రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
కుంభకోణంలో మొత్తం 75 సంస్థలు అక్రమ లబ్ధి పొందినట్లు గుర్తింపు.. ఇందులో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఉండటంపై అనుమానాలు
నిందితులుగా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర అధికారులు
త్వరలో వీరికి నోటీసులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో వెలుగులోకి వచ్చిన రూ.1,000 కోట్ల జీఎస్టీ స్కామ్ కేసును సీఐడీకి బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్ తదితరాలకు సంబంధించి చోటు చేసుకున్న ఈ గోల్‌మాల్‌లో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నిందితులుగా ఉన్న విషయమూ విదితమే.
వాణిజ్య పన్నుల శాఖ కోసం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ–హైదరాబాద్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ స్రూ్కట్నీ మాడ్యూల్‌లో పని చేస్తూ వాణిజ్య పన్నుల శాఖకు ఆయా సంస్థలు దాఖలు చేసే రిటర్న్స్‌ను పరిశీలించి లోటుపాట్లను గుర్తిస్తుంది. ఇందులో మార్పు చేయడం ద్వారా దాదాపు 75 సంస్థలకు అక్రమ లబ్ధి కూరేలా చేశారు.
ఈ వ్యవహారం మొత్తం మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ కనుసన్నల్లోనే జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. అయితే ఈ 75 సంస్థలు ఎవరివి? వాటికి, సోమేశ్‌కుమార్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అనేది ప్రస్తుతం కీలకంగా మారిందని అంటున్నారు. ఈ స్కామ్ ద్వారా లబి్ధపొందిన వాటిలో తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉండటంపై సీసీఎస్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ జీఎస్టీ పరిధిలోకి వస్తారు. వీరు విధిగా ఆ విభాగంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సేవలు అందించే సంస్థలు తమ బిల్లులో వినియోగించిన, ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా ట్యాక్స్‌ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా రిటర్న్స్ దాఖలు సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్‌ను సంబంధిత విభాగానికి చెల్లించాలి. ఈ పన్నుతో పాటు సెస్సు కూడా ఉంటుంది.
మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేయడం ద్వారా బేవరేజెస్ కార్పొరేషన్ వాణిజ్య సర్వీసు చేస్తున్నట్లు లెక్క. దీంతో ఈ విభాగం సైతం కచి్చతంగా జీఎస్టీ చెల్లించాల్సిందే. అయితే గోల్‌మాల్‌కు పాల్పడినట్లు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం వెనుక మరో స్కామ్ ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీయనున్నారు. వాణిజ్య పన్నుల శాఖ సాఫ్ట్‌వేర్‌ను పర్యవేక్షించడానికి ప్రత్యేక స్క్రూట్నీ మాడ్యూల్‌ను రూపొందించిన ఐఐటీ–హైదరాబాద్..దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎలాంటి సిబ్బందిని నియమించుకోలేదు.
పిలాంటో టెక్నాలజీస్ సిబ్బందినే దీనికోసం వినియోగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ–హైదరాబాద్ ప్రాంగణం చిరునామాతో పని చేస్తున్న ఐఐటీ–హైదరాబాద్ పిలాంటో టెక్నాలజీస్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ చేస్తుంటుంది. దీన్ని 2010 జనవరిలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శోభన్‌బాబు ఏర్పాటు చేశారని సీసీఎస్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు.
బిగ్ లీప్ నిర్వాకంతోనే వెలుగులోకి స్కామ్
దేశ వ్యాప్తంగా ఐదు మెట్రో నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్‌కు సంబంధించి సికింద్రాబాద్ కేంద్రంగా పని చేస్తోంది. ఇది ప్రస్తుతం మానవవనరుల సరఫరా రంగంలో ఉందని తేలింది. ఇది ఎగ్గొట్టిన రూ.25.51 కోట్ల వ్యవహారంతోనే ఈ స్కామ్ మొత్తం వెలుగులోకి వచి్చంది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో పాటు ఐజీఎస్టీ, సెస్‌లను చెల్లించని కొన్ని సంస్థలు అక్రమ లబ్ధి పొందాయి.
ఆయా సంస్థలకు లబ్ధి చేకూర్చడం కోసం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఎస్‌వీ కాశీ విశ్వేశ్వరరావు, ఎ.శివరామ ప్రసాద్ వాటి పరిధులను మార్చి చూపించినట్లు గుర్తించారు. తమ పరిధిలోకి రానప్పటికీ... బోగస్ చిరునామాలతో తమ పరిధుల్లో రిజిస్ట్రేషన్లు చేయించారని తేల్చారు. ఈ కేసుకు సంబంధించి త్వరలో సోమేశ్‌కుమార్ సహా మరికొందరికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment