కోరుట్ల ఆసుపత్రి ఎదుట నిరుపయోగంగా ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ సామగ్రి
సాక్షి నెట్‌వర్క్/హైదరాబాద్: రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రధానమైన జిల్లా ఆస్పత్రులను సైతం వైద్య పరికరాల కొరత పీడిస్తోంది. కొన్ని చోట్ల నిపుణులైన సిబ్బంది లేక స్కానింగ్, ఎక్స్‌రే మెషీన్లు, రక్త ఇతర పరీక్షల పరికరాలు నిరుపయోగంగా ఉంటే.. చాలాచోట్ల వీటితో పాటు బీపీ పరీక్ష వంటి చిన్న చిన్న వైద్య పరికరాలు, ఇతర యంత్రాలు పనిచేయడం లేదు. నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన పరికరాలు పాడై నెలలు, ఏళ్ల తరబడి మరమ్మతుకు నోచుకోక పోవడంతో కొన్ని చోట్ల తుప్పు, బూజు పట్టిపోతున్నాయి.
నిర్లక్ష్యమే శాపం
ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఇతర మౌలిక సదుపాయాల కల్పనతో పాటు తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో నెలకొల్పామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కూడా చెబుతున్నారు. కానీ కొన్నిచోట్ల అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోగులకు సరైన విధంగా సేవలందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రోగ నిర్ధారణకు కీలకమైన వైద్య పరికరాలు లేకపోవడంతో పేద రోగులు ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు 5,999 ఉన్నాయి. అందులో ఆరోగ్య ఉప కేంద్రాలు 4,745 ఉన్నాయి. 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 232 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 224 బస్తీ దవాఖానాలు, 90 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 27 జిల్లా ఆసుపత్రులు, 20 ఏరియా ఆసుపత్రులు, 14 స్పెషాలిటీ ఆసుపత్రులు, 9 బోధనాసుపత్రులు ఉన్నాయి. నిత్యం లక్షలాది మంది ఔట్ పేషెంట్లు ఆయా ఆస్పత్రులకు వస్తుంటారు. ఆయా ఆసుపత్రిలన్నింటిలోనూ బీపీ మిషన్ మొదలుకొని సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్ వరకు చిన్నా పెద్దవి కలిపి 30 వేల వైద్య పరికరాలు ఉన్నాయి. అందులో ఏకంగా 4,500 పరికరాలు పని చేయకుండా పాడైపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేశాయి.
జిల్లాల్లో ఇదీ పరిస్థితి...
► పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసే పరికరాలు పని చేయడం లేదు. జిల్లా క్షయ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎక్స్‌రే మిషన్ ఇప్పటివరకు నెలకొల్పకపోవడంతో రోగులకు సేవలు అందడం లేదు. అలాగే ల్యాబ్‌లో సెల్‌కౌంట్ మిషన్, బయో కెమిస్ట్రీ మిషన్లు సంవత్సరాలుగా పనిచేయకపోవడంతో రక్తం మూత్ర పరీక్షలను మాన్యువల్‌గా చేస్తున్నారు.
► భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్‌పీహెచ్‌సీలో ఎక్స్‌రే మిషన్ పనిచేయడం లేదు.
► మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 2018లో రూ. 1.25 కోట్లతో ఏర్పాటు చేసిన డిజిటల్ ఎక్స్‌రే మిషన్ పనిచేయడంలేదు.
► వనపర్తి జిల్లా ఆస్పత్రిలో అల్ట్రాసౌండ్ పరికరం ఉన్నా నిరుపయోగంగా మారింది.
► జోగుళాంబ గద్వాల జిల్లా ఆస్పతిలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సీటీ స్కానర్, సీ ఆర్మ్ స్కానర్, వెంటిలేటర్లు, డయాగ్నోస్టిక్ ల్యాబ్‌కు అవసరమయ్యే పరికరాలు ఏర్పాటు చేసింది. అయితే సిబ్బంది లేక ఈ పరికరాలు నిరుపయోగంగా మారాయి.
► రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో స్పెషలిస్టు వైద్యులు లేక ఆర్థో, జనరల్, ఈఎన్‌టీ, పల్మనాలజిస్టు, ఆప్తో విభాగాలకు చెందిన విలువైన పరికరాలను పక్కనబెట్టారు.
► వరంగల్‌ఎంజీఎం ఆస్పత్రిలో ఈసీజీ మెషీన్, సీటీ స్కాన్, ఎక్స్‌రే, వెంటిలేటర్లు సరిగా పనిచేయడంలేదు.
► నిజామాబాద్ జీజీహెచ్‌లో ఎంఆర్‌ఐ స్కానింగ్ లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఐదు ఎక్స్‌రేల్లో మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. యూవీ పౌండేషన్ ఇచ్చిన వెంటిలేటర్లు, అత్యవసర వైద్య పరికరాలు సిబ్బంది లేకపోవడంతో వినియోగించడంలేదు.
► డిచ్‌పల్లి సీహెచ్‌సీలో గర్భిణుల కొరకు స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆస్పత్రిలో రేడియాలజిస్టు్ట్ట, గైనకాలజిస్టు లేకపోవడంతో స్కానింగ్ తీయడం లేదు.
► కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో ఆల్ట్రా స్కానింగ్ యంత్రం కొత్తది ఉంది. అయితే వైద్యుడు లేకపోవడంతో దానిని గదిలో పెట్టి తాళం వేశారు. పీహెచ్‌సీల్లో ఎక్స్‌రే యంత్రాలు ఉపయోగించకుండా మూలకు పెట్టారు. జిల్లా ఆస్పత్రిలో సీటీ స్కాన్ యంత్రం అసలు లేనేలేదు.
► తాండూరు జిల్లా ఆస్పత్రిలో ముగ్గురు దంత వైద్యులు ఉండగా దంత పరీక్షలు నిర్వహించే యంత్రం ఏడాదిగా పని చేయటం లేదు. వైద్యులు ప్రైవేటుగా ప్రాక్టీసు చేస్తూ క్లినిక్‌లు నిర్వహిస్తుండటంతో వారే ఆ మిషన్‌ను పాడు చేశారనే ఆరోపణలున్నాయి. ఇక వైద్యులు లేక కంటి పరీక్ష పరికరాలు మూలకు పడ్డాయి.
► నల్లగొండ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్‌లో సీటీస్కాన్, ఎక్స్‌రే, డిజిటల్ ఎక్స్‌రే, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్, తెలంగాణ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లోని అన్ని రకాల పరిరకాలు పనిచేస్తున్నాయి. అయితే ఎనిమిది మంది రేడియోగ్రాఫర్లకు గాను ఒక్కరు మాత్రమే ఉండడంతో ఈసీజీ, ఎక్స్‌రే, సీటీ స్కాన్‌సేవలను అందించడంలో కొంత ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
► సూర్యాపేట జనరల్ ఆస్పత్రిలో సీటీ స్కాన్, అల్ట్రా సౌండ్ స్కాన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయినా కొందరు వై ద్యులు ఈ పరీక్షలు ప్రైవేటులో చేయించుకుని రావాలని రోగులకు సూచిస్తున్నారు.
► రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో గర్భిణులను పరీక్షించే స్కానింగ్ మిషన్ రెండేళ్లుగా పని చేయడం లేదు. నకిరేకల్‌లోని 30 పడకల వైద్యశాలలో స్కానింగ్ మిషన్, బ్లడ్ బ్యాంక్ వంటి సౌకర్యాలు లేవు.
► ఖమ్మం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ అందుబాటులోకి తెచ్చారు. అయితే ఒక్కరే టెక్నీషియన్ ఉండటంతో రోగులు తరచూ ఇబ్బందులు పడుతున్నారు.
► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత ఉంది. ముఖ్యంగా గుండె, నరాల బలహీనత, క్యాన్సర్‌వంటి రోగాలకు సంబంధించిన ఔషధాలు అందుబాటులో లేవు.
► జనగామ జిల్లా ఆస్పత్రిలో నాలుగేళ్లుగా సీటీ స్కాన్ మూలన పడింది. మరమ్మతుకు అవకాశం ఉన్నా కాల యాపన చేస్తూ సీటీ స్కాన్ గది తాళం వేసి పెడుతున్నారు. దీంతో రోగులు ప్రైవేట్‌లో పరీక్షలు చేయించుకుం టున్నారు. ఇదే ఆస్పత్రిలో పంటికి సంబంధించిన ఎక్స్‌రే మిషన్ కూడా పనిచేయడం లేదు. పాలకుర్తి, స్టేషన్‌ఘన్ పూర్‌లో లక్షల విలువైన ఎక్స్‌రే మిషన్లు పాడై తుప్పుపట్టి పోతున్నా పట్టించుకునే నాథుడే లేడు.
► కరీంనగర్ జిల్లా ఆసు పత్రిలో రెండు బెడ్‌సైడ్ ఎక్స్‌రే మిషన్లు ఉన్నాయి కానీ పని చేయడం లేదు. స్వల్ప మరమ్మతులు చేస్తే వాటిని వినియోగం లోనికి తెచ్చే అవకాశం ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో అవి ఉపయోగంలో లేకుండా పోయాయి. ఇక రెండు నెలల క్రితం 20 వెంటిలేటర్లు ఆసుపత్రికి వచ్చాయి. కానీ నిపుణులైన సిబ్బంది లేకపోవడంతో అలా స్టోర్‌రూం ముందు పెట్టి ఉంచారు. మరోవైపు 10 సీసీ సిరంజీలు, డిస్పోజబుల్æబెడ్‌షీట్స్, అథెసివ్ ప్లాస్టర్లు, డైనా ప్లాస్టర్లు, డిస్టిల్ వాటర్‌క్యాన్లు తదితర సర్జికల్, ల్యాబ్ మెటీరియల్‌కు తీవ్ర కొరత ఉంది.
► ఇది సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్. వేల రూపాయలు ఖర్చయ్యే సుమారు 57 రకాల పరీక్షలను నిరుపేదలకు ఉచితంగా చేసేందుకు ప్రభుత్వం వీటిని నెలకొల్పింది. అయితే ప్రస్తుతం సిబ్బంది లేకపోవడంతో ప్రాథమిక రక్త పరీక్షలైన సీబీపీ, సీఆర్‌పీ వంటి టెస్టులు కూడా నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులు ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
పరీక్షలు చేయట్లే..
కోటగిరి ఆస్పత్రిలో శరీరంలోని నొప్పులు తగ్గే మందులు అందుబాటులో లేవని చెబుతున్నారు. కళ్లు పరీక్ష చేసే కాంపౌండర్ కూడా పరీక్ష చేసే పరికరం లేదని చెప్పి వొట్టి మందులే రాస్తున్నడు. పెద్దాస్పత్రి అనుకుని మాలాంటి గరీబోళ్లు ఇక్కడికి వస్తే ఆస్పత్రిలో డాక్టర్ లేడు.
– పోతురాజు అబ్బవ్వ, కోటగిరి
ఎక్స్‌రే సౌకర్యం లేదు
వెలిశాల పీహెచ్‌సీలో ఎక్స్‌రే సౌకర్యం లేదు. మాకు తెలిసిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడగా.. ఆస్పత్రికి వెళితే ప్రాథమిక చిక్సిత చేసి పంపించారు. చిట్యాల సీహెచ్‌సీకి వెళ్లగా.. టెక్నీషియన్ అందుబాటులో లేకపోవడంతో పరకాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాం. – రేనుకుంట్ల సంపత్, సుబ్బక్కపల్లి, టేకుమట్ల మండలం
Comments
Please login to add a commentAdd a comment