ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం..
ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఓ ఎమ్మెల్యే ఇటీవల ఆ ఆస్పత్రికి వెళ్లారు.. సిబ్బంది అల్ట్రాసెట్ టాబ్లెట్ ఇచ్చారు.. కొన్ని టాబ్లెట్లు మింగిన తర్వాత ఎమ్మెల్యేకు అనుమానం వచ్చింది.. ఎప్పుడూ వేసుకునే టాబ్లెట్ మాదిరిగా లేకపోవడంతో డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.. టాబ్లెట్లను పరిశీలించిన అధికారులు అవి నాసిరకం మందులని తేల్చారు! మరుసటి రోజు మరో ఎమ్మెల్యేకు ఇదే తరహా అనుభవం ఎదురైంది!
పాతబస్తీలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి..
జీర్ణ సంబంధ సమస్యతో వచ్చిన ఓ రోగికి పాంటాసిడ్ మాత్ర ఇచ్చారు. అప్పటికే ఆ మాత్ర వేసుకుంటున్న రోగికి అనుమానం వచ్చింది. మరో వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి ఆ టాబ్లెట్ చూపిస్తే అది నకిలీదని చెప్పారు. ఏం చేయాలో తెలియక ఆ రోగి కొత్త మందులు కొనుక్కున్నాడు!!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను నకిలీ రహిత రాష్ట్రంగా మార్చాలని యత్నిస్తుంటే.. మరోవైపు ఏకంగా శాసనసభ్యులకు ఔషధాలు ఇచ్చే డిస్పెన్సరీలోనే నకిలీ మందులు బయటపడ్డాయి. డిస్పెన్సరీకి మందులు సరఫరా చేసే కాంట్రాక్టుపై ఏళ్లకేళ్లుగా గుత్తాధిపత్యం సంపాదించిన కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా నకిలీ ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసులే పరమావధిగా మందుల కంపెనీలు ప్రజలకు నకిలీ ఔషధాలను అంటగడుతున్నాయి. బహిరంగ మార్కెట్‌తోపాటు ప్రభు త్వం ఉచితంగా మందులు సరఫరా చేసే డిస్పెన్సరీల్లోనూ ఇదే తంతు. మందుల కొనుగోలులో ఆరోగ్యశాఖ నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎమ్మెల్యేలే నకిలీ బారిన పడితే సామాన్యుడి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాసిరకం మందులపై ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
అన్ని చోట్లా ఇదే పరిస్థితి
బోధన, జిల్లా, ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రులు.. పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లు కలిపి రాష్ట్రంలో 5,660 ఉన్నాయి. అన్ని ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య ఏటా సగటున 4.5 కోట్ల దాకా ఉంటోంది. 2016–17లో 4.6 కోట్ల మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చారు. ఈ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ప్రభుత్వం ఉచితంగా ఔషధాలను సరఫరా చేస్తోం ది. ఇందుకు రూ.200 కోట్లను కేటాయిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, వసతుల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఈ బాధ్యత నిర్వహిస్తోంది. కొనుగోలు, ఆస్పత్రులకు పంపించడం తప్పితే కంపెనీల తీరును పట్టించుకోవడం లేదు. నాణ్యత పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన ఔషధ నియంత్రణ మండలి(డీసీఏ) అధికారులు తనిఖీలను మరిచిపోయారు. దీంతో రోగులకు నాసిరకం మందులే దిక్కవుతున్నాయి.
తయారీలో.. నాసిరకంలో..
ఔషధాల తయారీలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. నకిలీ, నాసిరకం మందుల సరఫరా సైతం రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతోంది. కేంద్ర ఆర్యోగ, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నేషనల్ డ్రగ్ సర్వే(ఎన్‌డీఎస్) పేరుతో దేశవ్యాప్తంగా 8,286 ఔషధాల శాంపిల్స్‌ను సేకరించింది. 62 కంపెనీల 946 రకాల మందులు నాసిరకంగా ఉన్నట్లు నిర్ధారించింది. వీటిలో ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. నేషనల్ డ్రగ్ సర్వే నివేదికను పరిశీలిస్తే నాసిరకం ఔషధాలు 11.41 శాతం ఉన్నాయి. తెలంగాణ నుంచి సరఫరా అయ్యే మందులలో ఇది 21 శాతం వరకు ఉందని నివేదిక పేర్కొంది. నాసిరకం, నకిలీల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను హెచ్చరించింది. అయి నా నకిలీ, నాసిరకం మందులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఔషధ నియంత్రణ విభాగం సంయుక్త సంచాలకుడు కైలాసం వివరణ కోసం ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు.
రూ.వెయ్యి కోట్ల దందా
గుంటూరు జిల్లా కీలక నేత కుటుంబమే సూత్రధారి
సాక్షి, అమరావతి బ్యూరో: ఏపీలోని నరసరావుపేట కేంద్రంగా నకిలీ మందుల దందా దక్షిణ భారతదేశమంతటా విస్తరించినట్లు తెలుస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏటా ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల దందా సాగుతోంది. ఈ దందాకు మూలాలు గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉన్నాయని వెల్లడైంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఓ కీలక నేత కుటుంబ సభ్యులే ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులని సమాచారం. దీంతో ఈ కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అసలు నకిలీ మందుల తయారీదారులు ఎవరన్నది వెలుగులోకి రాకుండా తొక్కి పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కేవలం కర్నూలు జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు ఏజెంట్ల వరకే నకిలీ మందుల కేసును పరిమితం చేసేలా వ్యూహం రచిస్తున్నారు. దందాకు కేంద్రమైన నరసరావుపేటలో లోతుగా విచారించకుండా మమ అనిపించారు. ప్రముఖ కంపెనీల ఉత్పత్తుల పేరిట భారీగా నకిలీ మందులు తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ దీన్ని గుర్తించి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment