సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ పూర్తి చేసినవారి చూపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యపోస్టుల వైపు మళ్లింది. ప్రైవేట్ ప్రాక్టీసు కన్నా ప్రభుత్వ ఆసుపత్రే మిన్న అని భావిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వేతనాలు ఆశాజనకంగా లేకపోవడం కూడా దీనికి మరో కారణం. ప్రైవేట్ ప్రాక్టీసుపై ప్రభుత్వం నిషేధం విధించినా ప్రభుత్వ పోస్టుల వైపే ఎక్కువగా మొగ్గు చూపడం గమనార్హం.
ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో భాగంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు వస్తున్న దరఖాస్తుల సంఖ్యే అందుకు నిదర్శనమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అంతా కార్పొరేట్ వైద్యమయం అయిన పరిస్థితుల్లో ప్రైవేట్ ప్రాక్టీసు అసాధ్యమన్న భావనలో చాలామంది వైద్యులు ఉన్నారు. కొందరికైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 25 వేలు కూడా ఇవ్వడంలేదు. విదేశీ ఎంబీబీఎస్‌లకైతే కొందరికి రూ. 20 వేలు కూడా ఇవ్వడం లేదన్న చర్చ జరుగుతుంది.
సివిల్ అసిస్టెంట్ పోస్టులకు ఐదు రెట్ల డిమాండ్
వైద్య, ఆరోగ్య శాఖలో మొత్తం 12,755 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. అందులో 10,028 పోస్టులను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పటివరకు ఎంబీబీఎస్ అర్హతతో ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 734 పోస్టులు, వైద్య విధాన పరిషత్ పరిధిలో 209 పోస్టులు, ఐపీఎం పరిధిలో ఏడు సివిల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీచేశారు. మొత్తం 950 పోస్టులకు 4,800 దరఖాస్తులు వచ్చాయి.
అంటే ఏకంగా ఐదురెట్ల దరఖాస్తులు వచ్చాయి. వీరికి బేసిక్ వేతనం రూ.58,850 ఉంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనం. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వారికే 90 శాతం మేరకు ఇందులో పోస్టులు దక్కాయి. అనుభవం లేనివారికి, ఇప్పుడే ఎంబీబీఎస్ పూర్తయినవారిలో 90 శాతం మందికి అవకాశమే రాలేదు. కాగా, మొత్తం పోస్టులు పొందినవారిలో అధికంగా మహిళాడాక్టర్లు 509 మంది, పురుష డాక్టర్లు 441 మంది ఉన్నారు.
అంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు మహిళలే ముందుకు వస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ జారీచేయగా, ఇప్పటికే 2 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని వైద్య, ఆరోగ్య సేవల నియామక సంస్థ(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌ఏ) సభ్యకార్యదర్శి గోపికాంత్‌రెడ్డి చెబుతున్నారు. ఇంకా మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు.
స్టాఫ్‌నర్సు పోస్టులకైతే 30 వేల మంది పోటీ?
రాష్ట్రంలోని వివిధ వైద్య, ఆరోగ్య విభాగాల్లో 5,204 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ అయిన సంగతి విదితమే. ఈ పోస్టులకు పేస్కేల్ రూ.36,750– రూ. 1,06,990 మధ్య ఉండటంతో దాదాపు 30 వేల మంది దరఖాస్తు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే ఆరురెట్ల డిమాండ్ ఉంటుందని అంటున్నారు. 1,500 ఏఎన్‌ఎం పోస్టులకు కూడా త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. వాటికి పదిరెట్లు పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment