చెన్నై టి.నగర్ సమాచార కేంద్రం నుంచి బ్లాక్‌మార్కెట్‌కు..
ఇక్కడకు ప్రతీవారం 8 వేల నుంచి 10 వేల చిన్న లడ్డూలు, 300 పెద్ద లడ్డూలు, 300 వడలు సరఫరా
ఇందులో కొన్నే సామాన్య భక్తులకు అమ్మకాలు
మిగిలినవి సింహభాగం భారీఎత్తున ధర పెంచి విక్రయాలు
రెండు చిన్నవి, ఒక పెద్ద లడ్డూ, వడ కలిపి రూ.1,500లు..
సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకుండా పక్కదారి
నిద్ర మత్తులో విజిలెన్స్ అధికారులు
‘సాక్షి’ నిఘాలో వెల్లడైన ఆసక్తికర విషయాలు
భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూలు పక్కదారి పడుతున్నాయి. ఇంటిదొంగల నిర్వాకంతో బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్నాయి. వారం వారం తిరుమల నుంచి వచ్చే ఈ లడ్డూ ప్రసాదాల్లో కొన్నింటినే సామాన్య భక్తులకు విక్రయించి సింహభాగం స్వాహా చేస్తున్నారు.
నిన్న మొన్నటి వరకూ శ్రీవారి లడ్డూల్లో కల్తీ జరిగిందంటూ తెగ గుండెలు బాదుకున్న ముఖ్యనేతలు, ఉన్నతాధికారులు ఇప్పుడీ చేతివాటం గురించి తెలీదనుకోవాలా? తెలిసీ తెలియనట్లు నటిస్తున్నారనుకోవాలా? నిఘా విభాగం కూడా ఏమీ పట్టనట్లు ఉంటోంది.
లోగుట్టు శ్రీవారికే ఎరుక. తమిళనాడు రాజధాని చెన్నై టి.నగర్ సమాచార కేంద్రంగా సాగుతున్న ఈ దందాపై ‘సాక్షి’ నిఘాలో పలు విషయాలు తెలిశాయి. ఇవిగో ఆ వివరాలు..
తిరుమల: శ్రీవారి ప్రసాదాలను సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకెళ్లాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంకల్పించింది. ఇందులో భాగంగా.. తిరుమల శ్రీవారి లడ్డూ పోటు నుంచి నేరుగా చెన్నై, బెంగళూరు సమాచార కేంద్రాలు.. విజయవాడ, విశాఖపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపాలు.. హైదరాబాద్‌లోని టీటీడీ ఆలయాలకు వీటిని తరలించి భక్తులకు అందుబాటులో ఉంచుతోంది.
ఎంతో సత్సంకల్పంతో శ్రీకారం చుట్టిన ఈ విధానానికి కొందరు ఇంటిదొంగలు శ్రీవారి ప్రసాదాన్ని పక్కదారి పట్టిస్తూ తూట్లుపొడుస్తున్నారు. చెన్నై నడివీధుల్లో బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. చిన్నలడ్డూలు 2, ఒక పెద్ద లడ్డూ, ఒక వడ కలిపి ప్రత్యేక ప్యాకింగ్ చేసి రూ.1,500కు అమ్మేసుకుంటున్నారు.
చెన్నైలో బ్లాక్‌మార్కెట్లోకి..
తిరుమలలో ఉన్న పోటు ఏఈఓ ఏ సెంటర్‌కు ఎన్ని లడ్డూలు పంపించాలన్న ఇండెంట్, డిమాండ్ ఆధారంగా వాటిని పంపిస్తారు. చెన్నై, బెంగళూరు సమాచార కేంద్రాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్నందున చెన్నై కేంద్రానికి ప్రతీవారం 8 వేల నుంచి 10 వేల చిన్న లడ్డూలు, 300 పెద్ద లడ్డూలు, 300 వడలు పంపిస్తున్నారు. కానీ, చెన్నై టి.నగర్‌లోని టీటీడీ సమాచార కేంద్రంలో లడ్డూ ప్రసాదాలు విక్రయాలు జరిగే దగ్గరే పెద్దఎత్తున లడ్డూలు పక్కదారి పడుతున్నాయి.
ఇక్కడ పదేళ్లుగా చెన్నైలో తిష్టవేసిన ఇద్దరు అసిస్టెంట్ షరాబులు ‘శ్రీనివాసుడి’ ప్రసాదాలను సామాన్య భక్తులకు అందకుండా సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తిరుమల నుంచి టీటీడీ వాహనంలో వచ్చిన స్టాక్‌ను ఇక్కడి సిబ్బంది శ్రవణం హాల్లో దించి అటునుంచి అటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో లడ్డూలను ట్రేల నుంచి బాక్స్‌లకు మార్చి ఓ ప్రైవేట్ వాహనంలో తరలించేస్తున్నారు.
వచ్చిన లడ్డూల్లో కొన్నింటిని మాత్రమే విక్రయించి.. ఆ తర్వాత చిన్న లడ్డూల స్టాక్ అయిపోయిందంటూ ‘నో స్టాక్’ బోర్డు పెట్టేస్తున్నారు. 300 పెద్ద లడ్డూలు, 300 వడలు ఏనాడూ సామాన్య భక్తులకు విక్రయించిన దాఖలాల్లేవు.
నిఘా వైఫల్యం..
తిరుమలలో ఒక లడ్డూ ప్రసాదం అధిక ధరకు విక్రయిస్తే తీవ్రంగా పరిగణించే విజిలెన్స్ అధికారులు.. ఇక్కడ వేలకు వేలు లడ్డూలు ప్రైవేట్ వాహనంలో పక్కదారి పడుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో కంచే చేను మేస్తోందా అనే సందేహాలూ తలెత్తుతున్నాయి.
చెన్నై టి.నగర్ సమాచార కేంద్రం నుంచి ప్రైవేట్ వాహనాల్లో స్టాక్ తరలిపోతుంటే సెక్యూరిటీ విభాగం ఏం చేస్తోందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. లోపలికి వచ్చే ప్రతి వాహనాన్ని భద్రతా సిబ్బంది రికార్డుల్లో ఎంట్రీ చేయాలి. కానీ, అలాంటిదేమీ జరుగుతున్న దాఖలాలు కనిపించట్లేదు.
వాళ్లకు ఎలాంటి సంబంధం లేదంట?
ఇదిలా ఉంటే.. చెన్నైలో జరుగుతున్న ఈ అవకతవకలపై తమకెలాంటి సంబంధంలేదని సంబంధిత అధికారులు అంటున్నారు. కేవలం స్టాక్ పంపించడం వరకే తమ బాధ్యత అని చేతులెత్తేస్తున్నారు. తిరుమల నుంచి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షణలో టీటీడీ వాహనంలోనే ప్రసాదాలను పంపిస్తామని స్పష్టంచేస్తున్నారు.
శ్రీవారి లడ్డూ విక్రయాలకు లెక్కా పత్రం లేదు..
ఇక చెన్నైలో లడ్డూ ప్రసాదాల విక్రయాలకు లెక్కాపత్రం లేదు. సీసీ కెమెరాల నిఘా అంతకన్నాలేదు. అక్రమార్కుల ఆగడాలు చెల్లుబాటయ్యేలా సమాచార కేంద్రంలో ఉన్న శ్రవణం హాల్‌ను కేంద్రంగా చేసుకుని ఇష్టారాజ్యంగా బయటకు తరలించేస్తున్నట్లు ‘సాక్షి’ నిఘాలో బట్టబయలైంది.
నిజానికి.. లడ్డూ ప్రసాదం విక్రయం సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగాలి. తిరుమలలో ఇస్తున్నట్లుగా ఆధార్ కార్డు ప్రామాణికంగా భక్తులకు రెండు లడ్డూలే ఇవ్వాలి. కానీ, ఇక్కడ అలాంటివేమీ జరుగుతున్నట్లు లేదు. సామాన్య భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందకుండా ఏఈవో, అసిస్టెంట్ షరాబులు పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పదేళ్లుగా ఇక్కడ తిష్టవేసిన సిబ్బందిపై లోతుగా విచారణ జరపాల్సి ఉంది. లడ్డూ ప్రసాదాలు విక్రయించే కౌంటర్ నుంచి కాకుండా.. శ్రవణం హాల్ నుంచి విక్రయాలు చేస్తుండడంపై కూడా దృష్టిపెట్టాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment