
టెక్ రంగంలో భవిష్యత్తు కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కీలక సలహాలు ఇచ్చారు. స్ట్రాటెక్రీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక కంపెనీలలో కోడింగ్ పనులను కృత్రిమ మేధ (AI) ఎలా తీసేసుకుంటోందో తెలియజేశారు. ఇప్పుడు అనేక సంస్థలలో 50 శాతానికి పైగా కోడింగ్ పనిని ఏఐ చేస్తోందనే అంచనా ఉందని, అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్ లో పోటీపడాలంటే కృత్రిమ మేధతో పనిచేయడం నేర్చుకోవడం కీలకమని ఆయన నొక్కి చెప్పారు.
అప్పుడది.. ఇప్పుడిది..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ పై పట్టు సాధించడంపై నేటి దృష్టిని ఆల్ట్ మన్ చిన్నతనంలో కోడింగ్ నైపుణ్యాలను నేర్చుకోవడంపై ఉన్న దృష్టితో పోల్చారు. తాను హైస్కూల్ చదువుతున్నప్పుడు కోడింగ్ లో నైపుణ్యాన్ని సాధించడం వ్యూహాత్మక విషయంగా ఉండేదని, కానీ ఇప్పుడు కృత్రిమ మేధ సాధనాలను ఉపయోగించడంలో మెరుగ్గా ఉండటమే సరైన వ్యూహాత్మక విషయమని ఆల్ట్‌మన్ అన్నారు. పరిశ్రమ ఆటోమేషన్ వైపు వెళుతున్న క్రమంలో కృత్రిమ మేధలో మంచి ప్రావీణ్యం కలిగి ఉండటం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
హ్యూమన్ కోడర్ల స్థానంలో కృత్రిమ మేధ (ఏఐ) అనే ఆలోచన మరింత ప్రాచుర్యం పొందుతోంది. అనేక మంది పరిశ్రమ పెద్దలు దీనిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరు నెలల్లో 90 శాతం కోడ్ ను ఉత్పత్తి చేయగలదని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ ఇటీవల అంచనా వేశారు. ఈ ఏడాది చివరి నాటికి ఏఐ కోడింగ్ లో మనుషులను మించిపోతుందని ఓపెన్ ఏఐ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ కెవిన్ వీల్ సూచించారు.
ఈ అంచనాలను ఆల్ట్‌మన్ కూడా బలపరిచారు. కోడింగ్ లో ఏఐ పాత్ర ఇప్పటికే గణనీయంగా ఉందన్నారు. కృత్రిమ మేధ మరింత కోడింగ్ బాధ్యతలను చేపట్టగల ఆటోమేషన్ అధునాతన రూపమైన "ఏజెంట్ కోడింగ్" భావనను కూడా ఆయన స్పృశించారు. ఈ భావన ఇంకా అభివృద్ధిలో ఉన్నప్పటికీ, ఆల్ట్‌మన్ దాని సామర్థ్యం గురించి ఆశాజనకంగా ఉన్నారు. అయితే ప్రస్తుత నమూనాలు ఆ దశకు చేరుకోవడానికి ఇంకా మెరుగుదల అవసరమని అంగీకరించారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు తగ్గనున్న డిమాండ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత సామర్థ్యం పెరిగే కొద్దీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు డిమాండ్ తగ్గవచ్చని ఆల్ట్ మన్ సూచించారు. ప్రస్తుతం ఇంజనీర్లకు డిమాండ్ ఉందని అంగీకరించినప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరిన్ని పనులు చేపట్టడంతో అవసరమైన ఇంజనీర్ల సంఖ్య తగ్గుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాల మార్పు అకస్మాత్తుగా జరగదని, క్రమంగా వేగవంతం అవుతుందని ఆల్ట్ మన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment