ఆయన పేరు డాక్టర్ రమేష్‌బాబు (పేరు మార్చాం). విదేశాల్లో ఎంబీబీఎస్ సమానమైన ఎండీ కోర్సు చదివి వచ్చాడు. హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో జనరల్ ఫిజీషియన్‌గా పని చేస్తున్నాడు. యాజమాన్యం కూడా అతనికి అదే బోర్డు పెట్టి ప్రోత్సహిస్తోంది. ఇటీవల జరిగిన దాడుల్లో అతన్ని నకిలీ ఎండీగా గుర్తించారు.
డాక్టర్ శ్రీనివాస్ (పేరు మార్చాం) విదేశీ ఎండీ (ఎంబీబీఎస్ తత్సమాన కోర్సు) పూర్తి చేసి రంగారెడ్డి జిల్లాలో వైద్యం చేస్తున్నాడు. ఎండీ కార్డియాలజీగా అవతారం ఎత్తాడు. కార్డియాలజిస్ట్‌గా మందులూ రాస్తాడు. సర్జరీలు మాత్రం తనకు తెలిసిన డాక్టర్లకు రిఫర్ చేస్తాడు. ఇతని నిర్వాకాన్ని కూడా ఇటీవలి దాడుల్లో గుర్తించారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనేకమంది నకిలీ ఎండీలు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గుర్తించింది. అమెరికా, ఫ్రాన్స్ సహా అనేక దేశాల్లో ఎంబీబీఎస్ తత్సమాన ఎండీ కోర్సు ఉంది. ఆయా దేశాల్లో సదరు కోర్సు చేసిన పలువురు డాక్టర్లు రాష్ట్రంలో ఎండీ (డాక్టర్ ఆఫ్ మెడిసిన్)లుగా చలామణి అవుతూ రోగులను బురిడీ కొట్టిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి వచ్చింది.
ఇటీవలి దాడుల నేపథ్యంలో తమ చదువుకు మించి వైద్యం చేస్తున్న అనేక మంది డాక్టర్లకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కాగా అందులో విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి ఎండీగా చలామణి అవుతున్నవారూ ఉన్నారని వైద్య వర్గాలు వెల్లడించాయి. అలాగే దాదాపు 150 ఆసుపత్రులు అసలు రిజిస్ట్రేషనే లేకుండా పని చేస్తున్నాయని తేలడంతో వాటిని సీజ్ చేసినట్లు తెలిసింది.
వైద్యాధికారులకు ముడుపులు ఇస్తూ..
ఎంబీబీఎస్ చదివినా ఎండీగా బోర్డులు పెట్టుకోవడంతో స్పెషలిస్ట్ వైద్యులనుకొని అనేకమంది రోగులు చికిత్స కోసం వారిని ఆశ్రయిస్తున్నారు. జనరల్ ఫిజీషియన్, జనరల్ సర్జన్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్ధోపెడిక్, పీడియాట్రిక్, గైనిక్, రేడియాలజీ తదితర స్పెషలైజేషన్‌లు ఎండీ పక్కన పెడుతూ రోగులను గందరగోళానికి గురి చేస్తున్నారు. అంతేకాదు ఎండీ (యూఎస్), ఎండీ (ఫ్రాన్స్).. అంటూ బోర్డులపై ప్రదర్శిస్తున్నారు.
నగరాలు, పట్టణాల్లో తిష్ట వేసిన వీరంతా పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వీరిపై నిఘా పెట్టాల్సిన అనేక జిల్లాల వైద్యాధికారులు భారీగా ముడుపులు తీసుకుంటూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఎవరూ గుర్తించే పరిస్థితి కూడా ఉండటం లేదని, ఒక పేరున్న కార్పొరేట్ ఆసుపత్రి సైతం విదేశీ ఎండీ చదివిన వారికే జనరల్ ఫిజీషియన్, సర్జన్, కార్డియాలజీ వంటి బోర్డులు పెట్టి నడిపిస్తున్నట్లు తెలిసింది.
అనేకచోట్ల వికటించిన వైద్యం
ఎంబీబీఎస్‌లే ఎండీల మాదిరి స్పెషలిస్ట్ సేవలు అందిస్తుండటంతో, అనేకచోట్ల వైద్యం వికటించిన సంఘటనలు కూడా వైద్య, ఆరోగ్యశాఖ తనిఖీల్లో వెలుగు చూసినట్లు తెలిసింది. స్పెషాలిటీలో కనీస పరిజ్ఞానం లేకపోవడంతో వైద్యం వికటిస్తోంది. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు రోగులను బెదిరించి నోరు మూయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఎంబీబీఎస్ తత్సమాన ఎండీ చదివిన ఒక డాక్టర్ చిన్న పాపకు వైద్యం చేయడంతో అదికాస్తా వికటించి ఆ పాప ప్రాణం వదిలింది. అయితే ఈ ఘటన బయటకు పొక్కకుండా ఆసుపత్రి యాజమాన్యం మేనేజ్ చేసింది.
టీఎస్‌ఎంసీ ఆగ్రహం..
విదేశాల్లో ఎంబీబీఎస్ తత్సమాన ఎండీ చేసిన డాక్టర్లు పలువురు రోగులను మోసగించడంపై తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్‌ఎంసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంబీబీఎస్ అని మాత్రమే బోర్డులు పెట్టుకోవాలని ఆదేశిస్తూ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఎంబీబీఎస్‌తో పాటు ఇతరత్రా అదనపు అర్హతలు ఉన్నవారు మండలిలో నమోదు చేసుకోవాలని సూచించింది.
జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) లేదా టీఎస్‌ఎంసీలో నమోదు చేయని అర్హతలను బోర్డులపై ప్రదర్శించవద్దని స్పష్టం చేసింది. అల్లోపతి వైద్యాన్నే అనుసరించాలని, ప్రతి ఐదు సంవత్సరాలకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరించుకోవాలని ఆదేశించింది. విదేశాల్లో వైద్య విద్య పూర్తిచేసినవారు దేశంలో ప్రాక్టీస్‌కు, శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ చేయాలని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment