బాబు కుట్రకు పోలీసు వత్తాసు | CM Chandrababu Cheap Politics With Police Department On TTD Laddu | Sakshi
Sakshi News home page

బాబు కుట్రకు పోలీసు వత్తాసు

Published Thu, Sep 26 2024 1:58 AM | Last Updated on Thu, Sep 26 2024 7:42 AM

CM Chandrababu Cheap Politics With Police Department On TTD Laddu

వేధించి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే కుతంత్రం 

లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచార కుట్ర 

బెడిసికొట్టడంతో చంద్రబాబు పన్నాగం

వీర విధేయ పోలీసు అధికారులతో ‘సిట్‌’ 

సిట్‌ ఏర్పాటు తర్వాత కూడా పోలీసులకు ఫిర్యాదు 

ముందు రోజు రాత్రే సీఐని వీఆర్‌కు పంపిన ప్రభుత్వం 

తమ అనుకూల అధికారిని నియమించిన తర్వాతే ఫిర్యాదు 

ఇప్పటికే వీర విధేయులతో ‘సిట్‌’.. తాజాగా పోలీసు అస్త్రం  

తమ కుట్రను ప్రశ్నిస్తున్న వారిని వేధించేందుకు బాబు వ్యూహం

సాక్షి, అమరావతి: తిరుపతి లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారం బెడిసికొట్టడంతో సీఎం చంద్రబాబు కొత్త కుట్రకు తెర తీశారు. అవాస్తవ ఆరోపణల కుతంత్రం తన మెడకే చుట్టుకుంటుండడంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేకపోవడంతో ఆ వివాదమంతా టీడీపీ ప్రభుత్వ సృష్టేనని జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ అంశంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 

ఈ అంశంపై న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటే తన కుట్ర బట్టబయలవుతుందని బెంబేలెత్తుతున్నారు. దీంతో తాను సృష్టించిన వివాదాన్ని తనకు అను­కూలంగా ముగించేందుకు చంద్రబాబు దారులు వెతుకుతున్నారు. అందులో భాగంగానే టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో ‘సిట్‌’ ఏర్పాటు చేసినప్పటికీ ఆయన స్థిమితపడలేకపోతున్నారు. అందుకే లడ్డూ ప్రసాదం కోసం సరఫరా చేసిన నెయ్యిపై తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో టీటీడీ అధికారులతో బుధవారం ఫిర్యాదు చేయించారు. పోలీసు వేధింపులతో బెంబేలెత్తించి తిమ్మిని బమ్మి చేసే కుతంత్రానికి పదును పెడుతున్నారు.

రాత్రికి రాత్రే సీఐ అవుట్‌
తిరుపతి ఈస్ట్‌ పోలీసులకు టీటీడీ బుధవారం ఫిర్యాదు చేసింది. అయితే ఆ ముందు రోజే అంటే మంగళవారం రాత్రే తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ మహేశ్వర్‌రెడ్డిని ప్రభుత్వం హఠాత్తుగా వీఆర్‌కు పంపించింది. ఆయన స్థానంలో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా ఉన్న తమకు విధేయుడైన ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించింది. లడ్డూ అంశంపై అక్రమ కేసు నమోదు చేసేందుకు మహేశ్వర్‌­రెడ్డి సుముఖత చూపలేదని సమాచారం. దాంతో ఆయన్ని తప్పించి తమకు విధేయుడైన అధికారిని నియమించినట్లు తెలుస్తోంది. పోలీస్‌ స్టేషన్‌లో నమోదు చేసే ఫిర్యాదులపై విచారణ నిర్వహించాల్సిన బాధ్యత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌దే.  టీడీపీ ప్రధాన కార్యాలయం చెప్పినట్లుగా దర్యాప్తు పేరిట వేధింపులకు పాల్పడే అధికారిని నియమించుకునేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు స్పష్టమవుతోంది.

మరి.. నాడు బాబు హయాంలోనూ కల్తీ జరిగిందా?
నెయ్యి కల్తీ జరిగినట్లు ప్రాథమిక ఆధారంగా టీటీడీ ఆ ఫిర్యాదులో ప్రస్తావించిన అంశం విడ్డూరంగా ఉంది. కేజీ నెయ్యి రూ.319.80 చొప్పున సరఫరా చేసేందుకు ఏఆర్‌ డెయిరీ అంగీకరించడమే కల్తీ చేశారనేందుకు ప్రాథమిక ఆధారం అని పేర్కొనడం గమనార్హం. 

మరి కేజీ రూ.319.80 చొప్పున సరఫరా చేయడమే కల్తీ చేసినట్టుగా భావించాలంటే.. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015లో కేజీ రూ.276 చొప్పున, 2018లో రూ.320 చొప్పునే టీటీడీ నెయ్యి కొనుగోలు చేసింది. ఇక అప్పుడు కూడా కల్తీ చేసినట్లే భావించాలి కదా...? నాడు టీడీపీ హయాంలో నెయ్యి సరఫరా చేసిన డెయిరీలపై కూడా ఫిర్యాదు చేయాలి కదా? అని నిపుణులు నిలదీస్తున్నారు.

పక్కా పన్నాగంతోనే పోలీసులకు ఫిర్యాదు
లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూనే చంద్రబాబు ప్రభుత్వం పోలీసు అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధ పడింది. కల్తీ నెయ్యి సరఫరా చేశారని గుర్తించామని చెబుతున్న రెండు నెలల తరువాత టీటీడీ తీరిగ్గా తిరుపతి తూర్పు పోలీస్‌ స్టేషన్‌లో తాజాగా ఫిర్యాదు చేయడం గమనార్హం. తమిళనాడుకు చెందిన నెయ్యి సరఫరాదారు ఏఆర్‌ డెయిరీపై టీటీడీ జనరల్‌ మేనేజర్‌ (స్టోర్స్‌) పి.మురళీకృష్ణ ద్వారా ప్రభుత్వం ఫిర్యాదు చేయించింది. 

నెయ్యి కల్తీ జరిగిందని జూలై 23నే టీటీడీకి నివేదిక వచ్చిందన్న    చంద్రబాబు సెప్టెంబరు 20న తొలిసా­రిగా వెల్లడించి దుష్ప్రచారానికి తెరతీశారు. మరి కల్తీ జరిగిందని తెలిసిన జూలై 23నే ఆహార భద్రతా చట్టం కింద టీటీడీ ఎందుకు కేసు నమోదు చేయలేదన్న న్యాయ నిపుణుల ప్రశ్నకు ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పలేకపోయింది. టీటీడీ ఈవో శ్యామలరావు మొదట ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతూ నెయ్యిలో వెజిటబుల్‌ ఫ్యాట్‌ కలిసిందని... అయితే ఆ నెయ్యి వాడలేదని.. తిప్పి పంపామని వెల్లడించారు. 

అంతేగానీ జంతువుల కొవ్వు కలిసిందని ఆయన చెప్పలేదు.  జంతువుల కొవ్వు కలిసినట్లు ఎన్‌డీడీబీ నివేదికలో కూడా వెల్లడించలేదు. కానీ తరువాత ఈ నెల 20న సీఎం చంద్రబాబు కుట్రపూరితంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే దుష్ప్రచారం మొదలు పెట్టడంతో శ్యామలరావు కూడా మాట మార్చక తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలోని డొల్లతనంపై నిపుణులు సూటిగా ప్రశ్నలు సంధిస్తుండటంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. 

దాంతో తమను ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకు పోలీసు అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించారు. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారాన్ని పతాకస్థాయికి చేర్చిన చంద్రబాబు బృందం తాజాగా తిరుపతి పోలీసులకు ఫిర్యాదు ముసుగులో వేధింపుల కుట్రకు తెరతీసింది.

విచారణ పేరిట వేధింపుల కుట్ర..
రాజకీయ ప్రత్యర్థులు, డెయిరీల యాజమాన్యం, ఎంపిక చేసుకున్న అధికారులు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడాలన్నదే చంద్రబాబు ప్రభుత్వం కుట్ర. అక్రమ కేసుల్లో ఇరికించి అనంతరం కొందర్ని అప్రూవర్‌గా మార్చుకుని తమ కుట్ర వాదనను వారితో ఒప్పించాలనే కుతంత్రం పన్నింది. సిట్‌ పూర్తి స్వరూపాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. నివేదికతో సరిపెట్టాలా? అంతకుమించి అధికార పరిధి కల్పిస్తారా? అనేది స్పష్టం చేయలేదు. 

మరోవైపు తిరుపతి పోలీసులు కేసు విచారణ పేరిట వేధింపులకు గురి చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం డైరెక్షన్‌ మేరకే తిరుపతి పోలీసుల విచారణ హైడ్రామా కొనసాగనుంది. ఎవరెవరిని విచారణకు పిలవాలి? ఎలా భయపెట్టాలి? ఎలా వేధించాలన్నది అంతా టీడీపీ పర్య­వేక్షణలోనే సాగనుందన్నది సుస్పష్టం. 

లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారానికి వత్తాసు పలకాలని.. తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వాలని... లేదంటే కేసుల్లో ఇరికించి అరె­స్టులతో వేధిస్తామని పోలీసు అస్త్రాన్ని ప్రయో­గించాలన్నది చంద్రబాబు కుతంత్రం అని స్పష్టమవుతోంది.

సిట్‌ వేశాక పోలీసులకు ఫిర్యాదా!
లడ్డూ ప్రసాదం అంశంపై ప్రభుత్వం మంగళవారం తమకు వీర విధేయులైన పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియమించింది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు కొమ్ము­కాసిన గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్‌ ఇన్‌చార్జ్‌గా నియమించడంపై తీవ్రస్థాయిలో విమర్శ­లు వెల్లువె­త్తాయి. ఇక సిట్‌లో సభ్యుడిగా నియమించిన విశాఖ డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కృష్ణయ్య అల్లుడు. 

రిటైరైన తరువాత హెరిటేజ్‌ ఫుడ్స్‌లో డైరెక్టర్‌­గా పని చేసిన కృష్ణయ్య అనంతరం 2014–19లో టీడీపీ హయాంలో ఏపీఐ­ఐసీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన్ని కూటమి ప్రభుత్వం తాజాగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా నియమించింది. ఆయన అల్లుడు గోపీనాథ్‌ జెట్టీని సిట్‌ సభ్యుడిగా నియమించడం ద్వారా చంద్రబాబు కుతంత్రం బహిర్గతమవుతోంది. అయినా సరే చంద్రబాబులో ఆందోళన తగ్గలేదు. 

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఆధా­రాలు చూపించాలని జాతీయ స్థాయిలో పార్టీలు, నిపుణులు, న్యాయ­వేత్తలు ప్రభుత్వాన్ని నిలదీస్తు­న్నారు. సిట్టింగ్‌ న్యాయ­మూర్తి ద్వారా విచారణ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తన వ్యాఖ్య­లపై విచారణ జరిపించాలని మాజీ ఎంపీ సుబ్ర­హ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడంతో చంద్రబాబులో ఆందోళన మరింత తీవ్రమైంది. 

సుప్రీంకోర్టు విచా­రణకు ఆదేశిస్తే టీడీపీ సర్కారు కుట్ర మొత్తం బయట­పడుతుందన్నది ఆయనకు తెలుసు. తమ కుట్రను కప్పిపుచ్చేందుకు సిట్‌తో సరిపెట్టలేమని భావించారు. అందుకే పోలీసు వేధింపులతో బెంబేలెత్తించి తనకు అనుకూలంగా లొంగదీసుకునే కుతంత్రానికి తెరతీ­శారు. తాజాగా తిరుపతి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించడం ద్వారా మరోవైపు నుంచి కూడా విచారణ పేరిట రాద్దాంతం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement