అయినవాడికే అతిపెద్ద పోస్ట్‌  | Junior Doctor Appointed As Superintendent In Guntur With TDP Support | Sakshi
Sakshi News home page

అయినవాడికే అతిపెద్ద పోస్ట్‌ 

Published Tue, Jun 11 2019 9:14 AM | Last Updated on Tue, Jun 11 2019 12:09 PM

Junior Doctor Appointed As Superintendent In Guntur With TDP Support - Sakshi

గుంటూరు మెడికల్‌: ఆయన చాలామందికన్నా జూనియర్‌. టీడీపీ ప్రభుత్వ వీర విధేయుడు కావడంతో రాష్ట్ర రాజధాని ఆస్పత్రి గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా అవకాశం దక్కించుకున్నారు. ఆయనే డాక్టర్‌ దేవనబోయిన శౌరిరాజు నాయుడు. 2017లోనే పదవీ విరమణ చేయాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఆగమేఘాలపై ఒక  ప్రత్యేక జీఓనే తీసుకొచ్చింది. సీనియర్లను కాదని అతనికే సూపరింటెండెంట్‌ పదవి దక్కేలా చేసింది. సుమారు నాలుగేళ్లుగా జూనియర్‌ పరిపాలనలో రాష్ట్ర రాజధాని ఆస్పత్రి నడిచింది. అతని వివక్ష, అవినీతి, అసమర్థత, అవినీతి ధోరణితో ఆస్పత్రిలోని వారంతా అతడికి వ్యతిరేకంగా మారారు. అయినా నేటికీ ఆయనే కొనసాగుతూ ఉన్నారు.  

అతని కోసమే ప్రత్యేక జీవో..
గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా శౌరిరాజు నాయుడు విధుల్లో చేరటం కూడా పెద్ద చర్చనీయాంశమే అయింది. సాధారణంగా వైద్యుల్లో సీనియర్స్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్స్‌గా ప్రభుత్వం నియమిస్తుంది. కానీ డాక్టర్‌ రాజునాయుడు టీడీపీ నేతలతో తనకున్న సంబంధాలతో 26–09–2015న సూపరింటెండెంట్‌ పదవి దక్కించుకున్నారు. ఆయన పదవీకాలం 31–5–2017న ముగిసింది. వైద్యుల పదవీవిరమణ వయస్సు 60 నుంచి 63 ఏళ్లకు పెంచుతూ 2017 మే 31న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ జీఓను కేవలం రాజు నాయుడు కోసమే ప్రభుత్వం ఇచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైద్యులు విమర్శిస్తున్నారు. ఈ చర్యకు నిరసనగా తాము స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తామని, తమకు 60 ఏళ్ల వయస్సు వరకూ ఉద్యోగం చాలని పలువురు వైద్యులు ప్రభుత్వాన్ని కలిసి మొరపెట్టుకున్నా స్పందించలేదు.
 
అన్నీ వివాదాస్పద నిర్ణయాలే..
జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దేవనబోయిన సొంతంగా తీసుకున్న పలు నిర్ణయాలతో పలు వివాదాలు తలెత్తాయి. రెండేళ్లక్రితం జిల్లాలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల అనుమతి ప్రక్రియలో నిబంధనలకు నీళ్లు వదిలారనే అపవాదును ఎదుర్కొంటున్నారు. విజిలెన్స్‌ విచారణ కూడా దీనిపై నడుస్తోంది. ఏడాదిన్నర క్రితం జిల్లాలో కనీవిని ఎరుగని రీతిలో అత్యధిక సంఖ్యలో డయేరియా మరణాలు, డయేరియా కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో డయేరియా బాధితులకు ఉచితంగా వైద్యం చేయించాలని  కలెక్టర్‌ ఆదేశించగా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దేవనబోయిన మాత్రం ప్రభుత్వ మెప్పు పొందేందుకు జీజీహెచ్‌కు డయేరియా రోగులను తీసుకొచ్చారు. ప్రైవేటు ఆస్పత్రి నుంచి జీజీహెచ్‌కు తీసుకురావటం వల్లే తమ వారు చనిపోయారంటూ మృతుల బంధువులు ఆస్పత్రిలో తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. ఆస్పత్రిలో పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌ షిప్‌ విధానంలో టీడీపీ ప్రభుత్వం పలు వైద్యసేవలను ప్రారంభించింది. వారికి వైద్యసేవలకు అనుమతి కోసం అధిక మొత్తంలో మామూళ్లు తీసుకున్నారనే ఆరోపణలపై పలు పత్రికల్లో సైతం కథనాలు ప్రచురితం అయ్యాయి.

ఆస్పత్రిలో ఇరువురు ఆర్‌ఎంఓలు, నలుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లు ఉన్నా అందరిని పక్కనపెట్టేసి 8 నెలల క్రితం ఉద్యోగాల్లో చేరిన జూనియర్‌ వైద్యులకు అన్ని బాధ్యతలు ఇవ్వటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ నిధులు, ఆస్పత్రికి సంబంధించిన ఇతర నిధులపై నాలుగేళ్లుగా ఆడిట్‌లు జరగలేదని ప్రభుత్వ ఆర్థిక సలహాదారే నాటి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కార్యాలయ ఉద్యోగుల సీట్లు మార్పులు చేర్పుల సమయాల్లో వివక్ష చూపించారని ఉద్యోగులు వాపోతున్నారు. నిధులు ఉన్నా ఆరోగ్యశ్రీ పారితోషికాలు వైద్యులకు, వైద్య సిబ్బందికి ఇవ్వకపోవటంతో ఆరోగ్యశ్రీ జిల్లా అధికారులకు సైతం వైద్య సిబ్బంది ఫిర్యాదులు చేశారు. క్యాన్సర్‌ వార్డు నిర్మాణం కోసం అడ్డగోలుగా నర్సింగ్‌ స్కూల్‌ను పడగొట్టడం, ఎంసీహెచ్‌ వార్డు నిర్మాణం కోసం వందేళ్లకు పైగా ఉన్న మహా వృక్షాలను నరికి వేయటంలాంటి ఆరోపణలు వినిపించాయి.  

జీవోపై సీనియర్ల మండిపాటు... 
టీడీపీ ప్రభుత్వం 2014 జూన్‌లో అధికారం చేపట్టిన నాటి నుంచి రెగ్యులర్‌ సూపరింటెండెంట్‌ పోస్టులను భర్తీ చేయకుండా అత్యంత జూనియర్‌ వైద్యులను టీచింగ్‌ ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లుగా కొనసాగిస్తూ ఉండటంపై వైద్యుల సంఘం నాయకులు, సీనియర్‌ వైద్యులు మండిపడుతున్నారు. పలువురు సీనియర్‌ వైద్యులు కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టు జోక్యంతో సీనియారిటీ ప్రకారం పదోన్నతులు ఇస్తామని టీడీపీ ప్రభుత్వం డీపీసీ షెడ్యూల్‌ ప్రకటించింది. 2018 మే 10వ తేదీలోగా డీపీసీ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని టీడీపీ ప్రభుత్వం వెల్లడించింది. కానీ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కోసం పదోన్నతులు ఇవ్వలేదు. 80 మంది వైద్యులతో టీడీపీ ప్రభుత్వం సీనియారిటీ జాబితాను ప్రకటించగా అందులో 78వ స్థానంలో ఉన్న డాక్టర్‌ రాజునాయుడు నాలుగేళ్లుగా సూపరింటెండెంట్‌గా కొనసాగుతూ ఉన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement