లక్ష్యం సాధించాల్సిందే.. | Achieve tax collection targets: CM tells officials | Sakshi
Sakshi News home page

లక్ష్యం సాధించాల్సిందే..

Published Tue, Feb 27 2024 2:18 AM | Last Updated on Tue, Feb 27 2024 2:18 AM

Achieve tax collection targets: CM tells officials - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పన్ను వసూళ్లలో నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదాయాన్ని ఆర్జించే శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, భూగర్భ వనరుల శాఖల పన్ను వసూళ్లపై సోమ వారం సచివాలయంలో రేవంత్‌రెడ్డి సమీక్షించారు. వాణిజ్య పన్నుల శాఖలో పన్ను లక్ష్యానికి, రాబడికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది వరకు జీఎస్టీ పరిహారం కింద రూ.4 వేల కోట్లకు పైగా చెల్లించేదని, దాని గడువు ముగియడంతో ఆ నిధు లు ఆగడంతో వ్యత్యాసం కనిపిస్తోందని అధికా రులు వివరించారు. పొరుగు రాష్ట్రాల నుంచి నాన్‌డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి డిస్టిలరీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.  

ఆదాయం తెచ్చే శాఖలకు సొంత భవనాలు 
రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష సందర్భంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. దీనికి స్పందించిన రేవంత్‌  ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆదాయం తెచ్చే శాఖలకు కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలను పంపాలని ఆదేశించారు. అక్రమాలకు చెక్‌పెట్టేలా ఇసుక విక్రయాలపై సమగ్ర విధానం రూపొందించాలన్నారు.  

వే బిల్లులు.. వాహనాల ట్రాకింగ్‌ 
ఇసుక సరఫరా వాహనాలకు వే బిల్లులతోపాటు ట్రాకింగ్‌ ఉండాలని, అక్రమ రవాణాకు అవకాశం ఇవ్వొద్దని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. గతంలో నిబంధనలు ఉల్లంఘించిన పలు గనులపై జరిమానాలు విధించారని, ఆ జరిమానాలను వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు. టీఎస్‌ఎండీసీతోపాటు గనుల శాఖలో పలువురు అధికారులు ఒకే పోస్టులో ఏళ్ల తరబడి తిష్ట వేశారని, కొందరిపై ఆరోపణలున్నాయని, వారిని వెంటనే బదిలీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement