కూటమి సర్కారు రాగానే పచ్చ ముఠాల ఇసుక దందా
గత ప్రభుత్వం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుక మాయం
నిర్మాణ రంగం కుదేలై 40 లక్షల మంది కార్మికుల అవస్థలు
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే స్టాక్ యార్డుల్లో భద్రపరిచిన లక్షల టన్నుల ఇసుక నిల్వలను కరిగించేసి నాలుగు నెలల పాటు నిర్మాణ రంగాన్ని స్తంభింప చేసిన కూటమి సర్కారు తన నిర్వాకాలను కప్పిపుచ్చుకునేందుకే దళారులు బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారనే నాటకానికి తెర తీసినట్లు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వర్షాకాలంలో అవసరాల కోసం వైఎస్సార్‌సీపీ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన విషయం తెలిసిందే.
కూటమి సర్కారు రావడమే ఆలస్యం పచ్చ ముఠాలు సగం నిల్వలను అమ్ముకుని సొమ్ము చేసుకోగా, మిగతా ఇసుకను సైతం ఒక్క రేణువు కూడా మిగల్చకుండా ఆరగించేశాయి. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా తవ్వేసి అందినకాడికి దండుకోవడంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. 40 లక్షల మంది ఆధారపడ్డ నిర్మాణ రంగం కుదేలవడంతో భవన నిర్మాణ కార్మికులు జోవనోపాధి కోల్పోయి అల్లాడుతున్నారు.
ఈ ఇసుక దోపిడీని ప్రతిపక్షం ఎక్కడికక్కడ ఎండగట్టడం, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో చేసిన తప్పులను కప్పి పుచ్చి మభ్యపెట్టే యత్నాల్లో భాగంగానే బ్లాక్ మార్కెట్ నాటకానికి కూటమి సర్కారు తెర తీసినట్లు సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఉచిత ఇసుక పేరుతో జనం జేబులను గుల్ల చేసి గుమ్మడి కాయ దొంగలా జేబులు తడుముకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment