సాక్షి, హైదరాబాద్/బోధన్: బోధన్ నకిలీ చలాన్ల కుంభకోణం కేసులో ఎట్టకేలకు చార్జి షీట్ దాఖలైంది. 2017 నుంచి ఆరేళ్ల పాటు సుదీర్ఘంగా దర్యాప్తు చేసిన తెలంగాణ సీఐడీ అధికారులు ఇటీవల కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 34 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో 22 మంది వాణిజ్య పన్నుల విభాగానికి చెందిన అధికారులే.మొత్తం 123 మంది సాక్షులను విచారించినట్టు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.
68 రకాల సాఫ్ట్‌వేర్ మెటీరియల్‌తో పాటు 143 డాక్యుమెంట్లు, మూడు ఆడిట్ రిపోర్ట్‌లను సాక్ష్యాలుగా కోర్టుకు సమరి్పంచారు. ఈ కుంభకోణంలో నిందితులు మొత్తం రూ.231.22 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కొల్లగొట్టినట్టు తేల్చారు. దీనికి సంబంధించి 2005 నుంచి 2016 వరకు బోధన్, నిజామాబాద్ వాణిజ్య పన్నుల శాఖలో పని చేసిన అధికారుల వివరాలు సీఐడీ సేకరించింది.
ఇలా దోచేశారు..
వాణిజ్య పన్నులశాఖ బోధన్ సర్కిల్‌లో జరి గిన నకిలీ చలాన్ల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పన్నులు చెల్లించకుండానే నకిలీ చలాన్లు సృష్టించి కోట్ల రూపాయలు కొట్టేశారు. వ్యాపారాలు చేసేవారు వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నులు చలానా రూపంలో చెల్లిస్తారు. ప్రతి చలానాకు ప్రత్యేక నంబర్ ఉంటుంది.
ఖజానా (ట్రెజరీ)లో ఈ నంబర్ వేయించుకుని ప్రభుత్వం అనుమతించిన బ్యాంకులో పన్ను మొత్తాన్ని జమ చేయాలి. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, అతడి కుమారుడు సునీల్‌లు బోధన్ వాణిజ్య పన్నులశాఖ కార్యాలయ సిబ్బందితో కుమ్మక్కయ్యారు. పన్నులు చెల్లించకుండానే చెల్లించినట్టుగా నకిలీ చలాన్లు సృష్టించారు. కొంత మొత్తాన్ని చెల్లించి ఎక్కువ మొత్తంలో చెల్లించినట్టు చూపారు.
ఒకరు చెల్లించిన చలానాతోనే పదుల సంఖ్యలో వ్యాపారులు, పలు వ్యాపార సంస్థలు చెల్లించినట్టుగా రికార్డులు సృష్టించారు. వ్యాపారుల సొమ్మును పక్కదారి పట్టించి తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టారు. ఎక్కడికక్కడ అధికారులను తమ దారికి తెచ్చుకుని ఏళ్ల తరబడి ఈ కుంభకోణం కొనసాగించారు. అయితే నిజామాబాద్ జిల్లా బోధన్ సర్కిల్ సీటీఓ ఎల్.విజయేందర్ బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 2017 ఫిబ్రవరి 2న చేసిన ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది.
దర్యాప్తులో ఉద్యోగుల అవినీతి బాగోతానికి సంబంధించి పక్కా సాక్ష్యాలు లభించాయి. ఫోర్జరీ, మోసం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నేరపూరిత కుట్ర, లంచం తీసుకోవడం వంటి నేరాలు ఉండడంతో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం డీఎస్పీ ఎన్.శ్యామ్ ప్రసాద్‌రావు దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు.
కేసు నీరుగార్చే యత్నాన్ని బయటపెట్టిన ‘సాక్షి’..
ఈ భారీ కుంభకోణం దర్యాప్తులో ఆద్యంతం అనేక మలుపు చోటు చేసుకున్నాయి. చలాన్లు పెట్టేందుకే నిందితులు ఏకంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటి నిండా చలాన్లు ఉండటాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరోవైపు దర్యాప్తును నీరుగార్చేందుకు ఏకంగా ఐఏఎస్ స్థాయి అధికారి ఒకరు ప్రయత్నించిన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది.
ఆ తర్వాతే కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. తీగలాగితే డొంక కదిలిన చందంగా వాణిజ్య పన్నుల విభాగానికి చెందిన అనేకమంది అధికారుల పాత్ర వెల్లడైంది. ఈ క్రమంలో సీఐడీ విచారణాధికారికి కోటి రూపాయల ఎర వేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ డీఎస్పీ విజయ్‌కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
అరెస్టు అయ్యింది వీరే..
ఈ కుంభకోణానికి కీలక సూత్రధారులుగా ఉన్న సింహాద్రి లక్ష్మీ శివరాజ్ (ఏడాది క్రితం మరణించాడు), అతని కుమారుడు సింహాద్రి వెంకట సునీల్‌లను సీఐడీ అరెస్టు చేసింది. వీరిద్దరు నిజామాబాద్ పట్టణంలో సేల్స్ ట్యాక్స్ ప్రైవేటు ఆడిటర్లుగా ఉంటూ ఈ కుంభకోణానికి తెగబడ్డారు. వీరితో పాటు వారి సిబ్బంది విశాల్ పాటిల్ అలియాస్ విశాల్ కాంతిపాటిల్, కమ్మర రామలింగం అలియాస్ రామ లింగడు, నారాయణదాస్ వెంకట కృష్ణమాచారి, ఎన్.సత్యవెంకట కృష్ణకుమార్ అలియాస్ పంతులు, ఎం.మల్లేశ్, గంగొనే రాకేశ్, మడపల్లి రమణ, వంగల శ్రీనివాస్, మహ్మద్ నజీముద్దీన్ అలియాస్ అబీబుద్దీన్, అర్రోజుల రాజేశ్ కూడా ఉన్నారు.
ఇక వాణిజ్య పన్నుల శాఖ అధికారులు..రాథోడ్ ధర్మ విజయకృష్ణ, అనంతశ్యానం వేణుగోపాల స్వామి, బి.హనుమంతు సింగ్, ధరణి శ్రీనివాసరావు, టి.పూర్ణచంద్రారెడ్డితో పాటు బోధన్ సర్కిల్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు (ఏసీటీఓలు) ఆర్.కిషన్, కె.నాగేశ్వర్‌రావు, కె.విజయకుమార్, ఎస్.రత్నకుమారి, బీఎన్ ఇందిర, జె.రాజయ్య, ఎస్.సాయిలు, సీనియర్ అసిస్టెంట్‌లు సి.స్వర్ణలత, కె. అరుణ్‌రెడ్డి, బి.పీరాజి, రవీంద్రబాబు, ఆర్.బాలరాజు, జూనియర్ అసిస్టెంట్లు చంద్రహాస్, ఆర్.వినోద్‌కుమార్, బి.రంగారావు, ఎల్.భజరంగ్, సి.శ్రీధర్‌లు కూడా కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు.
రూ .231 కోట్లు కొట్టేశారు!
Published Wed, Jul 19 2023 2:22 AM | Last Updated on Wed, Jul 19 2023 2:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment