సిగ్గూ ఎగ్గూ లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణ | YSRCP president YS Jagan fired on CM Chandrababu | Sakshi
Sakshi News home page

సిగ్గూ ఎగ్గూ లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణ

Published Sat, Oct 5 2024 5:24 AM | Last Updated on Sat, Oct 5 2024 7:22 AM

YSRCP president YS Jagan fired on CM Chandrababu

సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ 

‘ఎక్స్‌’ వేదికగా టీడీపీ దారుణంగా అసత్య ప్రచారాలు 

కోర్టు చంద్రబాబును తప్పు పడితే మాపై దుష్ప్రచారం  

చంద్రబాబు వంటి నాయకుడు ఉండడం మన ఖర్మ 

సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించినా.. చంద్రబాబులో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. ఆయనకు వ్యక్తిత్వం ఉంటే ముందు ప్రజలను క్షమాపణ కోరాలి. తర్వాత తిరుమలలో స్వామి వారిని తప్పు చేశానని వేడుకోవాలి. కానీ, అవేవీ చేయకుండా చంద్రబాబుని కోర్టు తిడితే.. నీ పాపం పండింది జగన్‌.. అంటూ మమ్మల్ని తిట్టినట్టు  వక్రీకరిస్తూ ట్వీట్‌ చేశారు.  – వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: ‘సుప్రీంకోర్టు మీకు మొట్టికాయలు వేస్తూ తీర్పు ఇస్తే.. సిగ్గూ ఎగ్గూ లేకుండా ఆ తీర్పును వక్రీకరిస్తారా? మీరు చేసిన తప్పులను సుప్రీంకోర్టు ఎత్తి చూపుతూ మిమ్మల్ని నిలదీస్తే మాకు అక్షింతలు వేసిందంటూ దు్రష్ఫచారం చేస్తారా?’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. 

శుక్రవారం ‘ఎక్స్‌’లో తెలుగుదేశం పార్టీ అధికారిక ఖాతా(హ్యాండిల్‌)లో చేసిన పోస్టింగ్స్‌ చూస్తే.. ‘తప్పు జరిగిందని తెలిసినా, దేవుడి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించినా చంద్రబాబులో కనీస పశ్చాత్తాపం కనిపించడం లేదు’ అంటూ దుయ్యబట్టారు. 

టీడీపీ అధికారిక ఖాతా నుంచి ‘ఎక్స్‌’లో చేసిన ఆ పోస్టింగ్స్‌లో ఏం రాశారన్నది చదివి వినిపిస్తూ ‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్‌ కావడంతో అబద్ధం మీద అబద్దాలు చెప్పుకుంటూ పోతున్నారు. మనిషి అన్నాక కొద్దిగానైనా దేవుడంటే భక్తి ఉండాలి. కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇంత దారుణంగా వక్రీకరణ చేయడమా?’ అంటూ వైఎస్‌ జగన్‌ తీవ్రంగా ఆక్షేపించారు. వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..  

ఎంత నీచానికైనా దిగజారుతాడు  
సుప్రీంకోర్టు నిజానికి చంద్రబాబుకు అక్షింతలు వేస్తే, దాన్ని నేషనల్‌ మీడియా మొత్తం రాసిందంటూ.. గత సోమవారం సుప్రీంకోర్టులో వాదనల తర్వాత, ప్రతి నేషనల్‌ టీవీ, న్యూస్‌ పేపర్‌ చంద్రబాబును ఆక్షేపిస్తూ.. ఏం రాశాయన్నది చదివి వినిపించారు. ‘కీప్‌ గాడ్‌ అవే ఫ్రమ్‌ పాలిటిక్స్‌ సుప్రీంకోర్ట్‌ టెల్స్‌ నాయుడు’ అని ప్రతి నేషనల్‌ ఛానల్, ప్రతి ఇంగ్లిష్‌ పేపర్‌ చంద్రబాబును తప్పు పట్టింది. ఆయన్ను సుప్రీంకోర్టు తిట్టినా, ఆక్షేపించినా, టీడీపీ సోషల్‌ మీడి­యాలో చేస్తున్న దు్రష్పచారం, రాస్తున్న అబద్ధాలు చూస్తుంటే, ఆయన ఎంత నీచానికి దిగాడన్నది తెలుస్తుంది.

‘తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్‌. మీ పాపం పండింది జగన్‌..’ అంటూ ఏ మాత్రం సిగ్గూ, ఎగ్గూ లేకుండా వక్రీకరిస్తున్నారు. నిజానికి సుప్రీంకోర్టు చంద్రబాబును తిడితే, దాన్నీ వక్రీకరిస్తూ.. మీ పాపం పండింది.. వైవీ సుబ్బారెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం అని రాశారు. ఇంత దారుణంగా వక్రీకరిస్తూ, చంద్రబాబు దిగజారిపోయిన పరిస్థితి. ఇంకా వక్రీకరణలో భాగంగా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్‌ కావడంతో జగన్‌ రెడ్డి బావ ధర్మారెడ్డి, బాబాయి సుబ్బారెడ్డి, మామ కరుణాకర్‌ రెడ్డి అడ్డంగా బుక్కయ్యారని పెద్ద అబద్ధం రాశారు. 

చివరగా, ఒకటి గుర్తు పెట్టుకొండి. ఇవన్నీ వెలుగులోకి వచ్చాయంటే దేవుడి దయతోనే. వాళ్లు శ్రీ వేంకటేశ్వరస్వామితో ఆడుకుంటున్నారు. అన్నీ స్వామే చూసుకుంటారు. ఇటువంటి అన్యాయాలు చేస్తున్న వ్యక్తు­లకు శ్రీవారే మరిన్ని మొట్టికాయలు వేస్తారు’ అని చెప్పారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement