
ఆకలేస్తే అమ్మని! అల్లరి చేస్తే అత్తని!
నేను ఆరోతరగతి చదువుతుండగా నాన్న చనిపోయాడు. అప్పటి నుంచి అన్నయ్య వదినలే ఇంటి పెద్దలని అమ్మా, నేను అనుకున్నాం. అన్నయ్యకి ఒకమ్మాయి, ఒకబ్బాయి. ‘అత్తా...అత్తా...’ అంటూ నాతోనే ఉండేవారు. వాళ్లకి స్నానాలు చేయిస్తుంటే వదిన నవ్వుతూ...‘పెళ్లికి ముందే పిల్లల పెంపకం నేర్చుసుకుంటున్నావు’ అనేది. నన్నెపుడూ ఆడపడుచుగా చూడలేదు, చెల్లెలిగానే చూసుకుంది.
అన్నయ్య మాత్రం సాయంత్రం అవగానే తాగొచ్చి నానా గొడవా చేసేవాడు. వదినని, నన్ను, పిల్లల్ని నోటికొచ్చినట్టు తిట్టేవాడు. అలా...ఆరేళ్లు గడిచాక ఉన్నట్టుండి వదిన మానసికస్థితిలో మార్పు వచ్చింది. పిచ్చిదానిలా మారిపోయింది. తిండి తినేదికాదు. పెద్దాసుపత్రికి తీసుకెళ్లి మంచి వైద్యం చేయిస్తే బతికేదె. కానీ, అన్నయ్య పొద్దున ఒకలా, సాయంత్రమైతే ఒకలా ఆలోచించేవాడు. భార్యను బతికించుకోవాలన్న కోరిక తన తాగుడు ముందు తక్కువైపోయింది. జబ్బు బాగా ఎక్కువైపోవడంతో ఒకరోజు... పిల్లల్ని నా చేతిలో పెట్టి వదిన కన్ను మూసింది. వదిన చనిపోయాక అన్నయ్య ఇంటికి రావడం మానేశాడు. అప్పటివరకూ ‘అత్తా...అత్తా‘ అని పిలిచిన పిల్లలు ‘అమ్మా’ అనడం మొదలెట్టారు. నేనూ ఆ పిలుపుకి అలవాటు పడిపోయాను. పెళ్లికి ముందే పిల్లల్ని పెంచడం నేర్చుకున్నది వారికి తల్లినవ్వడం కోసమేనని నాకు అప్పుడే అర్థమైంది. ఆ పిలుపుని సార్థకం చేసుకోవడంలో భాగంగా నేను చదువాపేసి బ్యూటీపార్లల్‌లో చేరాను. పార్లర్‌లో అయితే జీతం తక్కువగా వస్తుందని ఇళ్లకు వెళ్లి పార్లర్ పనులు చేయడం మొదలుపెట్టాను. మా ప్రాంతంలో ఆ ట్రెండ్‌ని మొదలుపెట్టింది నేనే. దాంతో నాకు కస్టమర్లు బాగా పెరిగారు.
పొద్దునే ప్లిలల్ని స్కూలుకి పంపి బయలుదేరిపోయేదాన్ని. దాదాపు పన్నెండుగంటలు పని ఉండేది. సంపాదన కూడా బాగానే ఉండేది. బంధువుల్లో కొందరు నన్ను మెచ్చుకునేవారు. కొందరు తిట్టేవారు. ‘అంత కష్టపడి ఆ పిల్లల్ని చదివిస్తే నీకేమొస్తుంది. పిల్లాణ్ణి పనిలోకి పంపి, ఆడ పిల్లకు పెళ్లి చేసి నువ్వు కూడా ఏదో ఒక దారిచూసుకో...రెక్కలొచ్చాక కన్నబిడ్డలే కాదు... పొమ్మంటున్నారు. అన్నపిల్లల భవిష్యత్తు కోసం అన్ని కలలు కనడందేనికి’ అంటూ క్లాస్‌లు పీకేవారు. ఒకరోజు అన్నయ్య వచ్చాడు. తాగుడు మానలేదు, సంపాదన లేదు. తనతో గొడవపడితే ప్రయోజనంలేని పరిస్థితి. ఏం చేస్తాను. పిల్లలతో సమానమయ్యాడు. అమ్మ నా పాట్లు చూస్తూ బతుకుతోంది. అన్నయ్య తనకేం పట్టనట్లు బతుకుతున్నాడు. అయినా నాకు ఆ పిల్లలపై మమకారం తగ్గడం లేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా కళ్లముందు వారి బంగారు భవిష్యత్తులు తప్పమరేం కనిపించడం లేదు. బాబు ప్రస్తుతం ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. అమ్మాయి ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతోంది.
వాళ్లద్దిరికీ ఉద్యోగాలు రావాలి, పెళ్లిళ్లు కావాలి. ఆ తర్వాత నా భవిషత్తు గురించి ఆలోచిస్తాను. అప్పటికి(నవ్వుతూ...) నేను అమ్మమ్మను అయిపోతానేమో! చాలాసార్లు ఆలోచనలు నా పెళ్లివైపుకి వెళ్లేవి. వెంటనే...‘అమ్మా..అమ్మా’ అంటూ పిలిచే అన్న పిల్లల పిలుపు చెవుల్లో మారుమ్రోగేది. నిజంగా ఇప్పుడు నేను పెళ్లిచేసుకున్నా...పిల్లల్ని కన్నా...వారిపై నాకుండే ప్రేమ నా అన్న పిల్లలకన్నా తక్కువగానే ఉంటుందన్న భావన నన్ను వెంటాడుతుంది. నిజం చెప్పాలంటే నా పిల్లలకోసమైతే నేనింత కష్టపడేదాన్ని కాదు. సమాజం వేసే ఎన్నో వెకిలి ప్రశ్నలకు సమాధానం చెప్పేదాన్ని కూడా కాదు. ఆకలి వేసినపుడు ‘అమ్మా..’ అంటారు. అల్లరి చేసేటప్పుడు ‘అత్తా ’ అంటారు. పడుకునేముందు మాత్రం నేను అన్నం తిన్నానో.. లేదో అడగడం మాత్రం ఏ రోజూ మరిచిపోరు.
- సునీత, వరంగల్