దేశంలో రిజర్వుడ్‌ హెల్త్‌ ఫోర్స్‌ | 15th Economic Commission Recommendations To Central Government Over Health Force | Sakshi
Sakshi News home page

దేశంలో రిజర్వుడ్‌ హెల్త్‌ ఫోర్స్‌

Published Mon, Jan 27 2020 4:22 AM | Last Updated on Mon, Jan 27 2020 4:22 AM

15th Economic Commission Recommendations To Central Government Over Health Force - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశానికి రిజర్వుడ్‌ ఆర్మీ దళం ఉన్నట్లుగానే వైద్య దళాన్ని సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి 15వ ఆర్థిక సంఘం అత్యంత కీలకమైన సిఫార్సు చేసింది. 15వ ఆర్థిక సంఘం పరిధి లోని ఆరుగురు సభ్యుల ఉన్నతస్థాయి వైద్య బృందం ఆరోగ్య రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై పలు సూచనలు చేస్తూ కేంద్రానికి తాజాగా నివేదిక సమర్పించింది. ఈ విషయంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇండియన్‌ రిజర్వుడ్‌ ఆర్మీ మాదిరిగా షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌కు రూపకల్పన చేసి దేశంలో వైద్యుల కొరత ఎక్కడ ఉంటే అక్క డకు రిజర్వుడు స్పెషలిస్టు వైద్యులను పంపించడమే దీని ఉద్దేశం.

అనేక రాష్ట్రాల్లో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఆరోగ్యపరమైన విపత్తులు తలెత్తినా, ఎక్కడైనా కొరత ఉన్నా ఈ రిజర్వుడు వైద్య దళం అక్కడకు వెళ్తుంది. అవసరమైనన్ని రోజులు అక్కడ ఉండి వైద్య సేవలు అందిస్తుంది. అందుకోసం జాతీయ స్థాయిలో ఒక వైద్య దళాన్ని జాతీయస్థాయి పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇక ఇప్పటివరకు రాజ్యాంగంలో వైద్య ఆరోగ్య రంగం రాష్ట్ర జాబితాలో ఉంది. దీన్ని ఉమ్మడి జాబితాలోకి చేర్చాలని మరో కీలకమైన సిఫార్సు చేసింది.

ఆరోగ్యం ప్రాథమిక హక్కు.. 
75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2021లో ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా మార్చాలని ఆర్థిక సంఘం మరో ముఖ్యమైన సిఫార్సు చేసింది. దీనివల్ల ప్రతీ ఒక్కరికి ఆరోగ్య భరోసా లభిస్తుందని తెలిపింది. 2025 నాటికి బడ్జెట్‌లో ప్రభుత్వం వైద్యంపై పెట్టే ఖర్చును ఇప్పుడున్న దానికి రెండింతలు చేయాలని సూచించింది. రాష్ట్రాలు వైద్య బడ్జెట్‌లో పరిశోధనకు 2 శాతానికి తగ్గకుండా కేటాయించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే 10 శాతం నిధుల్లో మూడింట రెండొంతులు ప్రాథమిక ఆరోగ్యంపై ఖర్చు పెట్టాలని తెలిపింది. ప్రోత్సాహకాల వ్యవస్థను వైద్య ఆరోగ్య రంగంలో ప్రవేశపెట్టాలని, ప్రాథమిక వైద్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీర్చిదిద్దాలని నివేదించింది.

ప్రైవేటు ప్రాక్టీసు రద్దు.. 
వైద్య కళాశాలల్లో పనిచేసే ప్రొఫెసర్లు, డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదని మరో కీలక సిఫార్సు చేసింది. ఇప్పటికే ఎవరైనా చేస్తుంటే తమ ప్రైవేట్‌ ప్రాక్టీసును వదులుకోవాలని, తమ జీతం ప్రాతిపదికనే పనిచేయాలని సూచించింది. ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ను అనుమతించడం వల్ల వైద్య బోధనలో నాణ్యత దెబ్బతింటుందని తేల్చిచెప్పింది. ప్రభుత్వ వైద్యులను ఇతర విభాగాలతో పోల్చకుండా సముచిత వేతనాలు, సౌకర్యాలు, ఇతరత్రా రాయితీలు ఇవ్వాలంది. మెడికల్‌ కాలేజీల్లోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) ఆదేశాల ప్రకారం వైద్యరంగంలో పరిశోధనలు చేయాలని పేర్కొంది.

వైద్య కళాశాలకు రేటింగ్‌.. 
మెడికల్‌ కాలేజీలకు అవి సాధించే పీజీ సీట్లు, ఉత్తీర్ణత ఆధారంగా గుర్తింపు, రేటింగ్‌ ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఎంబీబీఎస్‌ స్థాయిలోనే కొన్ని స్పెషాలిటీ కోర్సులను ప్రోత్సహించాలని సూచించింది. అనస్థీషీయా, గైనిక్, పీడియాట్రిక్స్‌ విభాగాల్లో డిప్లొమా వైద్యులను కొనసాగిస్తూ వారి సేవలను మాధ్యమిక స్థాయి ఆస్పత్రుల్లో వినియోగించుకోవాలని వెల్లడించింది. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో పీజీ మెడికల్‌ కోర్సు చేయాలనుకునే విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది అనైతికం, అహేతుకం, మానవ విలువలకు వ్యతిరేకమని వ్యాఖ్యానించింది. దీనివల్ల అర్హులైన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత వైద్య విద్యను పొందటానికి అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తంచేసింది. ప్రభుత్వ యంత్రాంగం ఈ పరిస్థితులను నియంత్రించాలని సిఫార్సు చేసింది.

నిష్క్రమణకూ పరీక్ష.. 
వైద్య విద్య నాణ్యతను నిర్ధారించడానికి ఎంబీబీఎస్, పీజీ, సూపర్‌ స్పెషాలిటీ పూర్తి చేసిన విద్యార్థులకు ఒక సాధారణ ఎగ్జిట్‌ ఎగ్జామ్‌(నిష్క్రమణ పరీక్ష) పెట్టాలని సూచించింది. నర్సింగ్‌ వృత్తిని బలోపేతం చేయాలని సూచించింది. నర్సింగ్‌ కౌన్సిల్‌ చట్టం ద్వారా నర్సింగ్‌ కౌన్సిల్‌ పనితీరును సమీక్షించడం అవసరమని చెప్పింది. తద్వారా నర్సింగ్‌ నాణ్యతను మెరుగుపరచాలని సూచించింది. ఎయిమ్స్‌లను విస్తరించడం, జిల్లా ఆస్పత్రులను, మెడికల్‌ కాలేజీలను పెంచడం అవసరమని పేర్కొంది. 250 పడకల కంటే ఎక్కువగా ఉన్న ఆస్పత్రులను మెడికల్‌ కాలేజీలుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.

ఫ్యామిలీ మెడిసిన్‌ కోర్సు
దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్లు, సబ్‌ సెంటర్లను 2011 జనాభా లెక్కల ప్రకారం పెంచాలని పేర్కొంది. దీనికి సుమారు రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. దేశంలో ప్రస్తుతం వెయ్యి జనాభాకు ఒక బెడ్‌ ఉంటే, దాన్ని రెండుగా చేయాలని తెలిపింది. ఆ ప్రకారం వచ్చే ఐదేళ్లలో ప్రైవేటు భాగస్వామ్యం తో 3 వేల నుంచి 5 వేల ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని చెప్పింది. అలాగే ఆరోగ్య కార్డులను తీసుకురావాలని సూచించింది. 2025 నాటికి ఎంబీబీఎస్‌ సీట్లతో సమానంగా పీజీ వైద్య సీట్లను పెంచాలని, ఎంబీబీఎస్‌లోనే కొన్ని స్పెషాలిటీ కోర్సులను పెట్టాలని పేర్కొంది. ఫ్యామి లీ మెడిసిన్‌ కోర్సును ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, దానికి శాఖను ఏర్పాటు చేయాలని సూచించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement