్తుతం వేబిల్ ఆప్షన్ లేకపోవడంతో వాణిజ్య పన్నుల అధికారులు తనిఖీలు చేస్తే వేబిల్ లేకపోవతే భారీ స్థాయిలో జరిమానాలు విధించే అవకాశుముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 30న సాక్షి ఆధ్వర్యంలో జరిగిన జీఎస్టీపై అవగాహన సదస్సులో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ గీతా మాధురి వ్యాపారస్తులకు సందేహాలను నివృతి చేశారు. అయితే జీఎస్టీ వస్తే వేబిల్స్ ఎలా అని వ్యాపారస్తులు ప్రశ్నించగా పాత వేబిల్స్ ఉంటాయని చెప్పారని, ఇప్పుడు ఆ ఆప్షనే లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు. ఇన్వాయిస్ బిల్లులు రెండు కాపీలు పంపించండి – మురళీధరన్, వాణిజ్య పన్నుల శాఖ అధికారి–1 చెక్‌పోస్టులన్నీ ఎత్తివేశారు. ఈ వేబిల్ ఆప్షన్ కూడా లేదు. మూడు నాలుగు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. అంతవరకు వేచి ఉండాలి. అత్యవసరంగా సరుకులు పంపాలంటే వేబిల్ బదులుగా ఇన్వాయిస్ బిల్లు ఒరిజినల్, డూబ్లికేట్ ఒక్కోటి పంపించాలి. జీఎస్టీ ఉందని అధికారులకు తెలుసు. ఎవరూ పట్టుకోరు. ఒక వేళ పట్టుకున్నా తన సెల్ 9949992638 కు ఫోన్ చేస్తే సమస్యను పరిష్కరిస్తాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.