రూ. 65 కోట్లు కాదు.. 316 కోట్లు
బోధన్ స్కామ్‌పై సీఐడీ నివేదిక..
- 2005 నుంచే అక్రమాలు
- శివరాజు విచారణలో సంచలన అంశాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి పుట్ట పగలబోతోంది. సర్కిల్ కార్యాలయాల్లో సాగిన దందా కేంద్ర కార్యాలయం వరకు విస్తరించినట్టు సీఐడీ ఆధారాలతో సహా నిరూపించబోతోంది. అధికారులు బ్రోకర్లు కలసి చేసిన ఈ స్కాంపై సీఐడీ కీలక అంశాలను ఏ1గా ఉన్న శివరాజు నుంచి రాబట్టగలిగింది. బోధన్ కమర్షియల్ ట్యాక్స్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన కుంభకోణం ఇప్పటిది కాదని, 15 ఏళ్ల నుంచి నడుస్తోందని పూసగుచ్చినట్టు సీఐడీ అధికారులకు శివరాజు చెప్పినట్టు తెలిసింది. పాత్రదారులు ఎవరు... శివరాజుతో కుమ్మౖక్కై కోట్లు గడించిన అధికారుల పాత్ర ఏంటన్న అంశాలపై సీఐడీ రాష్ట్ర డీజీపీ పూర్తి నివేదిక సమర్పించారు.
కేంద్ర కార్యాలయం నుంచే...
బోధన్, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్... ఈ నాలుగు సర్కిల్ కార్యాలయాలను డీసీటీవో కంటే శివరాజే ఎక్కువగా ఆపరేట్ చేసినట్టు సీఐడీ గుర్తిం చింది. గతంలో డీసీటీవోలుగా పనిచేసిన అధికారులు ప్రస్తుతం కేంద్ర కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారని, మరికొంత మంది బదిలీ అయి ఇతర విభాగాలకు వెళ్లిపోయా రని, వారి పేర్లతో సహా శివరాజు బయటపెట్టి నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. గతం లో ఈ విభాగంలో పనిచేసిన నలుగురు ఐఆర్ ఎస్ అధికారులు కుట్రలో ప్రధాన భాగస్వా ములయ్యారని విచారణలో బయటపడినట్టు తెలిసింది. వీరి ద్వారా కేంద్ర కార్యాలయంలో సర్కిల్ కార్యాలయాల్లోని ఆడిటింగ్ ఫైళ్లను పరిశీలించకుండా చేశాడని సీఐడీ గుర్తించింది.
2012 నుంచి కాదు...
వాణిజ్య పన్నుల శాఖ బోధన్ సర్కిల్‌లో 2012 నుంచి కుంభకోణం జరిగిందని ఆ విభాగం కమిషనర్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. కానీ 2005 నుంచి స్కాం జరిగినట్టు సీఐడీ విచారణలో గుర్తించింది. అలాగే... రూ.65కోట్లు మాత్రమే నకిలీ చలాన్ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని వాణిజ్య పన్నుల శాఖ తెలుపగా, రూ.316 కోట్ల కుంభకోణం జరిగిందని సీఐడీ దర్యాప్తు బృందాలు డీజీపీకి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇంత భారీతేడా ఉన్నా వాణిజ్య పన్నుల శాఖలోని అధికారులు గుర్తించకపోవడంపై సీఐడీ ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిసింది.
అధికారులకు బంపర్ ఆఫర్లు...
శివరాజు నిజామాబాద్‌ను కేంద్రంగా చేసుకొ ని దందా సాగించాడు. అతడికి సహకరించిన ఏసీటీవోలు, డీసీటీవోలు, అసిస్టెంట్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లకు ఆరు నెలలకోసారి ఆఫర్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. మలేషియా, బ్యాంకాక్, శ్రీలంక, ముంబై.. ఇలా టూర్ ప్యాకేజీలు ఇచ్చి దగ్గరుండి స్కాం పనులు చక్కబెట్టుకున్నట్టు విచారణలో బయటపడింది. ఇలా శివరాజుకు సహకరించిన 16 మంది అధికారుల జాబితా ను నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది.
వివరాలివ్వడంలోనూ జాప్యం...
స్కాం విచారణ మొదలుపెట్టిన నాటి నుంచి సీఐడీ అడిగిన ఏ వివరాలనూ వాణి జ్య పన్నుల శాఖ తమకు అందించలేదని సీఐడీ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. చీఫ్ సెక్రెటరీ ఆదేశించిన తర్వాతే వివరాలు అందించారన్నారు. ఈ జాప్యం వెనుక అసలు కోణాలు శివరాజు విచారణలో బయటపడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు.
కేసుల నమోదుకు రంగం సిద్ధం...
శివరాజుకు సహకరించి ప్రభుత్వ ఖజానా ను జేబులోకి మళ్లించుకున్న 16 మంది అధికారులపై సీఐడీ ఇప్పుడు నజర్ పెట్టిం ది. సీఎం శాఖ కావడం, పైగా 15 ఏళ్ల నుంచి స్కాం జరుగుతుంటే పట్టించుకోక పోవడంపై ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిసింది. దీనితో వీరిపై కేసులు నమోదు చేసి విచారించాలని సీఐడీ భావిస్తోంది. ఇందుకు అన్ని ఆధారాలను సిద్ధంచేసి రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌కు అందించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఆధారాలను బట్టి ముందుకెళ్తున్నాం: డీజీపీ అనురాగ్‌శర్మ
బోధన్ వాణిజ్య పన్నుల శాఖ స్కాంలో సీఐడీ వేగవంతంగా విచారణ సాగిస్తోంది. అరెస్టయిన వారి నుంచి సేకరించిన వివరా లను బట్టి మరికొంత మందిని విచారించా ల్సి ఉంది. స్కాంలో ఆరోపణలెదుర్కుంటు న్న వారికి నోటిసులిచ్చి వాంగ్మూలాలు నమోదు చేయాలి. శివరాజు చెప్పిన అంశాలపై మరికొంత స్పష్టత, మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ఎంతటి అధికారులైనా స్కాంలో పాత్రదారులని తేలితే అరెస్ట్ చేయక తప్పదు.