న్యూఢిల్లీ: కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగానికి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్‌ఐ) పరిశీలిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ తరహా ఉత్పత్తులకు భారత్‌ను తయారీ కేంద్రంగా చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. కెమికల్స్, పెట్రోకెమికల్స్ తయారీ రంగం నిర్వహిస్తున్న మూడో ఎడిషన్ సదస్సును ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. కఠినమైన కాలుష్య నియంత్రణలు, పెరుగుతున్న కారి్మక వ్యయాలతో రసాయనాల పరిశ్రమలోని అంతర్జాతీయ కంపెనీలు తమ తయారీ వసతులను వైవిధ్యం చేసుకోవాలని చూస్తున్నాయని.. వీటి తయారీకి భారత్ ప్రత్యామ్నాయ కేంద్రంగా ఎదిగే అవకాశాలు, సామర్థ్యాలు ఉన్నాయని చెప్పారు.
దీనికితోడు ఈ ఉత్పత్తులకు భారత్ సైతం పెద్ద వినియోగ కేంద్రంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. దేశీయంగా మిగులను ఎగుమతి చేసుకోవచ్చని, ఇందుకు ప్రభుత్వం విధానాల పరంగా మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. ‘‘భారత్ తయారీ కేంద్రంగా అవతరించేందుకు మేము సానుకూలంగా ఉన్నాం. అందుకే కెమికల్స్, పెట్రోకెమికల్స్‌కు పీఎల్‌ఐని పరిశీలిస్తున్నాం. సుస్థిరత, కర్బన ఉద్గారాల విడుదల, కాలుష్యం, బూగర్భనీటి కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమ అదనపు సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవాలి. 2047 నాటికి ఇంధన పరంగా స్వావలంబన, 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాల స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాలను గుర్తు పెట్టుకోవాలి. ప్రతీ పరిశ్రమ, రంగం తన వంతు సహకారం అందించకపోతే ఈ లక్ష్యాలు సాకారం కావు’’అని మంత్రి సీతారామన్ గుర్తు చేశారు. పర్యావరణ అనుకూలమైన వృద్ధికే తమ ప్రాధాన్యం అని చెప్పారు. కర్బన ఉద్గారాల తీవ్రతను తగ్గించాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రీన్ హైడ్రోజన్ తయారీ ప్రోత్సాహకానికి ప్రభుత్వం రూ.19,744 కోట్లను ప్రకటించడాన్ని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment