
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహంలో భాగంగా జీఎస్టీ రేటు తగ్గింపుపై జీఎస్టీ కౌన్సిల్ శుక్రవారం జరిగే సమావేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం 12 శాతం రేటు ఉండగా, దీన్ని 5 శాతానికి తగ్గించాలన్నది ప్రతిపాదన. పెట్రోల్, డీజిల్ వాహనాలపై ప్రస్తుతం 28 శాతం పన్ను రేటు అమల్లో ఉంది. అక్రమ లాభ నిరోధక విభాగం పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు 2020 నవంబర్ వరకు పొడిగించే ప్రతిపాదనపైనా కౌన్సిల్ నిర్ణయాన్ని ప్రకటించనుంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జరిగే తొలి జీఎస్టీ కౌన్సిల్ భేటీ ఇది. వాస్తవానికి కౌన్సిల్‌కు ఇది 35వ సమావేశం అవుతుంది. జీఎస్టీ ఎగవేత నిరోధక చర్యల్లో భాగంగా ఈవే బిల్లును జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు (ఎన్‌హెచ్‌ఏఐ) చెందిన ఫాస్టాగ్‌తో 2010 ఏప్రిల్ 1 నుంచి అనుసంధానించడం, వ్యాపారుల నుంచి వ్యాపారుల మధ్య జరిగే విక్రయాలు (బీటుబీ) రూ.50 కోట్ల పైన ఉంటే ఈ ఇన్‌వాయిస్ జారీ చేయడం, అన్ని సినిమా హాళ్లలో ఈ టికెట్‌ను తప్పనిసరి చేయాలని రాష్ట్రాలను కోరే అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.
లాటరీలపై పన్ను అంశం తేలేనా?
లాటరీలపై జీఎస్టీ రేటు తగ్గింపుపైనా నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం లాటరీలపై భిన్న పన్ను రేట్లు అమల్లో ఉన్నాయి. ఏకీకృత రేటు విషయంలో 8 మందితో కూడిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. రాష్ట్రాలు నిర్వహించే లాటరీలపై 12% రేటు ఉంటే, రాష్ట్ర గుర్తింపుతో నడిచే లాటరీలపై 28 శాతం పన్ను అమలు చేస్తున్నారు. జీఎస్టీ రిఫండ్స్ మంజూరు వ్యవçహారాలకు ఒకే ఒక యంత్రాంగం ఉండాలన్న దానిపైనా కౌన్సిల్ చర్చించనుంది. ప్రస్తుతం తిరిగి చెల్లింపులను చూసేందుకు కేంద్రం, రాష్ట్రాల తరఫున రెండు రకాల యంత్రాంగాలు ఉన్నాయి. అలాగే, అప్పిలేట్ అథారిటీ నేషనల్ బెంచ్ ఏర్పాటు అంశం కూడా చర్చకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment