ఏప్రిల్–ఆగస్ట్ మధ్య 11.9 బిలియన్ డాలర్లు
గతేడాదితో పోలిస్తే ఇది 8.1 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా ఎగుమతులు భారత్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్ట్ మధ్య 11.9 బిలియన్ డాలర్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 8.1 శాతం అధికం. ఎగుమతుల పరంగా జెమ్స్–జువెల్లరీ, కెమికల్స్ విభాగాలను దాటి ఫార్మా రంగం నాల్గవ స్థానంలో నిలిచింది. 2023లో ఫార్మా రంగం ఆరవ స్థానంలో ఉంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ పరిశ్రమ 8–10% ఆదాయ వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. అమె రికా, యూరప్ వంటి రెగ్యులేటెడ్ మార్కెట్లకు బలమైన ఎగుమతులు, ఆఫ్రికా, ఆసియాతో సహా సెమీ–రెగ్యులేటెడ్ మార్కెట్లలో రికవరీ, అలాగే స్థిరమైన దేశీయ డిమాండ్‌తో 2024–25లో ఈ స్థాయి ఆదాయ వృద్ధిని సాధిస్తుందని క్రిసిల్ అంచనా వేస్తోంది.
స్థిర నగదు ప్రవాహాలు..
2023–24లో భారత ఔషధ పరిశ్రమ సుమారు 10 శాతం వృద్ధిని సాధించింది. యూఎస్ జెనరిక్స్ మార్కెట్‌లో ధరల ఒత్తిడి తగ్గడం, నిర్వహణ వ్యయాలు మెరుగవడం.. వెరశి ఆపరేటింగ్ మార్జిన్‌లు 70–80 బేసిస్ పాయింట్లు పెరిగి సుమారు 22.5 శాతానికి చేరే అవకాశం ఉందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ఫార్మాస్యూటికల్ కంపెనీలు సముచిత చికిత్సా విభాగాల్లో కొనుగోళ్లను కొనసాగించినప్పటికీ.. స్థిర నగదు ప్రవాహాలు, తక్కువ ఆర్థిక పరపతి నుండి కూడా ఈ రంగం ప్రయోజనం పొందుతుందని అంచనా. గత ఏడాది రూ.4.1 లక్షల కోట్ల మార్కెట్‌లో సగానికి బాధ్యత వహించే 190 ఔషధ తయారీ కంపెనీల ఆదాయాల ఆధారంగా క్రిసిల్ నివేదిక రూపొందించింది.
ఆదాయం దాదాపు సమానం..
దేశీయ విక్రయాలు, ఎగుమతుల మధ్య ఆదాయం దాదాపు సమానంగా ఉందని క్రిసిల్ వెల్లడించింది. దేశీయ ఆదాయంలో అధికంగా దీర్ఘకాలిక, తీవ్ర చికిత్సా విభాగాల ద్వారా సమకూరుతోంది. ఎగుమతుల ఆదాయం ప్రధానంగా ఫార్ములేషన్స్ 80 శాతం, బల్క్ డ్రగ్స్ 20 శాతం నమోదవుతోంది. 2024–25లో ఫార్ములేషన్ ఎగుమతులు రూపాయి పరంగా 12–14 శాతం పెరుగుతాయని అంచనా. యూఎస్, యూరప్ వంటి నియంత్రిత మార్కెట్లు 13–15 శాతం వృద్ధిని సాధిస్తాయి. కొనసాగుతున్న ఔషధాల కొరత, కొత్త ఉత్పత్తుల లాంచ్‌లు, ప్రత్యేక ఉత్పత్తుల వైపు మళ్లడం ఇందుకు కారణం. సెమీ–రెగ్యులేటెడ్ మార్కెట్లకు ఎగుమతులు 8–10 శాతం పెరగవచ్చు. విదేశీ మారక నిల్వలను మెరుగవడం, ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాలలో కరెన్సీల స్థిరీకరణ ఇందుకు సహాయపడుతుంది.
దేశీయంగా మార్కెట్ ఇలా..
ఫార్మా పరిశ్రమ ఆదాయం దేశీయంగా 7–9 శాతం పెరుగుతుందని అంచనా. ముఖ్యంగా నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (ఎన్‌ఎల్‌ఈఎం) ఉత్పత్తులలో ధరల పెరుగుదల ఇందుకు దోహదం చేయనుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం టోకు ధరల సూచీలో జరిగిన కొద్దిపాటి మార్పుల కారణంగా ఎన్‌ఎల్‌ఈఎం పోర్ట్‌ఫోలియో వృద్ధి తగ్గుతూనే ఉంటుంది. పెరుగుతున్న జీవనశైలి సంబంధిత వ్యాధులు, మహమ్మారి అనంతర ఆరోగ్య అవగాహన అధికం కావడం వంటి కారణంగా దీర్ఘకాలిక చికిత్సల విభాగం దేశీయ ఆదాయ వృద్ధికి కీలకంగా దోహదపడుతుందని క్రిసిల్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment