ప్రస్తుతం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం
మీడియా సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు
పలు ప్రశ్నలకు తెలియదంటూ సమాధానం దాటవేత
తిరుపతి సిటీ : టీటీడీ లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో గతంలో కల్తీ ఎక్కువగా ఉందని ఎన్‌డీడీబీ తేల్చిందని, అందుకోసం ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పులు తీసుకొచ్చామని టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. ఆదివారం రాత్రి తిరుపతి పద్మావతి గెస్ట్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం స్వచ్ఛమైన ఆవు నెయ్యినే ప్రసాదంలో వినియోగిస్తున్నామని చెప్పారు.
నందిని, ఆల్ఫా మిల్క్ వంటి పేరొందిన సంస్థల నుంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కిలో రూ.475తో కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న నెయ్యిని ఎన్‌డీడీబీ పరీక్షలు చేసి స్వచ్ఛమైనదిగా తేల్చిందన్నారు. క్రమం తప్పకుండా ఎన్‌ఏబీఎస్ అక్రిడిటేషన్ ల్యాబ్‌కు శ్యాంపిల్స్‌ను పంపించే ప్రక్రియను కొనసాగిస్తామన్నారు.
మొదటి సారిగా ఆవు నెయ్యి స్వచ్ఛతపై పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఇందుకోసం మైసూరు సీఎఫ్‌టీఆర్‌ఐలో ట్రైనింగ్ పొంది ల్యాబ్‌లో పని చేసిన 18 మందిని సెన్సరీ ప్యానెల్‌గా ఏర్పాటు చేశామన్నారు. వీరు నెయ్యి స్వచ్ఛతతోపాటు, రంగు, రుచి, వాసన కనుక్కునే విధానంలో నిపుణులని చెప్పారు. ఎన్‌డీడీబీ సంస్థ సహకారంతో డిసెంబర్‌లోపు రూ.75 లక్షల విలువగల నెయ్యి పరీక్షా పరికరాలు టీటీడీకి సమకూరుతాయని తెలిపారు.
లడ్డూ పోటులో సంప్రోక్షణ పూర్తి
ఆలయంలోని అన్న ప్రసాదాలు, లడ్డూ పోటులలో సంప్రోక్షణ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేశామని ఈవో చెప్పారు. భక్తులలో ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే, వారి సంతోషం కోసం శాంతి హోమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పెద్దజియ్యర్, ఆగమశాస్త్ర పండితుల సలహా మేరకు సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయంలోని బంగారు బావి వద్ద గల యాగ శాలల్లో మూడు హోమ గుండాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కాగా, కల్తీ నెయ్యిపై మైసూరు టెస్టింగ్ సంస్థ రిపోర్ట్‌లను ఎందుకు బహిర్గతం చేయలేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఈవో స్పందించ లేదు. తాను ఏమీ మాట్లాడలేనని చేతులెత్తేశారు. 2014–19లో, 2019–24 మధ్య కాలంలో ప్రమాణాలు పాటించని ఎన్ని సంస్థలను బ్లాక్‌లో పెట్టారు.. ఎన్ని ట్యాంకర్లను వెనక్కి పంపారన్న ప్రశ్నకూ సమాధానం దాటవేశారు.
చంద్రబాబు హయాంలో సైతం అతి తక్కువ ధరతో నెయ్యిని కొనుగోలు చేశారని.. ఆ సమయంలో నెయ్యి స్వచ్ఛంగానే ఉందా.. అన్న ప్రశ్నకు సైతం తన వద్ద సమాధానం లేదన్నట్టు వ్యవహరించారు. అన్ని విషయాలు సీఎం చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో చెప్పారంటూ తప్పించుకున్నారు. కాగా, సీఎం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను ఈవో చదవడం తప్పు మరేమీ చెప్పడం లేదన్న వ్యాఖ్యలు మీడియా ప్రతినిధుల నుంచి వినిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment