
గోలీమాల్
చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో 10 వేల మాత్రలు మాయం!
స్టాకు రిజిస్టర్‌లో దిద్దుబాట్లు
సిబ్బంది చేతివాటమా..? పొరపాట్లా?
ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన పెద్దాస్పత్రికి అవినీతి జబ్బు సోకింది. కంచే చేను మేసిన చందంగా ఆస్పత్రిలో పనిచేసే కొందరు ఉద్యోగులే అక్రమాలకు పాల్పడుతున్నారు. రోగులకు అందాల్సిన మందులు, మాత్రలను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. వైద్యాధికారుల బాధ్యతా రాహిత్యం.. అధికారుల పర్యవేక్షణ లేమి వారికి కలిసొస్తోంది. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో మాత్రల గోల్‌మాల్‌పై స్పెషల్ ఫోకస్..
ఇదంతా నాణేనికి ఒకవైపు...
జిల్లాలోనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రి పెద్దది. ఇక్కడ 320 పడకలున్నాయి. రోజుకు వెయ్యి మందికిపైగా ఔట్ పేషెంట్లు వస్తుంటారు. కోట్ల రూపాయల విలువచేసే పరికరాలతో వైద్యం.. నిత్యం రూ.లక్షల విలువచేసే మందుల పంపిణీ.. అబ్బో ఇదంతా చూస్తుంటే కార్పొరేట్ తరహా సేవలే గుర్తుకొస్తుంటాయి.
మరి రెండో వైపు..
ఆస్పత్రిలో జవాబుదారీతనం లేదు. కొందరు వైద్యులు ప్రైవేటు సేవలకే పెద్దపీట వేస్తున్నారు. ఉన్నతాధికారులు సొంత క్లినిక్‌లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకున్న కొందరు ఫార్మాసిస్ట్‌లు ప్రభుత్వం ఇచ్చే మాత్రలు, మందులను మాయం చేస్తున్నారు. దీని వెనుక ఇక్కడ పనిచేసే కొందరి సిబ్బంది హస్తం ఉందని బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తుండగా.. తిరుపతి నుంచి మాత్రలు ఇచ్చేటప్పుడే స్టాకు తక్కువగా వస్తోందని సిబ్బంది చెబుతున్నారు.
చిత్తూరు (అర్బన్): జిల్లాలోని పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉప కేంద్రాలతో పాటు ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులకు తిరుపతిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి మందులు, మాత్రలు సరఫరా అవుతుంటాయి. ప్రతి ఆస్పత్రికి కావాల్సిన మందులు అక్కడి అధికారులు ఇచ్చే ఇండెంట్ ప్రకారం పంపిణీ చేస్తుంటారు. ఈ లెక్కన చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి కూడా మాత్రలు అందుతాయి. ఈ మందుల్లో అమాక్సలిన్, కాల్షియం, బీ-కాంప్లెక్స్ తదితర ఖరీదైన మాత్రలు ఉంటాయి. రోగిలో రోగ నిరోధక శక్తిని అంచనా వేసి వైద్యులు యాంటిబయాటిక్ మాత్రలు రాస్తుంటారు. వీటిని తీసుకెళ్లి ఆస్పత్రిలో ఉన్న మందుల డిస్పెన్సరీ(మందుల పంపిణీ కేంద్రం)లో చూపిస్తే మాత్రలు ఇవ్వడం ఆనవాయితీ. అయితే వైద్యులు రాసిచ్చే చీటీల్లో కొన్ని ఖరీదైన మాత్రలు కూడా ఉంటాయి. ఒక్కో రోగికి ఈ మాత్రలను 10 కూడా ఇవ్వాలని చీటీల్లో రాస్తుంటారు. అయితే వీటిని డిస్పెన్సరీకి తీసుకెళితే ఇక్కడున్న కొందరు సిబ్బంది 10 మాత్రలకు బదులుగా 4, 6 మాత్రమే ఇస్తున్నారు. రోగులు దీనిని పట్టించుకోవకపోవడంతో ఆస్పత్రిలో భారీ ఎత్తున మాత్రలు పోగేశారు.
ఇలా దాదాపు 10 వేలకు పైగా మాత్రలు ఆస్పత్రిలో కనిపించకుండా పోయాయి. ఇటీవల ఈ-ఔషధిని ప్రవేశపెట్టడం, ప్రతి రోగికీ ఇచ్చే మాత్రలు, మందులు ఆన్‌లైన్‌లో పొందుపరచాలనే నిబంధన రావడంతో అసలు విషయం బయటపడింది. దీనికి తోడు మాత్రల స్టాకు పుస్తుకాల్లో సైతం దిద్దుబాట్లు, కొట్టి వేతలు ఉండడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఒక్కోరోజు అమాక్సలిన్ మాత్రలు 400 పంపిణీ చేస్తే, మరుసటి రోజు ఏకంగా 2500 మాత్రలు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫార్మసీ విభాగంలో ఇప్పటికే రెండు గ్రూపులుగా ఉన్న సిబ్బందిలో.. ఓ వర్గం నిత్యం అధికార పార్టీ నాయకుల పేరు చెప్పి మాత్రలను బయటకు తరలిస్తున్నట్లు ఇక్కడున్న సిబ్బంది చెబుతున్నారు. తిరుపతి నుంచి తమకు మందులు వచ్చేటప్పుడే స్టాకు తక్కువగా ఇస్తున్నారని, దాని ఫలితంగా రోగులకు మాత్రలను తక్కువ ఇవ్వాల్సి వస్తోందని మరికొందరు సిబ్బంది చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వాస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ జయరాజ్ మాట్లాడుతూ.. ఈ విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. మాత్రల స్టాకు వివరాలు, పంపిణీపై విచారణ జరిపిస్తామన్నారు. మాత్రలు పక్కదారి పట్టినట్లు తేలితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు ఈ వ్యవహారంపై లోతుగా విచారణ చేస్తే వాస్తవ విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.