govt hosptial
-
గుండెల నిండా దుఃఖం.. భుజంపై మేనకోడలి మృతదేహంతో..!
భోపాల్: కనీస మౌలిక సదుపాయలు అందక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్న హృదయవిదారక సంఘటనలు దేశంలో ఏదో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ద్విచక్రవాహనంపై, తోపుడు బండిపై, భుజాలపై మృతదేహాలను మోసుకుంటూ వెళ్లిన సంఘటనలు కలిచివేస్తున్నాయి. అలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని రద్దీ రోడ్డులో ఓ వ్యక్తి తన భుజాలపై మోసుకుటూ బస్టాప్‌కు వెళ్లారు. అందరితో పాటే బస్సులో మృతదేహాన్ని స్వగ్రామం చేర్చారు. ఈ హృదయవిదారక సంఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నాలుగేళ్ల చిన్నారి స్వగ్రామంలో ప్రమాదవశాత్తు మృతి చెందింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఛాతర్పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ, మృతదేహాన్ని తిరిగి ఇంటికి చేర్చేందుకు ఆసుపత్రిలో వాహనం లేదు. ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు దుఃఖంలో ఉన్న ఆమె మేనమామ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. బస్టాప్ వరకు తన భుజాలపై మోసుకెళ్లాడు. రద్దీగా ఉన్న బస్‌లోనే మృతదేహంతో ఎక్కాడు. అయితే, ఆయన వద్ద బస్సు టికెట్ కొనేందుకు సైతం డబ్బులు లేకపోవటం అందరిని కలచివేసింది. మరో ప్రయాణికుడు టికెట్ కొనిచ్చాడు. ఆసుపత్రి నుంచి మృతదేహాలను తరలించేందుకు పట్టణాభివృద్ధి విభాగం ఏర్పాట్లు చేయాలని చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ లఖన్ తివారీ తెలిపారు. ఇలాంటి వాటిలోకి ఆసుపత్రి, వైద్యులను లాగొద్దని కోరారు. నాలుగు నెలల క్రితం సైతం ఛతార్పుర్ జిల్లాలో ఇలాగే నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లారు. దీంతో జిల్లాలో సదుపాయలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. బుధవారమే సింగ్రౌలి జిల్లాలో శిశువును బైక్ సైడ్ బాక్సులో తీసుకెళ్లటం సంచలనంగా మారింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. A man carried the body of his four-year-old niece on his shoulders and took a bus to his village because he could not get a hearse from a hospital, This comes nearly four months after a four-year-old girl's body was carried by her family on their shoulders. Both in Chhatarpur. pic.twitter.com/NXZUNODqUT — Anurag Dwary (@Anurag_Dwary) October 20, 2022 ఇదీ చదవండి: 75వేల మంది యువతకు ప్రధాని మోదీ దివాళీ గిఫ్ట్ -
షాకింగ్ ఘటన.. హాస్పిటల్ భవనంపై శవాల గుట్టలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ ప్రభుత్వ ఆసుపత్రి భవనం డాబాపై కుళ్లిన స్థితో శవాల గుట్టలు కనిపించాయి. ప్రస్తుతం ఈ సంఘటన పాక్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అత్యంత దయనీయంగా, కుళ్లిన స్థితిలో మృతదేహాలు పడి ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వాటిని గద్దలు, ఇతర పక్షుల ఆహారం కోసం భవనంపై పడేశారనే వార్తలు సైతం వ్యాప్తి చెందాయి. ముల్తాన్‌లోని నిష్తార్ ఆస్పత్రిని కొద్ది రోజుల క్రితం ఉన్నతాధికారి ఒకరు సందర్శించారు. ఆ సమయంలో ఆస్పత్రి మార్చురీ పైభాగంలో ఈ మృతదేహాలను గుర్తించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భవనంపై వందల కొద్ది మృతదేహాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. నిష్తార్ ఆసుపత్రి సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది పాకిస్థాన్ ప్రభుత్వం. ఈ విషయం వెలుగులోకి వచ్చిన క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి చౌధరీ జమాన్ గుజ్జార్ సలహాదారు ఆసుపత్రిని సందర్శించారు. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఘటనలో బాధ్యులైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వర్గాలకు సూచించారు. అలాగే.. ముజామిల్ బాషిర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది పాక్. మూడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్న వార్తలు వెలుగులోకి వచ్చిన క్రమంలో స్పందించారు నిష్తార్ వైద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ మరియం అషార్ఫ్. ‘పోలీసు విభాగం గుర్తు తెలియని మృతదేహాలను విశ్వవిద్యాలయానికి అప్పగించింది. విద్యార్థులు వైద్యపరమైన పరీక్షలు నిర్వహించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. ఇదంతా నిబంధనల ప్రకారమే జరిగింది. వైద్య పరంగా ఉపయోగించేందుకు ఎముకలు, పుర్రెను వేరు చేయటం నిబంధనలకు విరుద్ధమేమీ కాదు.’ అని వెల్లడించారు. ఇదీ చదవండి: వీడియో: శభాష్.. ఆమె పూర్వానుభవం.. ఒక ప్రాణం నిలిపింది -
కేసీఆర్ కిట్.. రెండు జిల్లాల్లో ‘హిట్’
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లోని గర్భిణులు, బాలింతలకు పెద్ద మొత్తంలో కేసీఆర్ కిట్ కింద ప్రభుత్వ ప్రోత్సాహకం అందింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (ఆరు నెలల్లోనే) 22,192 మందికి రూ.34.05 కోట్లు అందడం గమనార్హం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మొత్తం నగదు ప్రోత్సాహకంలో 83.72 శాతం ఈ రెండు జిల్లాల వారికే ఇవ్వడం విశేషం. ఇందులోనూ మునుగోడు నియోజకవర్గ మహిళలకు అత్యధికంగా ప్రోత్సాహకం అందడం గమనార్హం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, సిజేరియన్లు తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం.. పుట్టిన బిడ్డకు అవసరమైన వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్‌తో పాటు నగదు ప్రయోజనం అందిస్తోంది. బిడ్డ పుట్టాక చీరలు, టవల్, జుబ్బాలు, బేబీ సబ్బులు, నూనెతో కూడిన కిట్ అందజేస్తున్నారు. ఇక గర్భం దాల్చిన 3వ నెలలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం/ఆసుపత్రిలో రిజిస్టర్ అయిన తేదీ మొదలుకుని పుట్టిన బిడ్డ వయస్సు 10 నెలలు దాటే వరకు నాలుగు విడతల్లో నగదు ప్రోత్సాహకాన్ని తల్లి ఖాతాలోకి బదిలీ చేస్తున్నారు. ఆడబిడ్డ అయితే రూ.13 వేలు, మగ బిడ్డ అయితే రూ.12 వేల చొప్పున ఇస్తున్నారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వారికి కేసీఆర్ కిట్లతో పాటు నగదు ప్రోత్సాహకం ఇటీవల ప్రభుత్వం అందజేసింది. ఇతర జిల్లాలకు రూ.లక్షల్లోనే.. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 28,242 మంది గర్భిణులు, బాలింతలకు రూ.40.67 కోట్ల నగదు ప్రోత్సాహకం ప్రభుత్వం అందించింది. అందులో నల్లగొండ జిల్లాలోని 15,817 మందికి రూ.24.68 కోట్లు అందగా, యాదాద్రి జిల్లాలోని 6,375 మంది మహిళలకు రూ.9.37 కోట్లు అందింది. మిగతా జిల్లాలకు మాత్రం చాలా తక్కువగా నగదు బదిలీ జరిగింది. హైదరాబాద్ జిల్లాలో 625 మందికి రూ.1.07 కోట్లు నగదు బదిలీ చేయగా, 30 జిల్లాల్లో ఏ జిల్లాకు రూ.కోటికి మించి విడుదల కాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోకి వచ్చే సూర్యాపేటలో కూడా కేవలం 501 మందికి రూ.19 లక్షలే నగదు బదిలీ అయ్యింది. నగదు ఎక్కువ మందికి.. కిట్లు తక్కువ మందికి! ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నగదు బదిలీ ప్రయోజ నం ఎక్కువమంది పొందగా, కిట్లు తక్కువ మందికే లభించాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 22,693 మంది నగదు ప్రయోజనం పొందగా, కేసీఆర్ కిట్ మాత్రం 7,526 మందికే లభించింది. కిట్లు పొందిన వారు నల్లగొండ జిల్లాలో 4,101 మంది, యాదాద్రి జిల్లాలో 1,250 మంది, సూర్యాపేట జిల్లాలో 2,175 మంది ఉన్నారు. మూడు దశల్లో నగదు ప్రయోజనం పొందిన తర్వాత డెలివరీ ప్రైవేటు ఆసుపత్రుల్లో చేయించుకోవడం, కిట్లు తక్కువగా పంపిణీ కావడానికి కారణంగా తెలుస్తోంది. -
ఉచితంగానే మందులు... బయట కొనొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుప త్రులకు వచ్చే రోగులకు అవసరమైన మందులు అన్నింటినీ ఉచితంగా ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ మందులు రాశాక రోగులకు నిర్దేశిత రోజులకు అవసరమైనన్ని మందులు కాకుండా తక్కువ రోజులకు ఇస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక చాలామంది రోగులు ప్రైవేట్ మందుల దుకాణాల్లో ఔషధాలు కొనుగోలు చేస్తున్నారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోగులకు అవసరమై నన్ని మందులను ఉచితంగానే ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) మొదలు ఏరియా, సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల వరకు అన్ని చోట్లా దీన్ని అమలు చేస్తారు. వైద్యులు అక్కడుండే మందులనే రాసి రోగులు బయట కొనే పరిస్థితి లేకుండా చూడాల్సి ఉంటుంది. ఇన్‌పేషెంట్లు, ఔట్ పేషెంట్లు అందరికీ నిర్ణీత కోర్సు మేరకు మందులు ఇస్తారు. ఉదాహరణకు ఒక రోగికి బీపీ మాత్రలు నెల రోజులకు రాస్తే, ఇప్పటివరకు వారం రోజులకు సరిపోయేలా ఇచ్చేవారు. ఇకపై నెల రోజులకూ ఇవ్వనున్నారు. ప్రభుత్వం మందుల కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ నిధులు పూర్తిస్థాయిలో రోగులకు మందులు ఇచ్చేందుకు సరిపోతాయని వైద్య వర్గాలు వెల్లడించాయి. 12 జిల్లాల్లో సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో అవసరమైనన్ని మందులను అందుబాటులో ఉంచాలంటే ఆ మేరకు పంపిణీ కూడా చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం ఆలస్యం కాకుండా మందులను సరఫరా చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాలకు సరఫరా చేసేలా 12 జిల్లాల్లో సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిల్లో మూడు నెలలకు సరిపడా మందులు ఎల్లప్పుడూ నిల్వ ఉంటాయి. ఎప్పటికప్పుడు మూడు నెలల బఫర్ స్టాక్‌ను నిర్వహించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద రూ.43.20 కోట్ల నిధులతో 2022–23లో సిద్దిపేటలోని బోధనాసుపత్రి, వనపర్తి, మహబూబాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తారు. 2023–24 సంవత్సరంలో కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, భువనగిరి, గద్వాల జిల్లా ఆసుపత్రుల్లో, వికారాబాద్ ఏరియా ఆసుపత్రిలో, సూర్యాపేట బోధనాసుపత్రిలో నెలకొల్పుతారు. ఒక్కో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఏర్పాటుకు రూ.3.60 కోట్ల చొప్పున కేటాయించారు. ఈ స్టోర్ల నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఎలాంటి జాప్యం లేకుండా మందులు సరఫరా అవుతాయి. -
సాక్షి హెల్త్ రిపోర్ట్: ‘పరీక్ష’ యంత్రాలు పనిచేయట్లే!
సాక్షి నెట్వర్క్/హైదరాబాద్: రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రధానమైన జిల్లా ఆస్పత్రులను సైతం వైద్య పరికరాల కొరత పీడిస్తోంది. కొన్ని చోట్ల నిపుణులైన సిబ్బంది లేక స్కానింగ్, ఎక్స్‌రే మెషీన్లు, రక్త ఇతర పరీక్షల పరికరాలు నిరుపయోగంగా ఉంటే.. చాలాచోట్ల వీటితో పాటు బీపీ పరీక్ష వంటి చిన్న చిన్న వైద్య పరికరాలు, ఇతర యంత్రాలు పనిచేయడం లేదు. నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన పరికరాలు పాడై నెలలు, ఏళ్ల తరబడి మరమ్మతుకు నోచుకోక పోవడంతో కొన్ని చోట్ల తుప్పు, బూజు పట్టిపోతున్నాయి. నిర్లక్ష్యమే శాపం ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఇతర మౌలిక సదుపాయాల కల్పనతో పాటు తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో నెలకొల్పామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కూడా చెబుతున్నారు. కానీ కొన్నిచోట్ల అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోగులకు సరైన విధంగా సేవలందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రోగ నిర్ధారణకు కీలకమైన వైద్య పరికరాలు లేకపోవడంతో పేద రోగులు ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు 5,999 ఉన్నాయి. అందులో ఆరోగ్య ఉప కేంద్రాలు 4,745 ఉన్నాయి. 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 232 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 224 బస్తీ దవాఖానాలు, 90 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 27 జిల్లా ఆసుపత్రులు, 20 ఏరియా ఆసుపత్రులు, 14 స్పెషాలిటీ ఆసుపత్రులు, 9 బోధనాసుపత్రులు ఉన్నాయి. నిత్యం లక్షలాది మంది ఔట్ పేషెంట్లు ఆయా ఆస్పత్రులకు వస్తుంటారు. ఆయా ఆసుపత్రిలన్నింటిలోనూ బీపీ మిషన్ మొదలుకొని సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ వరకు చిన్నా పెద్దవి కలిపి 30 వేల వైద్య పరికరాలు ఉన్నాయి. అందులో ఏకంగా 4,500 పరికరాలు పని చేయకుండా పాడైపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. జిల్లాల్లో ఇదీ పరిస్థితి... ► పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసే పరికరాలు పని చేయడం లేదు. జిల్లా క్షయ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎక్స్‌రే మిషన్ ఇప్పటివరకు నెలకొల్పకపోవడంతో రోగులకు సేవలు అందడం లేదు. అలాగే ల్యాబ్‌లో సెల్‌కౌంట్ మిషన్, బయో కెమిస్ట్రీ మిషన్లు సంవత్సరాలుగా పనిచేయకపోవడంతో రక్తం మూత్ర పరీక్షలను మాన్యువల్‌గా చేస్తున్నారు. ► భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్పీహెచ్సీలో ఎక్స్‌రే మిషన్ పనిచేయడం లేదు. ► మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 2018లో రూ. 1.25 కోట్లతో ఏర్పాటు చేసిన డిజిటల్ ఎక్స్‌రే మిషన్ పనిచేయడంలేదు. ► వనపర్తి జిల్లా ఆస్పత్రిలో అల్ట్రాసౌండ్ పరికరం ఉన్నా నిరుపయోగంగా మారింది. ► జోగుళాంబ గద్వాల జిల్లా ఆస్పతిలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సీటీ స్కానర్, సీ ఆర్మ్ స్కానర్, వెంటిలేటర్లు, డయాగ్నోస్టిక్ ల్యాబ్‌కు అవసరమయ్యే పరికరాలు ఏర్పాటు చేసింది. అయితే సిబ్బంది లేక ఈ పరికరాలు నిరుపయోగంగా మారాయి. ► రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో స్పెషలిస్టు వైద్యులు లేక ఆర్థో, జనరల్, ఈఎన్టీ, పల్మనాలజిస్టు, ఆప్‌తో విభాగాలకు చెందిన విలువైన పరికరాలను పక్కనబెట్టారు. ► వరంగల్ఎంజీఎం ఆస్పత్రిలో ఈసీజీ మెషీన్, సీటీ స్కాన్, ఎక్స్‌రే, వెంటిలేటర్లు సరిగా పనిచేయడంలేదు. ► నిజామాబాద్ జీజీహెచ్‌లో ఎంఆర్ఐ స్కానింగ్ లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఐదు ఎక్స్‌రేల్లో మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. యూవీ పౌండేషన్ ఇచ్చిన వెంటిలేటర్లు, అత్యవసర వైద్య పరికరాలు సిబ్బంది లేకపోవడంతో వినియోగించడంలేదు. ► డిచ్పల్లి సీహెచ్‌సీలో గర్భిణుల కొరకు స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆస్పత్రిలో రేడియాలజిస్టు్ట్ట, గైనకాలజిస్టు లేకపోవడంతో స్కానింగ్ తీయడం లేదు. ► కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో ఆల్ట్రా స్కానింగ్ యంత్రం కొత్తది ఉంది. అయితే వైద్యుడు లేకపోవడంతో దానిని గదిలో పెట్టి తాళం వేశారు. పీహెచ్‌సీల్లో ఎక్స్‌రే యంత్రాలు ఉపయోగించకుండా మూలకు పెట్టారు. జిల్లా ఆస్పత్రిలో సీటీ స్కాన్ యంత్రం అసలు లేనేలేదు. ► తాండూరు జిల్లా ఆస్పత్రిలో ముగ్గురు దంత వైద్యులు ఉండగా దంత పరీక్షలు నిర్వహించే యంత్రం ఏడాదిగా పని చేయటం లేదు. వైద్యులు ప్రైవేటుగా ప్రాక్టీసు చేస్తూ క్లినిక్‌లు నిర్వహిస్తుండటంతో వారే ఆ మిషన్‌ను పాడు చేశారనే ఆరోపణలున్నాయి. ఇక వైద్యులు లేక కంటి పరీక్ష పరికరాలు మూలకు పడ్డాయి. ► నల్లగొండ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్‌లో సీటీస్కాన్, ఎక్స్‌రే, డిజిటల్ ఎక్స్‌రే, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్, తెలంగాణ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లోని అన్ని రకాల పరిరకాలు పనిచేస్తున్నాయి. అయితే ఎనిమిది మంది రేడియోగ్రాఫర్లకు గాను ఒక్కరు మాత్రమే ఉండడంతో ఈసీజీ, ఎక్స్‌రే, సీటీ స్కాన్సేవలను అందించడంలో కొంత ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ► సూర్యాపేట జనరల్ ఆస్పత్రిలో సీటీ స్కాన్, అల్ట్రా సౌండ్ స్కాన్లు అందుబాటులో ఉన్నాయి. అయినా కొందరు వై ద్యులు ఈ పరీక్షలు ప్రైవేటులో చేయించుకుని రావాలని రోగులకు సూచిస్తున్నారు. ► రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో గర్భిణులను పరీక్షించే స్కానింగ్ మిషన్ రెండేళ్లుగా పని చేయడం లేదు. నకిరేకల్‌లోని 30 పడకల వైద్యశాలలో స్కానింగ్ మిషన్, బ్లడ్ బ్యాంక్ వంటి సౌకర్యాలు లేవు. ► ఖమ్మం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ అందుబాటులోకి తెచ్చారు. అయితే ఒక్కరే టెక్నీషియన్ ఉండటంతో రోగులు తరచూ ఇబ్బందులు పడుతున్నారు. ► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత ఉంది. ముఖ్యంగా గుండె, నరాల బలహీనత, క్యాన్సర్వంటి రోగాలకు సంబంధించిన ఔషధాలు అందుబాటులో లేవు. ► జనగామ జిల్లా ఆస్పత్రిలో నాలుగేళ్లుగా సీటీ స్కాన్ మూలన పడింది. మరమ్మతుకు అవకాశం ఉన్నా కాల యాపన చేస్తూ సీటీ స్కాన్ గది తాళం వేసి పెడుతున్నారు. దీంతో రోగులు ప్రైవేట్‌లో పరీక్షలు చేయించుకుం టున్నారు. ఇదే ఆస్పత్రిలో పంటికి సంబంధించిన ఎక్స్‌రే మిషన్ కూడా పనిచేయడం లేదు. పాలకుర్తి, స్టేషన్‌ఘన్ పూర్లో లక్షల విలువైన ఎక్స్‌రే మిషన్లు పాడై తుప్పుపట్టి పోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ► కరీంనగర్ జిల్లా ఆసు పత్రిలో రెండు బెడ్‌సైడ్ ఎక్స్‌రే మిషన్లు ఉన్నాయి కానీ పని చేయడం లేదు. స్వల్ప మరమ్మతులు చేస్తే వాటిని వినియోగం లోనికి తెచ్చే అవకాశం ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో అవి ఉపయోగంలో లేకుండా పోయాయి. ఇక రెండు నెలల క్రితం 20 వెంటిలేటర్లు ఆసుపత్రికి వచ్చాయి. కానీ నిపుణులైన సిబ్బంది లేకపోవడంతో అలా స్టోర్‌రూం ముందు పెట్టి ఉంచారు. మరోవైపు 10 సీసీ సిరంజీలు, డిస్పోజబుల్æబెడ్‌షీట్స్, అథెసివ్ ప్లాస్టర్లు, డైనా ప్లాస్టర్లు, డిస్టిల్ వాటర్క్యాన్లు తదితర సర్జికల్, ల్యాబ్ మెటీరియల్‌కు తీవ్ర కొరత ఉంది. ► ఇది సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్. వేల రూపాయలు ఖర్చయ్యే సుమారు 57 రకాల పరీక్షలను నిరుపేదలకు ఉచితంగా చేసేందుకు ప్రభుత్వం వీటిని నెలకొల్పింది. అయితే ప్రస్తుతం సిబ్బంది లేకపోవడంతో ప్రాథమిక రక్త పరీక్షలైన సీబీపీ, సీఆర్పీ వంటి టెస్టులు కూడా నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులు ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. పరీక్షలు చేయట్లే.. కోటగిరి ఆస్పత్రిలో శరీరంలోని నొప్పులు తగ్గే మందులు అందుబాటులో లేవని చెబుతున్నారు. కళ్లు పరీక్ష చేసే కాంపౌండర్ కూడా పరీక్ష చేసే పరికరం లేదని చెప్పి వొట్టి మందులే రాస్తున్నడు. పెద్దాస్పత్రి అనుకుని మాలాంటి గరీబోళ్లు ఇక్కడికి వస్తే ఆస్పత్రిలో డాక్టర్ లేడు. – పోతురాజు అబ్బవ్వ, కోటగిరి ఎక్స్‌రే సౌకర్యం లేదు వెలిశాల పీహెచ్సీలో ఎక్స్‌రే సౌకర్యం లేదు. మాకు తెలిసిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడగా.. ఆస్పత్రికి వెళితే ప్రాథమిక చిక్సిత చేసి పంపించారు. చిట్యాల సీహెచ్‌సీకి వెళ్లగా.. టెక్నీషియన్ అందుబాటులో లేకపోవడంతో పరకాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాం. – రేనుకుంట్ల సంపత్, సుబ్బక్కపల్లి, టేకుమట్ల మండలం -
కార్పొరేట్ ఆస్పత్రికి దీటుగా సర్కార్ దావఖానా..
సర్కారు దవాఖానా వాహ్ అనిపిస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రికి దీటుగా పరికరాలు సమ కూర్చుకుంటోంది. విధులు, నిధులు రెండూ బాగుండడంతో ఆస్పత్రి బాగు పడుతోంది. ప్రభుత్వం కావాల్సినంత సహకారం అందిస్తుండడంతో ఒక్కొక్కటిగా పరికరాలను తన అమ్ములపొదిలో చేర్చుకుంటోంది. అధునాతన యంత్రాలతో బుడితి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సారవకోట: మండలంలోని బుడితి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కార్పొరేట్ ఆస్పత్రికి దీటుగా మారుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగవుతున్నాయి. గతంలో ఆస్పత్రి నిర్మాణం జరగ్గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేలా ఫైర్ సేఫ్టీ సిలిండర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆస్పత్రిలో నిత్యం పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ఏడుగురు పారిశు ద్ధ్య కార్మికులను 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వీరు ఆపరేషన్ థియేటర్ నుంచి వార్డులు, ఓపీ సెంటర్, వైద్యుల గదులన్నింటినీ నిత్యం పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ►నాలుగు నెలల క్రితం దంత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు, దంత సమస్యలతో ఉన్న వారికి వైద్యం అందించేందుకు వీలుగా అధునాతన యంత్రాన్ని మంజూరు చేశారు. ► ఇటీవలే నలుగురు సెక్యూరిటీ గార్డులను నియమించడంతో వైద్య సేవలకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రసవాలపై ప్రత్యేక దృష్టి గైనకాలజిస్టు సృజనీకుమారి ఆస్పత్రి ప్రసవాలపై దృష్టి సారించడంతో సహజ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. సారవకోట, జలుమూరు, కోటబొమ్మాళి, కొత్తూరు, హిరమండలం తదితర మండలాల నుంచి గర్భిణులు వచ్చి ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. కాన్పు కష్టమైన సమయంలో శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం చేయాల్సి వచ్చినప్పుడు అవసరమయ్యే మత్తు వైద్యులను సైతం నియమించారు. ఫలితంగా కరోనా సమయంలో సైతం గైనకాలజిస్టు సృజనీకుమారి ధైర్యంగా గర్భిణులకు తోడుగా ఉంటూ ప్రసవాలు చేశారు. పిల్లల వైద్యుడు బోర సాయిరాం చిన్నారుల ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్త యంత్రాలు.. ఆస్పత్రికి ఫిజియోథెరపీ కోసం వచ్చే వారికి సేవలు చేసేందుకు అవసరమైన యంత్రాలను ఆగస్టు మొదటి వారంలో ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ యంత్రాలను ఇన్స్టాల్ చేసి సంబంధిత వైద్యులను ప్రభుత్వం నియమించాల్సి ఉంది. ప్రభుత్వ కృషి అభినందనీయం.. ప్రభుత్వం ఆస్పత్రుల అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయం. ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని మౌలిక వసతులు కల్పించడం, నూతన యంత్రాల మంజూరు, పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవడం సంతోషకరం. అలాగే నాడు–నేడు కార్యక్రమంతో ఆస్పత్రులను అభివృద్ధి చేసి సామాన్యులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తేవడం గొప్ప విషయం. – డాక్టర్ సృజనీకుమారి, సూపరింటెండెంట్, బుడితి సీహెచ్‌సీ -
‘ఊపిరి’ ఆగింది.. గాల్లోకి 22 ప్రాణాలు
సాక్షి ముంబై: మహారాష్ట్ర నాసిక్‌లో అత్యంత హృదయ విదారకమైన సంఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ఆక్సిజన్ ట్యాంకుకు లీకేజీ ఏర్పడి ప్రాణవాయువు అందక 24 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుంది. దుర్ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలో 150 మంది ఉండగా... అందులో 11 మంది వెంటిలేటర్‌పై... మిగతా వారు ఆక్సిజన్ సపోర్టుపై ఉన్నారు. ఉన్నట్లుండి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రి బెడ్స్‌పై గిలగిల్లాడుతూ ప్రాణాలు వదిలారు ఈ అభాగ్యులు. లీకేజీ జరిగిన కొద్దిసేపట్లోనే 22 మంది మరణించారు. వీరిలో 11 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. అనంతరం సాయంత్రం మరో ఇద్దరు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో 34 నుంచి 77 ఏళ్ల వయసు వాళ్లు ఉన్నారని తెలిపారు. బుధవారం 12.30 గంటల ప్రాంతంలో లీకేజీ గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది... ప్రత్యామ్నాయ సిలిండర్లను తెప్పించి ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించారు. ఈలోపే ఘోరం జరిగిపోయింది. సీరియస్‌గా ఉన్న పేషెంట్లను మరోచోటికి తరలించేందుకు బ్బంది పరుగులు పెట్టడం, ఏం జరుగుతుందో తెలియక రోగుల బంధువుల అర్తనాదాలతో ఆసుపత్రి ఆవరణలో గందరగోళం నెలకొంది. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 24 మంది చనిపోయారని నాసిక్ కలెక్టర్ సూరజ్ మందారే విలేకరులకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అసలేమి జరిగింది? నాసిక్‌లోని మున్సిపల్ కార్పొరేషన్ ఆసుపత్రి అయిన జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో 150 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి ఆవరణలో 13 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ట్యాంకు ఉంది. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆక్సిజన్ ట్యాంక్ సాకెట్ ఒకటి విరిగి లీకేజీ ప్రారంభమైంది. అయితే ట్యాంకర్ ద్వారా ట్యాంకులో ఆక్సిజన్ నింపుతుండగా ఇది జరిగిందనేది మరో వాదన. ఇది చూస్తుండగానే అధికమైంది. 12.30 ప్రాంతంలో ఆక్సిజన్ భారీగా లీకవ్వడం మొదలైంది. దీంతో అందరూ ముందుగా భయాందోళనలకు గురయ్యారు. అనంతరం ఈ లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాని లీకేజీ ఆగలేదు. అప్పటికి ట్యాంకులో 25 శాతం మేర మాత్రమే ఆక్సిజన్ ఉండగా... లీకేజీతో అది ఇంకా తగ్గిపోయింది. ట్యాంకులో ప్రెషర్ తగ్గి... పేషెంట్లకు ఆక్సిజన్ అందలేదు. మరోవైపు ఆసుపత్రిలో అరుపులు, కేకలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు ఆక్సిజన్ లీకేజీ కారణంగా ఇటువైపు ఉన్న అందరి దృష్టి ఒక్కసారిగా అటువైపు మళ్లింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనేక మంది రోగులు ఆక్సిజన్ అందక నీటి నుంచి బయటపడ్డ చేప పిల్లల్లా కొట్టుకోసాగారు. అక్కడే ఉన్న వారి కుటుంబసభ్యులు, నర్సులు, వైద్యులు ఈ సంఘటనతో అవాక్కయ్యారు. అందుబాటులో ఉన్న సిలిండర్లతో ఆక్సిజన్ అందించేందుకు ప్రయత్నించారు. ఇతర ఆసుపత్రులు నుంచి హుటాహుటిన డ్యూరా సిలిండర్లను తెప్పించారు. ఈ సమయంలో ఆసుపత్రి వర్గాలు కొందరు రోగులకు వేరే ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు కూడా చేపట్టారు. ఆక్సిజన్ ట్యాంకు నిర్వహణ బాధ్యతను చూస్తున్న ప్రైవేటు కంపెనీకి సమాచారం ఇచ్చి వారిని పిలిపించారు. ఇలా సుమారు గంటకుపైగా చేసిన ప్రయత్నాలు అనంతరం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో లీకేజీని ఆపగలిగారు. కాని అప్పటికే జరగరాని ఘోరం జరిగింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా 24 మంది ఆక్సిజన్ అందక మృతి చెందారు. ఈ సంఘటన అనంతరం బంధువుల ఆర్తనాదాలు, రోదనలతో ఆ పరిసరాలలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు అత్యంత విషాదకరమైన ఈ సంఘటన అనంతరం మృతుల కుటుంబీకులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే రూ. అయిదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొంటూ... ఏం మాట్లాడాలన్నా మాట పెగలడం లేదన్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంథించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దుర్ఘటనపై విచారణకు ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కమిటీని నియమించింది. మరోవైపు ఈ సంఘటన అనంతరం ఆసుపత్రికి చేరుకున్న నాసిక్ జిల్లా ఇంచార్జీ మంత్రి ఛగన్ భుజ్‌బల్ కూడా మృతుల కుటుంబీకులకు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున రూ. అయిదు లక్షల మద్దతు అందించనున్నట్టు ప్రకటించారు. ఇలా మొత్తం రూ.10 లక్షలు మృతుల కుటుంబీకులకు ఆర్థిక సహాయం అందనుంది. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి న్యూఢిల్లీ: ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడి 24 మంది కోవిడ్ రోగులు మృతిచెందడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘గుండెలను మెలిపెట్టే దురదృష్టకర సంఘటన. తీవ్ర వేదనను కలిగించింది. ఆత్మీయులకు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను..’అని మోదీ ట్వీట్ చేశారు. హోంమంత్రి అమిత్ షా కూడా సంతాపం ప్రకటించారు. మిగిలిన పేషెంట్లు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. నిర్లక్ష్యం కారణంగానే.. ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన చోటుచేసుకుందని మృతుల కుటుంబీకులు ఆరోపించారు. 60 ఏళ్ల తన తల్లిని మంగళవారమే ఈ ఆసుపత్రిలో చేర్చించామని, ఆమె వెంటిలేటర్‌పై ఉందని... ఇలా చనిపోవడానికి ఆమెను ఇక్కడ చేర్పించలేదని లీలా సర్కార్ అనే మహిళ గుండెలవిసేలా రోదించారు. ఊపిరి ఆడట్లేదని అమ్మ చెప్పగానే... నర్సింగ్ సిబ్బందిని పిలిచానని, ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. మరోవైపు తన తమ్ముణ్ని రక్షించుకోలేకపోయానంటూ మరోవ్యక్తి రోదించడం అక్కడున్న వారికి కన్నీళ్లు తెప్పించింది. ఆక్సిజన్ సరిగా సరఫరా కావడంలేదని ముందునుంచే తెలుపుతూ వచ్చామని, అయినా ఆసుపత్రి వారు పట్టించుకోలేదని మరి కొందరు వాపోయారు. ఆసుపత్రి నిర్లక్ష్యానికి ఇంత మంది మరణించారని ఆరోపించారు. చదవండి: ప్రశ్నలు సంధించాల్సిన సమయమిది చదవండి: ప్రపంచ విప్లవోద్యమ చుక్కాని లెనిన్ -
ఆస్పత్రి బాత్రూమ్లో కరోనా బాధితుడి ఆత్మహత్య
నాగ్‌పూర్: మహమ్మారి కరోనా వైరస్ రెండోసారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి ప్రజలను మళ్లీ భయాందోళనలకు నెట్టుతోంది. కరోనాతో మళ్లీ ప్రజలు భయపడే పరిస్థితులు వచ్చాయి. తాజాగా కరోనా సోకిందని భయంతో ఓ వృద్ధుడు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రిలోని బాత్రూమ్లోకి వెళ్లి ఆక్సిజన్ పైప్‌తో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. చదవండి: ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్లో ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి 81 ఏళ్ల వృద్ధుడు. కరోనా పాజిటివ్ రావడంతో ఆయన మార్చి 26వ తేదీన నాగ్‌పూర్‌లోని బోధన ఆస్పత్రి (జీఎంసీహెచ్)లో చేర్చారు. అయితే అకస్మాత్తుగా మంగళవారం ఆయన బాత్రూమ్లోకి వెళ్లి ఆక్సిజన్ పైప్‌కు ఆత్మహత్య చేసుకున్నారు. శుభ్రం చేయడానికి వెళ్లిన సిబ్బంది పైప్‌కు వేలాడుతున్న అతడిని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే అధికారులు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిశీలించారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు భయాందోళన చెందుతున్నారు. కరోనా వ్యాప్తితో వృద్ధులను కుటుంబసభ్యులు ఆదరించడం లేదు. ఒకవేళ కరోనా సోకితే ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్తున్నారు. వారి ఆరోగ్యం కుదుటపడిన కూడా ఇళ్లకు తీసుకెళ్లని ఘటనలు మనం చూస్తునే ఉన్నాం. అలాంటి బాధతోనే ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని తెలుస్తోంది. కాగా ఇదే ఆస్పత్రిలో ఒకే బెడ్‌పై ఇద్దరు కరోనా బాధితులను పడుకోబెడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ప్రభుత్వ తీరుపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదని చెబుతున్నారు. చదవండి: కిటికీలోంచి వాంతులు.. తెగిపడిన తల చదవండి: కంకులు తినాల్సిన చిన్నారులు బొగ్గుల్లా -
కరోనా ఉందని ఆస్పత్రిలో చేర్పిస్తే.. శ్మశానానికి పంపారు
కోల్‌కతా : కరోనా మహమ్మారి బారిన పడిన వ్యక్తి మరణం గురించి కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించకుండా అంత్యక్రియలు పూర్తిచేసిందో ప్రభుత్వాసుస్పత్రి. బాధితుడి చనిపోయిన నాలుగు రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన 70 ఏళ్ల హరినాథ్ సేన్ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అయితే హరినాధ్ సేన్ ఆరోగ్యం గురించి ఆస్పత్రికి కాల్ చేస్తే.. సిబ్బంది చాలా దురుసుగా మాట్లాడారని కొడుకు అర్జిత్ సేన్ ఆరోపించారు. ‘మీ తండ్రి మరణించాడు, దహన సంస్కారాలు కూడా చేశాం అని నాలుగు రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి ఫోన్ రాగానే మేమంతా షాక్‌కి గురయ్యామ’ని అర్జిత్ సేన్ మీడియాతో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇప్పటివరకు తన తండ్రి డెత్ సర్టిఫికెట్ కూడా అందివ్వలేదని తెలిపాడు. అయితే అర్జిత్ చేస్తున్న ఆరోపణలపై ఆస్పత్రి యాజమాన్యం స్పందించడానికి నిరాకరించింది. -
పసిమొగ్గపై పైశాచికం
పట్టుమని ఐదేళ్లు లేవు.. బడిబాటకు సిద్ధమవుతోంది. పలకాబలపం పట్టి అక్షరాలతో ఆడుకునే వేళ.. తెల్లారితే సరస్వతీమాత ఒడిలో అఆలు దిద్దాలి.. అమ్మానాన్న ఎవరి పనుల్లో వాళ్లు.. నానమ్మ పొరుగింట్లో.. అదను చూసుకుని ఇంట్లోకి చొరబడిందో మానవ మృగం.. ఆ పసిమొగ్గ వణికిపోయింది. ఎముకలు విరిగిపోయేంత బాధ.. అరిచేందుకూ వీల్లేకపోయింది. ఆ మృగాడి కామవాంఛ తీరింది. కడుపులో నొప్పి.. జననాంగంలో రక్తం.. అప్పుడే విధుల నుంచి ఇంటికి చేరుకున్న తల్లి.. గారాల బిడ్డకు ఏమైందోనని పరుగున ఆసుపత్రికి చేరుకుంది. జరిగిన ఘోరం తెలిసి కుప్పకూలింది. సమాజం సిగ్గుతో తలదించుకుంది. సాక్షి, అనంతపురం సెంట్రల్: ఓ మానవమృగం పంజా విసిరింది. అభం శుభం ఎరుగని ఐదేళ్ల బాలికను చిదిమేసేంది. బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట నగరంలోని ఎర్రనేల కొట్టాలలో నివాసం ఉంటోంది. వీరికి నలుగురు ఆడపిల్లలు సంతానం. పెద్దపాప వయస్సు(8), రెండో పాప (5), మూడో పాప (3) మరో చిన్నారికి (10 నెలలు). కుటుంబ పోషణకోసం భర్త ఆటో తోలుతుండగా.. భార్య ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి ఇంటి పక్కనే కరియన్న అలియాస్ కిరణ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. దంపతులిద్దరూ ఎవరిపనులకు వారు వెళ్లగానే పిల్లలు వారి నానమ్మ వద్ద ఉండేవారు. బుధవారం వృద్ధురాలు వ్యక్తిగత పనిపై కాసేపు బయటకు వెళ్లగా పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇది గమనించిన కిరణ్.. ఇంట్లోకి చొరబడి ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. చిన్నారి అరవకుండా నోరు నొక్కేశాడు. అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు. బాధతో చిన్నారి చాలా సేపు ఏడుస్తున్నా.. వృద్ధురాలు విషయం తెలుసుకోలేకపోయింది. రాత్రి ఇంటికి వచ్చిన చిన్నారి తల్లి.. ఏడుస్తున్న పాపను ఆరా తీసింది. కడుపులో నొప్పి అని చెప్పడం, జననాంగం వద్ద రక్తం వస్తున్నట్లు గమనించి వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు పరిశీలన అనంతరం జరిగిన విషయం తెలుసుకుని భర్తతో కలిసి వెళ్లి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితునిపై పోక్సో యాక్టు ఫిర్యాదు అందగానే పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకున్న సీఐ బాలమద్దిలేటి, ఎస్ఐ జైపాల్‌రెడ్డి నిందితునికి కోసం గాలింపు ముమ్మరం చేశారు. నిందితున్ని అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ బాలమద్దిలేటి విలేకరులకు వివరించారు. నిందితునిపై పోక్సోయాక్టు కింద కేసు నమో దు చేసినట్లు వివరించారు. నిందితునిది అండేపల్లి బాలికపై లైంగిక దాడి చేసిన కిరణ్ది కంబదూరు మండలం అండేపల్లి గ్రామం. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. తొలుత ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇటీవలే డ్రైవర్ ఉద్యోగం మానేశాడు. ఇటీవల ఓ కుల సంఘం నాయకునిగా చలామణి అవుతూ కాలనీలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. చిన్నారికి ప్రత్యేక చికిత్స లైంగిక దాడికి గురైన చిన్నారికి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య చికిత్సలను అందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక వార్డులో అడ్మిట్ చేయించారు. పాప విషయాలను గోప్యంగా ఉంచారు. ఐసీడీఎస్ పీడీ చిన్మయాదేవి ఆసుపత్రికి వెళ్లి చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. నలుగురు ఆడసంతానం కావడంతో కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఇద్దరు పిల్లలకు బాలసదనంలో ఆశ్రయం కల్పించి విద్యాభ్యాసానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
అయినవాడికే అతిపెద్ద పోస్ట్
గుంటూరు మెడికల్: ఆయన చాలామందికన్నా జూనియర్. టీడీపీ ప్రభుత్వ వీర విధేయుడు కావడంతో రాష్ట్ర రాజధాని ఆస్పత్రి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా అవకాశం దక్కించుకున్నారు. ఆయనే డాక్టర్ దేవనబోయిన శౌరిరాజు నాయుడు. 2017లోనే పదవీ విరమణ చేయాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఆగమేఘాలపై ఒక ప్రత్యేక జీఓనే తీసుకొచ్చింది. సీనియర్లను కాదని అతనికే సూపరింటెండెంట్ పదవి దక్కేలా చేసింది. సుమారు నాలుగేళ్లుగా జూనియర్ పరిపాలనలో రాష్ట్ర రాజధాని ఆస్పత్రి నడిచింది. అతని వివక్ష, అవినీతి, అసమర్థత, అవినీతి ధోరణితో ఆస్పత్రిలోని వారంతా అతడికి వ్యతిరేకంగా మారారు. అయినా నేటికీ ఆయనే కొనసాగుతూ ఉన్నారు. అతని కోసమే ప్రత్యేక జీవో.. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా శౌరిరాజు నాయుడు విధుల్లో చేరటం కూడా పెద్ద చర్చనీయాంశమే అయింది. సాధారణంగా వైద్యుల్లో సీనియర్స్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్స్‌గా ప్రభుత్వం నియమిస్తుంది. కానీ డాక్టర్ రాజునాయుడు టీడీపీ నేతలతో తనకున్న సంబంధాలతో 26–09–2015న సూపరింటెండెంట్ పదవి దక్కించుకున్నారు. ఆయన పదవీకాలం 31–5–2017న ముగిసింది. వైద్యుల పదవీవిరమణ వయస్సు 60 నుంచి 63 ఏళ్లకు పెంచుతూ 2017 మే 31న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ జీఓను కేవలం రాజు నాయుడు కోసమే ప్రభుత్వం ఇచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైద్యులు విమర్శిస్తున్నారు. ఈ చర్యకు నిరసనగా తాము స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తామని, తమకు 60 ఏళ్ల వయస్సు వరకూ ఉద్యోగం చాలని పలువురు వైద్యులు ప్రభుత్వాన్ని కలిసి మొరపెట్టుకున్నా స్పందించలేదు. అన్నీ వివాదాస్పద నిర్ణయాలే... జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన సొంతంగా తీసుకున్న పలు నిర్ణయాలతో పలు వివాదాలు తలెత్తాయి. రెండేళ్లక్రితం జిల్లాలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల అనుమతి ప్రక్రియలో నిబంధనలకు నీళ్లు వదిలారనే అపవాదును ఎదుర్కొంటున్నారు. విజిలెన్స్ విచారణ కూడా దీనిపై నడుస్తోంది. ఏడాదిన్నర క్రితం జిల్లాలో కనీవిని ఎరుగని రీతిలో అత్యధిక సంఖ్యలో డయేరియా మరణాలు, డయేరియా కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో డయేరియా బాధితులకు ఉచితంగా వైద్యం చేయించాలని కలెక్టర్ ఆదేశించగా సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన మాత్రం ప్రభుత్వ మెప్పు పొందేందుకు జీజీహెచ్‌కు డయేరియా రోగులను తీసుకొచ్చారు. ప్రైవేటు ఆస్పత్రి నుంచి జీజీహెచ్‌కు తీసుకురావటం వల్లే తమ వారు చనిపోయారంటూ మృతుల బంధువులు ఆస్పత్రిలో తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. ఆస్పత్రిలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ విధానంలో టీడీపీ ప్రభుత్వం పలు వైద్యసేవలను ప్రారంభించింది. వారికి వైద్యసేవలకు అనుమతి కోసం అధిక మొత్తంలో మామూళ్లు తీసుకున్నారనే ఆరోపణలపై పలు పత్రికల్లో సైతం కథనాలు ప్రచురితం అయ్యాయి. ఆస్పత్రిలో ఇరువురు ఆర్‌ఎంఓలు, నలుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లు ఉన్నా అందరిని పక్కనపెట్టేసి 8 నెలల క్రితం ఉద్యోగాల్లో చేరిన జూనియర్ వైద్యులకు అన్ని బాధ్యతలు ఇవ్వటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ నిధులు, ఆస్పత్రికి సంబంధించిన ఇతర నిధులపై నాలుగేళ్లుగా ఆడిట్లు జరగలేదని ప్రభుత్వ ఆర్థిక సలహాదారే నాటి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కార్యాలయ ఉద్యోగుల సీట్లు మార్పులు చేర్పుల సమయాల్లో వివక్ష చూపించారని ఉద్యోగులు వాపోతున్నారు. నిధులు ఉన్నా ఆరోగ్యశ్రీ పారితోషికాలు వైద్యులకు, వైద్య సిబ్బందికి ఇవ్వకపోవటంతో ఆరోగ్యశ్రీ జిల్లా అధికారులకు సైతం వైద్య సిబ్బంది ఫిర్యాదులు చేశారు. క్యాన్సర్ వార్డు నిర్మాణం కోసం అడ్డగోలుగా నర్సింగ్ స్కూల్‌ను పడగొట్టడం, ఎంసీహెచ్ వార్డు నిర్మాణం కోసం వందేళ్లకు పైగా ఉన్న మహా వృక్షాలను నరికి వేయటంలాంటి ఆరోపణలు వినిపించాయి. జీవోపై సీనియర్ల మండిపాటు... టీడీపీ ప్రభుత్వం 2014 జూన్‌లో అధికారం చేపట్టిన నాటి నుంచి రెగ్యులర్ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయకుండా అత్యంత జూనియర్ వైద్యులను టీచింగ్ ఆస్పత్రుల సూపరింటెండెంట్లుగా కొనసాగిస్తూ ఉండటంపై వైద్యుల సంఘం నాయకులు, సీనియర్ వైద్యులు మండిపడుతున్నారు. పలువురు సీనియర్ వైద్యులు కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టు జోక్యంతో సీనియారిటీ ప్రకారం పదోన్నతులు ఇస్తామని టీడీపీ ప్రభుత్వం డీపీసీ షెడ్యూల్ ప్రకటించింది. 2018 మే 10వ తేదీలోగా డీపీసీ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని టీడీపీ ప్రభుత్వం వెల్లడించింది. కానీ జీజీహెచ్ సూపరింటెండెంట్ కోసం పదోన్నతులు ఇవ్వలేదు. 80 మంది వైద్యులతో టీడీపీ ప్రభుత్వం సీనియారిటీ జాబితాను ప్రకటించగా అందులో 78వ స్థానంలో ఉన్న డాక్టర్ రాజునాయుడు నాలుగేళ్లుగా సూపరింటెండెంట్‌గా కొనసాగుతూ ఉన్నారు. -
తప్పంతా సిబ్బందిదేనట!
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగుల వ్యవహారంపై చేపట్టిన దర్యాప్తు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తం గా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఉన్నతాధికారుల విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది. అసలు సూత్రదారులను వదిలే సి, తప్పంతా కింది స్థాయి సిబ్బందిదేనని అధికారులు తేల్చడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో ఆయా, సూపర్వైజర్లపై వేటు వేసిన ఉన్నతాధికారులు.. ఇద్దరు స్టాఫ్‌నర్సులకు మెమోలు జారీ చేసి చేతులు దులుపుకోవడం గమనార్హం. సాక్షాత్తూ డీఎంఈ రమేశ్‌రెడ్డి విచారణ జరిపినా అసలు నిందితులు బయటకు రాకపోవడమేమిటో అంతు చిక్కడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం.. జిల్లా ఆస్పత్రిలో రెండు నెలల పాటు ఎలాంటి అనుమతి లేకుండా 17 మంది ఉద్యోగులుగా కొనసాగుతూ వైద్యం చేసిన ఘటన బయటకు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా జిల్లా ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగులు తిష్ట వేసి, ఏకంగా అత్యవసర విభాగంలోనూ వైద్యచికిత్సలు అందించడం అప్పట్లో కలకలం రేపింది. ఆస్పత్రిలోని 328వ గదిలో అక్రమార్కులు తమ దందా కొనసాగించడం, బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడం, ఈ గదిలోనే నకిలీ ఉద్యోగులకు విధులు కేటాయించడం చేశారు. దాదాపు రెండు నెలలు ఉద్యోగుల పేరిట ప్రైవేట్ వ్యక్తులు ఆస్పత్రిలో ఇంజక్షన్లు, ఇతరత్రా చికిత్సలు అందించడం చేశారు. అయితే, అత్యవసర విభాగంలో ఓ రోగికి యువకుడు సూది మందు ఇచ్చే విధానంలో తేడా కనిపించడాన్ని గమనించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు ఆ యువకుడ్ని వారించాడు. అసలు నువ్వు ఎవరని ఇంజక్షన్ ఇస్తున్న యువకుడ్ని సూపరింటెండెంట్ గట్టిగా నిలదీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాను కొత్తగా రిక్రూట్ అయినట్లు సదరు వ్యక్తి చెప్పడంతో అవాక్కయిన రాములు అసలు విషయం ఆరా తీయగా నకిలీ ఉద్యోగుల యవ్వారం బయట పడింది. మొత్తం 17 మంది నకిలీ ఉద్యోగులు ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్నట్లు తేలింది. ఈ విషయం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది డీఎంఈ విచారించినా.. ఈ వ్యవహారంపై కలెక్టర్‌తో పాటు ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి ఆస్పత్రికి స్వయంగా విచారణ జరిపారు. మాక్లూర్ మండలానికి చెందిన ఓ యువకుడు.. జిల్లా ఆస్పత్రిలో కొలువుల పేరిట కొంత మంది యువతీయువకుల నుంచి డబ్బులు వసూలు చేసి, వారిని ఆస్పత్రిలో ఉంచి పని చేయించినట్లు తేలింది. బాధితులతో పాటు నిందితుడ్ని విచారించిన డీఎంఈ.. ఆస్పత్రి అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రైవేట్ వ్యక్తులు ఆస్పత్రిలో నేరుగా వైద్యసేవలు అందించడం, శిక్షణ పేరిట కొనసాగడంపై ఎందుకు పసిగట్టలేకపోయారని గట్టిగా క్లాస్ తీసుకున్నారు. దీంతో ఆస్పత్రిలోని కీలక అధికారులపై చర్యలు తప్పవని అంతా భావించారు. ఏం జరిగిందో ఏమో కానీ, తప్పంతా చిరుద్యోగులేనని ఉన్నతాధికారులు వారిపై కొరడా ఝళింపించారు. ఆయా, సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించారు. అలాగే, అత్యవసర విభాగం, ఓపీ విభాగం వద్ద విధులు నిర్వర్తించే స్టాఫ్‌నర్సులకు మెమోలు జారీ చేసి, అధికారులు చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందుకు సాగని కేసు నకిలీ ఉద్యోగుల వ్యవహారంలో బాధితులు ఒకటో టౌన్లో ఫిర్యాదు చేశారు. మాక్లూర్ మండలం గుత్పకు చెందిన సతీష్ ఉద్యోగాల పేరిట డబ్బుల తీసుకుని తమను జిల్లా ఆస్పత్రిలో చేర్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సతీష్‌ను ప్రశ్నించిన అధికారులు.. మోపాల్ మండలం కాల్పోల్కు చెందిన గోపాల్ పేరును వెల్లడించాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నెల రోజులు గడిచినా కేసు విచారణ కొలిక్కి తేలేక పోయారు. అసలు సూత్రదారులను వెలికి తీయడంలో జాప్యం జరుగుతుండడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము మోసపోయమని, తమకు న్యాయం చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరిని తొలగించాం.. నకిలీ ఉద్యోగుల వ్యవహారంలో ఒక ఆయాతో పాటు సంబంధిత ఫ్లోర్ సూపర్వైజర్ను తొలగించాం. ఇద్దరు స్టాఫ్‌నర్సులకు మెమోలు జారీ చేశాం. ఆస్పత్రి నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – డా.రాములు, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ప్రభుత్వ క్యాంటిన్ ‘వ్యాపార’మంత్రం..
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో క్యాంటీన్ సేవలు విచిత్రంగా ఉన్నాయి. ఆస్పత్రిలోని రోగులు, బంధువుల కోసం ఏర్పాటు చేసిన క్యాంటీన్ అసలు లక్ష్యం పక్కదారి పడుతోంది. ఆస్పత్రి వైపు చిన్నదారి ఏర్పాటు చేసిన నిర్వాహకుడు.. బయట వైపు రెండు షట్టర్లు పెట్టి వ్యాపారం చేస్తున్నాడు. ఇదంతా అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ఏళ్లుగా ఒకరికే టెండర్ దక్కు తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆస్పత్రిలో చేరుతున్న రోగులు, వారి బంధు వులు ఛాయ్, టిఫిన్ కోసం బయట హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. ఏళ్ల తరబడి ఒకరికే..! దాదాపు పదేళ్ల క్రితమే క్యాంటీన్ నిర్వహణకు టెండర్ వేశారు. అప్పటి నుంచి ఒక్కరే క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఆస్పత్రికొచ్చే రోగులు, బంధువులకే క్యాంటీన్ సేవలందించాలి. కానీ లోపలి వైపు చిన్నదారం మాత్రమే ఏర్పాటు చేసి బయటి వైపు షట్టర్లు వేసి బేకరీ నిర్వహిస్తూ వ్యాపారం చేపడుతున్నారు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంగా అవతరించిన అనంతరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది రోగులు వస్తున్నారు. కేసీఆర్ కిట్ పథకంతో మరింతగా పెరిగిపోయింది. రోగులకు ఆస్పత్రిలో సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో భోజనం అందిస్తున్నప్పటికీ టీలు, టిఫిన్లు మాత్రం కరువయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించిన క్యాంటీన్లో అన్ని రకాల టీలు, టిఫిన్లు ఉండాలని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. కానీ క్యాంటీన్లో మాత్రం టీలు, టిఫిన్లు దొరకడం లేదు. రాత్రి వేళల్లో బంధువులకు భోజనం దొరకడం లేదు. ఈ క్యాంటీన్లో బేకరి నిర్వహించడంతో విమర్శలకు తావిస్తోంది. కొన్నేళ్లుగా ఒకరికే కాంట్రాక్ట్ కొనసాగిస్తున్నారని అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం టెండర్ నిర్వహిస్తే నడిబొడ్డు కావడంతో అందులో జిల్లా ఆస్పత్రిగా పేరు పొందడంతో మరింత ఆదాయం పొందే అవకాశం ఉంది. కానీ వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చర్యలు తీసుకుంటాం ఆస్పత్రిలో ఒకసారే టెండర్ నిర్వహిస్తాం. ప్రస్తుతం అతనే నిర్వహిస్తున్నాడు. టీ, టిఫిన్లు ఏర్పాటు చేయాల్సిందే. సమస్యలుంటే మా దృష్టికి తీసుకొస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – సదామోహన్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో శిశువు మృతి
నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో బుధవారం నాలుగురోజుల శిశువు మృతిచెందాడు. పసికందు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. వివరాలు.. రా మన్నపేట మండలం ఎల్లంకి గ్రామానికి చెందిన గిరి భార్య శిరీష ఈ నెల 24న ప్రసవానికి ఆస్పత్రిలో చేరింది. అదే రోజు శిరీష మగబిడ్డను జన్మనిచ్చింది. ఆస్పత్రిలో తల్లిబిడ్డ చికిత్స పొందుతున్నారు. కాగా బుధవారం ఉదయం బాలుడు మృతిచెందినట్లు వైద్యులు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో కోపోద్రిక్తులైన బంధువులు శిశువు మృతదేహంతో ఎంసీహెచ్ ఎధుట ఆందోళన నిర్వహించారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ బాలుడిని బలితీసుకుందని తల్లిదండ్రులతో పాటు బంధువులు విలపిస్తూ తెలిపారు. పసికందు చనిపోయిన తర్వాతనే ఎన్ఐసీకి తీసుకువచ్చారని డాక్టర్ దామెర యాదయ్య సాక్షికి తెలిపారు. సీసీ పుటేజీలు కూడా ఉన్నాయి. వాటిని పరిశీలించుకోవచ్చన్నారు. బాధ్యులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు. -
వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణి మృతి!
పెద్దపల్లి : కాన్పు కోసం వచ్చిన లింగంపల్లి విజయ(30)అనే గర్భిణి మృతి చెందిన సంఘటన శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. దాంతో గర్బిణి బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందంటూ ఆరోపించారు. వైద్యులు లేకపోవడంతో సిబ్బంది నర్సులతో వైద్యం చేపించి నిర్లక్ష్యంగా వ్యవహరించి గర్భిణీ ప్రాణాలు తీశారని బంధువుల ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలికి ఇప్పటికే 6 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. రెండవ కాన్పు కోసమని వస్తే బిడ్డ పుట్టకముందే మహిళ మరణించిందన్నారు. రోడ్డుపై మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
మహిళా డాక్టర్‌పై టీడీపీ కార్పొరేటర్ వీరంగం
-
పసికందు మృతదేహాన్ని పీక్కుతిన్న ఎలుకలు
-
వైద్యుల నిర్లక్ష్యం.. ఓ తల్లికి గర్భశోకం
నంద్యాల : స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలైంది. కాన్పుకోసం వచ్చిన మహిళకు ప్రసవం చేయకుండా ఈరోజు, రేపు అంటూ నాన్చుడు ధోరణితో వ్యవహరించారు. దీంతో శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధితు లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో ప్రభుత్వాసుపత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆదివారం చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని వీసీ కాలనీకి చెందిన హారూన్, సలీమాలకు 11సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు సంతానం. మగసంతానం కోసం ఆపరేషన్ చేయించుకోకుండా ఉన్నారు. సలీమా ఈనెల 7వ తేదీన కాన్పు కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. అప్పటి నుంచి వైద్యపరీక్షలు చేస్తున్న వైద్యులు కాన్పు చేయడంలో నాన్చుడు ధోరణి వ్యవహరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం కాన్పు కోసం ఇంజక్షన్ వేసి అనంతరం కాన్పు చేయకుండా థైరాయిడ్ ఉందని, పరీక్షల కోసం పంపారు. పరీక్షల్లో థైరాయిడ్ లేదని వచ్చిందని, ఆపరేషన్ చేయమని కోరినా వైద్యులు రేపు చేస్తామని పేర్కొన్నారని, ఆదివారం కూడా ఉదయం, మధ్యాహ్నం అంటూ నిర్లక్ష్యం వహించారని బాధితులు తెలిపారు. అనంతరం కడుపులో శిశువు మరణించిందని ఒకసారి, గుండెపోటుతో శిశువు మృతి చెందిందని మరోసారి పొంతనలేని జవాబులు చెప్పారని హారూన్ పేర్కొన్నారు. డబ్బులు లేక తాము ప్రభుత్వాసుపత్రికి వచ్చామని, వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పలుకుబడి ఉన్న వారికి మాత్రమే వైద్యం చేస్తున్నారని, పేదవారి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. శిశువు మృతితో ఆందోళన... శిశువు మృతి చెందారని తెలుసుకున్న బాధితుల బంధువులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న నంద్యాల టూటౌన్ సీఐ శివభాస్కర్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకొని బాధితులకు సర్దిచెప్పారు. విచారించి బాధితులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
ఏపీలో రోగులకు గుబులు పుట్టిస్తున్న ప్రభుత్వ వైద్యం
-
బ్లడ్ బ్యాంకుకు మహర్దశ
జనగామ: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్తనిధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. అత్యవసర సమయంలో రక్తాన్ని అందించేందుకు ప్రభుత్వ దవాఖానల్లోని రక్తనిధి కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఖమ్మంతో పాటు జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని పైలట్ ప్రాజెక్టు కింద నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్)కు ఎంపిక చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాల నిర్వహణ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా కొనసాగుతోంది. ఇటీవల తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోకి వెళ్లి పోయింది. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాలను మరింత అభివృద్ధి చేసేందుకు ఎన్‌ఏబీహెచ్‌కు రూపకల్పన చేశారు. ప్రస్తుతం జనగామ ఏరియా ఆస్పత్రిలో 1000 యూనిట్లు సామర్థ్యం ఉన్న రక్తనిధి కేంద్రం పనిచేస్తోంది. ఎన్‌ఏబీహెచ్‌కు పూర్తి అర్హత సాధించేందుకు ఇక్కడి రక్తనిధి కేంద్రంలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్, ఇతర సిబ్బంది కృషి చేస్తున్నారు. అర్హత సాధించాలంటే.. ఆదర్శవంతమైన రక్తనిధి కేంద్రంగా ఏరియా ఆస్పత్రి గుర్తింపు పొందాలంటే కేంద్రం ప్రభుత్వం విధించిన గైడ్‌లైన్స్ తప్పనిసరి. 24 గంటలపాటు ఎయిర్ కండీషన్, యంత్రాల పనితీరు, మెడికల్ ఆఫీసర్, ఐదుగురు టెక్నీషియన్లు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ఒక కౌన్సిలర్, రెండు కంప్యూటర్లు, రెండు టెలివిజన్లు, ప్రింటర్లు, ఒక అంబులెన్స్ ఉండాలి. ఇందులో ఒకస్టాఫ్ నర్సు కొరత ఉండగా, కంప్యూటర్లు, టెలివిజన్లు, అంబులెన్స్ అసలు లేవు. ఎన్‌ఏబీహెచ్‌కు పోటీ పడాలంటే రక్తనిధి కేంద్రంలో స్టాండర్డు క్వాలిటీ ఉండాలి. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన ఏరియా ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రంలో వసతి సౌకర్యాలను జిల్లా, రాష్ట్ర స్థాయి టీంలు పరిశీలిస్తాయి. అనంతరం కేంద్ర బృందం పరిశీలించిన తర్వాతనే అర్హత సర్టిఫికెట్‌ను అందజేస్తారు. రాష్ట్ర బృందం పరిశీలన ఏరియా ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రాన్ని ఇటీవల స్టేట్ క్వాలిటీ ఆఫీసర్ నిరంజన్ పరిశీలించారు. రక్తనిధి నిల్వల సామర్థ్యం, రికార్డులు, పని తీరుపై మెడికల ఆఫీసర్ రాంనర్సయ్య, పీఆర్వో రాము, రజిని, రాజేశ్వర్, వెంటస్వామిని అడిగి తెలుసుకున్నారు. -
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం
విజయవాడ: విజయవాడలోని సురంపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జీఎస్ ఎల్లాయిస్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడుతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. -
‘గోలీ’మాల్!
ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం.. ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఓ ఎమ్మెల్యే ఇటీవల ఆ ఆస్పత్రికి వెళ్లారు.. సిబ్బంది అల్ట్రాసెట్ టాబ్లెట్ ఇచ్చారు.. కొన్ని టాబ్లెట్లు మింగిన తర్వాత ఎమ్మెల్యేకు అనుమానం వచ్చింది.. ఎప్పుడూ వేసుకునే టాబ్లెట్ మాదిరిగా లేకపోవడంతో డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.. టాబ్లెట్లను పరిశీలించిన అధికారులు అవి నాసిరకం మందులని తేల్చారు! మరుసటి రోజు మరో ఎమ్మెల్యేకు ఇదే తరహా అనుభవం ఎదురైంది! పాతబస్తీలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి.. జీర్ణ సంబంధ సమస్యతో వచ్చిన ఓ రోగికి పాంటాసిడ్ మాత్ర ఇచ్చారు. అప్పటికే ఆ మాత్ర వేసుకుంటున్న రోగికి అనుమానం వచ్చింది. మరో వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి ఆ టాబ్లెట్ చూపిస్తే అది నకిలీదని చెప్పారు. ఏం చేయాలో తెలియక ఆ రోగి కొత్త మందులు కొనుక్కున్నాడు!! సాక్షి, హైదరాబాద్: ఓవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను నకిలీ రహిత రాష్ట్రంగా మార్చాలని యత్నిస్తుంటే.. మరోవైపు ఏకంగా శాసనసభ్యులకు ఔషధాలు ఇచ్చే డిస్పెన్సరీలోనే నకిలీ మందులు బయటపడ్డాయి. డిస్పెన్సరీకి మందులు సరఫరా చేసే కాంట్రాక్టుపై ఏళ్లకేళ్లుగా గుత్తాధిపత్యం సంపాదించిన కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా నకిలీ ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసులే పరమావధిగా మందుల కంపెనీలు ప్రజలకు నకిలీ ఔషధాలను అంటగడుతున్నాయి. బహిరంగ మార్కెట్‌తోపాటు ప్రభు త్వం ఉచితంగా మందులు సరఫరా చేసే డిస్పెన్సరీల్లోనూ ఇదే తంతు. మందుల కొనుగోలులో ఆరోగ్యశాఖ నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎమ్మెల్యేలే నకిలీ బారిన పడితే సామాన్యుడి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాసిరకం మందులపై ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అన్ని చోట్లా ఇదే పరిస్థితి బోధన, జిల్లా, ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రులు.. పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లు కలిపి రాష్ట్రంలో 5,660 ఉన్నాయి. అన్ని ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య ఏటా సగటున 4.5 కోట్ల దాకా ఉంటోంది. 2016–17లో 4.6 కోట్ల మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చారు. ఈ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ప్రభుత్వం ఉచితంగా ఔషధాలను సరఫరా చేస్తోం ది. ఇందుకు రూ.200 కోట్లను కేటాయిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, వసతుల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) ఈ బాధ్యత నిర్వహిస్తోంది. కొనుగోలు, ఆస్పత్రులకు పంపించడం తప్పితే కంపెనీల తీరును పట్టించుకోవడం లేదు. నాణ్యత పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన ఔషధ నియంత్రణ మండలి(డీసీఏ) అధికారులు తనిఖీలను మరిచిపోయారు. దీంతో రోగులకు నాసిరకం మందులే దిక్కవుతున్నాయి. తయారీలో.. నాసిరకంలో.. ఔషధాల తయారీలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. నకిలీ, నాసిరకం మందుల సరఫరా సైతం రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతోంది. కేంద్ర ఆర్యోగ, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నేషనల్ డ్రగ్ సర్వే(ఎన్డీఎస్) పేరుతో దేశవ్యాప్తంగా 8,286 ఔషధాల శాంపిల్స్‌ను సేకరించింది. 62 కంపెనీల 946 రకాల మందులు నాసిరకంగా ఉన్నట్లు నిర్ధారించింది. వీటిలో ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. నేషనల్ డ్రగ్ సర్వే నివేదికను పరిశీలిస్తే నాసిరకం ఔషధాలు 11.41 శాతం ఉన్నాయి. తెలంగాణ నుంచి సరఫరా అయ్యే మందులలో ఇది 21 శాతం వరకు ఉందని నివేదిక పేర్కొంది. నాసిరకం, నకిలీల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను హెచ్చరించింది. అయి నా నకిలీ, నాసిరకం మందులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఔషధ నియంత్రణ విభాగం సంయుక్త సంచాలకుడు కైలాసం వివరణ కోసం ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. రూ.వెయ్యి కోట్ల దందా గుంటూరు జిల్లా కీలక నేత కుటుంబమే సూత్రధారి సాక్షి, అమరావతి బ్యూరో: ఏపీలోని నరసరావుపేట కేంద్రంగా నకిలీ మందుల దందా దక్షిణ భారతదేశమంతటా విస్తరించినట్లు తెలుస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏటా ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల దందా సాగుతోంది. ఈ దందాకు మూలాలు గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉన్నాయని వెల్లడైంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఓ కీలక నేత కుటుంబ సభ్యులే ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులని సమాచారం. దీంతో ఈ కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అసలు నకిలీ మందుల తయారీదారులు ఎవరన్నది వెలుగులోకి రాకుండా తొక్కి పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కేవలం కర్నూలు జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు ఏజెంట్ల వరకే నకిలీ మందుల కేసును పరిమితం చేసేలా వ్యూహం రచిస్తున్నారు. దందాకు కేంద్రమైన నరసరావుపేటలో లోతుగా విచారించకుండా మమ అనిపించారు. ప్రముఖ కంపెనీల ఉత్పత్తుల పేరిట భారీగా నకిలీ మందులు తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ దీన్ని గుర్తించి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
ఔరా..డాక్టరా..!
ప్రభుత్వాస్పత్రిలో ప్రైవేట్ ప్రాక్టీస్ ఫీజు వంద.. ఆటో ఫ్రీ చిత్తూరులో ఇదీ పరిస్థితి ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు బయట క్లినిక్‌లు నడపడం చూస్తుంటాం. ఆస్పత్రిలో పనివేళలు పూర్తయ్యాక బయట ప్రాక్టీస్ సెంటర్లు నిర్వహించడం అందరికీ తెల్సిందే. కానీ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రయివేటు వైద్యం చేయడం ఎక్కడైనా చూశారా? అయితే మీరు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని సందర్శించాల్సిందే.. ఆ కథేంటో 2వ పేజీలో చదవండి.. సీన్ -1 చిత్తూరు నగరంలోని సుందరయ్యవీధి.గురువారం మధ్యాహ్నం 12.15 గంటలయింది. అక్కడే ఉన్న ఓ మెడికల్‌షాపు నిర్వాహకుడు ఆటోను పిలిపించి పది మంది పేషెంట్లను అందులో ఎక్కించాడు. సీన్ -2 మధ్యాహ్నం 12.33. ఆటో నేరుగా ప్రభుత్వాస్పత్రిలోని ఎంఎం వార్డు ముందు ఆగింది. ఆటోలో ఉన్న వాళ్లంతా నేరుగా ఆస్పత్రిలోని రక్తనిధి వార్డుకు వెళ్లారు. టోకెన్ నెంబర్ల ఆధారంగా ఒక్కొక్కరినీ పిలిచి అక్కడున్న వైద్యుడు పరీక్ష చేస్తున్నాడు. ఓ చీటీలో వీళ్లకు మందులు రాసిచ్చాడు. రోగుల్ని పరిశీలించినందుకు ఒక్కొక్కరి నుంచి రూ.వంద చొప్పున ఫీజు తీసుకున్నాడు. సీన్ -3 ఆటో నేరుగా మళ్లీ సుందరయ్యవీధి వద్దకు వెళ్లి ఆగింది. అందరూ కిందకు దిగారు. వైద్యుడురాసిచ్చిన చీటీలో మందులు కొనడానికి అదే ఆటోలో ఉన్న వాళ్లంతా అక్కడికి చేరుకున్నారు. మెడికల్ షాపు నిర్వాహకుడికి రూ.2 వేల వరకు వ్యాపారం జరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు చేస్తున్న సేవలు, వారిని పర్యవేక్షించాల్సిన అధికారుల పనితీరుకు ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలే నిలువెత్తు నిదర్శనం. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో రక్తనిధి ఇన్చార్జ్, చర్మవ్యాధి నిపుణులు రోజూ చేస్తున్న నిర్వాకం ఇది. తన ప్రైవేటు క్లినిక్‌కు వచ్చే రోగుల్ని అక్కడే ఉన్న మెడికల్‌షాపు నిర్వాహకుల సాయంతో ప్రతిరోజూ ఇలా ప్రభుత్వాస్పత్రికి పిలిపించుకుని ప్రైవేటు వైద్యం చేస్తున్నారు. ఆస్పత్రిలో వైద్యుల పనితీరు పర్యవేక్షించడానికి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ఇక్కడ ప్రాంతీయ వైద్యాధికారిణి (ఆర్ఎంవో), ఆస్పత్రి పర్యవేక్షలు (సూపరింటెండ్)లు ఉన్నా ఈ తంతు జరుగుతూనే ఉంది. జిల్లా ప్రభుత్వాస్పత్రులు సేవల సమన్వయాధికారిణి (డీసీహెచ్ఎస్) కూడా చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో ఉన్నా ఫలితం లేకపోతోంది. - చిత్తూరు అర్బన్ విచారించి చర్యలు తీసుకుంటాం ఆస్పత్రిలో జరుగుతున్న ఈ నిర్వాకం వల్ల వైద్యులందరికీ చెడ్డపేరు వస్తుంది. దీనిపై లోతుగా విచారణ జరిపిస్తాం. ఆస్పత్రిలో ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తున్నారని తేలితే చర్యలు కఠినంగా ఉంటాయి. - డాక్టర్ జయరాజ్, పర్యవేక్షకులు, చిత్తూరు ప్రభుత్వాస్పత్రి -
ఐసీయూకీ గతిలేదు
రాజధాని పెద్దాస్పత్రిలో రోగుల పాట్లు మేజర్ ఆపరేషన్ చేసినా.. వార్డులోనే రోగులు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం వైద్యుల్లోనూ ఆందోళన మరమ్మతుల్లో పోస్టు ఆపరేటివ్ వార్డు లబ్బీపేట : ఉయ్యూరుకు చెందిన సరస్వతికి కడుపు నొప్పి రావడంతో చికిత్స కోసం పెద్దాస్పత్రికి వచ్చింది. ఆమెకు పరీక్షలు జరిపిన వైద్యులు పేగుల్లో పుండు ఉన్నట్లు గుర్తించి నాలుగున్నర గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్స చేశారు. ఇలాంటి కేసుల్లో రోగులను శస్త్రచికిత్స అనంతరం మూడు నాలుగు రోజులు ఐసీయూలో ఉంచాలి. కానీ ఇక్కడ ఆ సదుపాయం లేకపోవడంతో సాధారణ వార్డులోనే ఉంచారు. సింగ్‌నగర్‌కు చెందిన అప్పాయమ్మ అనారోగ్యంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. హెర్నియాతో అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు క్లిష్టతరమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సర్జరీ అనంతరం ఆమెను ఉంచేందుకుపోస్టు ఆపరేటివ్ వార్డు అందుబాటులో లేక, జనరల్ వార్డులోనే ఉంచారు. ఇలా క్లిష్టతరమైన శస్త్రచికిత్సలు చేయించుకున్న మరెందరినో ఐసీయూ, పోస్టు ఆపరేటివ్ వార్డులు అందుబాటులో లేకపోవడంతో సాధారణ వార్డుల్లోనే ఉంచాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఇన్ఫెక్షన్లు సోకితే ఎవరు బాధ్యులు? శస్త్రచికిత్స తర్వాత రోగికి ఇన్ఫెక్షన్ సోకకుండా బయటి నుంచి గాలి కూడా సోకని, ఐసీయూ, పోస్టు ఆపరేటివ్ వార్డుల్లో ఉంచాలి. కానీ ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సాధారణ వార్డులో, అందులోను నిబంధనలకు విరుద్ధంగా కిక్కిరిసి వేసిన పడకల మధ్యనే శస్త్ర చికిత్స చేసినవారిని ఉంచుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని కూడా అక్కడే ఉంచాల్సి వస్తుండటంతో ఎప్పుడేమి జరుగుతుందోనని వైద్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఒకవేళ వారికి ఇన్ ఫెక్షన్లు సోకి జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కష్టపడి శస్త్రచికిత్సలు చేస్తున్నా, రోగులను ఉంచేందుకు సరైన వార్డులు లేవని ఓ సీనియర్ వైద్యుడు తెలిపారు. అలంకారప్రాయంగా ఎస్ఐసీయూ... ఆపరేషన్ తర్వాత క్రిటికల్ కేసులను ఉంచేందుకు ఆస్పత్రిలో ఎస్ఐసీయూ ఉన్నా అది నిరుపయోగంగా మారింది. ఇక్కడ కూడా ఏసీలు పనిచేయక పోవడంతో తలుపులన్నీ తీయాల్సిన దుస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితిలో అక్కడ రోగిని ఉంచినా ఎటువంటి ప్రయోజనం ఉండదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం న్యూరో సర్జరీ కేసులను మాత్రమే అక్కడ ఉంచుతున్నారు. అంతేగాక ఆరోగ్యశ్రీ వార్డుగా కూడా దానినే చూపిస్తున్నారు. -
గోలీమాల్
చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో 10 వేల మాత్రలు మాయం! స్టాకు రిజిస్టర్లో దిద్దుబాట్లు సిబ్బంది చేతివాటమా..? పొరపాట్లా? ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన పెద్దాస్పత్రికి అవినీతి జబ్బు సోకింది. కంచే చేను మేసిన చందంగా ఆస్పత్రిలో పనిచేసే కొందరు ఉద్యోగులే అక్రమాలకు పాల్పడుతున్నారు. రోగులకు అందాల్సిన మందులు, మాత్రలను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. వైద్యాధికారుల బాధ్యతా రాహిత్యం.. అధికారుల పర్యవేక్షణ లేమి వారికి కలిసొస్తోంది. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో మాత్రల గోల్‌మాల్‌పై స్పెషల్ ఫోకస్.. ఇదంతా నాణేనికి ఒకవైపు... జిల్లాలోనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రి పెద్దది. ఇక్కడ 320 పడకలున్నాయి. రోజుకు వెయ్యి మందికిపైగా ఔట్ పేషెంట్లు వస్తుంటారు. కోట్ల రూపాయల విలువచేసే పరికరాలతో వైద్యం.. నిత్యం రూ.లక్షల విలువచేసే మందుల పంపిణీ.. అబ్బో ఇదంతా చూస్తుంటే కార్పొరేట్ తరహా సేవలే గుర్తుకొస్తుంటాయి. మరి రెండో వైపు.. ఆస్పత్రిలో జవాబుదారీతనం లేదు. కొందరు వైద్యులు ప్రైవేటు సేవలకే పెద్దపీట వేస్తున్నారు. ఉన్నతాధికారులు సొంత క్లినిక్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకున్న కొందరు ఫార్మాసిస్ట్లు ప్రభుత్వం ఇచ్చే మాత్రలు, మందులను మాయం చేస్తున్నారు. దీని వెనుక ఇక్కడ పనిచేసే కొందరి సిబ్బంది హస్తం ఉందని బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తుండగా.. తిరుపతి నుంచి మాత్రలు ఇచ్చేటప్పుడే స్టాకు తక్కువగా వస్తోందని సిబ్బంది చెబుతున్నారు. చిత్తూరు (అర్బన్): జిల్లాలోని పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉప కేంద్రాలతో పాటు ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులకు తిరుపతిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి మందులు, మాత్రలు సరఫరా అవుతుంటాయి. ప్రతి ఆస్పత్రికి కావాల్సిన మందులు అక్కడి అధికారులు ఇచ్చే ఇండెంట్ ప్రకారం పంపిణీ చేస్తుంటారు. ఈ లెక్కన చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి కూడా మాత్రలు అందుతాయి. ఈ మందుల్లో అమాక్సలిన్, కాల్షియం, బీ-కాంప్లెక్స్ తదితర ఖరీదైన మాత్రలు ఉంటాయి. రోగిలో రోగ నిరోధక శక్తిని అంచనా వేసి వైద్యులు యాంటిబయాటిక్ మాత్రలు రాస్తుంటారు. వీటిని తీసుకెళ్లి ఆస్పత్రిలో ఉన్న మందుల డిస్పెన్సరీ(మందుల పంపిణీ కేంద్రం)లో చూపిస్తే మాత్రలు ఇవ్వడం ఆనవాయితీ. అయితే వైద్యులు రాసిచ్చే చీటీల్లో కొన్ని ఖరీదైన మాత్రలు కూడా ఉంటాయి. ఒక్కో రోగికి ఈ మాత్రలను 10 కూడా ఇవ్వాలని చీటీల్లో రాస్తుంటారు. అయితే వీటిని డిస్పెన్సరీకి తీసుకెళితే ఇక్కడున్న కొందరు సిబ్బంది 10 మాత్రలకు బదులుగా 4, 6 మాత్రమే ఇస్తున్నారు. రోగులు దీనిని పట్టించుకోవకపోవడంతో ఆస్పత్రిలో భారీ ఎత్తున మాత్రలు పోగేశారు. ఇలా దాదాపు 10 వేలకు పైగా మాత్రలు ఆస్పత్రిలో కనిపించకుండా పోయాయి. ఇటీవల ఈ-ఔషధిని ప్రవేశపెట్టడం, ప్రతి రోగికీ ఇచ్చే మాత్రలు, మందులు ఆన్లైన్లో పొందుపరచాలనే నిబంధన రావడంతో అసలు విషయం బయటపడింది. దీనికి తోడు మాత్రల స్టాకు పుస్తుకాల్లో సైతం దిద్దుబాట్లు, కొట్టి వేతలు ఉండడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఒక్కోరోజు అమాక్సలిన్ మాత్రలు 400 పంపిణీ చేస్తే, మరుసటి రోజు ఏకంగా 2500 మాత్రలు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫార్మసీ విభాగంలో ఇప్పటికే రెండు గ్రూపులుగా ఉన్న సిబ్బందిలో.. ఓ వర్గం నిత్యం అధికార పార్టీ నాయకుల పేరు చెప్పి మాత్రలను బయటకు తరలిస్తున్నట్లు ఇక్కడున్న సిబ్బంది చెబుతున్నారు. తిరుపతి నుంచి తమకు మందులు వచ్చేటప్పుడే స్టాకు తక్కువగా ఇస్తున్నారని, దాని ఫలితంగా రోగులకు మాత్రలను తక్కువ ఇవ్వాల్సి వస్తోందని మరికొందరు సిబ్బంది చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వాస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ జయరాజ్ మాట్లాడుతూ.. ఈ విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. మాత్రల స్టాకు వివరాలు, పంపిణీపై విచారణ జరిపిస్తామన్నారు. మాత్రలు పక్కదారి పట్టినట్లు తేలితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు ఈ వ్యవహారంపై లోతుగా విచారణ చేస్తే వాస్తవ విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.