ప్రభుత్వాస్పత్రిలో ప్రైవేట్ ప్రాక్టీస్
ఫీజు వంద.. ఆటో ఫ్రీ
చిత్తూరులో ఇదీ పరిస్థితి
ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు బయట క్లినిక్‌లు నడపడం చూస్తుంటాం. ఆస్పత్రిలో పనివేళలు పూర్తయ్యాక బయట ప్రాక్టీస్ సెంటర్లు నిర్వహించడం అందరికీ తెల్సిందే. కానీ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రయివేటు వైద్యం చేయడం ఎక్కడైనా చూశారా? అయితే మీరు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని సందర్శించాల్సిందే.. ఆ కథేంటో 2వ పేజీలో చదవండి..
సీన్ -1
చిత్తూరు నగరంలోని సుందరయ్యవీధి.గురువారం మధ్యాహ్నం 12.15 గంటలయింది. అక్కడే ఉన్న ఓ మెడికల్‌షాపు నిర్వాహకుడు ఆటోను పిలిపించి పది మంది పేషెంట్లను అందులో ఎక్కించాడు.
సీన్ -2
మధ్యాహ్నం 12.33. ఆటో నేరుగా ప్రభుత్వాస్పత్రిలోని ఎంఎం వార్డు ముందు ఆగింది. ఆటోలో ఉన్న వాళ్లంతా నేరుగా ఆస్పత్రిలోని రక్తనిధి వార్డుకు వెళ్లారు. టోకెన్ నెంబర్ల ఆధారంగా ఒక్కొక్కరినీ పిలిచి అక్కడున్న వైద్యుడు పరీక్ష చేస్తున్నాడు.
ఓ చీటీలో వీళ్లకు మందులు రాసిచ్చాడు. రోగుల్ని పరిశీలించినందుకు ఒక్కొక్కరి నుంచి రూ.వంద చొప్పున ఫీజు తీసుకున్నాడు.
సీన్ -3
ఆటో నేరుగా మళ్లీ సుందరయ్యవీధి వద్దకు వెళ్లి ఆగింది. అందరూ కిందకు దిగారు. వైద్యుడురాసిచ్చిన చీటీలో మందులు కొనడానికి అదే ఆటోలో ఉన్న వాళ్లంతా అక్కడికి చేరుకున్నారు. మెడికల్ షాపు నిర్వాహకుడికి రూ.2 వేల వరకు వ్యాపారం జరిగింది.
ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు చేస్తున్న సేవలు, వారిని పర్యవేక్షించాల్సిన అధికారుల పనితీరుకు ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలే నిలువెత్తు నిదర్శనం. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో రక్తనిధి ఇన్‌చార్జ్, చర్మవ్యాధి నిపుణులు రోజూ చేస్తున్న నిర్వాకం ఇది. తన ప్రైవేటు క్లినిక్‌కు వచ్చే రోగుల్ని అక్కడే ఉన్న మెడికల్‌షాపు నిర్వాహకుల సాయంతో ప్రతిరోజూ ఇలా ప్రభుత్వాస్పత్రికి పిలిపించుకుని ప్రైవేటు వైద్యం చేస్తున్నారు. ఆస్పత్రిలో వైద్యుల పనితీరు పర్యవేక్షించడానికి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ఇక్కడ ప్రాంతీయ వైద్యాధికారిణి (ఆర్‌ఎంవో), ఆస్పత్రి పర్యవేక్షలు (సూపరింటెండ్)లు ఉన్నా ఈ తంతు జరుగుతూనే ఉంది. జిల్లా ప్రభుత్వాస్పత్రులు సేవల సమన్వయాధికారిణి (డీసీహెచ్‌ఎస్) కూడా చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో ఉన్నా ఫలితం లేకపోతోంది. - చిత్తూరు అర్బన్
విచారించి చర్యలు తీసుకుంటాం
ఆస్పత్రిలో జరుగుతున్న ఈ నిర్వాకం వల్ల వైద్యులందరికీ చెడ్డపేరు వస్తుంది. దీనిపై లోతుగా విచారణ జరిపిస్తాం. ఆస్పత్రిలో ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తున్నారని తేలితే చర్యలు కఠినంగా ఉంటాయి. - డాక్టర్ జయరాజ్, పర్యవేక్షకులు, చిత్తూరు ప్రభుత్వాస్పత్రి
ఔరా..డాక్టరా..!
Published Fri, Mar 4 2016 2:38 AM | Last Updated on Mon, Oct 1 2018 5:41 PM
Advertisement