లడ్డూ ప్రసాదం స్వచ్ఛం, శుద్ధం, పవిత్రం | There is no animal fat in that ghee | Sakshi
Sakshi News home page

లడ్డూ ప్రసాదం స్వచ్ఛం, శుద్ధం, పవిత్రం

Published Mon, Sep 23 2024 5:45 AM | Last Updated on Mon, Sep 23 2024 5:45 AM

There is no animal fat in that ghee

ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలప లేదు

అలా చేస్తే విపరీతమైన దుర్వాసన వస్తుంది

ఎంత సుగంధ ద్రవ్యాలు పోసినా ఆ దుర్వాసన పోదు

గత ఐదేళ్లలో తిరుమల లడ్డూలపై అటువంటి ఫిర్యాదే లేదు

రోజూ వేలాది మంది ఆ లడ్డూలు భక్తితో స్వీకరించారు

వారిలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కూడా ఉన్నారు

ఆహార శాస్త్రవేత్తలు రుచి శ్రీవాస్తవ, నేహా దీపక్‌ షా స్పష్టీకరణ

సాక్షి, అమరావతి : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం స్వచ్ఛం..శుద్ధం అని ఆహార శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఏనాడూ తయారు చేయనేలేదని స్పష్టం చేశారు. భారత ఆహార భద్రత– ప్రమాణాల సాధికారిక సంస్థ(ఎఫ్‌ఎస్‌­ఎస్‌ఐ) అధ్యయనాన్ని ఉటంకిస్తూ శాస్త్రీయమైన ఆధారాలతో సహా నిగ్గు తేల్చారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆహార పరిశోధన రంగం శాస్త్ర­వేత్తలు రుచి శ్రీవాస్తవ, నేహా దీపక్‌ షాలు ఈ మేరకు సాధికారికంగా వెల్లడించారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న రాద్ధాంతం అంతా దుష్ప్రచార­మేనని తేల్చి చెప్పారు. 

జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే ఆహార పదార్థాలు విపరీతమైన దుర్వాసన వస్తుందని వారు స్పష్టం చేశారు. ఎటువంటి ప్రత్యామ్నాయ దినుసులు వాడినప్పటికీ ఆ దుర్వాసనను తొలగించలేమని చెప్పారు. అత్తరు, ఇతరత్రా సుగంధ ద్రవ్యాలు కుమ్మరించినా సరే ఆ దుర్వాసన పోదు. ఇక జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే లడ్డూలు గుండ్రంగా ఉండలా ఉండవు. లడ్డూ బూందీ విడిపోతుంది. ఆ నెయ్యి లడ్డూ బూందీని కలిపి ఉంచ లేదు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో తిరుమల లడ్డూ ప్రసాదంపై అటువంటి ఆరోపణ­లు­గానీ ఫిర్యాదులుగానీ రానే లేదు. ఎప్పటి మాదిరిగానే ఆ ఐదేళ్లలో కూడా రోజూ వేలాది మంది భక్తులు లక్షలాది లడ్డూలు భక్తితో తిన్నారు. ఆ అయిదేళ్లలో తిరుమల దర్శనం చేసుకున్న కోట్లాది మంది భక్తుల్లో ఒక్కరు కూడా లడ్డూ ప్రసాదంపై ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. దుర్వాసన వచ్చిన­ట్టు ఆరోపించనే లేదు. అంతెందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబా­బు, ఆయన కుమారుడు లోకేశ్‌ కూడా పలు­మార్లు తిరుమల వెళ్లారు. 

శ్రీవారి లడ్డూ ప్రసాదం తిన్నారు. ఉప రాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయు­డు­తోపాటు బీజేపీ అగ్రనేతలు అందరూ తిరుమల లడ్డూ ప్రసాదం స్వీకరించిన వారే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా తిరుమల వెళ్లారు. లడ్డూ ప్రసాదం తిన్నారు. కానీ వారిలో ఒక్కరు కూడా లడ్డూ ప్రసాదం నాణ్యత బాగోలేదని గానీ దుర్వాసన వస్తోందని గానీ ఆరోపించనే లేదన్నది అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం రాజకీయ ప్రయోజనాల కోసం కుట్ర పూరితంగానే తిరుమల లడ్డూ ప్ర­సాదంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నది సుస్పష్టం. 

ఎలా కల్తీ జరిగిందో ఎన్‌డీడీబీ చెప్పలేదు 
నెయ్యి కల్తీ జరిగిందని మాత్రమే ఎన్‌డీడీబీ నివేదిక వెల్లడించగలదు. కానీ, జంతువుల కొవ్వు కలపడం వల్ల ఆ కల్తీ జరిగిందని నిరూపించే అవకాశమే లేదని ఆహార శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సోయాబీన్, పొద్దు తిరుగుడు పువ్వు, రేపీడ్స్, గోధుమ జెర్మ్, మొక్క జొన్న జెర్మ్, పత్తి విత్తనాలు, కొబ్బరి, పామ్‌ ఆయిల్‌ ద్వారా కూడా కల్తీ చేసే అవకాశాలున్నాయి.

నెయ్యిలో కల్తీ చేయాలంటే వ్యాపారులు సాధారణంగా పాల్పడే అక్రమ విధానం ఏమిటంటే.. పామాయిల్, హైడ్రోజనేటెడ్‌ కూరగాయల కొవ్వును కలుపుతూ ఉంటారని ఆహార శాస్త్రవేత్తలు చెప్పారు. ఎందుకంటే అవి అయితేనే తక్కువ వ్యయంతో కల్తీ చేయవచ్చన్నారు. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎటువంటి కల్తీ చేశారన్నది ఎన్‌డీడీబీ నివేదికలో స్పష్టం చేయనే లేదు. కానీ చంద్రబాబు, ఆయన ముఠా సభ్యులు జంతువుల కొవ్వు కలిపారని రాద్ధాంతం చేయడం రాజకీయ కుట్రేనన్నది సుస్పష్టం.

జంతువుల కొవ్వు కలిసిందని నివేదికలో లేదు
టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్‌డీడీ­బీ ల్యాబ్‌ నివేదిక వెల్లడించ లేదు. ఆ నివేదిక కల్తీని సూచిస్తుందని తప్ప.. ఎటువంటి కల్తీనో చెప్ప లేదు. కల్తీ చేయాలనుకునే వ్యాపార సంస్థలు సాధారణంగా పామాయిల్‌ మరియు హైడ్రోజనేటెడ్‌ కూరగాయల కొవ్వు కలుపు­తారు.

అంతేగానీ జంతువుల కొవ్వును కలప­రు. ఎందుకంటే జంతువుల కొవ్వు కలిపితే వ్య­యం పెరుగుతుంది. వారికి లాభం ఉండదు. తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం పొందేందుకే ఎవరైనా కల్తీ చేస్తారు. కానీ తయారీ వ్యయం పెంచుకునేందుకు కల్తీ చేయరు.  – నేహా దీపక్‌ షా, ఆహార శాస్త్రవేత్త

ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదు
జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే లడ్డూలుగానీ ఇతర ఆహార పదార్థాల నుంచిగానీ విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఎటువంటి సువాసన ద్రవ్యం వేసినా సరే ఆ దుర్వాసన పోదు. దుర్వాసన వచ్చే లడ్డూలుగానీ ఆహార పదార్థాలు గానీ ఎవరూ తయారు చేయరు. తయారు చేసినా ఎవరూ స్వీకరించరు. తిరుమల లడ్డూ ప్రసాదంపై గత ఐదేళ్లలో అటువంటి ఫిర్యాదు రాలేదన్నది గుర్తుంచుకోవాలి. లడ్డూలో కల్తీ లేదని నేను కచ్చితంగా చెప్పగలను. – రుచి శ్రీవాస్తవ, ఆహార పరిశోధకురాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement