సోమేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి 1 నుంచి దేశవ్యాప్తంగా ‘ఈ–వే బిల్లు’ విధానం అమల్లోకి వచ్చిందని, పన్నుల ఎగవేతకు ఇక ముకుతాడు పడనుందని రాష్ట్ర వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది రెండో మైలురాయి అని అభివర్ణించారు. రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువుల రవాణాకు తప్పనిసరిగా ఈ–వే బిల్లు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ–వే బిల్లు విధానం అమలుతో వస్తు రవాణా రంగంపై తొలిసారిగా సమగ్రమైన డేటాబేస్ (సమాచార నిల్వ వ్యవస్థ) తయారవుతుందని పేర్కొన్నారు. ఏ సరకు ఎక్కడ నుంచి ఎక్కడకు రవాణా అవుతుందో తెలుస్తుందని వివరించారు. కంపెనీల నుంచి వస్తువులు ఎక్కడికి రవాణా అవుతున్నాయో, పన్నులు కట్టారో లేదో తెలుసుకోవడానికి ఈ సమాచార వ్యవస్థ ఉపయోగపడనుందని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనీల్ కుమార్‌తో కలసి గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
దేశంలో ఎక్కడికైనా అనుమతి: ఒకే ఈ–వే బిల్లుతో దేశంలో ఎక్కడికైనా వస్తువుల రవాణాకు అనుమతి ఉంటుందని, అంతర్రాష్ట్ర సరుకుల రవాణాకు ఇకపై ట్రాన్సిట్ పాస్ అవసరం ఉండదని సోమేశ్‌కుమార్ వెల్లడించారు. ట్రేడర్లకు వేధింపులు ఉండవ ని, ఈ–వే బిల్లులను సక్రమంగా తీసుకుంటున్నారో లేదో చెక్ చేస్తామని తెలిపారు. ఈ–వే బిల్లులు లేకుండా సరుకులు రవాణా చేస్తూ పట్టుబడితే ఎగ్గొట్టిన పన్నులతో పాటు సదరు పన్నులపై 100 శాతాన్ని జరిమానాగా వసూలు చేస్తామని హెచ్చరించా రు. ఈ–వే బిల్లు డేటాబేస్ ఆధారంగానే జీఎస్టీ వసూళ్లకు ఇన్‌వాయిస్‌లు రూపొందించే అవకాశముందని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనీల్ కుమార్ తెలిపారు. ఈ–వే బిల్లును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, బిల్లు నంబర్ ఉంటే చాలన్నారు.
జీ‘ఎస్’టీ!: రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ల సరళి సానుకూలంగా ఉందని, జీఎస్టీ అమలుల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి జనవరిలోనే ఎక్కువ ఆదాయం వచ్చిందని సోమేశ్ కుమార్ తెలిపారు. జనవరిలో అత్యధికంగా రూ.1,656.14 కోట్లు వచ్చినట్లు చెప్పారు. డిసెంబర్‌లో వచ్చిన రూ.1,493.50 కోట్ల పన్నులతో పోల్చితే జనవరిలో పన్ను వసూళ్లు దూకుడు ప్రదర్శించాయన్నారు. పన్ను వసూళ్లలో పెరుగుదల కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది జూలైలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత తొలుత రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని, క్రమంగా పుంజుకుంటుండటంతోపాటు రాష్ట్రానికి నష్ట పరిహారం లభిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ముందుందని తెలిపారు. 14 వేల మంది ట్రేడర్లకు నోటీసులు: జీరో వ్యాపారాన్ని నిర్మూలించడానికి ట్రాన్స్‌పోర్టు గోదాముల్లో తనిఖీలు నిర్వహించామని సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 786 వాహనాలను తనిఖీ చేశామని, పన్నులు చెల్లించకుండా వస్తువులు రవాణా చేస్తున్న 90 వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు రూ.1.19 కోట్ల పన్నులు వసూలు చేశామని తెలిపారు. జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేయని 14 వేల మంది ట్రేడర్లకు నోటీసులు జారీ చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment