బోధన్ స్కాంలో దర్యాప్తు అధికారి ఔట్
డీఎస్పీపై సస్పెన్షన్ వేటు వేసిన సీఐడీ అదనపు డీజీపీ
- దర్యాప్తును క్యాష్ చేసుకున్న వైనంపై ‘సాక్షి’ కథనం
- విచారణకు ఆదేశించిన సీఎస్
- కర్నూలు జిల్లాకు చెందిన డీఎస్పీతో కలసి రూ.65 లక్షల డీల్ కుదుర్చుకున్నట్టు వెల్లడి
- సీఐడీకి చేరిన డీఎస్పీ బేరసారాల ఆడియో క్లిప్
సాక్షి, హైదరాబాద్: బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కాం కేసును నీరుగార్చేందుకు యత్నించిన సీఐడీ డీఎస్పీపై వేటు పడింది. దర్యాప్తును క్యాష్ చేసుకుంటున్నారని ‘సాక్షి’ ఇటీవల ప్రచురించిన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కథనంపై రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. కేసు దర్యా ప్తును అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఐడీ అదనపు డీజీపీ ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ ఉన్నతాధికారులు బోధన్ కమర్షియల్ స్కాంలో నిందితులతో కుమ్మౖకన అధికారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఈ విచారణలో భాగంగా కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న డీఎస్పీ విజయ్‌కుమార్ అక్రమాలకు పాల్పడ్డట్టు ఆధారాలతో సహా బయటపడింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్ ‘సాక్షి’ తెలిపారు.
బ్యాచ్‌మేట్ డీఎస్పీని రంగంలోకి దింపి..
సీఐడీలో పనిచేస్తున్న డీఎస్పీ విజయ్‌కుమార్, బోధన్ స్కాంలో ఏ–2గా ఉన్న సునీల్‌తో సంప్రదింపులు జరిపినట్టు విచారణలో తేలింది. అంతేకాదు కేసును నీరుగార్చేందుకు ఇద్దరు ఒకేచోట కూర్కొని డీల్ సెట్ చేసుకున్నట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. ఇందులో భాగంగా సునీల్ దగ్గర పనిచేసిన రామలింగం అనే వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టుకొని డీల్ నడిపినట్టు బయటపడింది. నేరుగా డీల్‌లో పాల్గొంటే దొరికిపోతానని భావించిన విజయ్‌కుమార్ తన బ్యాచ్‌మేట్ అయిన కర్నూల్ జిల్లాల్లోని ఓ డీఎస్పీని రంగంలోకి దింపాడు. అతడి ద్వారా సునీల్, రామలింగం, సునీల్ భార్యతో సెటిల్‌మెంట్ కు యత్నించారు. ఇందులో భాగంగా రూ.65 లక్షలు డిమాండ్ చేసినట్టు విచారణలో బయటపడింది. దీంతో విజయ్‌కుమార్‌ను కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించి సస్పెండ్ చేస్తున్నట్టు అదనపు డీజీపీ గోవింద్ సింగ్ తెలిపారు.
త్వరలో అధికారుల బండారం..
బోధన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు నిందితులతో కలసి పోలీస్ విచారణను నీరుగార్చే యత్నం చేస్తున్నారని విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ సైతం తీవ్రంగా పరిగణించి నట్టు సమాచారం. పోలీస్, వాణిజ్య పన్నుల శాఖ అధికారుల మధ్య సాగిన వ్యవహారా లను కూడా బయటపెట్టనున్నట్టు సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. త్వరలో ఆ విభాగం అధికారుల బండారం కూడా బయటపడుతుందని, వారిని సైతం సస్పెండ్ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని అధికారులు తేల్చిచెప్పారు.
మరో డీఎస్పీ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు
బోధన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో డీఎస్పీపైనా విచారణ సాగుతోందని సీఐడీ వర్గాలు తెలిపాయి. ఈ డీఎస్పీతోపాటు మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై కూడా విచారణ జరపాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని, ఒకట్రెండు రోజుల్లో వారి సంగతి కూడా తేలుతుందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
అడ్డంగా పట్టించిన ఆడియో క్లిప్...
కేసును సెట్ చేయడంతోపాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు డీల్ కుదుర్చుకున్నపుడు జరిగిన సంభాషణల ఆడియో క్లిప్ ఒకటి అదనపు డీజీపీకి చేరింది. దీని ఆధారంగా మరింత లోతుగా విచారణ చేస్తున్నామని, డీల్‌లో ఎవరెవరున్నారు? వారికి కేసుకు సంబంధమేంటి? అధికారులూ ఉన్నా రా? అని విచారణ చేస్తున్నట్లు సీఐడీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.