ఎరువు ధర బస్తాకు ఏకంగా రూ.300 పెంపు
ఇప్పటివరకు రూ.1,350 ఉండగా.. ఇప్పుడు రూ.1,650 వసూలు
రాష్ట్రంలో పాత స్టాక్‌కు కూడా అదనపు రేటు తీసుకుంటున్న వ్యాపారులు
పట్టించుకోని మార్క్‌ఫెడ్ అధికారులు..పలుచోట్ల డీఏపీ కొరత
బ్లాక్ మార్కెట్‌కు తరలించి అడ్డగోలు ధరకు అమ్ముతున్న తీరు..
యాసంగి సీజన్ సాగు కోసం రైతుల ఇక్కట్లు..
సాక్షి, హైదరాబాద్: రైతులు పొలాల్లో వాడే డీఏపీ ఎరువు ధర భారీగా పెరిగింది. ఒక్కో బస్తాపై ఏకంగా రూ.300 పెరిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 50 కిలోల బస్తా డీఏపీ ధర రూ.1,350 ఉండగా.. రూ.1,650కు పెంచడం గమనార్హం. అయితే ఈ పెంపు పాత స్టాక్‌కు వర్తించదని మార్క్‌ఫెడ్ అధికా రులు చెప్తున్నా.. వ్యాపారులు మాత్రం పాత స్టాకు కు కూడా కొత్త ధర వసూలు చేస్తున్నారు.
ప్రస్తుతం దుక్కిలో వేసేందుకు డీఏపీ, యూరియా అవసరమని... ఇలాంటి తరుణంలో మార్కెట్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మరోవైపు నానో డీఏపీ, నానో యూరియాతీసుకోవాలంటూ వ్యాపారులు ఒత్తిడి చేస్తున్నారని చెప్తున్నారు.
నానో యూరియా బాటిల్ ధర రూ.252 ఉంటే.. దానికి కూడా రూ.300 వరకు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు ఇలా ధర పెంచి అమ్ముతున్నా మార్క్‌ఫెడ్‌గానీ, వ్యవసాయశాఖగానీ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.
రాష్ట్రంలో డీఏపీ కొరత...
యాసంగి సీజన్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. రైతులు ఓవైపు వానాకాలం సీజన్ పంటలను మార్కెట్లో అమ్ముకుంటూ.. మరోవైపు రెండో పంటకు సిద్ధమవుతున్నారు. యాసంగి సీజన్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 3.14 లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది.
ఇందులో ఆహార ధాన్యాలు 1.57 లక్షల ఎకరాల్లో, నూనె గింజలు 1.32 లక్షల ఎకరాల్లో వేశారు. చాలా మంది రైతులు పంటలు వేసేందుకు పొలాల్లో దుక్కులు దున్నుతున్నారు. ఈ సమయంలో డీఏపీ, ఇతర ఎరువులు వేస్తారు. దీనితో ఎరువులకు డిమాండ్ నెలకొంది.
మరోవైపు రాష్ట్రంలో డీఏపీ నిల్వలు కేవలం 4 వేల టన్నులే ఉన్నాయని మార్క్‌ఫెడ్ అధికారులు చెప్తున్నారు. యాసంగి సీజన్‌కు 20వేల టన్నుల నుంచి 30వేల టన్నుల వరకు డీఏపీ అవసరమని.. వచ్చే వారం దాదాపు 9 వేల టన్నుల స్టాక్ రాష్ట్రానికి రానుందని మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
బ్లాక్ చేసి అధిక ధరకు అమ్ముకుంటున్న వ్యాపారులు
అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దేశంలోకి డీఏపీ దిగుమతులు తగ్గాయని.. రాష్ట్రంతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ డీఏపీ కొరత ఉందని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి.
అయితే హరియాణా వంటి రాష్ట్రాల్లో రైతులు డీఏపీ కొరతపై ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారు. మన వద్ద కూడా సకాలంలో డీఏపీ అందుబాటులోకి రాకపోతే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. దీన్ని ఆసరాగా తీసుకుని దళారులు, కొందరు వ్యాపారులు డీఏపీని బ్లాక్ మార్కెట్‌కు తరలించి, అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
అమ్మేసుకుని చెప్పక.. కేంద్రం నుంచి స్టాక్ రాక..
రాష్ట్రంలో ఎరువులు పుష్కలంగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ రికార్డులు చెప్తుండగా... వాస్తవానికి క్షేత్రస్థాయిలో నిల్వలు లేవని సమాచారం. కంపెనీల నుంచి ఆయా ప్రాంతాలకు సరఫరా అయిన ఎరువులను ఎప్పుడో అమ్మేశారని... కానీ ఈ సమాచారాన్ని రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో కేంద్రం కొత్త కేటాయింపులు జరపడం లేదని తెలిసింది.
దీనితో ఎరువుల కొరత ఏర్పడింది. ఇదే అదనుగా ఎరువుల కొరతను కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉన్న కొద్దిపాటి నిల్వలను బ్లాక్ మార్కెట్‌కు తరలించేసి, ఎక్కువ ధరకు అమ్ముతున్నారని రైతులు పేర్కొంటున్నారు.
పాత స్టాక్‌కు పాత ధరే చెల్లించాలి..
డీఏపీ ధర బస్తాకు రూ.300 పెరిగి.. రూ.1,650 అయింది. అయితే పాత స్టాక్‌కు ఈ పెరిగిన ధర వర్తించదు. పాత ధరకే అమ్మాలి. కొత్త స్టాక్‌ను మాత్రమే పెరిగిన ధరకు అమ్మాలి. రైతులు దీనిని గమనించి వ్యాపారులకు సొమ్ము చెల్లించాలి. – శ్రీనివాసరెడ్డి, ఎండీ, మార్క్‌ఫెడ్
Comments
Please login to add a commentAdd a comment