రాజకీయాల్లోకి మతాన్ని లాగడమా? | Sakshi Guest Column On Chandrababu Politics In TTD Laddu | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి మతాన్ని లాగడమా?

Published Thu, Sep 26 2024 1:45 AM | Last Updated on Thu, Sep 26 2024 5:59 AM

Sakshi Guest Column On Chandrababu Politics In TTD Laddu

అభిప్రాయం

రాజకీయ నాయకులు సుద్దపూసలు కారు. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు చేయగలిగినన్ని పాపాలు చేశాడు. కానీ, తిరుమల తిరుపతి దేవస్థానపు ‘లడ్డూ’ ప్రసాదం కేంద్రంగా ఆడుతున్న నాటకం మాత్రం ఆయన ప్రజా జీవితంలో అత్యంత నికృష్టమైన చేష్ట. దైవ దూషణ, నిరాధార ఆరోపణలతో కూడి ఉందీ రాజకీయం. ఒక వర్గంలో విపరీతమైన ద్వేషం, ఉన్మాదాన్ని రేకెత్తించేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయ త్నమిది. దేవుడి పేరుతో జరుగుతున్న ఆటవిక రాజకీయం. చంద్ర బాబు గురించి తెలిసిన వాళ్లు కూడా ఊహించని విధంగా ఆయన దక్షిణాదిలో మతోన్మాదాన్ని వేగంగా వ్యాపింపజేసేందుకు కంకణం కట్టుకున్నాడని అనిపిస్తోంది. 

లడ్డూ ప్రసాదంపై వచ్చిన ఆరోపణలు ఏవీ నిలిచేవి కావు. ఎందుకంటే అన్నీ పరస్పర విరుద్ధమైనవి. ‘ద ప్రింట్‌’కు చెందిన నిచ్చెనమెట్ల ప్రసాద్‌ సెప్టెంబరు 21న రాసిన కథనం ప్రకారం... కల్తీ జరిగిందని భావిస్తున్న నెయ్యి దేవస్థానానికి జూలై 6 నుంచి 12 తేదీల మధ్య వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రిగా గద్దెనెక్కిన తరువాత! దేవస్థానం వ్యవహారాల్లో అత్యంత శక్తిమంతుడైన ఎగ్జిక్యూటివ్‌ అధికారి శ్యామల రావును నియమించింది కూడా చంద్రబాబే. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందని అనుమానిస్తున్న నెయ్యిని వాడనే లేదని ఆయన విస్పష్టంగా ప్రకటించాడు.

వాస్తవానికి జరిగిందేమిటంటే... నాణ్యత పరీక్షల్లో విఫలమైన కారణంగా కల్తీ జరిగిందని అనుమానించిన నెయ్యి ట్యాంకర్లను సరఫరాదారుకు తిప్పి పంపారు. ఈ ట్యాంకర్ల నుంచి సేకరించిన నమూనాలను తనిఖీల కోసం ప్రత్యేకమైన పరిశోధన సంస్థలకు పంపారు. ఈ సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగానే బాబు కుమారుడు లోకేశ్‌ కూడా ‘‘జగన్ ప్రభుత్వం తిరుపతి ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడింది. జగన్, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ విషయమై సిగ్గుపడాలి. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్లను గౌరవించలేకపోయారు’’ అని మాట్లాడాడు.

జరిగిన పరిణామాలు, అందుబాటులో ఉన్న అరకొర సాక్ష్యాలను బట్టి చూస్తే అత్యంత మూర్ఖులు మాత్రమే ఈ రకమైన పైత్యాన్ని నమ్ముతారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సహజంగానే ఈ ఉచ్చులో పడిపోయాడు. వాస్తవాలను పరిశీలించాలన్న ఆలోచన కూడా లేకుండా లడ్డూ ప్రసాదం ‘అపవిత్రమై’పోయిందన్నాడు. ఈవో శ్యామలరావు స్వయంగా అలాంటిదేమీ జరగలేదని ప్రకటించిన విషయాన్నీ పట్టించుకోలేదు. 

రాహుల్‌ గాంధీ వైఖరి ఎంత విచిత్రంగా ఉంటుందంటే... దేశంలోని మత మైనారిటీల రక్షణకు రాకుండా, వారినే అంతమొందిస్తామన్న ఖలిస్తానీ తీవ్రవాదులకు మద్దతుగా మాట్లాడేంత! దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతపై క్రిస్టియన్‌  అన్న ఒక్క కారణంగా జరుగుతున్న దుష్ప్రచారానికి పవిత్రత కల్పిస్తూగానీ మెజారిటీ వర్గాలకు భరోసా ఇవ్వలేక పోయేంత!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం చేసుకున్న అదృష్టం ఏమిటంటే... జగన్‌ మోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ లాంటివాడు కాకపోవడం! వారసుడే అయినప్పటికీ, అట్టడుగు నుంచి అధికార పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానం షేక్‌స్పియర్, మారియో పూజో(‘ద గాడ్‌ ఫాదర్‌’ రచయిత) ఉమ్మడిగా రాసినట్టుండే కథనానికి ఏమాత్రం తీసిపోనిది. 

భారతీయ రాజకీయ యవనికపై అకస్మాత్తుగా కనుమరుగైన నేతలు ఎందరో ఉన్నారు. కానీ అత్యంత ప్రభావశీలమైన నిష్క్రమణల్లో వై.ఎస్‌. రాజశేఖర రెడ్డిది ఒకటి. 2009 సెప్టెంబరు 2న జరిగిన ఆ హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి ఆయన బతికి బయటపడి ఉంటే కాంగ్రెస్‌ పార్టీకి పెట్టని కోటగా మారిన ఆంధ్రప్రదేశ్‌ అసలు విభజితమై ఉండేది కాదు. 

నియంతల్లా పేరుపడ్డ మోదీ, అమిత్‌ షా సైతం సిగ్గుపడే స్థాయిలో అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయాలన్న నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం కాంగ్రెస్‌ పార్టీని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఈ ఒక్క నిరంకుశ నిర్ణయంతో కాంగ్రెస్‌ పార్టీ అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణలోనూ తుడిచి పెట్టుకుపోయింది. ఈ సమయంలోనే మోదీ కూడా గుజరాత్‌ను వీడి జాతీయ రాజ కీయాల్లో చక్రం తిప్పడం మొదలుపెట్టిన విషయం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాల తరువాత కాంగ్రెస్‌ పార్టీకి అధికారం దక్కేలా చేసిన వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి వారసుడైన జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆ పార్టీ ముప్పు తిప్పలు పెట్టింది. జగన్‌ మోహన్‌రెడ్డిని  పార్టీలోనే పరాయివాణ్ణి చేశారు. ఆంక్షలు పెట్టారు. కేసుల పేరుతో హింసకు గురిచేశారు. జగన్‌ పోరాడింది ఆషామాషీ వ్యక్తులతో కాదు. దేశంలోనే అత్యంత శక్తిమంతులైన రాజకీయ నేతలతో.

ఢిల్లీలో గాంధీలు... హైదరాబాద్‌లోని వారి చంచాలు ఒక పక్క,ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ఇంకోపక్క. వైఎస్‌ దాతృత్వంతో లబ్ధి పొందిన వాళ్ల కేసుల కారణంగానే జైల్లో మగ్గిన జగన్‌కు ఇక భవిష్యత్తు లేదని చాలామంది అనుకున్నారు. అయితే జగన్‌ ఈ విషయాలపై ఫిర్యాదు చేయలేదు. తనకు అన్యాయం జరిగిపోయిందని ఏడవలేదు. పోరాడాడు. సొంతంగా పార్టీ స్థాపించాడు. అత్యంత దుర్భరమైన, వేల కిలోమీటర్ల పొడవునా జన సామాన్యులతో కలిసిపోతూ పాదయాత్ర నిర్వహించాడు.

పార్టీ స్థాపించిన ఎనిమిదేళ్లకు వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకొచ్చాడు. ఏ రకంగా చూసినా ఇది అసాధారణ విజయమనే చెప్పాలి. వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అన్ని మతాలు, కులాల వాళ్లూ ఇష్టపడ్డారు. క్రిస్టియన్‌  కాబట్టి నేతగా అంగీకరించమని ఎవరూ అనుకోలేదు. రాజశేఖర రెడ్డి కూడా కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని పోయేవాడు. 

విదేశాల నుంచి తిరిగి వచ్చిన ప్రతిసారీ తిరుపతిని సందర్శించడం రాజశేఖర రెడ్డి పాటించిన పద్ధతుల్లో ఒకటి. వాళ్లు రహస్య క్రైస్తవులని అంటున్న హిందువుల మెప్పు కోసం నేను ఈ మాటలు అనడం లేదు. మత విశ్వాసాల విషయంలో రాజశేఖర రెడ్డి వైఖరి అన్నింటినీ సమాదరించే లక్షణం ఉండటం వల్ల అంటున్నా. ఆయనది అసలైన భారతీయుడి మనస్తత్వం.

జగన్‌ను ప్రత్యర్థిగా చేసుకుని ఆయన్ని హిందూ వ్యతిరేకిగా ముద్రించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు గర్హనీయం, హేయం, అత్యంత ప్రమాదకరం, నిర్లక్ష్యపూరితం. ఈ విషయంలో చంద్రబాబు అండ్‌ కో రోజు రోజుకూ అత్యంత నీచమైన రాజకీయాలకు పాల్పడుతోంది. హిందూ ధర్మ పరిరక్షకుడి స్థాయిలో తానూ గుర్తుండిపోవాలని చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత అథమ స్థాయికి చేరిందంటే... టీటీడీ బోర్డు ఛైర్మన్‌ భార్య తన చేతిలో బైబిల్‌ పట్టుకుని తిరుగుతోందని ఆరోపించేంత వరకు!

రాజకీయాల్లోకి మతాన్ని లాగడం ద్వారా చంద్రబాబు ఘోరమైన తప్పు చేస్తున్నాడు. దీనిపై ఆగ్రహ జ్వాలలు సర్వత్రా వ్యాపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ ప్రజానీకం ఇదంతా నాటకమని నమ్ముతూంటే, మిగిలిన వారిని రెచ్చగొట్టేందుకు పవన్‌ కల్యాణ్‌ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్‌లో గట్టి మద్దతే ఉంది. మతతత్వ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా నడిచేవీ కావు. అధికారం ఎప్పుడూ ఓకే పార్టీ, నేతతో ఉండేదీ కాదు.

విభజించి పాలించు అన్నది తాత్కాలికంగా కొన్ని లాభాలు ఇవ్వ వచ్చునేమో కానీ... ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి మార్గంలో పెట్టాలని ఆశిస్తున్న చంద్రబాబుకు దీర్ఘకాలంలో ఇది చెరగని మరకగానే మిగిలిపోతుంది.

కపిల్‌ కొమిరెడ్డి 
వ్యాసకర్త ‘మాలెవొలెంట్‌ రిపబ్లిక్‌: ఎ షార్ట్‌ హిస్టరీ ఆఫ్‌ ద న్యూ ఇండియా’ పుస్తక రచయిత (‘ద ప్రింట్‌’ సౌజన్యంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement