దీని అర్థం ఏంటి బాబూ?: వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jagan Fires On Chandrababu About TTD Laddu | Sakshi
Sakshi News home page

దీని అర్థం ఏంటి బాబూ?: వైఎస్‌ జగన్‌

Published Mon, Sep 30 2024 5:31 AM | Last Updated on Mon, Sep 30 2024 7:14 AM

YSRCP President YS Jagan Fires On Chandrababu About TTD Laddu

దీని కన్నా వేరే సాక్ష్యం కావాలా?

శ్రీవారి లడ్డూ ప్రసాదం, తన పర్యటనపై చంద్రబాబు 

అబద్ధాలను ఎండగట్టిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 

సత్యమేవ జయతే అంటూ ట్వీట్‌

సాక్షి, అమరావతి: రాజకీయ దుర్బుద్ధితో పరమ పవిత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై పచ్చి అబద్ధాలు వల్లె వేసి అపవిత్రం చేస్తూ.. తన తిరుమల పర్యటనపై అవాస్తవాలు చెబుతూ దబాయిస్తున్న సీఎం చంద్రబాబు తీరును ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. ‘నీకు నోటీసు ఇచ్చారా? తిరుమలకు పోవద్దాన్నారా? వేంకటేశ్వరస్వామి గుడికి పోనివ్వబోమని ఎవరైనా చెప్పారా...’ అంటూ శుక్రవారం సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలను వల్లె వేశారు. 

మాజీ సీఎం జగన్‌ తిరుపతి, తిరుమల పర్యటనకు అనుమతి లేదని.. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలకు శుక్రవారం నోటీసులు ఇచ్చారు. శుక్రవారం సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోనూ.. వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసులు జారీ చేసిన నోటీసులను జత చేస్తూ ‘దీని అర్థం ఏంటి బాబూ?.. దీని కన్నా వేరే సాక్ష్యం కావాలా? సత్యమేవ జయతే’ అంటూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.  

స్వార్థ రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తావా? 
పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ చంద్రబాబు చెబుతోన్న మాటల్లో వీసమెత్తు నిజం లేదంటూ సాక్ష్యాధారాలతో సహా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. జూలై 23న టీటీడీ ఈవో.. సెప్టెంబరు 18న సీఎం చంద్రబాబు.. సెప్టెంబరు 20న టీటీడీ ఈవో.. సెప్టెంబరు 22న సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను.. సెప్టెంబరు 27న తాను మీడియాతో మాట్లాడిన మాటల వీడియోలను జత చేసి.. దీని అర్థం ఏంటి బాబూ? దీని కన్నా వేరే సాక్ష్యం కావాలా? సత్యమేవ జయతే అంటూ ‘ఎక్స్‌’లో వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు.  

వనస్పతి కలిసింది.. ట్యాంకర్లు రిజెక్ట్‌ చేశాం 
శాంపిళ్లలో కల్తీ జరిగిందని తేలింది. అందులో వెజిటబుల్‌ ఫ్యాట్‌ అంటే వనస్పతి కలిసిందని తేలింది. ఆ సప్లయిర్‌ను బ్లాక్‌ లిస్ట్‌ చేసేందుకు షోకాజ్‌ నోటీసు ఇచ్చాం. రెండు ట్యాంకర్లను రిజెక్ట్‌ చేశాం 
– జూలై 23న టీటీడీ ఈవో శ్యామలరావు 

కల్తీ బాబు సృష్టి..  
శ్రీ వేంకటేశ్వరస్వామి దగ్గర పెట్టే ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా నాసిరకమైన ముడిసరుకులు వాడారు. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారు. 
– సెప్టెంబరు 18న సీఎం చంద్రబాబు 



నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపాం 
కల్తీ నెయ్యి అని రిపోర్టులో తేలడంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని రిజెక్ట్‌ చేశాం. నాలుగు ల్యాంకర్లను వెనక్కి పంపాం. ఆ సంస్థ నుంచి సరఫరాను నిలిపేశాం. 
– సెప్టెంబరు 20న టీటీడీ ఈవో శ్యామలరావు 

బాబు నోట మళ్లీ అవే కల్తీ మాటలు  
నాలుగు ట్యాంకర్లు అప్పటికే వచ్చేశాయి. వాటిలోని కల్తీ నెయ్యిని వాడారు.  
– సెప్టెంబరు 22న సీఎం చంద్రబాబు 

తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు 
పచ్చి అబద్ధాలు వల్లె వేసి తిరుమల, తిరుపతి దేవస్థానం ప్రతిష్టను సీఎం చంద్రబాబు అబాసుపాలు చేశారు. పరమ పవిత్రమైన లడ్డూ విశిష్టతకు దెబ్బతీశారు. శ్రీవారి ప్రసాదం బాగాలేదని, తింటే మంచిది కాదని భక్తుల్లో అనుమానపు బీజాలు నాటారు. తాను చెబుతున్నది పచ్చి అబద్ధమని తెలిసి కూడా చంద్రబాబు పదే పదే అవాస్తవాలు చెబుతున్నారు. 
– సెప్టెంబరు 27న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 


నేడు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ 
– విచారణ జరపనున్న జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ ధర్మాసనం 
తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణియన్‌స్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యర్ధించారు. ఎన్‌డీడీబీ ల్యాబ్‌ నివేదికపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరపాలని విన్నవించారు. 

ఈ కేసులో సుబ్రమణియన్‌స్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకెళ్లారు. తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎందుకైంది, ల్యాబ్‌ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా? అనేది కూడా తేల్చాలని పిటిషన్‌లో విన్నవించారు. 

నిరాధారమైన తప్పుడు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వివరించారు. ఎస్‌వోపీ ప్రకారం పరీక్షల్లో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నెయ్యిని మాత్రమే తిరుమల ప్రసాదానికి వినియోగించే విధానం దశాబ్దాలుగా కొనసాగుతోందని, ఏదో ఒక చిన్న రిపోర్టును ఆధారంగా చేసుకుని కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు అభ్యర్ధించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement