అవసరమైన వారికి ఇసుక దొరకడం లేదు
ఏడు జిల్లాల్లో రీచ్‌లు, స్టాక్ పాయింట్లు లేవు
దీంతో అక్కడ మరింత ధర
ఆ జిల్లాలకు మార్చి వరకు 40 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం
ప్రభుత్వానికి నివేదించిన అధికారులు
సాక్షి, అమరావతి: ఇసుకను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని, నిజంగా అవసరమైన వారికి దొరకడం లేదని, ధర బాగా ఎక్కువగా ఉందని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. రీచ్‌ల నుంచి ఇసుక తీసుకున్నవారు తిరిగి అధిక ధరకు విక్రయిస్తుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందని తెలిపారు. రోజు, వారం కోటాల లెక్కన ఇసుక బుకింగ్ జరుగుతుండటంతో అత్యవసరంగా కావాల్సినవారికి బుకింగ్ అవకాశాలు లభించడం లేదని పేర్కొన్నారు. పరిమిత బుకింగ్‌తో ఇసుక అవసరమైన వారికి లభ్యత ఉండటం లేదని అధికారులు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఇసుక పరిస్థితిపై అధికారులు ప్రభుత్వానికి రెండురోజుల కిందట నివేదిక సమర్పించారు. ఇసుక తీసుకున్నవారు తిరిగి విక్రయించడం, బ్లాక్ మార్కెట్‌తో ధర చాలా ఎక్కువగా ఉంటోందని తెలిపారు. ఇసుక వినియోగదారులు సొంత వాహనాల్లో తీసుకెళ్లి తిరిగి అత్యధిక ధరకు విక్రయిస్తుండటంపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు పేర్కొన్నారు. రవాణా చార్జీలతో పాటు బ్లాక్ మార్కెటింగ్, తిరిగి ఇసుకను విక్రయిస్తుండటంతో వినియోగదారులు గతంలో కన్నా ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోందని తెలిపారు.
పేరుకు ఉచిత ఇసుక విధానమేగానీ వినియోగదారులు మాత్రం అత్యధిక ధర చెల్లించాల్సి వస్తోందని, ఇది వినియోగదారుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోందని వివరించారు. లోడింగ్, రవాణా చార్జీలనే వసూలు చేస్తున్నామని చెబుతున్నా గతంలో కన్నా ఇసుక ధర ఎక్కువగా ఉందని వినియోగదారులు చెబుతున్నారని తెలిపారు. రీచ్‌లు, స్టాక్ పాయింట్లు లేని ఏడు జిల్లాల్లో రవాణా చార్జీలతో ఇసుక ధర తడిసిమోపెడవుతోందని, ఇది ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి దారితీస్తోందని వివరించారు.
రీచ్‌లు, స్టాక్ పాయింట్లు లేని విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ప్రకాశం, నంద్యాల, తిరుపతి జిల్లాలవారు ఇసుక కోసం పొరుగు జిల్లాలపై అధారపడాల్సి రావడంతో రవాణా చార్జీలు భరించలేని స్థితిలో ఉన్నాయని తెలిపారు. ఈ జిల్లాల్లో వచ్చే మార్చి వరకు 40 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ ఏడు జిల్లాల్లో ఇసుక సరఫరా, స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
అధికారబలంతో ఇష్టారాజ్యం
అధికారుల నివేదికనుబట్టి చూస్తే కూటమి నేతలు అధికార బలంతో ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీకి పాల్పడి, బ్లాక్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. ఇసుక రీచ్‌ల నుంచి తీసుకువెళ్లి మళ్లీ ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. పేరుకు ఉచిత ఇసుక విధానం అని చెప్పి అధికార పార్టీ నేతల జేబులు నింపడమే లక్ష్యంగా రీచ్‌ల నిర్వహణ, విక్రయాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
కూటమి ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఉచిత ఇసుక పేరుతో వినియోగదారుల జేబులకు భారీగా కన్నం వేస్తూ తమ జేబులు నింపుకొంటున్నట్లు అధికారుల నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా ఇసుక బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారంటే.. ప్రభుత్వ పెద్దల అండతోనే జరుగుతున్నట్లు ఎవరికైనా అర్థం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment