సముద్ర మార్గంలో ఫార్మా ఎగుమతులు | Pharma exports through the sea way | Sakshi
Sakshi News home page

సముద్ర మార్గంలో ఫార్మా ఎగుమతులు

Published Tue, Jul 29 2014 2:07 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

సముద్ర మార్గంలో ఫార్మా ఎగుమతులు - Sakshi

సముద్ర మార్గంలో ఫార్మా ఎగుమతులు

సాక్షి,విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి విదేశాలకు  సముద్రమార్గంలో ఫార్మా ఉత్పత్తుల ఎగుమతి నెమ్మదినెమ్మదిగా ఊపందుకుంటోంది. ఇక్కడున్న కంటైనర్ పోర్టు నుంచి జపాన్,అమెరికాకు నగరంలోని ఇజాయ్ ఫార్మా కంపెనీ తన ఉత్పత్తులైన మందుబిళ్లలు, ఇంజక్షన్ల రవాణాను తొలిసారిగా ఇటీవలే ప్రారంభించింది. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతికి క్లీన్‌కార్గోగా పోర్టులు లేకపోవడం, ఉన్న విమానాశ్రయంలో కార్గో రవాణా సదుపాయం లేకపోవడంతో ఇక్కడ ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గత నాలుగేళ్లుగా ఎగుమతి చేస్తున్నాయి. కానీ రానురాను రవాణావ్యయం పెరిగిపోతుండడం, అనుమతుల సమస్య కారణంగా కొత్తగా చౌకైన సముద్రమార్గం ద్వారా ఎగుమతి, దిగుమతులు ప్రారంభించాయి. దీంతో మున్ముందు సముద్రమార్గం ద్వారా ఫార్మా రవాణా వ్యాపారం రూ. 4 వేల కోట్ల దాటవచ్చని అంచనా.

 తీరని కష్టాలు
 విశాఖలో మొత్తం 90 వరకు ఫార్మా కంపెనీలున్నాయి.వీటిలో 50కి పైగా పెద్ద కంపెనీలున్నాయి. వీటిలో దివీస్, డాక్టర్ రెడ్డీస్, కొర్నియాస్, లీఫార్మాతో పాటు ఫార్మాసిటీలో అమెరికాకు చెందిన హోస్పిరా, జపాన్‌కు చెందిన ఈసాయి, జర్మనీకి చెందిన ఫార్మా జెల్ కంపెనీలు 25 రకాల ఫార్మా ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడి ఫార్మా వ్యాపారం విలువ రూ. 12వేల కోట్లు.

 అయితే ఈ ఉత్పత్తుల్లో అధిక  శాతం విదేశీ ఎగుమతులే. ముఖ్యంగా బల్క్‌డ్రగ్స్, మందులు, ట్యాబ్లెట్లను ఈ కంపెనీలు విశాఖలో అంతర్జాతీయస్థాయి కార్గో రవాణాలేని కారణంగా రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తరలించి  శంషాబాద్ ఎయిర్‌పోర్టు ద్వారా ఎగుమతులు చేస్తున్నాయి. దీనివల్ల సమయాభావం, అనుమతులు,ఎయిర్‌పోర్టు చార్జీలు తదితర ఖర్చులన్నీ కంపెనీలకు తడిసిమోపెడవుతున్నాయి. వాస్తవానికి నగరంలో వైజాగ్‌పోర్టు, గంగవరం పోర్టు, వైజాగ్ కంటైనర్ పోర్టులతో కలిపి మొత్తం మూడున్నాయి.

వీటినుంచి విదేశాలకు సరుకు పంపవచ్చు. కానీ ఫార్మా  ఉత్పత్తుల ఎగుమతులకు అవసరమైన క్లీన్ కార్గో పోర్టు లేదు.  దీంతో ఇక్కడున్న బడా ఫార్మా కంపెనీలు సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, జపాన్, రష్యా తదితర దేశాలకు క్యాప్యుల్స్, బల్క్‌డగ్స్ ఇతర మందులను తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ విమానాశ్రయం  నుంచి ఎగుమతి చేస్తున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రవాణా చేయడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నా ఇక్కడ విదేశాలకు  ఎయిర్ కార్గో సదుపాయం లేదు. ఇటీవల సింగపూర్‌కు కార్గో విమానం మొదలైనా అదికూడా ట్రైల్ రన్‌గానే మిగిలిపోయింది.

అయితే, ఇప్పుడు తాజాగా విశాఖలోని కంటైనర్ టెర్మినల్ నుంచి ఫార్మా ఎగుమతుల ప్రారంభం కావడంతో సమయం ఆదాతోపాటు ఖర్చులు మిగులుతున్నాయని, అందుకే తొలిసారిగా కొద్దిమొత్తం పోర్టు ద్వారా ఎగుమతి చేస్తున్నట్లు ఇజాయ్ ఫార్మా కంపెనీ ఎండీ లాంబా ‘సాక్షి’కి వివరించారు. సముద్రరవాణా అయితే రకరకాల అనుమతుల తలనొప్పులు, ఇతరత్రా ఇబ్బందులు తగ్గుతున్నాయని చెప్పారు. మరోపక్క పోర్టు వర్గాలు సైతం  ఫార్మా కంపెనీల నిర్ణయాన్ని స్వాగతించాయి. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు క్రమక్రమంగా పెరగడానికి ఇవి సంకేతాలని వీసీటీపీఎల్ అధికారి ఎంఎన్‌రావు విశ్లేషించారు. సముద్రమార్గంలో ఫార్మా ఉత్పత్తుల రవాణా వ్యాపారం మున్ముందు రూ.200 వందల కోట్లను దాటవచ్చని సీఐఐ అంచనా వేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement