సాక్షి, హైదరాబాద్: ఏవో మందులు, ఔషధాలు అమ్ముతామంటారు.. అవసరమైతే సైకోథెరపిక్ డ్రగ్స్‌నూ సరఫరా చేస్తామని గాలం వేస్తారు.. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు, పేమెంట్లు తీసుకుంటారు.. ఫార్మా ఔషధాల ముసుగులో ఏకంగా అమెరికాకే డ్రగ్స్‌ను పార్శిల్ చేసి పంపిస్తారు.. ఇది ఎక్కడో కాదు.. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ రాకెట్ వ్యవహారం. ఇంటర్నెట్ అడ్డాగా కొనసాగుతున్న నిషేధిత డ్రగ్స్ రవాణా దందాను తాజాగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఛేదించింది.
హైదరాబాద్‌లోని దోమల్‌గూడ ప్రాంతానికి చెందిన కీలక సూత్రధారి ఆశిష్‌జైన్‌ను ఎన్‌సీబీ ఢిల్లీ బృందం తాజాగా అరెస్టు చేసింది. ఆశిష్‌జైన్ జేఆర్ ఇన్ఫినిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అమెరికాలోని కస్టమర్లకు సైకోథెరపిక్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టుగా తేల్చింది. మూడు రోజుల పాటు ఆశిష్ కార్యాలయం, నివాసంలో సోదాలు చేసి.. కంప్యూటర్లు, ఇతర సామగ్రి, రూ.3.7 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌సీబీ (ఆపరేషన్స్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్‌కుమార్‌సింగ్ తెలిపారు.
హైదరాబాద్ టు అమెరికా..
ఆశిష్ జైన్ డ్రగ్స్ దందా కోసం కొందరు ఉద్యోగులను నియమించుకున్నాడని.. వారితో అమెరికాలోని వినియోగదారులకు మెయిల్స్, మెసేజీలు, ఫోన్లు చేయించి ఫార్మా డ్రగ్‌తోపాటు సైకోథెరపిక్ డ్రగ్స్ ఆఫర్ చేస్తున్నాడని అధికారులు తెలిపారు. డ్రగ్స్ కావాలన్న వారి వివరాలు తీసుకుని.. బిట్‌కాయిన్, క్రెడిట్‌కార్డు, ఇతర ఆన్‌లైన్ మార్గాల ద్వారా డబ్బు చెల్లించాలని కోరేవాడని వివరించారు. డబ్బు చెల్లించిన కస్టమర్లకు హైదరాబాద్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల నుంచి డ్రగ్స్ పార్సిల్ చేసి పంపించాడని తెలిపారు.
వెయ్యికి పైగా షిప్‌మెంట్స్..
ఆశిష్‌జైన్ ఇప్పటివరకు వెయ్యికిపైగా డ్రగ్ పార్సిళ్లను అమెరికాలోని పలుచోట్లకు పంపినట్లు ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. ఈ అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా ముఠాకు ఆశిష్ జైన్ సూత్రధారి అని గుర్తించినట్టు వెల్లడించారు. అతను ఆక్సికోడోన్, హైడ్రోకోడోన్, అల్ఫ్రాజోలం, డైజోఫాం, లోరాజిపామ్, క్లోనాజిపామ్, జోల్పిడెమ్, ట్రెమడాల్ తదితర సైకోథెరపిక్ డ్రగ్స్‌ను సరఫరా చేసినట్టు తెలిపారు.
ఆశిష్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాలను ఇంకా దర్యాప్తుచేయాల్సి ఉందని ఎన్‌సీబీ (ఆపరేషన్స్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్‌కుమార్‌సింగ్ చెప్పారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చాడు, దేశంలో ఎక్కడెక్కడ నెట్‌వర్క్ ఏర్పాటుచేశాడు, ఎక్కడెక్కడి నుంచి రవాణా చేశాడన్న వివరాలను గుర్తించాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment