వివాదం రేగకుండా 35 శాతం సరఫరాకు అనుమతి
టెండర్లలో ఎల్ 2గా నిలిచిన ఆల్ఫాకు 65 శాతం సరఫరా కాంట్రాక్టు
నిబంధనలకు విరుద్ధంగా రివర్స్ టెండర్ల నిర్వహణ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. మహాపచారానికి పాల్పడ్డారని పచ్చి అబద్ధాలు వల్లిస్తూ శ్రీవారి సన్నిధిలో రివర్స్ టెండర్లు ఏమిటంటూ గద్దించిన సీఎం చంద్రబాబు తాజాగా అదే విధానంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థకు కేటాయించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.
టెండర్‌లో ఎల్ 1గా నిలిచిన కర్ణాటకకు చెందిన నందిని డెయిరీకి పూర్తి స్థాయిలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వకుండా రివర్స్ టెండర్ పిలిచి అత్యధికంగా ఆల్ఫా మిల్క్ సంస్థకు కేటాయించడం గమనార్హం. నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆల్ఫా మిల్క్ ఫుడ్స్‌కు కట్టబెట్టేందుకే లడ్డూలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయనే ఆరోపణలు తెరపైకి తెచ్చి రివర్స్ టెండర్ విషయాన్ని పక్కదారి పట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎల్ 1 కాదని ఎల్ 2కి ఎలా ఇస్తారు? ‘రివర్స్’ మతలబేంటి?
తిరుమలలో స్వామి వారి ప్రసాదాలకు వినియోగించే నెయ్యి సరఫరా కాంట్రాక్టును తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టాలని కూటమి పెద్దలు ముందుగానే నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా టీటీడీ గత నెల 7 తేదీన మూడు నెలలకు సరిపడా నెయ్యి సరఫరాకు ఈ టెండర్లు పిలిచింది. ఇందులో కర్ణాటకకు చెందిన నందిని(కర్ణాటక కో–ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్) కిలో నెయ్యి రూ.470 చొప్పున సరఫరా చేసేందుకు కోట్ చేసి ఎల్ 1గా నిలిచింది.
ఢిల్లీకి చెందిన ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థ రూ.530 కోట్ చేసి ఎల్ 2గా నిలిచింది. నిబంధనల ప్రకారం ఎల్ 1గా నిలిచిన నందినికే టెండర్ దక్కాలి. అయితే నందినిని కాదని ‘ముఖ్య’ నేత ఆల్ఫా ఫుడ్స్ సంస్థకు నెయ్యి టెండర్ కేటాయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో టీటీడీ వెంటనే రివర్స్ టెండర్లు పిలిచింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం ఈ టెండర్లు పిలిచిన తరువాత తిరిగి టెండర్లు పిలవాల్సి వస్తే మళ్లీ ఈ టెండర్‌నే పిలవాలి.
రివర్స్ టెండర్‌కి అవకాశమే లేదు. అయితే టీటీడీ ఈవో ఆదేశాల మేరకు గత నెల 9న రివర్స్ టెండర్స్ నిర్వహించారు. ఈసారి ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ కిలో నెయ్యి రూ.450 చొప్పున కోట్ చేయగా నందిని కిలో రూ.475కి కోట్ చేసింది. ఈ టెండర్‌లో ఆల్ఫా మిల్క్ ఫుడ్స్‌కి 65 శాతం నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఖరారు చేశారు. రివర్స్ టెండర్‌పై వివాదాన్ని తెరపైకి తేకుండా నందినికి 35 శాతం నెయ్యి సరఫరా అవకాశం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment