Jelaja Ratheesh Drive A Cargo Lorry From Kerala To Kashmir, Inspirational Story In Telugu - Sakshi
Sakshi News home page

Jelaja Ratheesh: కారులో ఏముంది..కార్గోనే కిక్కిస్తుంది

Apr 9 2022 12:51 AM | Updated on Apr 9 2022 9:34 AM

Jelaja Ratheesh: Drive a cargo lorry Kerala to Kashmir - Sakshi

ఉరుకుల పరుగుల జీవితంలో... అప్పుడప్పుడు కాస్త బ్రేక్‌ తీసుకుని ఎక్కడికైనా కొత్తప్రదేశానికి వెళ్తే శారీరకంగా, మానసికంగానూ ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. చాలా మంది ఇలా ఆరునెలలకో, ఏడాదికోసారి ట్రిప్పులు వేస్తుంటారు. ఇలాంటి ట్రిప్పులకు ‘‘కార్లో వెళ్తే ఏం బావుంటుంది లారీ అయితే మరింత మజా వస్తుంది ఫ్రెండ్స్‌’’ అంటోంది జలజా రతీష్‌. మాటల దగ్గరే ఆగిపోకుండా కేరళ నుంచి కార్గోలారీని నడుపుకుంటూ కశ్మీర్‌ ట్రిప్‌నూ అప్‌ అండ్‌ డౌన్‌ పూర్తి చేసి ఔరా అనిపిస్తోంది జలజ.

  కొట్టాయంకు చెందిన నలభై ఏళ్ల జలజా రతీష్‌కు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్‌ చేయడం అంటే ఎంతో ఇష్టం. దీనికితోడు కొత్త ప్రదేశాలను చూడడం అంటే మక్కువ. దీంతో పెళ్లి తరువాత భర్త ప్రోత్సాహంతో డ్రైవింగ్‌ నేర్చుకుంది. ఒక పక్క ఇంటి పనులు చూసుకుంటూనే డ్రైవింగ్‌పై పట్టు రావడంతో సొంతంగాఎక్కడికైనా వెళ్లాలని ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోన్న జలజకు.. భర్తకు ముంబైకు ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్డర్‌ రూపంలో అవకాశం వచ్చింది. దాంతో భర్తతో కలిసి బయలు దేరింది. ఈ ట్రిప్పులో తనే స్టీరింగ్‌ పట్టి నడిపింది. ఏ ఇబ్బంది లేకుండా ముంబై ట్రిప్పు పూర్తిచేయడంతో.. మరోసారి కూడా మళ్లీ లారీ నడుపుతూ ముంబై వెళ్లింది. ఈ రెండు ట్రిప్పులు ఆమె ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచి కేరళ నుంచి కశ్మీర్‌ వరకు ట్రిప్‌ను ప్లాన్‌ చేసేలా చేసింది.  

భర్తతో కలిసి..
లాంగ్‌ ట్రిప్‌కు పక్కగా ప్రణాళిక రూపొందించి భర్త రతీష్, మరో బంధువు అనీష్‌తో కలిసి ఫిబ్రవరి రెండోతేదీన ఎర్నాకుళం జిల్లా పెరంబూర్‌ నుంచి బయలు దేరింది. లారీలో ప్లైవుడ్‌ లోడింగ్‌ చేసుకుని పూనేలో డెలివరి ఇచ్చింది. తరువాత ఉల్లిపాయలను లోడ్‌ చేసిన మరో లారీని తీసుకుని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యాణ, పంజాబ్‌ల మీదుగా కశ్మీర్‌ చేరుకుంది. రోడ్డుమీద కార్గో లారీని నడుపుతోన్న జలజను చూసిన వారికి ‘‘ఇది నిజమేనా అన్నట్టు’’ ఆశ్చర్యంగా అనిపించింది. కొంతమంది ఆసక్తిగా చూస్తే, మరికొంతమంది విస్తుపోయి చూశారు.

లారీ ఆపిన ప్రతిసారి చుట్టుపక్కల వాళ్లు వచ్చి జలజ డ్రైవింగ్‌ను పొగడడం, లారీ నడపడాన్ని అద్భుతంగా వర్ణిస్తుండడంతో.. మరింత ఉత్సాహంతో లారీని నడిపి కేరళ నుంచి కశ్మీర్‌ ట్రిప్‌ను వేగంగా పూర్తిచేసింది. తిరుగు ప్రయాణంలో కూడా కశ్మీర్‌లో ప్లైవుడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ దొరకడంతో హర్యాణ, బెంగళూరులో లోడ్‌ దించి, అక్కడ పంచదారను లోడ్‌ చేసుకుని కేరళ లో అన్‌లోడ్‌ చేయడంతో జలజ ట్రిప్పు విజయవంతంగా పూర్తయింది. ఈ ట్రిప్పు బాగా పూర్తవడంతో తరువాతి ట్రిప్పుని త్రిపుర నుంచి ఢిల్లీ ప్లాన్‌ చేస్తోంది. జలజ తన ట్రిప్‌ మొత్తాన్ని వీడియో తీసి నెట్‌లో పెట్టడంతో చాలామంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కొంతమంది అమ్మాయిలు తాము కార్గో లారీలు నడుపుతామని చెబుతున్నారు.   

సినిమాల్లో చూసినవన్ని ప్రత్యక్షంగా..
‘‘గత కొన్నేళ్లుగా సినిమాల్లో చూసిన ఎన్నో ప్రదేశాలు ఈ ట్రిప్పు ద్వారా ప్రత్యక్షంగా చూడగలిగాను. ఆద్యంతం ఎంతో ఆసక్తిగా సాగిన ట్రిప్పులో గుల్‌మర్గ్, పంజాబ్‌ ప్రకృతి అందాలు మర్చిపోలేని సంతోషాన్నిచ్చాయి. చిన్నప్పటి నుంచి డ్రైవింగ్‌ మీద ఆసక్తి ఉన్నప్పటికీ పెళ్లి తరువాతే నా కల నెరవేరింది. ఇప్పుడు కూడా నా భర్త రితీష్‌ ప్రోత్సాహంతో ఈ సుదీర్ఘ ట్రిప్పుని పూర్తిచేశాను. కార్గో లోడ్‌లను తీసుకెళ్లడం వల్ల ట్రిప్పుకు పెద్దగా ఖర్చు కాలేదు. లారీలోనే వంట చేసుకుని తినేవాళ్లం. కారులో కంటే లారీలో నిద్రపోవడానికి చాలా సౌకర్యంగా అనిపించింది. కారులో కంటే కార్గో ట్రిప్పు మంచి కిక్‌ ఇస్తుంది. త్వరలో కుటుంబం మొత్తం కలిసి ఇలాంటి జర్నీ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాము’’ అని జలజ చెప్పింది.   
 రోజూ చేసే పని అయినా రొటీన్‌కు భిన్నంగా చేసినప్పుడే ఆ పని మరింత ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందనడానికి జలజ జర్నీనే ఉదాహరణ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement