Private Practice
-
పనివేళల్లో ప్రైవేటు ప్రాక్టీస్ చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ వైద్యకళాశాలల అధ్యాపకులు పనివేళల్లో ప్రైవేట్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉండాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు ఇచ్చింది. టీచింగ్ ఫ్యాకల్టీలు వారి పనివేళల్లో అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాక్టీస్ చేయొద్దని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు ఇచ్చింది. పనివేళల్లో ఎవరైనా వైద్యులు ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తించినట్లయితే, అది వైద్య నైతిక నియమావళిని ఉల్లంఘించినట్లుగా భావించి, వారి రిజిస్ట్రేషన్ నంబర్లను తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ రిజిస్ట్రీ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. -
ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దన్నా... ప్రభుత్వ ఉద్యోగమే ముద్దు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ పూర్తి చేసినవారి చూపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యపోస్టుల వైపు మళ్లింది. ప్రైవేట్ ప్రాక్టీసు కన్నా ప్రభుత్వ ఆసుపత్రే మిన్న అని భావిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వేతనాలు ఆశాజనకంగా లేకపోవడం కూడా దీనికి మరో కారణం. ప్రైవేట్ ప్రాక్టీసుపై ప్రభుత్వం నిషేధం విధించినా ప్రభుత్వ పోస్టుల వైపే ఎక్కువగా మొగ్గు చూపడం గమనార్హం. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో భాగంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు వస్తున్న దరఖాస్తుల సంఖ్యే అందుకు నిదర్శనమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అంతా కార్పొరేట్ వైద్యమయం అయిన పరిస్థితుల్లో ప్రైవేట్ ప్రాక్టీసు అసాధ్యమన్న భావనలో చాలామంది వైద్యులు ఉన్నారు. కొందరికైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 25 వేలు కూడా ఇవ్వడంలేదు. విదేశీ ఎంబీబీఎస్‌లకైతే కొందరికి రూ. 20 వేలు కూడా ఇవ్వడం లేదన్న చర్చ జరుగుతుంది. సివిల్ అసిస్టెంట్ పోస్టులకు ఐదు రెట్ల డిమాండ్ వైద్య, ఆరోగ్య శాఖలో మొత్తం 12,755 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. అందులో 10,028 పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పటివరకు ఎంబీబీఎస్ అర్హతతో ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 734 పోస్టులు, వైద్య విధాన పరిషత్ పరిధిలో 209 పోస్టులు, ఐపీఎం పరిధిలో ఏడు సివిల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీచేశారు. మొత్తం 950 పోస్టులకు 4,800 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఏకంగా ఐదురెట్ల దరఖాస్తులు వచ్చాయి. వీరికి బేసిక్ వేతనం రూ.58,850 ఉంది. డీఏ, హెచ్ఆర్ఏ అదనం. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వారికే 90 శాతం మేరకు ఇందులో పోస్టులు దక్కాయి. అనుభవం లేనివారికి, ఇప్పుడే ఎంబీబీఎస్ పూర్తయినవారిలో 90 శాతం మందికి అవకాశమే రాలేదు. కాగా, మొత్తం పోస్టులు పొందినవారిలో అధికంగా మహిళాడాక్టర్లు 509 మంది, పురుష డాక్టర్లు 441 మంది ఉన్నారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు మహిళలే ముందుకు వస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ జారీచేయగా, ఇప్పటికే 2 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని వైద్య, ఆరోగ్య సేవల నియామక సంస్థ(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌ఏ) సభ్యకార్యదర్శి గోపికాంత్‌రెడ్డి చెబుతున్నారు. ఇంకా మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. స్టాఫ్‌నర్సు పోస్టులకైతే 30 వేల మంది పోటీ? రాష్ట్రంలోని వివిధ వైద్య, ఆరోగ్య విభాగాల్లో 5,204 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ అయిన సంగతి విదితమే. ఈ పోస్టులకు పేస్కేల్ రూ.36,750– రూ. 1,06,990 మధ్య ఉండటంతో దాదాపు 30 వేల మంది దరఖాస్తు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే ఆరురెట్ల డిమాండ్ ఉంటుందని అంటున్నారు. 1,500 ఏఎన్ఎం పోస్టులకు కూడా త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. వాటికి పదిరెట్లు పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియమితులయ్యే వైద్యులు ఇక నుంచి ప్రైవేటు ప్రాక్టీసు చేయకుండా నిషేధం విధిస్తూ వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. నేరుగా నియమితులైన క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాలకు చెందిన స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్టు వైద్యులు గానీ, బోధనేతర విభాగం నుంచి బదిలీపై వచ్చిన వైద్యనిపుణులు గానీ ఇక నుంచి ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం పరిధిలోకి వస్తారని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజారోగ్య విభాగంలో ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులో చేరే వైద్యులకు, తెలం గాణ వైద్య విధాన పరిషత్ విభాగాల పరిధిలో స్పెషలిస్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా నియమితు లయ్యే వారికి కూడా ఈ నిషేధం వర్తిస్తుంది. ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ఏరియా, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియమితులయ్యే డాక్టర్లంద రికీ ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధం నిబంధన వర్తిస్తుంది. కొత్తగా నియమితులయ్యే డాక్టర్లంతా తమ అర్హత ధ్రువపత్రాలను రాష్ట్ర వైద్య మండలిలో తప్పని సరిగా నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా 12,755 వైద్య పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవగా వాటిలో 10 వేలకుపైగా పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయ నుంది. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం పోస్టు లను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయనుం డగా..ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. డీఎంఈ పరిధిలోని కాలేజీల్లో నియమితులయ్యే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేర్పులు చేసింది. ఏడాది సీనియర్ రెసిడెంట్ అనుభవం క్లినికల్ విభాగంలో మొత్తం 18 రకాల స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేస్తారు. వాటికి అర్హత వివరాలను మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, రెస్పి రేటరీ మెడిసిన్, సైకియాట్రీ, డెర్మటాలజీ, వెనిరీయోలజీ లెప్రసీ, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా, రేడియో డయాగ్నసిస్, రేడియేషన్ ఆంకాలజీ, ఈఎన్టీ, ఆప్తమాలజీ, హాస్పిటల్ అడ్మిన్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్ క్లినికల్ పోస్టులు భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఎండీ/డీఎన్బీ పూర్తి చేసిన వారు అర్హులు. అలాగే ఎండీ పూర్తి చేసిన తర్వాత ఏడాదిపాటు సీనియర్ రెసిడెంట్లుగా పనిచేసిన అనుభవం ఉండాలి. 500కు పైగా పడకలున్న ఆసుపత్రిలో డీఎన్బీ కోర్సు చేస్తే.. ఒక ఏడాది సీనియర్ రెసిడెంట్‌గా పని చేయాలి. ఒకవేళ 500లోపు పడకలున్న ఆసుపత్రిలో డీఎన్బీ కోర్సు చేస్తే.. రెండేళ్లపాటు సీనియర్ రెసిడెంట్‌గా సేవలందించిన వారే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అర్హులవుతారని స్పష్టం చేశారు. నాన్ క్లినికల్ విభాగంలో... నాన్ క్లినికల్ విభాగంలో అసిస్టెంట్ పోస్టులుగా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకా లజీ, పాథాలజీ, మైక్రోబయోలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ ఉన్నాయి. వీటికి ఎండీ/ డీఎన్బీ/ఎంఎస్ చదివి ఉండాలి. అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీలకు సబ్జెక్టుల్లో ఎండీ తత్సమాన కోర్సు చేసినవారు లేకుంటే ఆ కోర్సుల్లో ఎంఎస్సీ (పీహెచ్డీ) చేసిన వారిని 15% వరకు తీసుకోవచ్చు. ఈ పోస్టుల్లో చేరేవారు ఏడాదిపాటు ట్యూటర్‌గా పనిచేసిన అను భవం ఉండాలి. సూపర్ స్పెషాలిటీలో.. సూపర్ స్పెషాలిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగం లో కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, థోరాసిక్ సర్జరీ/కార్డియాక్ సర్జరీ (సీటీ సర్జరీ), యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ పోస్టులున్నాయి. వీటికి ఆయా కోర్సులను బట్టి డీఎం/డీఎన్బీ లేదా ఎంసీ హెచ్/డీఎన్బీ చదివి ఉండాలి. కాగా, విదేశాల్లో 18 రకాల పీజీ కోర్సులు పూర్తి చేసిన వారికి అవకాశం కల్పిస్తారా లేదా అన్న విషయంపై ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వలేదు. వైద్యుల వ్యతిరేకత.. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయ కుండా నిషేధం విధించడంపై పలువురు వైద్యులు వ్యతిరే కత వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం తక్కువ వేతనాలు ఇస్తూ, ఇలా నిషేధం విధించడం తగదన్నారు. కనీ సం ప్రోత్సాహకాలు ఇవ్వడమో లేదా నిమ్స్ మాదిరిగా సాయంత్రం వేళల్లో పనిచేస్తే ఆదా యం వచ్చే మార్గమైనా వెతికే పనిచేస్తే బాగుంటుందని అంటున్నారు. -
Sakshi Cartoon: ఇక్కడే ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకుంటారంట!
ప్రైవేటు ప్రాక్టీస్ ఎత్తేశారంట సార్..! దానికి బదులు ఇక్కడే ప్రాక్టీస్ చేసుకుంటారంట! -
ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌ను రద్దు చేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే ఇకపై సర్కారు ఆసుపత్రుల్లో నియమితులయ్యే వైద్యులకు మాత్రమే ఈ నిర్ణయాన్ని వర్తింపజేయనుంది. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, పారామెడికల్ సిబ్బందిని నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకోసం కసరత్తు చేపడుతోంది. నియామక మార్గదర్శకాలను 2–3 రోజుల్లోగా విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్గదర్శకాల్లో ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్ రద్దు అంశం కీలకమైందని చెబుతున్నాయి. మరోవైపు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఆయా పోస్టుల భర్తీలో గతంలో ఇచ్చినట్లుగానే వెయిటేజీ ఉంటుందని ఒక కీలకాధికారి తెలిపారు. సర్వీస్ రూల్స్‌ల్లో మార్పులు... రాష్ట్రంలో మొత్తం 12,755 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవగా వాటిలో 10 వేలకుపైగా పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ ఆర్బీ) భర్తీ చేయనుంది. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయనుండగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను మాత్రం టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. పోస్టుల భర్తీకి సంబంధించి సుమారు 20 ఏళ్ల నాటి సర్వీస్ రూల్స్‌ను మార్చే ప్రక్రియ దాదాపు పూర్తయింది. గతంలో స్టాఫ్ నర్సులు, ఇతర పారామెడికల్ పోస్టుల భర్తీ సమయంలో తలెత్తిన న్యాయ చిక్కుల వంటివి ఈసారి తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని వైద్య యంత్రాంగం భావిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు వైద్య కోర్సుల్లో, పోస్టుల్లో మార్పులు ఎన్నో మార్పులు ఉండటంతో పాత సర్వీస్ రూల్స్ ప్రకారం కొత్త కోర్సులు చేసిన వారు అనర్హులయ్యే పరిస్థితులు న్నాయి. ముఖ్యంగా ల్యాబ్ టెక్నీ షియన్లలో దాదాపు 30 రకాల విభాగాలు, కోర్సులు వచ్చాయి. అంటే కార్డియో టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, న్యూరోకు సంబంధించి టెక్నీషియన్, వివిధ కొత్త యంత్రాలకు టెక్నీషియన్లు వచ్చారు. వాటికి కోర్సులు కూడా వచ్చాయి. ఇలా 30 రకాల కోర్సులు చేసిన వారందరూ అర్హులు కాబట్టి వేర్వేరు కోర్సులకు వేర్వేరు సిలబస్ తయారు చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన సర్వీస్ రూల్స్‌ను మార్చారు. స్టాఫ్ నర్సుల పోస్టులకు 20 వేల మంది పోటీ! వైద్య, ఆరోగ్యశాఖలో పోస్టులను ప్రకటించిన తర్వాత స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంల కోసం అభ్యర్థులు పెద్ద ఎత్తున సన్నద్ధం అవుతున్నారు. స్టాఫ్ నర్సుల భర్తీ దాదాపు నాలుగేళ్ల తర్వాత జరుగుతుండటంతో 4,722 స్టాఫ్ నర్సు పోస్టుల కోసం 20 వేల మంది పోటీ పడే అవకాశముంది. అలాగే 1,520 ఏఎన్ఎం పోస్టుల కోసం 6 వేల మంది పోటీ పడే అవకాశం ఉందని అంటున్నారు. దాదాపు 2 వేల వరకున్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 8 వేల మంది పోటీ పడొచ్చని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ధర్మాసుపత్రిలో దాష్టీకం: డాక్టర్లు ప్రాక్టీసుకు.. పేషెంట్లు ప్రయివేటుకు..
కొత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన రాజనర్సుకు ప్రమాదంలో కుడికాలు విరిగింది. నిరుపేద కుటుంబం కావడంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి ఆటోలో రాగానే అక్కడే కాచుకుని కూర్చున్న అంబులెన్స్ నిర్వాహకులు రాజనర్సు బంధువులను అడ్డగించి ‘ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు.. ఇక్కడ వైద్యులు లేరు. ఉన్నా వైద్యం సరిగా చేయక ప్రాణాల మీదకు తెస్తారని’ భయబ్రాంతులకు గురిచేసి వారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇలా వచ్చిన పేషెంట్లను వచ్చినట్లు ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తూ అంబులెన్స్‌ల నిర్వాహకులు కమీషన్లు దండుకుంటున్నారు. సాక్షి, కరీంనగర్: జిల్లా ఆస్పత్రిలో కమీషన్ల కాసులవర్షం కురుస్తోంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు పైసా ఖర్చు లేకుండా వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తుంటే... కొంతమంది కమీషన్లకు కక్కుర్తిపడి పేద రోగులకు ప్రభుత్వ వైద్యం అందకుండా చేస్తున్నారు. ఆస్పత్రి వైద్యులు మధ్యాహ్నానికే ‘ప్రయివేటు’ ప్రాక్టీసుకు వెళ్లిపోగా.. అదనుచూసి అంబులెన్స్ డ్రైవర్లు ఆస్పత్రి ఆవరణలో తిష్ట వేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారిని ప్రైవేటు ఆసుపత్రులకు పంపుతున్నారు. ఆస్పత్రిలో వైద్యం చేసేందుకు డాక్టర్లు లేదని, ఉన్నా పట్టించుకోరని, తీరా ప్రాణాల మీదకు వచ్చాక ఎక్కడికి పోతారని పేషెంట్ల బంధువులను భయబ్రాంతులకు గురిచేసి ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తూ కమీషన్లు దండుకుంటున్నారు. అవసరమైతే ఉచితంగా అంబులెన్స్ సేవలు అందిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ఈ దందా యథేచ్చగా సాగుతుండగా.. ఈ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం కొసమెరుపు. చదవండి: (దారుణం: కుల బహిష్కరణ.. మాట్లాడితే రూ.50వేల జరిమానా) ప్రభుత్వాసుపత్రి సిబ్బంది అండతో: ప్రైవేటు అంబులెన్స్‌లను ప్రభుత్వాసుత్రి కంపౌండ్ వెలుపలే ఉంచాలి. కానీ గత కొద్ది రోజులుగా ప్రభుత్వాసుపత్రి సిబ్బంది అండదండలతో కంపౌండ్‌లో అడ్డా పెట్టి అంబులెన్స్‌లకు సీరియల్ నంబర్లు కూడా కేటాయిస్తున్నారు. పేషెంట్ల బంధువులు ద్విచక్రవాహనాలపై వస్తే దూరంగా పార్కింగ్ చేయిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ప్రైవేటు ఆంబులెన్స్‌లకు మాత్రం ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేసుకునేందుకు స్థలాలు చూపిస్తున్నారు. దగ్గరుండి పేషెంట్లను అంబులెన్స్‌లలో ప్రైవేటుకు తరలిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ: అంబులెన్స్‌ల ద్వారా పేషెంట్లను తీసుకువచ్చే వారికి 30 నుంచి 50 శాతం వరకు కమీషన్లు ఇస్తున్నారు. కమీషన్లు ఇచ్చేందుకు పేషెంట్లను నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా వైద్యం పొందాల్సిన పేషెంట్లను ప్రైవేటు ఆసుపత్రులకు పంపుతున్న వారిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. సెక్యూరిటీ, పీఆర్వోలకు చెప్పాం. ప్రైవేటు ఆంబులెన్స్‌లు కంపౌండ్లోపల పార్కింగ్‌లో పెట్టకూడదని సెక్యూరిటీకి, పీఆర్వోలకు చెప్పాం. ఎవరూ కంపౌండ్ లోపల ప్రైవేటు ఆంబులెన్స్‌లు పెట్టకుండా చర్యలు చేపడతాం. – డాక్టర్ జ్యోతి, జిల్లా ఆసుపత్రి ఆర్ఎంవో -
దేశంలో రిజర్వుడ్ హెల్త్ ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: దేశానికి రిజర్వుడ్ ఆర్మీ దళం ఉన్నట్లుగానే వైద్య దళాన్ని సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి 15వ ఆర్థిక సంఘం అత్యంత కీలకమైన సిఫార్సు చేసింది. 15వ ఆర్థిక సంఘం పరిధి లోని ఆరుగురు సభ్యుల ఉన్నతస్థాయి వైద్య బృందం ఆరోగ్య రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై పలు సూచనలు చేస్తూ కేంద్రానికి తాజాగా నివేదిక సమర్పించింది. ఈ విషయంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇండియన్ రిజర్వుడ్ ఆర్మీ మాదిరిగా షార్ట్ సర్వీస్ కమిషన్‌కు రూపకల్పన చేసి దేశంలో వైద్యుల కొరత ఎక్కడ ఉంటే అక్క డకు రిజర్వుడు స్పెషలిస్టు వైద్యులను పంపించడమే దీని ఉద్దేశం. అనేక రాష్ట్రాల్లో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఆరోగ్యపరమైన విపత్తులు తలెత్తినా, ఎక్కడైనా కొరత ఉన్నా ఈ రిజర్వుడు వైద్య దళం అక్కడకు వెళ్తుంది. అవసరమైనన్ని రోజులు అక్కడ ఉండి వైద్య సేవలు అందిస్తుంది. అందుకోసం జాతీయ స్థాయిలో ఒక వైద్య దళాన్ని జాతీయస్థాయి పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇక ఇప్పటివరకు రాజ్యాంగంలో వైద్య ఆరోగ్య రంగం రాష్ట్ర జాబితాలో ఉంది. దీన్ని ఉమ్మడి జాబితాలోకి చేర్చాలని మరో కీలకమైన సిఫార్సు చేసింది. ఆరోగ్యం ప్రాథమిక హక్కు.. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2021లో ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా మార్చాలని ఆర్థిక సంఘం మరో ముఖ్యమైన సిఫార్సు చేసింది. దీనివల్ల ప్రతీ ఒక్కరికి ఆరోగ్య భరోసా లభిస్తుందని తెలిపింది. 2025 నాటికి బడ్జెట్లో ప్రభుత్వం వైద్యంపై పెట్టే ఖర్చును ఇప్పుడున్న దానికి రెండింతలు చేయాలని సూచించింది. రాష్ట్రాలు వైద్య బడ్జెట్లో పరిశోధనకు 2 శాతానికి తగ్గకుండా కేటాయించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే 10 శాతం నిధుల్లో మూడింట రెండొంతులు ప్రాథమిక ఆరోగ్యంపై ఖర్చు పెట్టాలని తెలిపింది. ప్రోత్సాహకాల వ్యవస్థను వైద్య ఆరోగ్య రంగంలో ప్రవేశపెట్టాలని, ప్రాథమిక వైద్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీర్చిదిద్దాలని నివేదించింది. ప్రైవేటు ప్రాక్టీసు రద్దు.. వైద్య కళాశాలల్లో పనిచేసే ప్రొఫెసర్లు, డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదని మరో కీలక సిఫార్సు చేసింది. ఇప్పటికే ఎవరైనా చేస్తుంటే తమ ప్రైవేట్ ప్రాక్టీసును వదులుకోవాలని, తమ జీతం ప్రాతిపదికనే పనిచేయాలని సూచించింది. ప్రైవేట్ ప్రాక్టీస్‌ను అనుమతించడం వల్ల వైద్య బోధనలో నాణ్యత దెబ్బతింటుందని తేల్చిచెప్పింది. ప్రభుత్వ వైద్యులను ఇతర విభాగాలతో పోల్చకుండా సముచిత వేతనాలు, సౌకర్యాలు, ఇతరత్రా రాయితీలు ఇవ్వాలంది. మెడికల్ కాలేజీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆదేశాల ప్రకారం వైద్యరంగంలో పరిశోధనలు చేయాలని పేర్కొంది. వైద్య కళాశాలకు రేటింగ్.. మెడికల్ కాలేజీలకు అవి సాధించే పీజీ సీట్లు, ఉత్తీర్ణత ఆధారంగా గుర్తింపు, రేటింగ్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఎంబీబీఎస్ స్థాయిలోనే కొన్ని స్పెషాలిటీ కోర్సులను ప్రోత్సహించాలని సూచించింది. అనస్థీషీయా, గైనిక్, పీడియాట్రిక్స్ విభాగాల్లో డిప్లొమా వైద్యులను కొనసాగిస్తూ వారి సేవలను మాధ్యమిక స్థాయి ఆస్పత్రుల్లో వినియోగించుకోవాలని వెల్లడించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ కోర్సు చేయాలనుకునే విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది అనైతికం, అహేతుకం, మానవ విలువలకు వ్యతిరేకమని వ్యాఖ్యానించింది. దీనివల్ల అర్హులైన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత వైద్య విద్యను పొందటానికి అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తంచేసింది. ప్రభుత్వ యంత్రాంగం ఈ పరిస్థితులను నియంత్రించాలని సిఫార్సు చేసింది. నిష్క్రమణకూ పరీక్ష.. వైద్య విద్య నాణ్యతను నిర్ధారించడానికి ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ పూర్తి చేసిన విద్యార్థులకు ఒక సాధారణ ఎగ్జిట్ ఎగ్జామ్(నిష్క్రమణ పరీక్ష) పెట్టాలని సూచించింది. నర్సింగ్ వృత్తిని బలోపేతం చేయాలని సూచించింది. నర్సింగ్ కౌన్సిల్ చట్టం ద్వారా నర్సింగ్ కౌన్సిల్ పనితీరును సమీక్షించడం అవసరమని చెప్పింది. తద్వారా నర్సింగ్ నాణ్యతను మెరుగుపరచాలని సూచించింది. ఎయిమ్స్‌లను విస్తరించడం, జిల్లా ఆస్పత్రులను, మెడికల్ కాలేజీలను పెంచడం అవసరమని పేర్కొంది. 250 పడకల కంటే ఎక్కువగా ఉన్న ఆస్పత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ఫ్యామిలీ మెడిసిన్ కోర్సు దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, సబ్ సెంటర్లను 2011 జనాభా లెక్కల ప్రకారం పెంచాలని పేర్కొంది. దీనికి సుమారు రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. దేశంలో ప్రస్తుతం వెయ్యి జనాభాకు ఒక బెడ్ ఉంటే, దాన్ని రెండుగా చేయాలని తెలిపింది. ఆ ప్రకారం వచ్చే ఐదేళ్లలో ప్రైవేటు భాగస్వామ్యం తో 3 వేల నుంచి 5 వేల ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని చెప్పింది. అలాగే ఆరోగ్య కార్డులను తీసుకురావాలని సూచించింది. 2025 నాటికి ఎంబీబీఎస్ సీట్లతో సమానంగా పీజీ వైద్య సీట్లను పెంచాలని, ఎంబీబీఎస్‌లోనే కొన్ని స్పెషాలిటీ కోర్సులను పెట్టాలని పేర్కొంది. ఫ్యామి లీ మెడిసిన్ కోర్సును ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, దానికి శాఖను ఏర్పాటు చేయాలని సూచించింది. -
ప్రభుత్వ వైద్యులకు మంత్రి హెచ్చరిక
ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయడం మానకపోతే తీవ్ర చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. వారికి మొదటి హెచ్చరికగా మూడు ఇంక్రిమెంట్లు కోత విధిస్తామని, అప్పటికీ పద్ధతి మార్చుకోకపోతే ఉద్యోగాల నుంచి తొలగింపు కూడా తప్పదని ఆయన అన్నారు. ఇక వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. కౌన్సెలింగ్‌కు ఈనెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. -
ప్రభుత్వ వైద్యులపై అభియోగాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 43మంది వైద్యులపై ప్రభుత్వం అభియోగాలు (ఆర్టికల్ ఆఫ్ చార్జెస్) నమోదు చేసింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో వివిధ జిల్లాలకు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, సివిల్ సర్జన్ స్పెషలిస్ట్‌లు, డిప్యూటీ సివిల్ సర్జన్లు ఉన్నారు. విధుల్లో సరైన ప్రవర్తన లేకపోవడం, విధులకు సరిగా రాకపోవడం తదితర కారణాలతో అభియోగాలు నమోదు చేసినట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. 15 రోజుల్లోగా ప్రభుత్వానికి సంజాయిషీ ఇవ్వాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. వైద్యులు ఇచ్చిన సంజాయిషీపై ప్రభుత్వం సంతృప్తి చెందితే అభియోగాలు ఉపసంహరణ చేసుకుంటుందని, లేదంటే అనంతరం విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. -
ఔరా..డాక్టరా..!
ప్రభుత్వాస్పత్రిలో ప్రైవేట్ ప్రాక్టీస్ ఫీజు వంద.. ఆటో ఫ్రీ చిత్తూరులో ఇదీ పరిస్థితి ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు బయట క్లినిక్‌లు నడపడం చూస్తుంటాం. ఆస్పత్రిలో పనివేళలు పూర్తయ్యాక బయట ప్రాక్టీస్ సెంటర్లు నిర్వహించడం అందరికీ తెల్సిందే. కానీ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రయివేటు వైద్యం చేయడం ఎక్కడైనా చూశారా? అయితే మీరు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని సందర్శించాల్సిందే.. ఆ కథేంటో 2వ పేజీలో చదవండి.. సీన్ -1 చిత్తూరు నగరంలోని సుందరయ్యవీధి.గురువారం మధ్యాహ్నం 12.15 గంటలయింది. అక్కడే ఉన్న ఓ మెడికల్‌షాపు నిర్వాహకుడు ఆటోను పిలిపించి పది మంది పేషెంట్లను అందులో ఎక్కించాడు. సీన్ -2 మధ్యాహ్నం 12.33. ఆటో నేరుగా ప్రభుత్వాస్పత్రిలోని ఎంఎం వార్డు ముందు ఆగింది. ఆటోలో ఉన్న వాళ్లంతా నేరుగా ఆస్పత్రిలోని రక్తనిధి వార్డుకు వెళ్లారు. టోకెన్ నెంబర్ల ఆధారంగా ఒక్కొక్కరినీ పిలిచి అక్కడున్న వైద్యుడు పరీక్ష చేస్తున్నాడు. ఓ చీటీలో వీళ్లకు మందులు రాసిచ్చాడు. రోగుల్ని పరిశీలించినందుకు ఒక్కొక్కరి నుంచి రూ.వంద చొప్పున ఫీజు తీసుకున్నాడు. సీన్ -3 ఆటో నేరుగా మళ్లీ సుందరయ్యవీధి వద్దకు వెళ్లి ఆగింది. అందరూ కిందకు దిగారు. వైద్యుడురాసిచ్చిన చీటీలో మందులు కొనడానికి అదే ఆటోలో ఉన్న వాళ్లంతా అక్కడికి చేరుకున్నారు. మెడికల్ షాపు నిర్వాహకుడికి రూ.2 వేల వరకు వ్యాపారం జరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు చేస్తున్న సేవలు, వారిని పర్యవేక్షించాల్సిన అధికారుల పనితీరుకు ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలే నిలువెత్తు నిదర్శనం. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో రక్తనిధి ఇన్చార్జ్, చర్మవ్యాధి నిపుణులు రోజూ చేస్తున్న నిర్వాకం ఇది. తన ప్రైవేటు క్లినిక్‌కు వచ్చే రోగుల్ని అక్కడే ఉన్న మెడికల్‌షాపు నిర్వాహకుల సాయంతో ప్రతిరోజూ ఇలా ప్రభుత్వాస్పత్రికి పిలిపించుకుని ప్రైవేటు వైద్యం చేస్తున్నారు. ఆస్పత్రిలో వైద్యుల పనితీరు పర్యవేక్షించడానికి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ఇక్కడ ప్రాంతీయ వైద్యాధికారిణి (ఆర్ఎంవో), ఆస్పత్రి పర్యవేక్షలు (సూపరింటెండ్)లు ఉన్నా ఈ తంతు జరుగుతూనే ఉంది. జిల్లా ప్రభుత్వాస్పత్రులు సేవల సమన్వయాధికారిణి (డీసీహెచ్ఎస్) కూడా చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో ఉన్నా ఫలితం లేకపోతోంది. - చిత్తూరు అర్బన్ విచారించి చర్యలు తీసుకుంటాం ఆస్పత్రిలో జరుగుతున్న ఈ నిర్వాకం వల్ల వైద్యులందరికీ చెడ్డపేరు వస్తుంది. దీనిపై లోతుగా విచారణ జరిపిస్తాం. ఆస్పత్రిలో ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తున్నారని తేలితే చర్యలు కఠినంగా ఉంటాయి. - డాక్టర్ జయరాజ్, పర్యవేక్షకులు, చిత్తూరు ప్రభుత్వాస్పత్రి -
ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే కోతే!
సాక్షి, ముంబై: ప్రభుత్వ వైద్యులుగా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకుంటున్న వైద్యుల జీతాల్లో కోత విధించాలని బీఎంసీ పరిపాలనా విభాగం నిర్ణయించింది. అదనపు సంపాదనమీద ఆశతో ఇప్పటికే ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తూ విధులను నిర్లక్ష్యం చేస్తున్న కొందరిని బీఎంసీ హెచ్చరించినా వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయరాదు. ప్రభుత్వ, బీఎంసీ ఆస్పత్రుల్లో పనిచేసే అనేక మంది వైద్యులకు సొంతంగా ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్ హోంలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ బినామీ పేర్లతో వాటిని నడుపుతున్నారు. కాగా బీఎంసీ ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు మాత్రం డ్యూటీ అయిపోయిన తరువాత ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసుకునే అవకాశముంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆస్పత్రిలో కచ్చితంగా ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. కాని అనేక మంది డాక్టర్లు సొంత ఆస్పత్రి నుంచి నుంచి ఫోన్ రాగానే వెళ్లిపోతున్నారు. కొందరైతే అక్కడ పనులు ముగించుకుని ఆలస్యంగా ఆస్పత్రికి వస్తున్నారు. మరికొందరు నాలుగు గంటలకు ముందే వెళ్లిపోతున్నారు. దీంతో వార్డులో రోగులకు సరైన వైద్యం లభించడంలేదంటూ బీఎంసీకి అనేక ఫిర్యాదులు అందాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న బీఎంసీ ఆస్పత్రి యాజమాన్యాలు హాజరు పుస్తకాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం రాగానే, సాయంత్రం వెళ్లేటప్పుడు అందులో కచ్చితంగా సంతకం చేయాలని ఆంక్షలు విధించింది. కాని కొందరు మధ్యలో మాయమై పనులు చూసుకుని తిరిగి వస్తున్నారు. ఇక వీరి ప్రవర్తనలో మార్పు రాదని గ్రహించిన బీఎంసీ.. పట్టుబడిన వైద్యుల జీతంలో కోత విధించాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఇలాంటి డాక్టర్లపై ఆస్పత్రి సూపరింటెండెంట్ నిఘా వేస్తారు. వారికి కేటాయించిన వార్డులో లేని పక్షంలో వేటు వేసే యోచనలో కూడా ఉన్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.