Pharma exports
-
నాలుగో స్థానంలో ఫార్మా ఎగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా ఎగుమతులు భారత్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్ట్ మధ్య 11.9 బిలియన్ డాలర్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 8.1 శాతం అధికం. ఎగుమతుల పరంగా జెమ్స్–జువెల్లరీ, కెమికల్స్ విభాగాలను దాటి ఫార్మా రంగం నాల్గవ స్థానంలో నిలిచింది. 2023లో ఫార్మా రంగం ఆరవ స్థానంలో ఉంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ పరిశ్రమ 8–10% ఆదాయ వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. అమె రికా, యూరప్ వంటి రెగ్యులేటెడ్ మార్కెట్లకు బలమైన ఎగుమతులు, ఆఫ్రికా, ఆసియాతో సహా సెమీ–రెగ్యులేటెడ్ మార్కెట్లలో రికవరీ, అలాగే స్థిరమైన దేశీయ డిమాండ్‌తో 2024–25లో ఈ స్థాయి ఆదాయ వృద్ధిని సాధిస్తుందని క్రిసిల్ అంచనా వేస్తోంది. స్థిర నగదు ప్రవాహాలు.. 2023–24లో భారత ఔషధ పరిశ్రమ సుమారు 10 శాతం వృద్ధిని సాధించింది. యూఎస్ జెనరిక్స్ మార్కెట్లో ధరల ఒత్తిడి తగ్గడం, నిర్వహణ వ్యయాలు మెరుగవడం.. వెరశి ఆపరేటింగ్ మార్జిన్లు 70–80 బేసిస్ పాయింట్లు పెరిగి సుమారు 22.5 శాతానికి చేరే అవకాశం ఉందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ఫార్మాస్యూటికల్ కంపెనీలు సముచిత చికిత్సా విభాగాల్లో కొనుగోళ్లను కొనసాగించినప్పటికీ.. స్థిర నగదు ప్రవాహాలు, తక్కువ ఆర్థిక పరపతి నుండి కూడా ఈ రంగం ప్రయోజనం పొందుతుందని అంచనా. గత ఏడాది రూ.4.1 లక్షల కోట్ల మార్కెట్లో సగానికి బాధ్యత వహించే 190 ఔషధ తయారీ కంపెనీల ఆదాయాల ఆధారంగా క్రిసిల్ నివేదిక రూపొందించింది. ఆదాయం దాదాపు సమానం.. దేశీయ విక్రయాలు, ఎగుమతుల మధ్య ఆదాయం దాదాపు సమానంగా ఉందని క్రిసిల్ వెల్లడించింది. దేశీయ ఆదాయంలో అధికంగా దీర్ఘకాలిక, తీవ్ర చికిత్సా విభాగాల ద్వారా సమకూరుతోంది. ఎగుమతుల ఆదాయం ప్రధానంగా ఫార్ములేషన్స్ 80 శాతం, బల్క్ డ్రగ్స్ 20 శాతం నమోదవుతోంది. 2024–25లో ఫార్ములేషన్ ఎగుమతులు రూపాయి పరంగా 12–14 శాతం పెరుగుతాయని అంచనా. యూఎస్, యూరప్ వంటి నియంత్రిత మార్కెట్లు 13–15 శాతం వృద్ధిని సాధిస్తాయి. కొనసాగుతున్న ఔషధాల కొరత, కొత్త ఉత్పత్తుల లాంచ్‌లు, ప్రత్యేక ఉత్పత్తుల వైపు మళ్లడం ఇందుకు కారణం. సెమీ–రెగ్యులేటెడ్ మార్కెట్లకు ఎగుమతులు 8–10 శాతం పెరగవచ్చు. విదేశీ మారక నిల్వలను మెరుగవడం, ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాలలో కరెన్సీల స్థిరీకరణ ఇందుకు సహాయపడుతుంది. దేశీయంగా మార్కెట్ ఇలా.. ఫార్మా పరిశ్రమ ఆదాయం దేశీయంగా 7–9 శాతం పెరుగుతుందని అంచనా. ముఖ్యంగా నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (ఎన్ఎల్ఈఎం) ఉత్పత్తులలో ధరల పెరుగుదల ఇందుకు దోహదం చేయనుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం టోకు ధరల సూచీలో జరిగిన కొద్దిపాటి మార్పుల కారణంగా ఎన్ఎల్ఈఎం పోర్ట్‌ఫోలియో వృద్ధి తగ్గుతూనే ఉంటుంది. పెరుగుతున్న జీవనశైలి సంబంధిత వ్యాధులు, మహమ్మారి అనంతర ఆరోగ్య అవగాహన అధికం కావడం వంటి కారణంగా దీర్ఘకాలిక చికిత్సల విభాగం దేశీయ ఆదాయ వృద్ధికి కీలకంగా దోహదపడుతుందని క్రిసిల్ భావిస్తోంది. -
ఫార్మా ఎగుమతులు 4 శాతం అప్
హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–అక్టోబర్) ఫార్మా ఎగుమతులు 4.22 శాతం వృద్ధి చెంది 14.57 బిలియన్ డాలర్లకు చేరాయి. గత ఏడాది ఇదే వ్యవధిలో ఎగుమతులు 13.98 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఇవి 27 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనాలు నెలకొన్నాయి. కేంద్ర వాణిజ్య శాఖలో భాగమైన ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) డైరెక్టర్ జనరల్ ఉదయ భాస్కర్ ఈ విషయాలు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు 24.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జూలై, అక్టోబర్ ఎగుమతులు కాస్త తగ్గినప్పటికీ సెప్టెంబర్‌లో సానుకూలంగానే ఉన్నాయని, ఇదే ధోరణి పూర్తి ఆర్థిక సంవత్సరంలోను కొనసాగవచ్చని భాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో ఫార్మా ఎగుమతులు 5.45 శాతం క్షీణించి 1.95 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలతో పాటు కొన్ని కీలక కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడటం కూడా ఎగుమతుల తగ్గుదలకు కారణమైనట్లు భాస్కర్ చెప్పారు. ‘ఉదాహరణకు భారత ఫార్మాకు టాప్ 5 మార్కెట్లలో నైజీరియా కూడా ఒకటి. అమెరికా డాలర్‌తో పోలిస్తే నైజీరియా నైరా క్షీణత కొనసాగుతుండటంతో ఆ దేశం దిగుమతులను తగ్గించుకోవాల్సి వస్తోంది‘ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్‌కు అమెరికా, కెనడా, మెక్సికోతో పాటు యూరప్, ఆఫ్రికా దేశాలు టాప్ మార్కెట్లుగా ఉంటున్నాయి. -
ఆన్లైన్లో అమెరికాకే ‘మత్తు’
సాక్షి, హైదరాబాద్: ఏవో మందులు, ఔషధాలు అమ్ముతామంటారు.. అవసరమైతే సైకోథెరపిక్ డ్రగ్స్‌నూ సరఫరా చేస్తామని గాలం వేస్తారు.. ఆన్లైన్లో ఆర్డర్లు, పేమెంట్లు తీసుకుంటారు.. ఫార్మా ఔషధాల ముసుగులో ఏకంగా అమెరికాకే డ్రగ్స్‌ను పార్శిల్ చేసి పంపిస్తారు.. ఇది ఎక్కడో కాదు.. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ రాకెట్ వ్యవహారం. ఇంటర్నెట్ అడ్డాగా కొనసాగుతున్న నిషేధిత డ్రగ్స్ రవాణా దందాను తాజాగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఛేదించింది. హైదరాబాద్‌లోని దోమల్‌గూడ ప్రాంతానికి చెందిన కీలక సూత్రధారి ఆశిష్‌జైన్‌ను ఎన్సీబీ ఢిల్లీ బృందం తాజాగా అరెస్టు చేసింది. ఆశిష్‌జైన్ జేఆర్ ఇన్ఫినిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అమెరికాలోని కస్టమర్లకు సైకోథెరపిక్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టుగా తేల్చింది. మూడు రోజుల పాటు ఆశిష్ కార్యాలయం, నివాసంలో సోదాలు చేసి.. కంప్యూటర్లు, ఇతర సామగ్రి, రూ.3.7 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ (ఆపరేషన్స్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్‌కుమార్‌సింగ్ తెలిపారు. హైదరాబాద్ టు అమెరికా.. ఆశిష్ జైన్ డ్రగ్స్ దందా కోసం కొందరు ఉద్యోగులను నియమించుకున్నాడని.. వారితో అమెరికాలోని వినియోగదారులకు మెయిల్స్, మెసేజీలు, ఫోన్లు చేయించి ఫార్మా డ్రగ్‌తోపాటు సైకోథెరపిక్ డ్రగ్స్ ఆఫర్ చేస్తున్నాడని అధికారులు తెలిపారు. డ్రగ్స్ కావాలన్న వారి వివరాలు తీసుకుని.. బిట్‌కాయిన్, క్రెడిట్‌కార్డు, ఇతర ఆన్లైన్ మార్గాల ద్వారా డబ్బు చెల్లించాలని కోరేవాడని వివరించారు. డబ్బు చెల్లించిన కస్టమర్లకు హైదరాబాద్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల నుంచి డ్రగ్స్ పార్సిల్ చేసి పంపించాడని తెలిపారు. వెయ్యికి పైగా షిప్‌మెంట్స్.. ఆశిష్‌జైన్ ఇప్పటివరకు వెయ్యికిపైగా డ్రగ్ పార్సిళ్లను అమెరికాలోని పలుచోట్లకు పంపినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఈ అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా ముఠాకు ఆశిష్ జైన్ సూత్రధారి అని గుర్తించినట్టు వెల్లడించారు. అతను ఆక్సికోడోన్, హైడ్రోకోడోన్, అల్ఫ్రాజోలం, డైజోఫాం, లోరాజిపామ్, క్లోనాజిపామ్, జోల్పిడెమ్, ట్రెమడాల్ తదితర సైకోథెరపిక్ డ్రగ్స్‌ను సరఫరా చేసినట్టు తెలిపారు. ఆశిష్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాలను ఇంకా దర్యాప్తుచేయాల్సి ఉందని ఎన్సీబీ (ఆపరేషన్స్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్‌కుమార్‌సింగ్ చెప్పారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చాడు, దేశంలో ఎక్కడెక్కడ నెట్వర్క్ ఏర్పాటుచేశాడు, ఎక్కడెక్కడి నుంచి రవాణా చేశాడన్న వివరాలను గుర్తించాల్సి ఉందన్నారు. -
ఫార్మా ఎగుమతులకు వైరస్ దెబ్బ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫార్మా ఎగుమతుల మీద కరోనా గట్టి దెబ్బే వేసింది. కేంద్రం కొన్ని రకాల ఔషధాల ఎగుమతుల మీద నియంత్రణ పెట్టడం, దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో దేశీయ ఫార్మా పరిశ్రమ 22 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోలేదని ఫార్మాసూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(ఫార్మెక్సిల్) తెలిపింది. గత ఆర్ధిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు 19.14 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని.. 2020 ఆర్ధిక సంవత్సరంలో 22 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేశామని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. గతేడాది మార్చి ఒక్క నెలలోనే 2.1 బిలియన్ డాలర్ల ఫార్మా ఎగుమతులు జరిగాయన్నారు. 2017–18లో ఫార్మా ఎగుమతులు 17.28 బిలియన్ డాలర్లు. పారాసిటమల్, హైడ్రాక్సిక్లోరోక్విన్ వంటి కరోనా నియంత్రణలో వినియోగించే ఔషదాల ఎగమతుల మీద కేంద్రం నియంత్రణ విధించిన సంగతి తెలిసిందే. ఫార్మా ఎగుమతుల్లో వీటి వాటా 600 మిలియన్ డాలర్లుంటుందని పరిశ్రమ వర్గాల సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 18.74 బిలియన్ డాలర్ల ఎగుమతులను సాధించామని తెలిపారు. -
ఫార్మా ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చాలా రంగాలు వెనుకబడి నప్పటికీ ఫార్మా మాత్రం పరుగు పెడుతోంది. రెండంకెల వృద్ధితో ఆశాజనకంగా ఉంది. భారత్ నుంచి ఔషధ ఎగుమతులు 2019 నవంబరులో రూ.12,530 కోట్లు నమోదు చేశాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20.60 శాతం అధికం. జూన్ తర్వాత అత్యధిక ఎగుమతులు నమోదు చేసింది నవంబరులోనే. జూన్‌లో రూ.12,810 కోట్ల విలువైన ఎక్స్‌పోర్ట్స్ జరిగాయి. ఇక 2019–20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–నవంబరులో భారత్ నుంచి విదేశాలకు సరఫరా అయిన ఔషధాలు రూ.95,848 కోట్లుగా ఉన్నాయి. 2018–19 ఏప్రిల్–నవంబర్‌తో పోలిస్తే ఇది 11.46 శాతం ఎక్కువ. చాలా రంగాలు తిరోగమన వృద్ధిలో ఉంటే ఫార్మా రంగం వృద్ధి బాటన ఉండడం శుభపరిణామమని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) డైరెక్టర్ జనరల్ రవి ఉదయ్ భాస్కర్ సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. 2019–20లో భారత ఫార్మా ఎగుమతులు 14.5 శాతం అధికమై రూ.1,54,000 కోట్లు నమోదవుతాయని ఫార్మెక్సిల్ అంచనా వేస్తోంది. -
‘గోలీ’మాల్!
ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం.. ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఓ ఎమ్మెల్యే ఇటీవల ఆ ఆస్పత్రికి వెళ్లారు.. సిబ్బంది అల్ట్రాసెట్ టాబ్లెట్ ఇచ్చారు.. కొన్ని టాబ్లెట్లు మింగిన తర్వాత ఎమ్మెల్యేకు అనుమానం వచ్చింది.. ఎప్పుడూ వేసుకునే టాబ్లెట్ మాదిరిగా లేకపోవడంతో డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.. టాబ్లెట్లను పరిశీలించిన అధికారులు అవి నాసిరకం మందులని తేల్చారు! మరుసటి రోజు మరో ఎమ్మెల్యేకు ఇదే తరహా అనుభవం ఎదురైంది! పాతబస్తీలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి.. జీర్ణ సంబంధ సమస్యతో వచ్చిన ఓ రోగికి పాంటాసిడ్ మాత్ర ఇచ్చారు. అప్పటికే ఆ మాత్ర వేసుకుంటున్న రోగికి అనుమానం వచ్చింది. మరో వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి ఆ టాబ్లెట్ చూపిస్తే అది నకిలీదని చెప్పారు. ఏం చేయాలో తెలియక ఆ రోగి కొత్త మందులు కొనుక్కున్నాడు!! సాక్షి, హైదరాబాద్: ఓవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను నకిలీ రహిత రాష్ట్రంగా మార్చాలని యత్నిస్తుంటే.. మరోవైపు ఏకంగా శాసనసభ్యులకు ఔషధాలు ఇచ్చే డిస్పెన్సరీలోనే నకిలీ మందులు బయటపడ్డాయి. డిస్పెన్సరీకి మందులు సరఫరా చేసే కాంట్రాక్టుపై ఏళ్లకేళ్లుగా గుత్తాధిపత్యం సంపాదించిన కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా నకిలీ ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసులే పరమావధిగా మందుల కంపెనీలు ప్రజలకు నకిలీ ఔషధాలను అంటగడుతున్నాయి. బహిరంగ మార్కెట్‌తోపాటు ప్రభు త్వం ఉచితంగా మందులు సరఫరా చేసే డిస్పెన్సరీల్లోనూ ఇదే తంతు. మందుల కొనుగోలులో ఆరోగ్యశాఖ నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎమ్మెల్యేలే నకిలీ బారిన పడితే సామాన్యుడి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాసిరకం మందులపై ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అన్ని చోట్లా ఇదే పరిస్థితి బోధన, జిల్లా, ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రులు.. పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లు కలిపి రాష్ట్రంలో 5,660 ఉన్నాయి. అన్ని ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య ఏటా సగటున 4.5 కోట్ల దాకా ఉంటోంది. 2016–17లో 4.6 కోట్ల మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చారు. ఈ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ప్రభుత్వం ఉచితంగా ఔషధాలను సరఫరా చేస్తోం ది. ఇందుకు రూ.200 కోట్లను కేటాయిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, వసతుల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) ఈ బాధ్యత నిర్వహిస్తోంది. కొనుగోలు, ఆస్పత్రులకు పంపించడం తప్పితే కంపెనీల తీరును పట్టించుకోవడం లేదు. నాణ్యత పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన ఔషధ నియంత్రణ మండలి(డీసీఏ) అధికారులు తనిఖీలను మరిచిపోయారు. దీంతో రోగులకు నాసిరకం మందులే దిక్కవుతున్నాయి. తయారీలో.. నాసిరకంలో.. ఔషధాల తయారీలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. నకిలీ, నాసిరకం మందుల సరఫరా సైతం రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతోంది. కేంద్ర ఆర్యోగ, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నేషనల్ డ్రగ్ సర్వే(ఎన్డీఎస్) పేరుతో దేశవ్యాప్తంగా 8,286 ఔషధాల శాంపిల్స్‌ను సేకరించింది. 62 కంపెనీల 946 రకాల మందులు నాసిరకంగా ఉన్నట్లు నిర్ధారించింది. వీటిలో ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. నేషనల్ డ్రగ్ సర్వే నివేదికను పరిశీలిస్తే నాసిరకం ఔషధాలు 11.41 శాతం ఉన్నాయి. తెలంగాణ నుంచి సరఫరా అయ్యే మందులలో ఇది 21 శాతం వరకు ఉందని నివేదిక పేర్కొంది. నాసిరకం, నకిలీల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను హెచ్చరించింది. అయి నా నకిలీ, నాసిరకం మందులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఔషధ నియంత్రణ విభాగం సంయుక్త సంచాలకుడు కైలాసం వివరణ కోసం ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. రూ.వెయ్యి కోట్ల దందా గుంటూరు జిల్లా కీలక నేత కుటుంబమే సూత్రధారి సాక్షి, అమరావతి బ్యూరో: ఏపీలోని నరసరావుపేట కేంద్రంగా నకిలీ మందుల దందా దక్షిణ భారతదేశమంతటా విస్తరించినట్లు తెలుస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏటా ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల దందా సాగుతోంది. ఈ దందాకు మూలాలు గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉన్నాయని వెల్లడైంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఓ కీలక నేత కుటుంబ సభ్యులే ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులని సమాచారం. దీంతో ఈ కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అసలు నకిలీ మందుల తయారీదారులు ఎవరన్నది వెలుగులోకి రాకుండా తొక్కి పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కేవలం కర్నూలు జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు ఏజెంట్ల వరకే నకిలీ మందుల కేసును పరిమితం చేసేలా వ్యూహం రచిస్తున్నారు. దందాకు కేంద్రమైన నరసరావుపేటలో లోతుగా విచారించకుండా మమ అనిపించారు. ప్రముఖ కంపెనీల ఉత్పత్తుల పేరిట భారీగా నకిలీ మందులు తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ దీన్ని గుర్తించి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
ఫార్మా ఎగుమతులకు సుస్తీ!
5 శాతానికే పరిమితమైన వృద్ధి; వాణిజ్య శాఖ వృద్ధి లక్ష్యం 10%... రష్యా ఎగుమతుల్లో 15 క్షీణత దరల తగ్గుదల, నియంత్రణలూ కారణమే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం గతేడాది ఫార్మా ఎగుమతుల విలువ రూ. 90,000 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాలరుతో రూపాయి విలువ క్షీణించడంతో లబ్ధిపొందుదామనుకున్న దేశీయ ఫార్మా కంపెనీలకు అంతర్జాతీయ పరిణామాలు పెనుసవాళ్ళనే విసురుతున్నాయి. ఇప్పటికే అమెరికా వూర్కెట్ నియంత్రణలు, ధరల తగ్గుదలతో ఇబ్బంది పడుతున్న కంపెనీలకు తగ్గుతున్న ముడిచమురు ధరలు గట్టి షాక్‌నే ఇస్తున్నాయి. చమురు ఉత్పత్తిపై అత్యధికంగా ఆధారపడ్డ రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటుండటంతో ఆ ప్రభావం ఫార్మా ఎగువుతులపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఏడాది ఫార్మా ఎగుమతుల్లో 10 శాతం వృద్ధి నమోదు చేయాలన్న కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ లక్ష్యం చేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. మొదటి ఎనిమిది నెలల కాలంలో దేశీయ ఫార్మా ఎగుమతుల వృద్ధి 5 శాతం దిగువకే పరిమితమైనట్లు ఫార్మాసూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియయా (ఫార్మెక్సిల్) తెలిపింది. ఏప్రిల్ నుంచి నవంబర్ నాటికి దేశీయ ఫార్మా ఎగుమతులు సుమారు 5 శాతం వృద్ధితో 10.22 బిలియన్ డాలర్లకు చేరాయి. గత మూడేళ్లుగా ఏటా 15% వృద్ధిని సాధిస్తున్నామని, పరిస్థితులను బట్టి ఈ ఏడాది వృద్ధిరేటు 10 శాతానికి కుదించినా అది చేరుకోవడం కష్టంగానే కనిపిస్తున్నట్లు ఫార్మెక్సిల్ డెరెక్టర్ జనరల్ పి.వి.అప్పాజీ తెలిపారు. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల కాలంలో రష్యా ఫార్మా ఎగుమతుల్లో 15% క్షీణించాయి. గతేడాది సువూరు 350 మిలియన్ డాలర్లుగా ఉన్న రష్యా ఎగుమతులు ఈ 8 నెలల్లో 300 మిలియన్ డాలర్లుగా నమోదయియంది. గతేడాది మొత్తం దేశీయు ఫార్మా ఎగుమతులు 15 బిలియన్ డాలర్లు కాగా ఈ ఏడాది కనీసం 16.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా వేశారు. రూపాయిల్లో పెరిగినా... రూపాయి విలువ క్షీణించడంతో దేశీయ కంపెనీల ఎగువుతుల ఆదాయం పెరిగినట్లు కనిపించినా డాలరు విలువలో వృద్ధి అంతగా ఉండకపోవచ్చని ఫార్మెక్సిల్ భావిస్తోంది. గతేడాది రూపాయల్లో చూస్తే ఎగుమతులు రూ. 90,000 కోట్లు ఉండగా, ఈ ఏడాది లక్ష కోట్ల అంచనాను దాటగలవున్న ధీమాను ఫార్మెక్సిల్ వ్యక్తం చేసింది. డాలరు విలువల్లో ఎగుమతుల వృద్ధి అంతగా లేకపోవడంపై కేంద్రం సీరియస్‌గా దృష్టిసారించినట్లు అప్పాజీ తెలిపారు. ముఖ్యంగా రష్యా కరెన్సీ రూబుల్ విలువ భారీగా పతనంకావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, త్వరలోనే దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రకటించనుందన్నారు. రష్యాకు ప్రధానంగా ఎగుమతి చేసే కంపెనీల్లో డాక్టర్ రెడ్డీస్, గ్లెన్వూర్క్, జేబీ కెమికల్స్, లూపిన్ తదితర దిగ్గజాలు ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్‌పై రష్యా ప్రభావం... హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్ రెడ్డీస్ అమ్మకాల్లో 15 శాతం రష్యా నుంచే సవుకూరుతోంది. గడిచిన త్రైమాసికంలో డాక్టర్ రెడ్డీస్ రష్యా అమ్మకాల్లో 13 శాతం క్షీణత నమోదయియందని, ఇప్పుడు రూబుల్ ఇంకా పతనం కావడంతో వచ్చే రెండు త్రైమాసికాలు ఇదే విధమైన క్షీణత నమోదయ్యే అవకాశం ఉందని ఏంజెల్ బ్రోకింగ్ ఫార్మా రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సరబ్జిత్ కౌర్ నన్గ్రా తెలిపారు. రాష్ట్రానికి చెందిన అరబిందో ఫార్మా, నాట్కో ఫార్మా కంపెనీలకు రష్యా నుంచి వచ్చే ఆదాయం స్వల్పంగా ఉండటంతో ఎగుమతులపై అంతగా ప్రభావం చూపే అవకాశం లేదని ఆ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఎగుమతులను పెంచడానికి జపాన్ వంటి దేశాలకు విస్తరించాలని చూస్తున్నా అక్కడి నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఎగుమతులను ప్రోత్సహించడానికి బ్రాండ్ ఇండియూ పేరుతో ప్రచార కార్యక్రవూన్ని చేపట్టినట్లు అప్పాజీ తెలిపారు. వచ్చే నాలుగు నెలల్లో పరిస్థితులు అనుకూలంగా మారితే లక్ష్యాన్ని చేరుకోగలవుని అప్పాజీ అభిప్రాయపడ్డారు. -
సముద్ర మార్గంలో ఫార్మా ఎగుమతులు
సాక్షి,విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి విదేశాలకు సముద్రమార్గంలో ఫార్మా ఉత్పత్తుల ఎగుమతి నెమ్మదినెమ్మదిగా ఊపందుకుంటోంది. ఇక్కడున్న కంటైనర్ పోర్టు నుంచి జపాన్,అమెరికాకు నగరంలోని ఇజాయ్ ఫార్మా కంపెనీ తన ఉత్పత్తులైన మందుబిళ్లలు, ఇంజక్షన్ల రవాణాను తొలిసారిగా ఇటీవలే ప్రారంభించింది. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతికి క్లీన్కార్గోగా పోర్టులు లేకపోవడం, ఉన్న విమానాశ్రయంలో కార్గో రవాణా సదుపాయం లేకపోవడంతో ఇక్కడ ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గత నాలుగేళ్లుగా ఎగుమతి చేస్తున్నాయి. కానీ రానురాను రవాణావ్యయం పెరిగిపోతుండడం, అనుమతుల సమస్య కారణంగా కొత్తగా చౌకైన సముద్రమార్గం ద్వారా ఎగుమతి, దిగుమతులు ప్రారంభించాయి. దీంతో మున్ముందు సముద్రమార్గం ద్వారా ఫార్మా రవాణా వ్యాపారం రూ. 4 వేల కోట్ల దాటవచ్చని అంచనా. తీరని కష్టాలు విశాఖలో మొత్తం 90 వరకు ఫార్మా కంపెనీలున్నాయి.వీటిలో 50కి పైగా పెద్ద కంపెనీలున్నాయి. వీటిలో దివీస్, డాక్టర్ రెడ్డీస్, కొర్నియాస్, లీఫార్మాతో పాటు ఫార్మాసిటీలో అమెరికాకు చెందిన హోస్పిరా, జపాన్‌కు చెందిన ఈసాయి, జర్మనీకి చెందిన ఫార్మా జెల్ కంపెనీలు 25 రకాల ఫార్మా ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడి ఫార్మా వ్యాపారం విలువ రూ. 12వేల కోట్లు. అయితే ఈ ఉత్పత్తుల్లో అధిక శాతం విదేశీ ఎగుమతులే. ముఖ్యంగా బల్క్‌డ్రగ్స్, మందులు, ట్యాబ్లెట్లను ఈ కంపెనీలు విశాఖలో అంతర్జాతీయస్థాయి కార్గో రవాణాలేని కారణంగా రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తరలించి శంషాబాద్ ఎయిర్‌పోర్టు ద్వారా ఎగుమతులు చేస్తున్నాయి. దీనివల్ల సమయాభావం, అనుమతులు,ఎయిర్‌పోర్టు చార్జీలు తదితర ఖర్చులన్నీ కంపెనీలకు తడిసిమోపెడవుతున్నాయి. వాస్తవానికి నగరంలో వైజాగ్‌పోర్టు, గంగవరం పోర్టు, వైజాగ్ కంటైనర్ పోర్టులతో కలిపి మొత్తం మూడున్నాయి. వీటినుంచి విదేశాలకు సరుకు పంపవచ్చు. కానీ ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అవసరమైన క్లీన్ కార్గో పోర్టు లేదు. దీంతో ఇక్కడున్న బడా ఫార్మా కంపెనీలు సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, జపాన్, రష్యా తదితర దేశాలకు క్యాప్యుల్స్, బల్క్డగ్స్ ఇతర మందులను తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఎగుమతి చేస్తున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రవాణా చేయడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నా ఇక్కడ విదేశాలకు ఎయిర్ కార్గో సదుపాయం లేదు. ఇటీవల సింగపూర్‌కు కార్గో విమానం మొదలైనా అదికూడా ట్రైల్ రన్‌గానే మిగిలిపోయింది. అయితే, ఇప్పుడు తాజాగా విశాఖలోని కంటైనర్ టెర్మినల్ నుంచి ఫార్మా ఎగుమతుల ప్రారంభం కావడంతో సమయం ఆదాతోపాటు ఖర్చులు మిగులుతున్నాయని, అందుకే తొలిసారిగా కొద్దిమొత్తం పోర్టు ద్వారా ఎగుమతి చేస్తున్నట్లు ఇజాయ్ ఫార్మా కంపెనీ ఎండీ లాంబా ‘సాక్షి’కి వివరించారు. సముద్రరవాణా అయితే రకరకాల అనుమతుల తలనొప్పులు, ఇతరత్రా ఇబ్బందులు తగ్గుతున్నాయని చెప్పారు. మరోపక్క పోర్టు వర్గాలు సైతం ఫార్మా కంపెనీల నిర్ణయాన్ని స్వాగతించాయి. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు క్రమక్రమంగా పెరగడానికి ఇవి సంకేతాలని వీసీటీపీఎల్ అధికారి ఎంఎన్‌రావు విశ్లేషించారు. సముద్రమార్గంలో ఫార్మా ఉత్పత్తుల రవాణా వ్యాపారం మున్ముందు రూ.200 వందల కోట్లను దాటవచ్చని సీఐఐ అంచనా వేస్తోంది.