ఏప్రిల్‌ 1 నుంచి ఈ–వే బిల్లు అమలు | E-Way Bill Roll-Out From April 1, Return Filing Process Extended Till June | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 1 నుంచి ఈ–వే బిల్లు అమలు

Published Sun, Mar 11 2018 2:29 AM | Last Updated on Sun, Mar 11 2018 2:29 AM

E-Way Bill Roll-Out From April 1, Return Filing Process Extended Till June - Sakshi

న్యూడిల్లీ: అంతర్రాష్ట్ర సరకు రవాణా కోసం ఎలక్ట్రానిక్‌–వే బిల్లును వచ్చే నెల 1 నుంచి తప్పనిసరి చేయాలని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి నిర్ణయించింది. పన్ను రిటర్నుల విధానాన్ని మరింత సరళీకరించడంపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జీఎస్టీ మండలి ప్రస్తుత విధానాన్నే మరో 3 నెలలు పొడిగించినట్లు ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. వాణిజ్య సంస్థలు ప్రతినెలా జీఎస్టీఆర్‌–3బీ, జీఎస్టీఆర్‌–1 అనే 2 రకాల రిటర్నులు ఇస్తున్నాయి. వీటిని సరళీకరించి ఒకే రిటర్ను పత్రాన్ని ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని  భావించామనీ, సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఆ నిర్ణయం వాయిదా పడిందని జైట్లీ చెప్పారు. దీంతో ప్రస్తుతం ఉన్న రిటర్నుల విధానాన్నే జూన్‌ వరకు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు.

కాగా, అంతర్రాష్ట్ర రవాణా కోసం ఈ–వే బిల్లును ప్రభుత్వం ఫిబ్రవరి 1నే అమలు చేయగా ఆ వ్యవస్థలో లోపాలు తలెత్తి సరిగ్గా పనిచేయకపోవడం తెలిసిందే. దీంతో తప్పులను సరిదిద్ది అంతర్రాష్ట్ర సరకు రవాణా కోసం ఏప్రిల్‌ 1 నుంచి ఈ–వే బిల్లులను మళ్లీ తప్పనిసరి చేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. ఒకే రాష్ట్రంలో రవాణాకు కూడా ఈ–వే బిల్లులను దశల వారీగా తప్పనిసరిచేస్తామనీ, ఇందుకోసం రాష్ట్రాలను నాలుగు భాగాలుగా విభజిస్తామని జైట్లీ తెలిపారు. జూన్‌ 1 నాటికి అన్ని రాష్ట్రాల్లోనూ ఈ–వే బిల్లుల వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఏప్రిల్‌ 15న తొలిదశను అమలు చేస్తామనీ, ఆ రాష్ట్రాలేవో ఏప్రిల్‌ 7న ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అలాగే ఎగుమతిదారులకు జీఎస్టీ కింద రీఫండ్‌లు చెల్లించేందుకు ఈ–వాలెట్‌ను అక్టోబరు 1 నాటికి అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement