తిరుమల లడ్డూపై మరో మారు చంద్రబాబు అబద్ధాలు | Another lie of Chandrababu on Tirumala Laddu | Sakshi
Sakshi News home page

తిరుమల లడ్డూపై మరో మారు చంద్రబాబు అబద్ధాలు

Published Sun, Sep 22 2024 5:32 AM | Last Updated on Sun, Sep 22 2024 8:00 AM

Another lie of Chandrababu on Tirumala Laddu

మీడియాతో చంద్రబాబు చిట్‌చాట్‌

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకపోయినా ఏదో జరిగిపోయినట్లు మరో మారు అబద్ధాలు వల్లెవేసిన సీఎం చంద్రబాబు

తన రాజకీయ స్వార్థం కోసం అసత్యాలు చెబుతూ పదేపదే అపచారం

సాక్షి, అమరావతి: కళ్లార్పకుండా కమిట్‌మెంట్‌తో అబద్ధాలు ఆడడంలో దిట్ట.. చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా చెప్పడంలో నేర్పరి అయిన సీఎం చంద్రబాబు శనివారం మళ్లీ తిరుమల శ్రీవారి పవిత్రతకు అపచారం తలపెట్టారు. తన రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా తెగించే ఆయన తిరుమల లడ్డూ విషయంలో బ్రహ్మాండం బద్దలైపోయినట్లు భక్తుల మనోభావాల్ని, వారి విశ్వాసాలను కాలరాస్తున్నారు. 

ఎందుకంటే.. కల్తీ నెయ్యితో తిరుమల లడ్డూ తయారైందని ఆరోపించిన ఆయన.. వాస్తవా­నికి అసలు ఆ నెయ్యితో లడ్డూయే తయారుకాలేదన్న విషయాన్ని.. కల్తీనెయ్యి కల్తీనెయ్యి అంటూ గుండెలు బాదు­కుంటున్న ఆయన ఆ నెయ్యిని వాడలేదన్న విషయాన్నీ మరు­గునపర్చి అనవసర రాద్ధాంతానికి తెరలేపి భక్తు­ల్లో విషబీజాలు నాటుతున్నారు. 

ఏడుకొండల వాడే తనతో ఈ లడ్డూ వ్యవహారంపై మాట్లాడించాడేమోనని వ్యాఖ్యానించే స్థితికి ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారిపోయారు. ఆ దేవుడే తన నోటినుంచి నిజాలు చెప్పించాడేమోనని, మనం నిమిత్తమాత్రులమని దేవుడే అన్నీ చేయిస్తాడని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. 

దేవాలయాల పవిత్రత, భక్తుల సెంటిమెంట్‌ను కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ.. గత ప్రభుత్వంలో దేవాలయాల్లో అనేక అపచారాలు జరిగాయని అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతూ పదేపదే అపచారాలకు పాల్పడుతున్నారు. 

పైగా ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకున్నారని, ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వలేదని ఆయనన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు నేరాలు చేసి ఎదురుదాడి చేస్తున్నారన్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ ఇస్తే దానిపై సమాధానం చెప్పకుండా బుకాయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

రూ.320కి కిలో ఆవు నెయ్యి ఎలా వస్తుందని ప్రశ్నించారు. శ్రీవారికి నైవేద్యంగా పెట్టే లడ్డూ తయారీలో రివర్స్‌ టెండర్లు ఏమిటన్నారు. తప్పు చేసింది కాక డైవర్షన్‌ పాలిటిక్స్‌ అని సిగ్గులేకుండా చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం మారిన వెంటనే తిరుమల ప్రక్షాళన చేయాలని కొత్త ఈఓకు చెప్పానన్నారు.

పండితులతో చర్చించి సంప్రోక్షణపై నిర్ణయం..
ఇక టీటీడీ విషయంలో తర్వాత ఏంచేయాలనే దానిపై చర్చిస్తున్నామని.. జీయర్లు, కంచి పీఠాధిపతులు, సనాతన ధర్మ పండితులతో చర్చించి సంప్రోక్షణ ఎలా ఉండాలో నిర్ణయిస్తామన్నారు. తిరుమల సెట్‌ను ఇంట్లో వేసుకున్న వాడిని ఏమనాలని ప్రశ్నించారు. 

ఇక అమరావతితో రూ.250 కోట్లతో శ్రీవారి గుడి కడదామనుకుంటే దాన్ని కుదించారని, మళ్లీ ఇప్పుడు పెద్దపెద్ద మాటలు చెబుతున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రసాదాల నాణ్యాతా పరీక్షలు, అవసరమైన సంప్రోక్షణ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయంలో వినతులు స్వీకరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement